Home Features ఫలితాలపై టెన్షన్ పెంచుతున్న చంద్రబాబు ధీమా, జగన్  మౌనం

ఫలితాలపై టెన్షన్ పెంచుతున్న చంద్రబాబు ధీమా, జగన్  మౌనం

304
0
(యనమల నాగిరెడ్డి)
ఎపి ఎన్నికల ఫలితాలు వెలువడే తేదీ దగ్గర పడే కొద్దీ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం తమదే అంటూ చూపుతున్న ధీమా, వైసీపీ అధినేత (కాబోయే ముఖ్యమంత్రి అని అందరు అనుకుంటున్న) జగన్ మోహన్ రెడ్డి పాటిస్తున్న మౌన వ్రతం ప్రజలలో, ఆయా పార్టీల కార్యకర్తల గుండెల్లో గుబులు రేపుతున్నది. రాజకీయ పరిశీలకులతో పాటు, టీవీలలో కనిపిస్తున్న ఆస్థాన వైతాళికులలో కూడా టెన్షన్ పెంచుతున్నది. అలాగే జాతీయ రాజకీయ కూటములను గందరగోళ పరుస్తున్నది. చివరగా బెట్టింగ్ రాయుళ్లు నిద్ర లేని రాత్రులతో సతమతమౌతూ బీపీలు పెంచుకుంటున్నారు. (పార్టీల పరిస్థితి ఏమైనా వీరు పరిస్థితి మాత్రం గోవిందా! గోవిందా!!)
చంద్రబాబుకు ఎందుకంత ధీమా!?
అనేక సర్వేలు, అధికార గణం, నిఘా వర్గాలు, ఇతర అనేక వ్యవస్థలలో అధికశాతం వైస్సార్సీపీ విజయఢంకా మోగిస్తుందని, ముఖ్యమంత్రి పీఠం జగన్ దే నని ప్రకటిస్తున్నారు. అయితే తన 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ ఇచ్చిన అనుభవంతో “అవసరార్థపు బ్రహ్మణీకం” చేయడంలో నిష్ణాతుడైన చంద్రబాబు ఈ ఎన్నికల ఫలితాలపై ఏంతో ధీమా వ్యక్తం చేస్తూ ఉదరగొడుతున్నారు. దీనికి ఆయన ఆస్థాన మీడియా సహకారంతో పాటు , మీడియా మేనేజ్మెంట్లో ఉన్న విశేష అనుభవం కూడా ఆయన ‘ధీమాకు’ పెద్దపీట వేసి ఢంకా బజాయిస్తున్నారు. అయితే చంద్రబాబుతో సహా మీడియా దొరలు కూడా ఆ ధీమాకు కారణాలు చెప్పడం లేదు.
అయితే ఈ విలేఖరి కొందరు టీడీపీ ప్రముఖులతో మాట్లాడితే కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించారు. వాటిలో ప్రధానమైనవి జగన్ మోహన్ రెడ్డికి ప్రధాని మోడీకి మధ్య ఉన్న రహస్య ఒప్పందం వల్ల ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు వైస్సార్ సిపికి దూరమైనారని, యువతలో చెప్పుకోతగిన స్థాయిలో పవన్ వెంట నడిచారని, చంద్రబాబు అనుభవం పై నమ్మకమున్న జనం బాబు వెంట నడిచారని, నాయకులు ఎలా మారినా టీడీపీకి పెట్టని కోటలా ఉన్న కార్యకర్తలు అలాగే పార్టీతో నడిచారని, బిసిల ఓటు బాంక్ అండదండలతో, అధికార బలం తోడు కావడం కారణాలుగా టీడీపీ గెలుపు ఖాయమని, అందుకే చంద్రబాబు అంట ధీమాగా ఉన్నారని వారు వివరించారు.
