మీ అమ్మా నాన్న పుట్టిన తేదీ గుర్తు లేదా, కష్టమే :ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్

(మాడభూషి శ్రీధర్‌)
మనది చాలా గొప్ప ప్రగతి. 70వ రిపబ్లిక్‌ డే నుంచి మనం ఆల్‌ ఫూల్స్‌ డేకు ప్రగతి చెందబోతున్నాం. సరిగ్గా ఏప్రిల్‌ 1, 2020న జనులు సిద్ధంగా ఉండాలి తమ తమ వివరాలతో, తమ నివాసాలకు రుజువులతో. అమ్మానాన్నల పుట్టుపూర్వోత్తరాలు చెప్పి రుజువులు కూడా తేవాలని మహా ఘనత వహించిన సర్కారు వారు ఆదేశిస్తున్నారు.
*భారత సంవిధానం పూర్తిస్థాయి అమలు ప్రారంభమై 70 ఏళ్లు గడిచిన తరువాత అప్పటినుంచి బతికి ఉన్న వృద్ధులు కూడా తాము పౌరులమే అని రుజువు చేసుకోవాలి. ఒక వేళ వారు గతించి ఉంటే వారి తనయులు, తమ తల్లిదండ్రులు జనన స్థలం, జనన తేదీలను రూఢిగా అధికారులకు తెలియజేయాలి.
*ముందు జనపట్టిక కోసం అధికారులు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించే పని ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ చివరిదాకా జరుగుతుందని ఎప్పుడో నోటిఫై చేశారు. జనపట్టిక వివరాల్లో తప్పులకు జరిమానాలు ఉంటాయి. అంతకన్న పెద్ద ప్రమాదం ఏమంటే వివరాలు ఇవ్వకపోయినా, రుజువులు చూపకపోయినా పౌరసత్వానికి అనుమానపు ఎసరు వస్తుంది.
*నిజానికి 2011 నుంచే జనపట్టిక నమోదుకోసం ఎన్‌పీఆర్‌ కార్యక్రమం మొదలైంది. అప్పుడు 15 ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలన్నారు. దీన్ని 2015లో కొంత మార్చారు. 2019లో ఆరు కొత్త ప్రశ్నలు చేర్చారు. ఆ ఆరు ప్రశ్నల్లో నాలుగు చాలా ఇబ్బందికరమైనవి, అవి 1. తండ్రి పుట్టిన తేదీ, 2. తండ్రిపుట్టిన చోటు, 3. తల్లి పుట్టిన తేదీ, 4. తల్లి పుట్టిన చోటు వివరాలు. 5. ఆధార్‌ వివరాలు, 6. చదువు వివరాలు. తల్లిదండ్రుల పుట్టుక తేదీ, పుట్టిన చోటు తెలుసుకోవడం, వాటికి రుజువులు కనుక్కోవడం కోట్లాది మంది ప్రజలకు సాధ్యం కాదు.
*పత్రాలు లేకపోతే ప్రత్యక్ష సాక్షులను తేవొచ్చు అంటున్నారు. ఇది మరొక వింత. తండ్రి పుట్టిన నాడు చూసిన లేదా తెలిసిన సాక్షులు బతికి ఉంటారనీ, ఒకవేళ ఉన్నా వారు ఈనాటికీ సాక్ష్యం చెప్పడానికి వస్తారనుకోవడం అసాధ్యం.*
*ఇప్పుడు బతికున్న మనమంతా మన పుట్టిన చోటు, తేదీ రుజువు చేసుకోవడం సాధ్యం అవుతుందేమో గాని, తల్లిదండ్రులు (ఉన్నప్పటికీ) వారి పుట్టుక తేదీ, చోటు ఏ విధంగా రుజువుచేయాలనేది సమస్య. చాలామందికి సొంత జనన ధ్రువపత్రాలే ఉండని సమాజం మనది.
*బడిలో ఆరోతరగతిలో చేరడానికి మన ముందు తరాల వారు వెళ్తే ఆ బడిలో పనిచేసే గుమస్తాలు, చాలామందికి జూలై ఒకటిని పుట్టిన తేదీగా నమోదు చేసేవారు. ఇప్పుడు 70, 80 ఏళ్ల వయసున్న పెద్దలందరికీ ఇటువంటి కలి్పత పుట్టిన తేదీలే ఉంటాయి. ఇదీ పొంచి ఉన్న ప్రమాదం.
*జన పట్టిక వివరాలలో అనుమానం వస్తే స్థానిక రెవెన్యూ అధికారులకు విపరీతమైన అధికారాలు వస్తాయి. తండ్రి, తల్లి పుట్టిన తేదీ, చోటు రుజువు చేయలేకపోతే వారి పేరు పక్కన ’డి‘ అని రాస్తారు. తరువాత మరింత పరిశీలన జరుపుతారు. అప్పుడు ఆ వ్యక్తి తన కేసు చెప్పుకోవచ్చు. ఆ తరువాత అనుమానం తీరినట్టు అధికారి భావిస్తే ప్రమాదమే లేదు. అతనికి పౌర ధ్రువపత్రం లభిస్తుంది. లేకపోతే అతను పౌరుడు కాడంటూ కేసును ఫారినర్స్‌ ట్రిబ్యునల్‌కు పంపిస్తారు.
*అక్కడ సిటిజన్‌షిప్‌ చట్టం 1955కు 2019లో చేసిన సవరణ ప్రకారం నిర్ణయం జరుగుతుంది. అనుమానం స్థిరపడితే ఇన్నాళ్లూ ఇక్కడ భారతీయుడైన వ్యక్తి హఠా త్తుగా పరాయి వాడవుతాడు. తన సొంత దేశానికి పంపే దాకా డిటెన్షన్‌ సెంటర్‌లో బంధి స్తారు.*
*ఈ దేశం వాడికి ఇంకే సొంత దేశం ఉంటుంది? అంటే ఏ దేశానికీ చెందని వాడుగా మారిపోతే అతని గతి ఏమిటి? ఎన్నాళ్లు జైల్లో ఉంటాడు? వారి సంతతి ఏమవుతారు? ఇంత దారుణమైన పరిణామాలు ఉంటాయి.*
*జనపట్టిక అనే పేరుతో మన జాతీయతకు, దేశీయతకు, పౌరసత్వానికే ఎసరు పెట్టడం గురించి గమనించాలి. ఇది కేవలం ముస్లింల సమస్య కాదు. ప్రతి వ్యక్తి భారతీయతకు సంబంధించిన సమస్య.
(సోర్స్ సోషల్ మీడియా)
(మాడభూషి శ్రీధర్‌, బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్)