‘ఫ్రెండ్సిఫ్ డే అంటే గుర్తొచ్చే జంట బాపూ-రమణ‘

“A good friend is someone who knows the song in your heart and can sing it back to you when you have forgotten the words.” ఎవరు చెప్పరో కాని చాలా బావుంది ((అందుకే తెలుగులోకి అనువదించి చెడగొట్టదల్చుకో లేదు)
స్నేహం అంటే ఏమిటి ? ఇది చాలా కాలం నుంచి నడుస్తున్న చర్చ. మంచి స్నేహితుడు అంటే ఎవడు? ఇది కూడా చెప్పలేం. అయితే మంచి స్నేహితుడు అంటే he is my “alter ego” అని ఇంగ్లీషులో చెప్తారు. తెలుగులో చెప్పాలంటే తన (ద్వితీయాత్మ?) ప్రాణానికి ప్రాణం అని చెప్పుకోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే తన లాంటి వాడే ఇంకొకడు.
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నాకు గుర్తొచ్చే స్నేహితుల జంట “బాపు రమణ”. స్నేహం అంటే ఇలా ఉండాలి, స్నేహితులు అంటే ఇలా ఉండాలి అని వాళ్ళని చూస్తే చెప్పుకోవచ్చు.
రెండు శరీరాలు ఒక ఆత్మ అనొచ్చు. కొన్ని సంవత్సరాలపాటు నడిచిన ఈ స్నేహం ఆగిపోవడానికి కారణం 2011 రమణ బాపు ని వదిలి వెళ్లడం. ఆ తర్వాత బాపు కూడా 2014లో ముళ్ళపూడి వెంకటరమణ ను చేరుకున్నాడు. బాపు-రమణలు చిన్నప్పట్నుంచి సహాధ్యాయులు. మొదట ముళ్లపూడి రమణ సినిమాల్లోకి వస్తే, తర్వాత బాపు అనబడే సత్తిరాజు లక్ష్మీనారాయణ ముళ్ళపూడి వెంకటరమణతో కలిశాడు. దీర్ఘకాలంపాటు ఇద్దరూ కలిసి ఉన్నారు. ముళ్లపూడి మరణం మాత్రమే వాళ్ళిద్దరినీ విడదీయ గలిగింది. వారు తమ స్నేహాన్ని బంధుత్వం గా కూడా మార్చుకున్నారు. సినిమారంగంలో ఈ జంట గురించి అందరూ వారిని Body and soul of one another అని చెప్పుకునే వారు.
(ఈ సందర్భంగా బాపూ గారు మనల్ని వదిలిపేట్టి వెళ్ళిపోయినప్పుడు గతంలో నేను వారి గురించి రాసిన ఆర్టికల్ లోనుంచి కొంత భాగం ఇది)
ఇద్దరు మిత్రులు??!!
“నాకు డబ్బులు కావాలి.” మిత్రుడికి ఫోన్ చేశాడు ఒక పెద్దమనిషి.
“ఎప్పుడు కావాలి? మిత్రుడు అడిగాడు. “మొన్నటికి!” అని పెద్దమనిషి జవాబు!!
రమణ గారు అంతకు మూడేళ్ళ ముందే వెళ్ళిపోయారు.. (బాపు కన్న పెద్దారు కద, వయసులో!)
పైన అడిగిన పెద్దమనిషి “ముళ్ళపూడి”, మిత్రుడు”బాపు”
ఒకాయన అప్పు అడిగి తీసుకోకుండానే వెళ్ళిపోతే, ఇంకో ఆయన ఇవ్వడానికి వెళ్ళాడు.
నిఖార్సైన కామెడికి “డ్రెస్సూ”, “అడ్రెస్సూ” అయిన ఇద్దరు అలా వెళ్ళిపోవటం మనకు నచ్చకపోవచ్చు. అయినా వాళ్ళు అలానే చెస్తారు. అందుకే “బాపు-రమణలయ్యారు.”
నాకు బాపు గీతలు, రమణ రాతలు రెండు తెగిష్టం. కుంచెతో బాపు, కలంతో రమణ అడుకున్నట్లు వేరెవరూ ఆడుకోలేదు,లేరు కూడాను.. తెలుగులో హాస్యంలో కాని, సినిమా రివ్యూల్లో కాని రమణ కు మించిన వారు లేరు. ఇక బాపు గురించి ఏం చెప్పగలం?
అచ్చ తెనుగుతో “అచ్చనకాయలు”(ఇప్పుడు లేవు లేండి)
ఆడుకున్న రమణ గారు “కోతి కొమ్మచ్చి” కూడా బాగనే ఆడారు.(మూడు పుస్తకాల్లో)
బాపు బొమ్మల గురించి చెప్పవసరంలేదు..(ఈ పదం ముళ్ళపూడి వారి పదమేననుకుంటా)
సెన్సా ఆఫ్ హ్యూమరు రమణ రాతల్లో అలవోకగా ఉంటే
బాపు బొమ్మల్లో అందంగా ఉండేది.
“భార్య భర్తలు సమానమే కాని
భర్త కొంచెం ఎక్కువ సమానం!” అనటం రమణ గారికే చెల్లింది.
బాపు గారి కార్టూన్ ల గురించి చెప్పటం, కొండకచో మెచ్చుకోవటం జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యం
వేసే ప్రయత్నం.. అందుకే ఆ పని(అంటే చెప్పటం) చెయ్యటంలా బాపు “బొమ్మలు” రమణ”కోతికొమ్మలు”
రెండు మనకిక లేవు. ఎక్కడొ కొంచెం దుఖ్ఖవూ,కొంచెం శూన్యవూను…
ఏ చేస్తాం? ఎప్పుడొ ఓసారి తప్పదు.
గొప్ప స్నేహం, స్నేహితుడు అంటే మనకు గుర్తొచ్చేది కర్ణుడు! దుర్యోధనుడు- కర్ణుడి మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. స్నేహితుడి కోసం ప్రాణాలైనా ఇచ్చే వాడు కర్ణుడు. అర్జునుడి కోసం పెట్టుకున్న శక్తివంతమైన అస్త్రాన్ని( ఇంద్రుడు ప్రసాదించింది. ఒక్కసారి మాత్రమే వాడ గలిగినది) మిత్రుడు దుర్యోధనుడి కోరిక మేరకు ఘటోత్కచుడు పై ప్రయోగిస్తాడు. ఇతిహాసాల్లో గొప్ప స్నేహితుడిగా కర్ణుడు నిలిచాడు. స్నేహితుడి కోసం ఎంత దూరమైన వెళ్లగలిగే స్నేహితుడి కథ అది.
దుర్యోధనుడు చేస్తున్నది తప్పని తెలిసినా చివరి వరకు స్నేహితుణ్ణి వదిలి వెళ్లకపోవడం కర్ణుడు ఎంత గొప్ప స్నేహితుడో తెలియజేస్తుంది.
అలాగే మన పురాణాల్లో కృష్ణ- కుచేల స్నేహం గురించి అందరికీ తెలిసిందే. కృష్ణ భగవానుడు కుచేలుడు ఇంటికి వెళ్లడం.. అటుకులు తినడం కథ తెలియనివాళ్లు దాదాపు ఉండరు. స్నేహానికి తారతమ్యాలు , ఎలాంటి భేషజాలు ఉండవని తెలియపరిచే స్నేహం అది. ఇంకా ఇలాంటి స్నేహాలు, స్నేహితులు పురాణాల్లో, ఇతిహాసాల్లో, సాహిత్యాల్లో ఎన్నో కనబడతాయి
జీవితంలో ఎవరికైనా కృష్ణుడు , కర్ణుడు లాంటి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్లు అదృష్టవంతులే! కృష్ణుడు ఆయుధం చేపట్టడు, యుద్ధము చేయడు , కానీ వెంట ఉండి ఇన్స్పైర్ చేస్తూ, తెలివితేటలతో యుద్ధాన్ని గెలిపిస్తాడు. ఇక కర్ణుడు, మనం చేస్తున్నది తప్పని తెలిసినా మన కోసం ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేస్తాడు. కనీసం ఇద్దరిలో ఒక్కరు ఉన్నా చాలు.
మన తల్లిదండ్రులను, బంధువులను మనం ఎంపిక చేసుకోలేము. అయితే స్నేహితులను మాత్రం మనం సెలెక్ట్ చేసుకుంటాము. అందుకే , “Be slow in choosing friends and slower in leaving them” అంటాడొక కవి. “Old friends, old books and old wine are always cherishable” అంటాడు మరో రచయిత
“A good friend is one, who, when you have made a fool of yourself, doesn’t think that you have done a permanent job!”
చివరగా “సుఖాల్లో నీ చుట్టూ ఎంతమంది ఉంటారో తెలుస్తుంది..కష్టాల్లో మాత్రమే నీతో ఎవరున్నారో తెలుస్తుంది.” ఆ “ఎవరు” ఎవరో చెప్పల్సిన అవసరం లేదనుకుంటా!
CS Saleem Basha
(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)