చంద్రబాబు బిజెపితో తెగతెంపులు చేసుకున్న వెంటనే “ మోడీని తెచ్చింది బాబే! ఇపుడు దించేది బాబే!!” అన్న నినాదాన్ని గత సంవత్సర కాలంగా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల వ్యవస్థలలో చొప్పించడంలో విజయం సాధించారని వారు గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన తన అనుకూల మైన ముల్లాలను మసీదులకు పంపి ప్రచారం చేశారని, అలాగే కొందరు క్రిస్టియన్ మత ప్రచారకులు కూడా రంగంలో దించి “మతం మార్చుకున్న క్రిస్టియన్లు అధికంగాఉన్న”కోస్తా ప్రాంతంలో విశేషంగా ప్రచారం చేశారని వారు తెలిపారు. అలాగే ఉత్తర భారతంలో మైనార్టీలపై అనేక రకాలుగా జరిగిన దాడులపైన ఆయా మత నాయకులు ఆంధ్రప్రదేశ్ లోని మైనారిటీలకు దిశా నిర్దేశం చేశారని వారు వివరించారు. మోడీకి వ్యతిరేకంగా పోరాడుతూ తన జన్మ విరోధి కాంగ్రెస్ తో జట్టు కట్టి దేశంలోని మోడీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడానికి కృషి చేస్తున్నారని అందువల్ల చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి మైనారిటీలు నిర్ణయించి, తదనుగుణంగా కృషి చేశారని (పేరు బయట పెట్టడానికి అంగీకరించని చిత్తూరు జిల్లాకు చెందిన మైనారిటీ నాయకుడు) సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తాను ముస్లిం సమావేశాలతో పాటు క్రిస్టియన్ సమావేశాలలో కూడా పాల్గొన్నానని ఆయన వివరించారు.
జగన్ పై మోజుతో ఉన్న యువతలో అధికశాతం మంది అనేక కారణాల వల్ల పవన్ వెంట నడిచారని అందువల్ల వైసీపీకి ఓట్లు తగ్గాయని మరో కారణంగా, టీడీపీ కార్యకర్తలు పార్టీ వెంటే నడిచారని, టీడీపీకి వెన్నెముకలా ఉన్న బిసిలు యధావిధిగా పార్టీకి మద్దతు ఇచ్చారని, ప్రభుత్వం చివరి క్షణంలో ఇచ్చిన పసుపు-కుంకుమ, రైతు బంధు పధకాలు, డ్వాక్రా మహిళల మద్దతు టీడీపీ గెలుపుకు కారణాలని ఆ నాయకులు విశ్లేషించారు. అంగ బలం, ఆర్థిక బలం, మీడియా అండదండలు, (ఇసి కోరాడా విదిల్చినా) మెజారిటీ అధికారులు బాబుపై నమ్మకంతో ఎన్నికలలో అందించిన సహకారం వల్ల టీడీపీ విజయ దుందుభి మోగిస్తుందని, చంద్రబాబే మరోసారి ముఖ్యమంత్రి అని పలువురు ప్రముఖులు ఢంకా బజాయిస్తున్నారు.
జగన్ మోహనుడి మౌన రాగం
భారత రాజకీయాలలో మౌనం(గా)తోనే ఐదు సంవత్సరాల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి “మౌనమునిగా” పేరు గాంచిన పివి నరసింహారావును ఆదర్శంగా తీసుకున్న వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి గత కొంత కాలంగా మౌన వ్రతం పాటిస్తూ “తన పని తానూ చేస్తూ” ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్నారు.
ఎన్నికల సమయంలో “రావాలి జగనన్న- కావాలి జగనన్న” నినాదంతో పార్టీ శ్రేణులను ఉత్తేజ పరచిన జగన్ ప్రచారం చివరి అంకంలో “నాకు ఒక్క అవకాశం ఇవ్వండి” అన్న విజ్ఞప్తి ప్రజలలో మార్పు తెచ్చిందని జనం అంటున్నారు.వ్యవస్థా పరంగా బలహీనంగా ఉన్న పార్టీని పోలింగ్ కేంద్రం స్థాయిలో బలపరచడంలోనూ, వ్యూహాల పరంగా, నిఘా,నిర్వహణ పరంగా పీకే టీమ్ అందించిన సహకారం, 2014 ఎన్నికల పాఠాల ఆధారంగా 2019 ఎన్నికలలో నిధుల సమీకరణ, పంపిణీ అంశాలు, చంద్రబాబు అస్మదీయులైన (చీఫ్ సెక్రటరీ, నిఘా అధికారి లాంటి) అధికారులకు ఎన్నికల కమీషన్ చెక్ పెట్టడం, చావో-రేవో గా మారిన ఈ ఎన్నికలను కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేయడం జరిగిందని ఆ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు.
