విశాఖ ఉక్కు ఉద్యమం…అందరూ రాస్తూన్నా ఎవరూ ప్రస్తావించని అంశం ఇదే

19 ఏళ్ల పాలనా వైఫల్యాలపై నిరసన, విశాఖ ఉక్కు ఉద్యమం!!

 

(దివి కుమార్)

తెలియని ఏ తీవ్ర శక్తులో నడిపిస్తే నడిచే మనుష్యులు అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు, 1966 నాటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో నేను కూడా నడిచాను.

నేనేమీ నాయకుడిని కాను. కానీ చురుకైన కార్యకర్తగా నాటి కృష్ణదేవరాయ పాలిటెక్నిక్, వనపర్తి (మహబూబ్ నగర్ జిల్లా) కళాశాలలో ఫైనల్ ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థిగా పాల్గొన్నాను.

నాటి విశాఖ ఉద్యమం గురించి రాస్తున్న వాళ్ళు, గుర్తు చేస్తున్న వారు ప్రస్తావించని ఒక ముఖ్య విషయం నాకు మరువలేని ప్రత్యక్ష అనుభవంగా ఉండిన దానిని తప్పక చెప్పుకోవాలి. అది ..

రూపాయి విలువలో 37 శాతం కోత!

ఈ నిర్ణయం శ్రీమతి ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన అతి కొద్ది నెలల్లోనే జరిగింది. ఆ నిర్ణయంతో విభేదించిన కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి టి టి కృష్ణమాచారిని ఇందిరాగాంధీ మార్చి వేసినట్లు కూడా గుర్తు. దానితో మా చదువులకు అవసరమైన డ్రాయింగ్ షీట్లు, ఎరేజర్లు , కొన్ని రకాల ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్స్, instrument బాక్సులు అవన్నీ గతంలో ఒక రూపాయి ఉండినవి వెంటనే ఒక రూపాయి 37 పైసలుకు పెరిగిపోయాయి. కారణం అవన్నీ విదేశాల నుండి మనకు దిగుమతి అయి వచ్చినవి కావటం !

మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ పైన అది ఎంత తీవ్రప్రభావం కలిగించిందో మీరే ఊహించుకోవచ్చు. నేటి కోవిడ్ మహమ్మారి పీడించిన కారణంగా ఒక్క వ్యవసాయ రంగం తప్ప మిగిలిన పారిశ్రామిక, సేవ తదితర రంగాలన్నీ మైనస్ అభివృద్ధిలోకి దిగజారినట్లే, 1966-67 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక అభివృద్ధి గుండుసున్నా (0%) స్థాయిలోనే ఉండిపోయిoది. నాకు అంత లోతు విషయాలు అప్పుడు తెలియవు కానీ, భయంకరంగా నిరుద్యోగం వ్యాప్తి చెందటం, మా కళాశాలలోనే కాదు చాలా పాలిటెక్నిక్ లలో సివిల్ ఇంజనీరింగ్ కోర్సు తాత్కాలికంగా రద్దు చేసుకోవడం మాకు ప్రత్యక్ష అనుభవంలో ఉండిoది.

అప్పటివరకూ సాగిన 19 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన పట్ల దాదాపు భక్తి ప్రపత్తులతో, దాన్ని ఆమోదిస్తూ పెరిగిన మాతరం విద్యార్థి యువకులలో, మన స్వాతంత్రం పట్ల, దేశ అభివృద్ధి విధానాల పట్ల అనుమానాలు పొడచూపటానికి , నిరసనలు చెలరేగడానికి, విశాఖ ఉక్కు లాంటి వాటి రూపంలో ఆందోళనలు పెల్లుబకటానికి ఆస్కారం కలిగించింది నాటి ఆర్థిక రాజకీయ పరిస్థితులే!!


విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు ఆంధ్ర బంద్ పాటిస్తున్నారు.


