నోములను ఎపుడో చంపాలనుకున్నారు…

(అల్లి యువరాజ్ )
బహుజన నేత, పోరాట యోధుడు నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో డిసెంబరు 1వ తేదీ 2020న తుది శ్వాస విడిచారు.30 ఏళ్ల ప్రజా జీవితంలో నోముల నర్సింహ్మయ్య అనేక అవాంతరాలను, అణిచివేతను, ఒడిదుడుకులను, ఆటుపోటును ఎదుర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ప్రతిదినం.. ప్రతిక్షణం అణిచివేతను అధిగమించి ముందుకు సాగారు. ఆయనను రాజకీయంగా అణచేయాలనుకోవడమే కాదు, భౌతికంగా అంతమొందించాలని కూడా అనుకున్నారు. అన్నింటిని ఆయన ఎదుర్కొని అజేయంగా నిలబడ్డారు. పిరిస్థితుల్ వల్ల ఆయన కమ్యూనిస్టు పార్టీని వదిలేసిన  కమ్యూనిస్టుగానే చివరిదాకా జీవించారు.
నోముల నర్సింహ్మయ్య గురించి ఎవరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి:
ఆరోజేం జరిగిందంటే…
నోముల నర్సింహ్మయ్య ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత నకిరేకల్, నల్లగొండ కోర్టుల్లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అప్పటి సిపిఎం ఎమ్మెల్యే నర్రా రాఘవ రెడ్డి ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి సిపిఎం పార్టీలో పనిచేయడం మొదలెట్టారు.
ఇటు అడ్వొకెట్ గా ప్రాక్టీస్ చేస్తూనే సిపిఎం రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1987 పూరార్ధంతో పార్టీని బాగా బలోపేతం చేస్తున్నారు.ఆయన ఎందరికో కంటగింపుగా మారారు.  ఒక దశలో  నోముల స్పీడ్ చూసిన ప్రత్యర్థి  నేతలు ఎలాగైనా నోములను తుదముట్టించాలని కుట్రకు తెరలేపారు.
ఒకరోజు పన్నాల రాజశేఖర్ రెడ్డి అనే కాంగ్రెస్ యువ నాయకుడి ఆధ్వర్యంలో రాత్రి కొంత మంది నోముల ఇంటిమీద ఎటాక్ చేశారు. తమ మీద దాడి చేస్తారన్న సమాచారం ముందే పసిగట్టిన నోముల నర్సింహ్మయ్య దాడిని ఎదుర్కొనేందుకు కుటుంబసభ్యులు, సహచర సిపిఎం కార్యకర్తలతో ఇంట్లో సిద్ధంగా ఉన్నారు.
అయితే వచ్చిన వారిలో మిగతావాళ్లు ఇంటిబయట ఉండగా పన్నాల రాజశేఖర్ రెడ్డి ఆయుధంతో ఒక్కడే నర్సింహ్మయ్య ఇంట్లోకి జొరపడ్డాడు. అప్పటికే అలర్ట్ గా ఉన్న నర్సింహయ్య, మిగతావారు రాజశేఖర్ రెడ్డి వద్ద ఉన్న ఆయుధాన్ని గుంజుకున్నారు. వచ్చిన ఆగంతకుడు వారిచేతికి దొరికిపోయాడు. పెనుగులాటలో హతమయ్యాడు.
అది చూసిన మిగతావారు చెల్లాచెదరై పారిపోయారు. ఆరోజు ఏమాత్రం అలక్ష్యంగా ఉన్నా.. నోముల మీద దాడి జరిపేవారేనని ఆ ఘటన గుర్తున్న వారు ఇప్పటికీ చెప్పుకుంటారు.