బిసిలకు 40 సీట్లు కేటాయించి టీడీపీకి అనుకూలంగా ఉన్న బిసిల ఓటర్ లను ఆకర్షించడంలో జగన్ కృతకృత్యులైనారని, రాజశేఖర్ రెడ్డి అభిమానులు యధావిధిగా మద్దతు పలకగా, ఆయన నవరత్నాలు, ఇతర పధకాలు ప్రజలను ఆకర్షించడంతో పాటు “చంద్రబాబు కంటే మాట నిలుపుకోవడంలో జగన్ మిన్న” అని జనాన్నినమ్మించడంలో ఆయన విజయం సాధించారని చూపుతున్నారు.
“ కులాల కురుక్షేత్రంగా మారిన ఈ ఎన్నికలలో” చరిత్రకు వ్యతిరేకంగా రెడ్డి కులస్తులలో 90 శాతం మేరకు జగన్ కు మద్దతు పలకడం వల్ల వైసీపీ గ్రామాలలో బాగా బలపడిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
వీటన్నిటికీ మించి ‘14 వ శతాబ్దపు ఇంగ్లీష్ చక్రవర్తి’ ప్రవచించిన “లైస్, డామండ్ లైస్, స్టాస్టిక్స్” (అపద్దాలు, అతి తీవ్ర అపద్దాలు, గణాంకాలు) అన్న సూక్తి ఆధారంగా, గోబెల్స్ ప్రచారం సాయంతో చంద్రబాబు చేసిన ఎన్నికల జిమ్మిక్కులను ప్రజలు తిరస్కరించి తమకు పట్టం కడుతున్నారని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన తల్లి విజయమ్మ నమ్మే “ డెస్టినీ విల్ డిసైడ్” అన్న సూత్రాన్ని తానూ కూడా నమ్ముతూ పోలింగ్ తర్వాత మౌన వ్రతం పాటిస్తూ అందరి గుండెల్లో గుబులు రేపుతున్నారు. ప్రజలు తనను గెలిపిస్తారని, తానె కాబోయే ముఖ్యమంత్రి అన్న ఆలోచనతో “చాప కింద నీరులా ముఖ్యమంత్రిగా తాను చేయవలసిన పనులు చేయడానికి ప్రణాళికలు వేసుకుంటూ, తన మనోగతం బయట పెట్టకుండా మౌన వ్రతం పాటిస్తున్నారు.”
చంద్రబాబు ఎన్నికల తర్వాత ఫలితాలపై చేస్తున్న రగడను, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానని చేస్తున్న రచ్చను కూడా జగన్ మౌనంగా గమనిస్తున్నారు. పివి నరసింహారావు లాగ తమ నాయకుడు కూడా ఈ రణంలో గెలిచి రాష్ట్రంలోనూ, కేంద్రంలోను చక్రం తిప్పుతాడని, ప్రజారంజకమైన పాలన అందిస్తారని అంతేవాసులు బల్ల గుద్దుతున్నారు.
చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లు, ఆయన మీడియా చేస్తూన్న ప్రచారం, జగన్ మోహన్ రెడ్డి పాటిస్తున్న మౌనం, ఆయన చాప క్రింద నీరులా చేస్తున్న పనులు జనం గుండెల్లో సందేహాలు రేకెత్తిస్తుండగా, బెట్టింగ్ రాయుళ్ల గుండెలలో మాత్రం రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అందరి సందేహాలకు 23 మాత్రమే సమాధానం వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here