అలా డి వాల్యుయేషన్, అనగా రూపాయి ధరలో కోత, దేశ ఆర్థిక రాజకీయాలను ప్రశ్నించే ఆలోచనకు నాలో బీజం వేస్తే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం దాన్ని మరింత గట్టి పరిచింది .
ఆ విద్యా సంవత్సరపు ఆరంభంలోనే మా కళాశాల ప్రిన్సిపాల్, రామిరెడ్డి గారు విద్యార్థులతో ప్రత్యేకమైన సమావేశం ఒకటి నిర్వహించి రూపాయి ‘ డీ వాల్యుయేషన్ ‘ యొక్క ఆవశ్యకతను, తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ మాకు పాఠంలాగా బోధించారు.

కానీ ఆచరణలో ధరలు పెరగడంతో మాకు ఖర్చులు బాగా పెరిగి అవన్నీ తెలియపరుస్తూ ఇంటికి ఉత్తరాలు రాసుకుని, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నామే అని లోలోపల దిగులు చెందిన కాలం కనుక నాకు ఆ విషయం గాఢంగా ముద్రపడి ఇంకా నా జ్ఞాపకాల్లో మిగిలి ఉoది.
నేను వనపర్తిలో చదువుకుంటున్న కాలంలో విశాఖ ఉక్కు ఉద్యమం కంటే ముందు జరిగిన రెండు ఆందోళనల్లో నేను పాల్గొని ఉన్నాను.

1. అపరాధపు ఫీజుల పెంపునకు నిరసనగా ..

2. డిప్లమా నుండి డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సులలో చేర్చుకోవాలనేది.
మొదటిది కళాశాల యాజమాన్యంపై నిరసన, రెండవది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సాగినది.

ఫైనల్ ఇయర్ లోది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇది కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా! ఈ ఉద్యమ కాలంలోనే నాకు 17 వ సంవత్సరం పూర్తయింది .

అట్లా మాకు తెలియకుండా దేశకాల పరిస్థితులలో నుండి ఆందోళనల బాటలో నడిచిన వాళ్ళం మేము. మాతో చదువుకున్న వారందరూ వీటిల్లో పాల్గొన్నారని చెప్పలేను కానీ నాకు మాత్రం అలాంటివి మన కళ్ళముందు జరుగుతూ ఉంటే దూరంగా ఉండటం చేతకాని విషయం.

ఆ సంవత్సరం మా కళాశాల విద్యార్థి సంఘ నాయకుడు కె. కేశవ గుప్తా! (గుడివాడలో పండ్ల వ్యాపారస్తుల వంశీయుడు.) అతనితోపాటు వచ్చిన విద్యార్థి బృందం హాస్టల్లో మీటింగ్ పెట్టి విశాఖ హక్కు గురించి, అమృత రావు సాగిస్తున్న నిరాహార దీక్ష గురించి ఒక రోజు చెప్పారు.

మనం కూడా ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కొద్దిరోజుల్లో విశాఖపట్నంలో కాల్పులు జరగడం, విద్యార్థులు కొందరు చనిపోవడం, దానిపై రాష్ట్రంలో చెలరేగుతున్న ఉద్యమం తరహాలో మనం కాలేజీ బంద్ చేయాలి అనేది ముందుకు వచ్చింది వెంటనే అమలు జరిగింది. నిరాహార దీక్షలు ప్రారంభం అయినాయి.

ఒక రోజు బహుశా 14- 11 – 1966 కావచ్చు వనపర్తి టౌన్ బందు చేయాలి అనుకుంటూ దాదాపు మూడు వంతుల మంది పైగా విద్యార్థులo ప్రదర్శనగా బయలుదేరాం. పోలీసులు మా ప్రదర్శనను ఆపడానికి ప్రయత్నం చేశారు. మేము వెనక్కి మళ్లలేదు. ముందుకు సాగాలని మా ప్రయత్నం.

బస్టాండ్ సెంటర్ దాకా వెళ్ళగానే లాఠీచార్జి ప్రారంభించారు. చెల్లాచెదురై పారిపోయిన వాళ్ళు ఉండినప్పటికీ లాఠీచార్జి లెక్కపెట్టకుండా ముందుకు నడవటానికి ప్రయత్నించిన వాళ్లూ ఉన్నారు . మరికొద్ది సేపట్లో పోలీసులు టియర్ గ్యాస్ షేల్స్ విసిరారు .