సిపిఎంలోనూ అణిచివేత…
తదనంతర కాలంలో నోముల నర్సింహ్మయ్య ఎంపిటిసిగా, నకిరేకల్ ఎంపిపిగా ఎన్నికయ్యారు. 1994 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో నోముల నర్సింహ్మయ్యకు సిపిఎం తరఫున నకిరేకల్ టికెట్ ఇవ్వాలన్న చర్చ జరిగింది. ఆ సమయంలో యువ నేతగా ఉన్న నోములకు టికెట్ ఇవ్వడం ద్వారా సిపిఎంలో యువ నాయకత్వాన్ని పెంపొందించాలన్న ప్రతిపాదన తెర ముందుకు వచ్చింది. దీంతో అప్పుడు నోముల నర్సింహ్మయ్య అభ్యర్థిత్వాన్ని కొందరు అగ్రవర్ణ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. జనరల్ సీట్ లో బిసి యాదవ కులానికి చెందిన వ్యక్తికి సీటు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఆరోజుల్లో సిపిఎం బలంగా ఉండేది. ప్రతి గ్రామంలో పటిష్టమైన గ్రామశాఖలు ఉండేవి. అప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నర్రా రాఘవరెడ్డి 1994లో నోములకు టికెట్ ఇప్పించాలని భావించారు. కానీ పార్టీలో పనిచేసే అగ్రవర్ణ నాయకులంతా ఏకమై నోములకు అనుభవం లేదని, నర్రా రాఘవరెడ్డికే మరోసారి టికెట్ ఇవ్వాలని తెర వెనుక మంత్రాంగం నడిపి అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీల్లో తీర్మానాలు చేయించారు. అప్పుడు పార్టీ రాష్ట్ర నాయకత్వం నోముల అభ్యర్థిత్వాన్ని పక్కనపెట్టి సీనియర్ ఎమ్మెల్యే అయిన నర్రా రాఘవరెడ్డికి మరోసారి 1994లోనూ టికెట్ ఇచ్చారు. ఆయన మళ్లీ గెలిచారు.
కానీ అగ్రవర్ణాలు ఎంతగా వ్యతిరేకించినా… తొక్కిన చోటే ఎదగాలన్న కసి ఉన్న వ్యక్తి నోముల నర్సింహ్మయ్య అదే పార్టీలో 1999లో అభ్యర్థి అయ్యాడు. గెలిచాడు. అప్పటి వరకు సిపిఎం కు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండేవారు. కానీ 1999లో నకిరేకల్ నుంచి నోముల, భద్రాచలం నుంచి సున్నం రాజయ్య ఇద్దరే గెలిచారు. అప్పుడు నోముల సిపిఎం శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు.
1999 నుంచి 2004 వరకు మొక్కవోని దీక్షతో ప్రజా సమస్యలపై పనిచేశారు. అసెంబ్లీలో చంద్రబాబు సర్కారుపై తనదైన శైలిలో పోరు నడిపారు. పంచ్ డైలాగులు, సామెలతో ఎలాగైతే నర్రా రాఘవరెడ్డి ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఆకట్టుకునే ప్రసంగాలు చేసేవారో ఆయన వారసత్వం నిలబెట్టారు నోముల. ఆ కాలంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలే ఎక్కువగా మాట్లాడే వెసులుబాటు ఇచ్చేవారు స్పీకర్. కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి సిఎం చంద్రబాబు సెషన్ మొత్తంలో 8 గంటలు మాట్లాడితే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 9 గంటలు, ఇద్దరు సభ్యులున్న సిపిఎం పార్టీ నేత నోముల సైతం 8గంటలు మాట్లాడిన సందర్భాలున్నాయి.
2000 ప్రాంతంలో విద్యుత్ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో బయట సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చేసిన పోరాటాన్ని శాసనసభాపక్ష నేతగా నోముల అసెంబ్లీలో కొనసాగించారు. తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిరహారదీక్ష వైఎస్సార్ తో పాటు నోముల విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా నిరహార దీక్ష చేశారు.
ఆ తర్వాత 2001లో జరిగిన ఆర్టీసి పోరాటంలో నోముల పాత్ర అనిర్వచనీయమైనది. అప్పుడు చంద్రబాబు సర్కారును అసెంబ్లీలో కడిగిపారేశారు. 24రోజులపాటు ఆర్టీసి కార్మికులు చేసిన సమ్మె చారిత్రాత్మకమైనది.
2004లో మళ్లీ పోరాటమే…
2004లో అదే సిపిఎం నుంచి నోముల నర్సింహ్మయ్య శాసనభకు ఎన్నికయ్యారు. అప్పుడు కాంగ్రెస్, వామపక్షాలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. 2004లో సిపిఎం నుంచి నోముల, సున్నం రాజయ్య, తమ్మినేని వీరభద్రం పాటూరి రామయ్య లాంటివాళ్లు గెలిచారు. అయితే పార్టీలో సీనియర్లు సిపిఎం నుంచి గెలిచారు కాబట్టి సిపిఎం శాసనసభాపక్ష నేత ఎవరవుతారు అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. పార్టీలో అప్పటికే సీనియర్ నేతగా తమ్మినేని ఉన్నారు. కానీ అసెంబ్లీలో అప్పటికే శాసనసభాపక్ష నేతగా నోముల ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నోములను పక్కనపెట్టి తమ్మినేనిని శాసనసభాపక్ష నేతగా ఎన్నిక చేయాలన్న చర్చ జరిగింది. తమ్మినేని అగ్రవర్ణానికి చెందిన నాయకుడు. ఒకవేళ నోములను పక్కన పెట్టి తమ్మినేనిని శాసనసభాపక్ష నేతగా ఎన్నిక చేస్తే అగ్రవర్ణ పార్టీగా, బహుజన నాయకత్వాన్ని ఎదగనీయని పార్టీగా సిపిఎం విమర్శలు మూటగట్టుకునే ప్రమాదం ఉందని గ్రహించి అయిష్టంగానే నోములకే మళ్లీ శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు ఇచ్చారు.
ఇక 2009లో నియోజకవర్గ పునర్విభజన జరిగి రిజర్వేషన్లు మారిపోయాయి. నకిరేకల్ ఎస్సీ సీటుగా మారింది. రెండుసార్లు గెలిచిన నోముల అక్కడినుంచి కొత్త నియోజకవర్గానికి వలస వెళ్లాల్సి వచ్చింది. దీంతో 2009లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనను భువనగిరి పార్లమెంటుకు బరిలోకి దింపింది సిపిఎం. అక్కడ నోముల ఓడిపోయారు.
తర్వాత సిపిఎంలో కుల రాజకీయాలు పెచ్చుమీరడంతో నోముల ఆ పార్టీలో ఇమడలేకపోయారు. కొందరు అగ్రవర్ణ నేతలు నోముల అవినీతిపరుడు అన్న ప్రచారాన్ని బలంగా చేశారు. దీంతో ఆపార్టీకి గుడ్ బై చెప్పి 2014లో టిఆర్ఎస్ లో చేరారు. నల్లగొండ జిల్లాలో ఉద్దండ నేతగా ఉన్న జానారెడ్డి పోటీ చేసిన నాగార్జున సాగర్ లో నోముల నర్సింహ్మయ్యకు టికెట్ ఇచ్చారు కేసిఆర్. కానీ అప్పుడు ఓడిపోయారు. అదే నియోజకవర్గంలో 2018 ముందస్తు ఎన్నికల్లో జానారెడ్డిని ఓడించి తెలంగాణ శాసనసభలో నోముల కాలు పెట్టారు. కానీ ఇటీవల కొంతకాలంగా నోముల అనారోగ్యంతో ఉన్నారు. ఇవాళ చివరి శ్వాస విడిచారు.
నోముల నర్సింహ్మయ్య బహుజన నేతగా జీవితాంతం ఇంటా బయటా పోరాటం చేస్తూనే మనుగడ సాగించారు. సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించి న్యాయశాస్త్ర పట్టభద్రుడు అయిన నోముల నర్సింహ్మయ్య ఎందరికో తన వంతు స్పూర్తితో కూడిన సందేశాలను ఇచ్చిన ధ్రువతార.
నోముల నర్సింహ్మయ్య నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో 1956, జనవరి 9న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1981 లో ఎల్ఎల్ బి, 1983లో ఎంఏ పూర్తి చేశారు. యూనివర్శిటీలో ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశారు. ఆయన తల్లిదండ్రులు మంగమ్మ, నోముల రాములు. ఐదుగురి సంతానంలో నర్సింహ్మయ్య రెండవ వాడు. చిన్నతనం నుంచే చురుకైన వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు. నర్సింహ్మయ్య కుటుంబంలో అందరూ ఉన్నత చదువులు చదివిన వారే.
నోముల కుటుంబం వివరాలు
భార్య: లక్ష్మీ
ఇద్దరు కూతుర్లు: ఝాన్సీ రాణి, అరుణ జ్యోతి వివాహితులు (ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు)
ఒక కుమారుడు : నోముల భగత్ కుమార్, హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నారు.
(ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ట్రెండింగ్ తెలుగు న్యూస్ వాటితో ఏకీభించినట్లు కాదు.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *