మొనాలిసా పెయింటింగ్ చూడ్డానికి తిరుమలలో లాగా పెద్ద క్యూ (యూరోప్ యాత్ర 3)

(డా. కే.వి.ఆర్.రావు)
మా యూరప్ యాత్ర, మూడో భాగం: ప్యారిస్ (ఫ్రాన్స్)
తరువాతి రెండురోజులు ఫ్రాన్సులో ప్యారిస్ సందర్శన. యాత్ర మూడోరోజు ఉదయమే గంటకు 350 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ‘యూరోస్టార్’ సూపర్ ఫాస్ట్ రైల్లో ప్యారిస్ ప్రయాణం.
పొద్దున ఎనిమిది గంటలకంతా లండన్ హోటెల్ లో ఇంగ్లిష్ అల్పాహారం ముగించుకుని బయలుదేరి దారిలో నగరంలోమరికొంత చూసుకుని తొమ్మిదిన్నరకు రైల్వేస్టేషన్ చేరుకున్నాము. రైల్వేస్టేషన్లో ఎయిర్ పోర్ట్ లో లాగే సెక్యూరిటి చెక్, వీసా పరిశీలనలు, స్టాంపింగులు అయ్యాక వెళ్లి రైల్లో కూర్చున్నాము.
ఆరోజు మధ్యాహ్నభోజనం ప్యాక్ ని థామస్ కుక్ వాళ్లు ముందే అందించారు. లండన్ వదిలిన కొద్దిసేపటికే రైలు సముద్రం (ఇంగ్లిష్ చానెల్) లోపలినుంచి వేసిన సొరంగమార్గంలోకి ప్రవేశించడం వల్ల మళ్లీ ఫ్రాన్స్ లో ప్రవేశించేదాకా చాలాసేపు బయటేమీ కనిపించలేదు. ఆ తరువాత ఫ్రాన్స్ గ్రామీణప్రాంతాలు కిటికీలోంచి చూస్తూండగా మాప్రయాణం సాగింది.
నీటివసతి, సూర్యకాంతి ఉన్నా చలిదేశాలు కాబట్టి అన్నీ మెట్టపంటలే ఉన్నాయి. చాలాచోట్ల గడ్డిని ఒక పంటలాగ పెంచి చలికాలం పశువులకోసం పెద్ద చుట్టలుగాచుట్టి నిలవ ఉంచుతున్నట్టుగా కనపడింది. పల్లెలు శుభ్రంగా, అన్నివసతులతో, మంచి ఇళ్ల సముదాయాలతో ఉన్నాయి.
రైలు అంతవేగంగా వెళ్తున్నా తెలియలేదు, బయట వెనక్కి పరిగెడుతున్న చెట్లను చూసి ఊహించవలసిందే. సుఖవంతమైన ప్రయాణం చేసి ప్యారిస్ రైల్వే స్టేషన్ చేరాము. స్టేషన్ అంత గొప్పగాలేదు, మన నగరాల్లో కనిపించేవిధంగానే ఉంది.
స్టేషన్ బయట సిద్ధంగా ఉన్న బస్సులో బయలుదేరి మొదటిరోజు ప్యారిస్ నగరం చూడ్డానికి బయలుదేరాము. ప్యారిస్ చూపించే గైడ్ స్టేషన్ దగ్గరే మాబస్సు ఎక్కారు. ఆమె ఫ్రెంచ్ స్లాంగ్ లో మాట్లాడుతున్న ఇంగ్లీషు మాకు అర్థమవడానికి కష్టపడాల్సివచ్చింది.
మొదటగా ఆర్క్ డి ట్రయంఫ్ దగ్గర దిగి చూశాము. ఇది తన మొదటి విజయాలకు చిహ్నంగా నెపోలియన్ బోనపార్టె 1806లో కట్టించడం మొదలుపెట్టాడు కాని చాలా ఆలస్యమై అతను చనిపోయిన 15 సంవత్సరాలకు (1836) పూర్తయింది. ఇది నాలుగు స్థంబాలమీద కట్టిన అనేక శిల్పాలతో కూడిన 164 అడుగుల ఎత్తైన పెద్ద నిర్మాణం. ఈ కూడలిలో 12 వైపుల్నుంచి వచ్చిన రహదారులు కలుస్తాయి. తనకీర్తికి గుర్తుగా తలపెట్టిన నిర్మాణం పూర్తికాకముందే నెపోలియన్ పూర్తిగా ఓడిపోవడం, ఖైదీగా మరణించడం కూడా జరిగిపోవడం ఆయన విజయాలకంటే మనిషికున్న పరిధుల్నే ఎక్కువగా సూచించింది.
ఆర్క్ డి ట్రయంఫ్ నుంచి ప్రసిద్ధి చెందిన విశాలమైన షాన్స్ ఎలిజీ (Champs Elysees) రహదారిలో ప్రయాణించి దాదాపు మైలుదూరంలోవున్న కంకార్డ్ స్క్వేర్ కి వెళ్లాము. అది చాలాపెద్ద చారిత్రకమైన స్క్యేర్. దాన్నిదివరకు రెవల్యూషన్ స్క్యేర్ అని పిలిచేవాళ్లు. 1789 ఫ్రెంచ్ విప్లవం తరువాత అక్కడే 1793 లో ఫ్రాన్స్ రాజపరంపరలో చివరివాడైన పదహారవ లూయిని, అతని రాణి మేరిని ఇతర రాజవంశీకులను ప్రజాసంఘాలు అక్కడే ఉరితీశాయట.
ప్రస్తుతం స్క్యేర్ మధ్యలో 1833లో ఈజిప్టునుంచి తెప్పించి అమర్చిన 23 మీటర్ల ఎత్తైన మూడువేల యేళ్లనాటి పురాతన రాతిస్తంభం ఉంది. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజావిప్లవాలకు నాంది పలికి తదనంతరం అమెరికా స్వాతంత్రపోరాటంతో సహా అనేక విప్లవాలకు స్పూర్తినిచ్చి ప్రజాస్వామ్యపాలనలకు దారితీసిన ఫ్రెంచ్ విప్లవం జరిగిన ప్రదేశాన్ని చూడ్దం ఉత్తేజకరంగా అనిపించింది.
అక్కడినుంచి ‘లెజ్ ఇన్ వాలెడె’ భవనానికెళ్లి దూరంనుంచే చూశాము. ముందు విశాలమైన పచ్చగడ్డి మైదానంతో ఉన్న పొడవైన పెద్ద పురాతన భవనమది. యుద్దంలో గాయపడినవారికోసం పదిహేడవ శతాబ్దంలో పద్నాలుగవ లూయీ కట్టించిన ఆసుపత్రి. ఇప్పటికీ కొంతభాగం అందుకు ఉపయోగపడుతోందిట. దానివెనక బంగారువర్ణపు డోమ్ గల ఎత్తైన చర్చ్ ఆవరణలోనే నెపోలియన్ సమాధికూడా ఉందిట.
ప్రసిద్ధి చెందిన నాట్రె డామ్ కెథడ్రల్ ఆ మధ్య అగ్నిప్రమాదానికి గురికావడంవల్ల సందర్శకులను అనుమతించడం లేదు. దూరంనుంచే చూశాము. విక్టర్ హ్యూగో తన నవలలో చిత్రించిన లెజండరీ పాత్ర ‘హంచ్ బ్యాక్ ఆ చర్చ్ లో తిరుగాడ్డం ఊహారూపంలో చూద్దామనుకున్నా కుదరలేదు.
శరవణభవన్ లో దక్షిణభారత మధ్యాన్న భోజనం తరువాత ప్యారిస్ నగర ముఖ్యవీధులగుండా మా బస్సు ప్రయాణించింది. ప్యారిస్ లో ప్రసిధ్ధిగాంచిన ఫ్యాషన్ దుకాణాలు, సెంటు షాపులు, చారిత్రక నేపధ్యంగల క్లబ్బులు (మౌలిన్ రూజ్ కూడా) చూశాము.
అనేక రహదారుల వెంబడి రహదారికి, రెస్టారెంట్ భవనాలకు మధ్యన వరండాల్లాంటి విశాలమైన ఆవరణల్లోకి రెస్టారెంట్ కుర్చీలు, టేబుళ్లు వ్యాపించి చాలామంది అక్కడే అల్పాహారం, వైను, కాఫీల్లాంటివి తీసుకుంటూ మాట్లాడుకుంటూ గడపడం కనిపించింది. గడచిన రెండు శతాబ్దాల్లో జరిగిన ఆధునిక మానవ సాంస్కృతిక నాగరికతా పరిణామానికి ప్యారిస్ ప్రధాన కేంద్రం అనొచ్చునేమో. అక్కడ కళల్లో, తాత్విక విషయాల్లో జరిగిన పరిణామాలకు ఈ రెస్టారెంట్ల వరండాలు, క్లబ్బులే సజీవ సాక్ష్యాలంటారు.
బాల్జాక్, మొపసా, వెర్న్ లాంటి రచయితలు, బోదిలేర్, హ్యూగోలాంటి కవులు, మోనె, డేగా, సిజానే, గాగిన్, పికాసో లాంటి చిత్రకారులు, సార్త్ర్, డెర్రిడా లాంటి తత్వవేత్తలు ఈ వీధుల్లోనే తిరిగివుంటారుగదా అనిపించింది. వాటిని రెస్టారెంట్లలాకాక పరిణామ కేంద్రాలుగా చూస్తే వేరుగా కనబడతాయేమో.
ఆసాయంత్రం ఆరుగంటలకి (అప్పుడు అక్కడ ఏడుకుగాని చీకటి పడటంలేదు) ప్రఖ్యాత లూవ్ర్ మ్యూజియంకి తీసుకెళ్లి ‘మ్యూజియం చూడ్డానికి రెండుగంటల సమయమిచ్చా’మన్నారు మా టూర్ ఆపరేటర్లు. అందరం అంతతక్కువ సమయం సరిపోదని దెబ్బలాడాం. వాళ్లకష్టాలేవో చెప్పారు. లూవ్ర్ మ్యూజియం చాలాపెద్దదని, చూడాలంటే వారం పడుతుందని, సాధారణంగా ‘లియనార్డో దవిన్సీ’ వేసిన ‘మోనాలిసా’ పెయింటింగ్ చూడ్డానికి మాత్రమే యాత్రికులు వస్తారుకాబట్టి ఆ సమయం సరిపోతుందని చెప్పారు. చేసేదిలేక లోపలికెళ్లాం. నిజంగానే అది చాలా పెద్ద మ్యూజియం. శతాబ్దాలనాటి వాస్తుశైలిలో కట్టబడింది.
మమ్మల్ని మోనాలిసా చూడ్డానికొచ్చిన సందర్శకుల క్యూలో నిలబెట్టారు. క్యూ వేగంగానే కదిలినా మాకు 40 నిమిషాలు పట్టింది. మూడో అంతస్తులో ఒక పెద్ద హల్లో ఒక పెద్ద గాజు చట్రంలో ఆ పెయింటింగ్ పెట్టారు. ఎస్కలేటర్లు ఉన్నాయి. తిరుమలలోలాగ అంతా సందడిగావుంది. ఇరవై ముప్పైమందిని ఒకసారి వదిలి రెండుమూడునిముషాల తరువాత బయటికి పంపించేస్తున్నారు. చూసేవారిలో అత్యధికం సెల్ ఫోన్లలో ఫొటోలు, సెల్ఫిలు తీసుకోవడంలోనే పుణ్యకాలం ముగించేస్తున్నారు.
మేముకూడా ఆపని చేసి కొంత సమయం మిగుల్చుకుని ఆగోలలోనే తదేకంగా చూశాము. పదహారో శతాబ్దపు రెనయజెన్స్ క్లాసికల్ ఆర్ట్ కి సజీవప్రతినిధుల్లో ఒకటిగా వెలుగొందుతున్న మోనాలిసా చిరునవ్వు నిజంగానే మార్మికంగా, అద్భుతంగా ఉంది. బయట ఫొటోల్లో చూసిందానికి, నిజంగా చూడ్డానికి చాలా తేడావుంది. ఆచిత్రానికి అంతపేరు ఊరికే రాలేదనిపించింది. మరోగంట ఆభవనంలోనే మిగతావి చూసి బయటికి వచ్చేశాము.
అదే మ్యూజియంలో ఉన్న అనేక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చిత్రాలు, శిల్పాలు చూడలేక పోయామని విచారిస్తూ, మరోసారి ప్యారిస్ వచ్చి తీరిగ్గా చూడాలని నిర్ణయించుకున్నాము.
ఆరాత్రి ఇండియన్ రెస్టారెంట్ లో భోంచేసి హోటల్ కు చేరుకున్నాము. నాలుగోరోజు ఉదయమే కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్ (అనగా రకరకాల బ్రెడ్డులు, సీరియల్స్, గుడ్లు, పాలు, కాఫీ, అతిచల్లని పండ్లముక్కలు మొదలైనవి ఉంటాయి) చేసి బయలుదేరి ప్యారిస్ కి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే వెర్సాయ్ ప్యాలెస్ చూడ్డానికి వెళ్లాము. ఆరోజంతా సన్నటి వర్షం.
వెర్సాయ్ ప్యాలెస్ ని 17 వ శతాబ్దంలో ఫ్రాన్స్ రాజు పద్నాలుగవ లూయి ఇంద్రభవనంలా నిర్మించాడు (దీన్ని చూసి ఇంద్రభవమెలావుంటుందో ఊహించుకోవచ్చేమో). రాజుది దైవదత్తమైన సంపూర్ణమైన అధికారమని బలంగా నమ్మిన లూయి అదిచాలక ఫ్రాన్స్ రాజభవనం ప్రపంచానికే కేంద్రంగా అన్నివిధాలుగా అద్భుతంగా ఉండాలనే నిశ్చయంతో దాన్ని కట్టించాడు.
లూయి వారసులుకూడా ఆ భవనాన్ని తర్వాతికాలంలో పొడిగించారు. అతను నమ్మినట్టుగానే అతను ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని 72 సంవత్సరాలు నిరంకుశంగా పరిపాలించి, ప్రజలసొమ్ముతో అతి విలాసవంతంగా జీవించి 70 యేళ్ల తరువాత వచ్చిన ఫ్రెంచ్ విప్లవానికి పరోక్షంగా కారకుడయ్యాడు.
వెర్సాయి ప్యాలెస్ ముందే బస్సుదిగాము. అక్కడ ఒక లోకల్ గైడ్ ను మాకు ఏర్ప్పటు చేశారు, అది కాకుండా ఆడియో గైడెన్స్ కూడా ఉంది. మూడు వింగ్స్ తో ఉన్న ఆ భవనాన్ని మొదట మొదటి అంతస్తు ఒకవైపు నుంచి చూడ్డం ప్రారంభించి క్రమంగా సమావేశ మందిరాలు, రాజుగారి గదులు, అద్దాల హాలు, రాణుల గదులు ఇతర రాజవంశీకుల నివాసాలు అన్నీ చూసి నాలుగ్గంటల తరువాత మరోవైపునుంచి బయటకువచ్చాం.
ఇంతాచేస్తే మేము ఒక్కోగదిలో కొన్ని నిముషాలు మాత్రమే ఉన్నాం. ఆరోజు సందర్శకులు విపరీతంగా ఉన్నారు. మొదటి పదినిముషాల్లోనే గైడ్ తో సహా ఎవరిదారి వారిదే అయింది.
ప్రతిగదీ కింద ఫ్లోరింగుతో సహా అతి ఖరీదైనవాటితో నిర్మింపబడివుంది. గోడలు, పైకప్పులు బంగారు తాపడపు నగిషీలతో, రకరకాల షాండిలియర్స్ తో నిండి వున్నాయి. నాలుగు గోడలు, పైకప్పులోపలి భాగం ఆనాటి గొప్ప పెయింటర్స్ తో వేయించిన తైలవర్ణచిత్రాలతో, శిల్పులతో చెక్కించిన పాలరాతి శిల్పాలతో అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇక ఫర్నిచర్, నిలువెత్తు డ్రేపరీస్, అద్దాల్లాంటివాటి సంగతి చెప్పఖ్ఖర్లేదు. భవనంలో భాగంగా ఓవైపు చర్చికూడా ఉంది.
భవనం పక్కన, వనుకభాగాన కొన్ని వందల ఎకరాల్లో ఆనాటినుంచే చక్కగా తీర్చిదిద్దినట్టు పెంచిన తోట వ్యాపించివుంది.
బహుశా ప్రపంచంలో ఇంత విలాసవంతమైన భవనం మరొకటి ఉండదేమో అన్న అభిప్రాయం కలిగింది. ఉన్నా దీంట్లోవున్న చిత్రాలు, శిల్పాల విలువతో పోలిస్తే ఇలాంటివి ఉండే అవకాశం తక్కువేమో అనిపించింది. అదే సమయంలో దేశంలోని ప్రజలంతా అతిసామాన్య జీవితం గడుపుతూంటే కేవలం కొన్ని రాజకుటుంబాలు ఇంత విలాసవంతంగా జీవించడం విడ్డూరంగా కనిపిస్తుంది. మొదటి ప్రపంచయుద్ధం తరువాత ఈ భవనపు మధ్యహాలులో జరిగిన సంధి ‘వెర్సాయ్ సంధి’గా ప్రసిద్ధికెక్కి, జర్మనుల అసంతృప్తికి కారణమై ఆ తరువాత రెండోప్రపంచయుద్ధానికి దారితీసింది.
వెర్సాయ్ ప్యాలెస్ చూశాక ఆసాయంత్రం ప్యారిస్ ల్యాండ్ మార్క్ ఐన ఐఫిల్ టవర్ చేరుకున్నాము. ఎప్పట్నుంచో ఫోటోల్లో, విడియోల్లో, సినిమాల్లో చూసిన ఐఫిల్ టవర్ ని ప్రత్యక్షంగా చూడ్డం అందరికీ ఉత్సాహాన్నిచ్చింది. సన్నటి వర్షంలోనే క్యూలో నిలబడి లిఫ్టులో టవర్ పైభాగానికి వెళ్లి లాబీలో చుట్టూతిరిగి అక్కడినుంచి అద్భుతంగా కనపడే ప్యారిస్ ని చూసి కొన్నింటిని గుర్తుపట్టాము.
నిరవధికంగా పడుతున్న వర్షంవల్ల కొంత మసకేసినా ప్యారిస్ నగర సౌందర్యమేమాత్రమూ తగ్గలేదు. పచ్చటి పరిసరాలు, తీర్చిదిద్దిన రహదారులు, వంతెనలు, వివిధ ఆకృతులలో పురాతన భవనాలు, తోటలు వీటన్నిటిమధ్యా పారుతున్న అందమైన సైన్ నది, అందులో నడుస్తున్న మోటారు పడవలు అన్నీ ఒక సుందర దృశ్యాన్ని ఆవిష్కరించాయి.
ఆరాత్రి బయటే భోజనం చేసి హోటల్ చేరుకున్నాము. ఆ రాత్రి మాలో చాలామంది ‘ఆప్షనల్’ ఐన లిడో షోకి వెళ్లారు. మేము వెళ్లలేదు.
( తరువాయి నాలుగవభాగంలో)
యూరోప్ యాత్ర రెండో భాగం

https://trendingtelugunews.com/english/features/baglore-express-in-london-europe-tour-travelogue/