నాకైతే అప్పటికి టియర్ గ్యాస్ లాంటిది ఒకటి ఉంటుందని తెలియదు. ఇప్పుడులాగా తుపాకీలో నుంచి వెలువడే తూటాల రూపంలో అప్పుడు ఉండేది కాదు. విసిరి కొడితే పగిలిపోయే సీసాల్లో బంధింపబడి టియర్ గ్యాస్ ఉండేది. పోలీసులు విసిరిన టియర్ గ్యాస్ షేల్స్ కొన్ని పగలక పోయేవి.

వాటిని పుచ్చుకుని పోలీసులపై మేము వెనక్కి విసిరే వాళ్ళం . టియర్ గ్యాస్ వలన కళ్ళు మంటలెక్కి విపరీతంగా నీరుకారి పోవడం, కళ్ళు సరిగా కనపడకపోవడం విద్యార్థులను చెదిరిపోయేట్లు చేసింది.

ఇంతలో ఎవరో ఉల్లిపాయలు తెచ్చారు. వాటిని కోసి వాసన చూస్తే టియర్ గ్యాస్ పనిచేయదు అని అన్నారు కానీ, నాకు ఉల్లిపాయల ప్రభావం అంతగా అనుభవంలోకి రాలేదు. సుమారు ఒకటి రెండు గంటలలో విద్యార్థులo వెనుకకు మళ్లి హాస్టళ్లకు చేరుకున్నాం . అయితే నిరాహార దీక్షా శిబిరం కొనసాగింది. పోలీసులు దానిని తొలగించలేదు.

ముగ్గురు నలుగురు విద్యార్థులు పది రోజులు పైన నిరాహార దీక్ష చేశారు. రిలే నిరాహార దీక్షలు సాగుతూ ఉండేవి. రోజూ డాక్టర్ బాలకృష్ణయ్య గారు వచ్చి విద్యార్థులను పరీక్షించి వెళ్లేవారు. ఆయన వనపర్తి గ్రామంలో ప్రఖ్యాత ప్రజా వైద్యులు. సి. పి. ఐ. ఎం. పార్టీకి నాయకులు.(తర్వాత కాలంలో 14-3-1982న మహాకవి శ్రీశ్రీ కి వనపర్తిలో అపూర్వ పౌరసన్మానం జరిపి 25 వేల రూపాయల పర్స్ బహూకరించిన చరిత్రకు సూత్రధారుడు ఆయనే!) డాక్టర్ బాలకృష్ణయ్య గారు ఎప్పుడు వచ్చినా ఆయనను అంటిపెట్టుకుని కృష్ణమూర్తి అనే అతను ఉండేవాడు. ( ఆయననే కిట్టు మామ అని పిలుస్తారని ఎప్పటికో నాకు తెలిసింది) వారు మా నిరాహార దీక్షల శిబిరానికి వచ్చినప్పుడు జనశక్తి దిన పత్రిక ఇచ్చి వెళ్లేవారు. నేను మొదటిసారి

శ్రీశ్రీ ఖడ్గసృష్టి పుస్తకం ఆ కృష్ణమూర్తి చేతుల్లోనే చూశాను.
మా కళాశాల యాజమాన్యం ఫ్యూడల్ సంస్థానాధీశులది. వారికి డాక్టర్ బాలకృష్ణయ్య ఎదురు. ఆధిపత్యాన్ని ధిక్కరించే వాళ్లంటే విద్యార్థులకు ఒక ఆకర్షణ. అందులో మా కళాశాల యాజమాన్యానికి బాలకృష్ణయ్య వ్యతిరేకం కదా!

విశాఖ ఉక్కు ఉద్యమం గురించి మిగిలిన దినపత్రికలలో రాని వార్తలు జనశక్తిలో వస్తుండేవి. అప్పట్లో ఆంధ్రభూమి తప్ప మిగిలిన దినపత్రికలన్నీ బెజవాడ నుండి వచ్చేవి. అవి వనపర్తికి చేరుకునేసరికి సాయంత్రం మూడో నాలుగో! మేము కాలేజీ అయిపోయిన తర్వాత సెంటర్ కు వెళ్లి రోజూ జనశక్తి చదవడానికి అలవాటు పడ్డాం.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పై గొల్లపూడి నారాయణరావు రచన తెలుగుగడ్డ నవల జనశక్తి పత్రిక లోనే సీరియల్ గా వచ్చింది. అమెరికా సామ్రాజ్య వాదుల సూచనల మేరకే రూపాయి విలువను తగ్గించారని అందులో వ్యాసాలు వస్తుండేవి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉద్యమాల రిపోర్టులు జనశక్తి లో మాత్రమే వచ్చేవి. వ్యాపార పత్రికలు ఉక్కు పోరాట వార్తలన్నీ రిపోర్టు చేసేవి కాదు. కనుక జనశక్తి ప మమ్మల్ని ఎక్కువ ఆకర్షించేది. నాటి కమ్యూనిస్టు ఎమ్మెల్యేల రాజీనామాలు, వారి ప్రకటనలు వివరంగా ఇచ్చేవారు. అవి చదవటానికి మాకు బాగా ఆసక్తిగా ఉండేది.

ప్రముఖ సంపాదకుడు ఏబీకే ప్రసాద్ ఆ పత్రికకు సంపాదకుడు . ఆయన తొలిగా సంపాదకత్వం వహించిన దినపత్రిక జనశక్తి అన్న విషయం ఈ కాలంలో చాలా మందికి తెలియదు. విజయవాడలోని ఏలూరు లాకుల సెంటర్ లో ఉండిన ఆనాటి కేంద్ర ఉక్కుశాఖా మంత్రి నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ముక్కల కింద చేసి ఏలూరు కాలువలో తోసివేసిన సంఘటన గురిoచి వివరమైన రిపోర్టు చదివి హాస్టల్లో ఉత్సాహంగా తోటి విద్యార్థులతో పoచుకునేవాళ్ళం.

మహబూబ్నగర్ జిల్లాలో ఆనాటికి కళాశాలలు ఎక్కువ లేవు. వనపర్తి నుండి కర్నూలు వైపు గద్వాలలోనూ, హైదరాబాదు రహదారిలో బిజినేపల్లి జంక్షన్కి పెడగా వుండే పాలెం గ్రామంలోనూ డిగ్రీ కళాశాలలు ఉండేవి. అప్పటికే
పాలెంలో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉండేది. ఒకరోజు వనపర్తి విద్యార్థులం లారీలు వేసుకొని పాలెం వెళ్లి ఆ కళాశాలను కూడా బందు చేయించాం. వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని మొదటిసారిగా నేను చూసినది పాలెం లోనే.

అప్పటికి తిరుపతి వెంకటేశ్వరుడు కొండదిగి పట్టణాలకు గ్రామాలకు ఇంకా విస్తరించలేదు. వనపర్తికి నాలుగు ఐదు మైళ్ళ దూరంలో తిరుమలయ్య గుట్ట అని ఒకటి ఉండేది. అక్కడ శూద్ర పూజారులు ఉండే వారు. అక్కడి విగ్రహం కూడా వేరే రకంగా ఉండేది. తిరుమలకు నమూనాగా ఉండి నందువల్ల కావచ్చు పాలెం దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిoది.

వనపర్తిలో టియర్ గ్యాస్ ప్రయోగించిన కొద్దిరోజుల్లోనే అక్కడికి కొంత దూరంలో ఉండే కొల్లాపూర్ లో విశాఖ ఉక్కుకై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.

ఇంకొక రోజు సుమారు పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉండే వనపర్తి రోడ్డు (మదనాపురం) రైల్వే స్టేషన్ కు వనపర్తి విద్యార్థులమంతా వెళ్లి అర్ధరాత్రి ఒకటిన్నరకు సికింద్రాబాద్ నుండి బెంగళూరుకు, బెంగళూరు నుండి సికింద్రాబాద్ కూ వెళ్లే రైళ్లను కొంత సేపు నిలుపుదల చేయించాము. మొత్తంగా ఒక నెల రోజుల లోపు ఇవన్నీ సాగి క్రమంగా ఆగిపోయినాయి.

వనపర్తి కాలేజీలో కమ్యూనిస్టు నాయకుల బిడ్డలు కొందరు చదువుతూ ఉండేవారు. పిల్లలమర్రి వెంకటేశ్వర్లు గారి అబ్బాయి రవీంద్రనాథ్ ఠాగూర్ ( ఇతను దేవీప్రసాద్ చటోపాధ్యాయ తాత్విక ఉపన్యాసాలను తెలుగులోకి అనువాదం చేశాడు) ఉద్దరాజు రామంగారి అబ్బాయి బాపిరాజు, తుమ్మల వెంకట్రామయ్యగారి అబ్బాయి అజయ్ కుమార్, కమ్మెల దుర్గయ్య గారి అబ్బాయి భాస్కర రావు అట్లాగే మందలపర్తి కపర్ది గారి పెద్దబ్బాయి రామచంద్ర రావు (ఇతని ఆఖరి తమ్ముడే జర్నలిస్ట్ కిషోర్) వనపర్తి పాలిటెక్నిక్ లో చదువుకున్న వారే. ఇందులో మా సెక్షన్ వాళ్ళు ముగ్గురే.

అయితే నాకంటే ఒక్క సంవత్సరం సీనియర్ ఠాగూర్, జూనియర్ భాస్కర రావు. భాస్కర రావు వాళ్ల బాబాయి కమ్మెల వెంకటేశ్వర్లు గారు మాకు హైడ్రాలిక్స్ చెప్పేవారు. ఆయన సిపిఎం పార్టీ అభిమాని అని విద్యార్థులు చెప్పుకునేవారు. విద్యార్థుల పట్ల చాలా అభిమానంగా ప్రేమగా సన్నిహితంగా ఉండటంతో ఆయన మాటకు విద్యార్థులలో చాలా విలువ అత్యధిక గౌరవం ఉండేవి . విశాఖ ఉక్కు ఉద్యమ విద్యార్థుల వెనుక ఆయన మార్గదర్శకత్వం ఉండేదని చెప్పుకునేవారు. భాస్కరరావు మాత్రం విద్యార్థులను ఆర్గనైజ్ చేయడంలో బాగా చురుకుగా ఉండే వాడు. తుమ్మల అజయ్ నాయకుడిగా ముందు వరసలో లేడు గాని బాగా చురుకుగా ఉండేవాడు. నాకంటే రెండేళ్ళు పెద్ద. మేమిద్దరం వనపర్తి కాలేజీ క్రికెట్ టీం కి ఓపెనింగ్ బ్యాట్స్మెన్లం కూడా అవడంతో బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం. విశాఖ ఉక్కు ఉద్యమంలో నేను అజయ్ తోటే ఉండేవాణ్ణి . నిరాహార దీక్షలో తప్ప మిగిలిన అన్ని కార్యక్రమాల్లో చురుకుగా మేమిద్దరం పాల్గొన్నాo. కళాశాల యాజమాన్యం, సమయం రాకముందే సెలవులు ప్రకటించి విద్యార్థులను ఇళ్ళకు పంపించేశారు.

మేము ఫైనలియర్ వాళ్ళం కనుక ఇంటికి వెళ్లకుండా బుద్ధిగా చదువులో మునిగిపోయాం.మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న మాకు రాష్ట్రంలో ఎక్కడా ఉద్యోగాలు లేవు. అంతా హైదరాబాద్ పోవాల్సిందే. అవీ అరకొర ఉద్యోగాలే. పారిశ్రామిక సంక్షోభం అంతటా చుట్టుముట్టి ఉందని జనశక్తి పత్రికలో ఏవేవో రాస్తూ ఉండేవారు కానీ నా వయసుకి, నా నేపథ్యానికి అవి అర్థమయ్యే స్థాయి నాకు ఆనాటికి రాలేదు .

అదే సంవత్సరం 1966లోనే మోటూరి హనుమంతరావు గారి ముందు మాటతో భారత దేశంలో సంపద కేంద్రీకరణ అనే తరిమెల నాగిరెడ్డి రచన వెలువడిందని ఆ తర్వాత రెండేళ్ల దాకా నాకు తెలియనే తెలియదు. ఆ రచన ప్రేరణతోనే వందేమాతరం కవితను రాసినట్లు తర్వాత కాలంలో చెరబండరాజు చెప్పటం మాత్రం నాకు తెలుసు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు పోరాడుతున్నారని తెలుసు గాని చైనాలో మొదలైన సాంస్కృతిక విప్లవం గురించి నాకు దాదాపు తెలియదు.
అయితే కాలేజీ చదువు పూర్తయి ఇంకా పరీక్షా ఫలితాలు వెలువడకముందే, 1967 మే నెలాఖరులో సంభవించిన నక్సల్బరీ సంఘటన మాత్రం నాకు నేరుగా వార్తాపత్రికల ద్వారా బాగానే అందింది. నక్సల్బరీని ఉత్సాహంగా స్వీకరించ గలిగిన మనోస్థితిలో నేను అప్పటికే ఉన్నానని దాని అర్థo. అది నా తదనంతర కార్యకలాపాలన్నిటికీ ప్రేరణగా నిలబడటం యాదృచ్ఛికం కాదు. చారిత్రక పర్యవసానమే!!

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోరాటం తెలుగునాట నక్సల్బరీ విప్లవ స్ఫూర్తిని పొందిన తొలితరానికి చరిత్ర ఇచ్చిన ప్రాథమిక ఉద్యమ తర్ఫీదు లేక రిహార్సల్స్ అని నా నిశ్చితాభిప్రాయం.

విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, వరంగల్లు, హైదరాబాదులలో నాడు చురుకుగా విశాఖ హక్కు ఉద్యమంలో పాల్గొన్న విద్యార్ది యువజనుల నుండే నక్సల్బరీ సంఘటనతో మలుపు తీసుకున్న విప్లవోద్యమ నిర్మాణ యువ నాయకత్వం రూపొందిందని రుజువుకు అందే చారిత్రక సత్యం!!

ముక్తాయింపు 

ఒకవైపున ఢిల్లీలో రోజులు గడిచి నెలలుగా సాగుతున్న రైతాంగ ఉద్యమం మహోధృతంగా సాగుతూ ఉండగా , విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సమస్యను పాలకులు ఎందుకు ముందుకు తెచ్చారు ? కులం కత్తులతో కాట్లాడుకోవటం తప్ప తెలుగు వారికి ఏమీ తెలియదులే అనే చులకన భావం ఏమయినా ఉండివుంటుందా?

నేటి విశాఖ ఉక్కు ఉద్యమం ఢిల్లీలో సాగుతున్న రైతాంగ పోరాట అనుభవాలనుoడి నేర్చుకుని, విదేశీ సామ్రాజ్యవాద శక్తులకు దేశీయ కార్పొరేట్ వర్గాలకు వ్యతిరేకంగా, కేంద్ర పాలకుల మత రాజకీయాలకు రాష్ట్ర పాలకుల కుల రాజకీయాలకు అతీతంగా సమైక్యంగా సాగితే గాని
పాలకులు దిగివచ్చేలా లేరు. అప్పుడుగాని నేటి విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం విజయవంతం కాదు.

మరొక తరహాలో థామస్ జెఫర్సన్ చెప్పినట్లు నిరంతరం త్యాగపూరిత ప్రజా ఉద్యమం అనే ఎరువులు వేస్తే తప్ప ప్రజాస్వామ్యం అనే చెట్టు ఫలాలను అందించదు. ఆ ఫలాలు ప్రజలకే చెందాలన్నా , తెలుగునాట పారిశ్రామిక ప్రగతిని ఆకాంక్షించిన ఉక్కు ఉద్యమ అమరుల ఆశలు నెరవేరాలన్నా నిరంతరాయ సంఘటిత ప్రజా ఉద్యమాలు తప్ప మరో మార్గాంతరం కనబడటం లేదు.

(రచయిత దివికుమార్ కవి,  విమర్శకుడు. ప్రస్తుతం ‘జనసాహితి’ అధ్యక్షుడు)

2 thoughts on “విశాఖ ఉక్కు ఉద్యమం…అందరూ రాస్తూన్నా ఎవరూ ప్రస్తావించని అంశం ఇదే

  1. నేను వనపర్తి లో ఆరవ తరగతి చదువుతున్నప్పుడు విశాఖ ఉక్కు ఉద్యమం వచ్చింది. దివికుమార్ గారు చదివిన పాలిటెక్నిక్ లోనే మా నాన్న ఉద్యోగం చేసేవారు. ఆ ప్యాలెస్ ఆవరణలోనే ఉన్న క్వార్టర్స్ లో మేం ఉండేవాళ్ళం. నాజీవితం లో చూసిన తొలి ఉద్యమం ఇది. నేను కూడా తరగతులు బహిష్కరించి ‘ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ‘ అని అంద రితో పాటు నినాదాలు చేస్తూ తిరిగాను. తెలిసీ తెలియని వయసు. క్లాసులు లేకపోతే ఉత్సాహంగా ఇంటికొచ్చే సే వాళ్ళం. దివికుమా ర్ బ్యాచ్ విద్యార్థులు ఆందోళన చేయ డం, వారిని పోలీసులు లాఠీలతో తరమడ ము కళ్ళారా చూశాను. మా వరండా లోంచి చూస్తే కాలేజీ ముందర ఏమేం జరిగేదో అంతా కనిపించేది.. విద్యార్థులపై పోలీసులు భాష్ప వాయు గోళాలు ప్రయోగించడం కళ్ళారా చూశాను. దాంతో విద్యార్థులు పోలీసులపై రాళ్ళు రువ్వి కాలేజీ లోకి పరుగులు తీసేవారు. ఒక యుద్ధ భూమిని తలపించేది. నాకు తెలియదు కానీ, దివికుమా ర్ గారు మా నాన్నకు బాగా తెలుసు. మా బాబాయి, మా పెదనాన్న కొడుకులకు దివికుమార్ గారికి స్నేహం. దివికుమార్ గారు నా బాల్యపు జ్జాపకాల తుట్టెను కదిలించినందుకు అభినందనలు

  2. శ్రీ దివికుమార్ గారి వ్యాసం చదివిన తరువాత ఆ నాటి ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారిలో నేనూ వున్న విషయం, ఆ నాటి ఘటనలు నా కళ్ళముందు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. నేను విజయవాడ ఆంథ్రా లయోలా కాలేజీలో B A చదువుతున్నప్పుడు విజయవాడ Students federation (SFI) vice-president గా వుండేవాణ్ణి. అప్పుడు శ్రీ సురవరం సుథాకర రెడ్డి గారు national president గావుండేవారు.
    “విశాఖ ఉక్కు ,ఆంథ్రుల హక్కు ” వుద్యమం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న రోజులవి. రాజకీయాలకు అతీతంగా దాదాపుగా యావత్తు ప్రజానీకం ప్రభంజనంలా ఏకమై” విశాఖ ఉక్కు,ఆంథ్రుల హక్కు ” అని ఎలుగెత్తి చాటుతూ ఎలా వుద్యమించారో, ఎన్ని నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, సమ్మెలు జరిపారో అందరికీ బాగా జ్ఞాపకమే. విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థి లోకం అనేక చోట్ల ఈ వుద్యమానికి అగ్రభాగాన నిలిచింది .
    ఆనాటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నీలం సంజీవరెడ్డి విగ్రహం ఏలూరు కాలువ గట్టున లాకులు సమీపంలో వుండేది. ఏ నెల, ఏరోజునో నాకు జ్ఞాపకం లేదు. మేము ఓ 20,30 మంది ఆ విగ్రహం వద్దకు చేరుకున్నాం. “విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు” అని గొంతుక చించుకునేలా నినాదాలుచేసాం. ఉయకలు వేస్తున్న వుత్సాహంతో, వీరావేశంతో విగ్రహానికి తాళ్ళు కట్టి ,వెర్రి బలంతో ఆ విగ్రహాన్ని కూలదోసాం. దాన్ని ముక్కలు చేసి పక్కనే వున్న ఏలూరు కాల్వలోకి దొర్లించాం . ఈ లోగా పోలీసులు అక్కడికి చేరుకుని మమ్మల్ని అదుపులోకి తీసుకుని బలవంతంగా ఈడ్చుకుంటూ అందరినీ లారీల్లోకి ఎక్కించుకుని తాలూకా ఆఫీసుకు తరలించారు. అక్కడ ఒక షెడ్డులాంటి చోట కూచోపెట్టారు. బహూశా మూడు, నాలుగు గంటలపాటు మమ్మల్ని అక్కడే నిర్భంధంలో వుంచారు. ఆశ్చర్యంగా మా అందరికీ టీలు తెప్పించారు. విద్యార్థులతో గొడవ పెట్టుకోవడం మంచిదికాదని వాళ్ళకి తెలుసు. మమ్మల్ని లాఠీలతో బాదుతారేమోనని భయపడ్డాం. కానీ మా జోలికి రాలేదు. బుద్థిగా చదువుకోక ఎందుకు ఈ వుద్యమాలు మీకు అని చిన్నసైజు లెక్చరిచ్చి మమ్మల్ని వదిలేసారు.
    దివికుమార్ గారి వ్యాసం చదవగానే ఇవన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలాయి.
    వెంటనే ఆయనకు ఫోను చేసాను. మా నాన్నగారు పరకాల పట్టాభి రామారావు గారు బాగా తెలుసుననీ, రెండుమూడుసార్లు జర్నలిస్ట్ కాలనీలో వున్న మా ఇంటికి కూడా వచ్చినట్టు ఆయన చెప్పారు. నన్ను కూడా చూసివుంటానేమో అనికూడా ఆయన అన్నారు. మాటల సందర్భంలో సంజీవ రెడ్డి విగ్రహం కూలదోసిన వాళ్ళలో నేనూ వున్నానని చెప్పినప్పుడు ఆ సంఘటన గురించి రాయండి అని ఆయన నన్ను ప్రోత్సహించారు.
    ఆనాటి ఆ సంఘటన గురించి రాస్తున్నప్పుడు ఆ నాడు మాతో మా విద్యార్థి నాయకుడు శ్రీ సురవరం సుధాకర రెడ్డిగారు కూడా వున్నారేమో అనిపించింది . కానీ కచ్చితంగా జ్ఞాపకం లేదు. వెంటనే C R Foundation Home for Aged లో కీలక బాథ్యతలు నిర్వర్తిస్తున్న నా మిత్రుడు శ్రీ చెన్నకేశవ కి ఫోన్ చేసి శ్రీ సుధాకర రెడ్డిగారి ఫోన్ నెంబర్ తీసుకుని ఆయనకు ఫోన్ చేసాను.
    ఎన్నో ఏళ్ళ తరువాత ఆయనకు ఫోన్ చేయడం వల్ల నన్ను నేను పరిచయం చేసుకున్నాను. వెంటనే ఆయన నన్ను గుర్తు పట్టారు. ‘ ఆ, సూర్యమోహన్, బావున్నారా ? అని అడిగారు . ఆ నాటి సంఘటన గుర్తు చేసినప్పుడు తాను అప్పుడు హైదరాబాద్ లో వున్నానని చెప్పారు.
    ఇప్పుడు 55 ఏళ్ళ తరువాత , విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా కేంద్రం పావులు కదుపుతున్న నేపథ్యంలో ” విశాఖ ఉక్కు , ఆంధ్రుల హక్కు ” , దీనిని ప్రైవేటు పరం చేయడాన్ని సహించేది లేదని యావత్తు ఆంథ్రరాష్ట్ర
    ప్రజానీకం మళ్ళీ వుద్యమం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసినదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *