Home Features చేనేత వస్తాలు తయారు చేసే మగ్గం ఎపుడైనా చూశారా? ఇది మినీమగ్గం మీ కోసమే…

చేనేత వస్తాలు తయారు చేసే మగ్గం ఎపుడైనా చూశారా? ఇది మినీమగ్గం మీ కోసమే…

860
0

చేనేత పట్టుబడి చీరలకు, డ్రెస్ మెటీరియల్ కు మంగళగిరి ప్రసిద్ధి. ఇక్కడ తయారయ్యే చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఉన్నత వర్గాల వారయితే మరింత ముచ్చట పడతారు. ఫ్యాషన్ షోలలో హొయలొలికించే అందాల భామలకు చేనేత వస్త్రాలు పెట్టని ఆభరణాలు. చేనేత వస్తాలు  అంటూనే ఒక విధంగా గర్వపడతాం. అవి ఇచ్చే హుందాతనం మరే వస్రం ఇవ్వలేదు. ఇక షోకేసుల్లో చేనేత వస్తాలు అలంకరించిన ఆ బొమ్మల్ని చూస్తుంటే చూపుతిప్పుకోలేం. అయితే ప్రశస్తమయిన వస్త్రాలను తయారుచేసేందుకు వాడే చిన్న సాదాసీదా పరికరమే మగ్గం.

నాలుగు చెక్కముక్కలతోయారయ్యే ఈ మగ్గం నుంచి ఇంత కళ ఉట్టి పడుతుందంటే నమ్మలేం. చేనేత వస్త్రాలను కోట్లాది మంది ధరిస్తున్నా, వారిలో ఎక్కువ మందికి మగ్గం ఎలా ఉంటుందో తెలియదు. మగ్గం స్వరూపం ప్రాంతాలను బట్టి మారినా, మగ్గం ప్రాథమిక డిజైన్ మారదు.  చేనేత అంటూనే మనకురాట్నం గుర్తుకొస్తుంది. రాట్నాన్నినూలు వడికేందుకు మహాత్మాగాంధీ వాడి చాలా ప్రాచుర్యంలోకి తెచ్చారు. చేనేతలో రాట్నం ఒక సాధనం మాత్రమే. రాట్నం గాంధీ విలువలకు ప్రతీక అయింది. రాట్నాన్ని ఎన్నికల గుర్తు చేసిన ఎన్నికల కమిషన్ కూడా బాగా ప్రచారంలోకి తెచ్చింది. అయితే, చేనేత వస్త్రాన్ని తయారుచేసేందుకు వాడే మగ్గం (Loom) ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. మగ్గం చిత్రం అంతగా ప్రచారంలోకి రాలేదు.

ఇలాంటి మగ్గాన్ని చేనేత అభిమానులందరికి సంపూర్ణంగా చూపించేందుకు ఒక  మినియేచర్ కళాఖండం తయారయింది.    మంగళగిరికి చెందిన జంజనం శివభావన్నారాయణ తయారుచేసిన మినియేచర్ మగ్గం ఇపుడు అందరినీ ఆకట్టుకుంటూ ఉంది.

ఆయన చేనేత వండ్రంగి. అంటే చేనేత రంగానికి కావలసిన కొయ్య పరికరాలను తయారుచేస్తారు.  నేత వడ్రంగంలో నిపుణుడైన శివభావన్నారాయణ   స్వహస్తాలతో ఈ చిట్టిమగ్గాలు (Miniature looms)తయారు చేస్తున్నారు. ముచ్చట గొలిపే ఈ షో కేసులో వచ్చే ఈ చిట్టి మగ్గం ఇపుడు చాలా మంది ఒక అమూల్యమయిన అలంకరణ వస్తువుగా సేకరించుకుంటున్నారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చిన్న వయస్సులోనే శివభావన్నారాయణ వడ్రంగి పనితోపాటు మగ్గం నేర్చుకున్నాడు. 17 ఏళ్ల ప్రాయంలో నేత పనిలోకి దిగాడు. అటు నేత… ఇటు వడ్రంగం వృత్తుల్లో నైపుణ్యం పొందుతున్న క్రమంలో పాత మంగళగిరిలో కళాకారుడు, మాస్టర్ వీవర్ అయిన పొట్లాబత్తుని లక్ష్మణరావు వద్ద నేత కార్మికుడిగా చేరాడు.

మినియోచర్ లూమ్ తో జంజనం శివభావన్నారాయణ

చేతివృత్తిలో నైపుణ్యం సాధించడంతోపాటు కార్మిక సంఘాల్లోనూ చురుగ్గా ఉంటూ రాజకీయ పరిజ్ఞానం అలవర్చుకుంటున్న క్రమంలో ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు ఆయా వృత్తిదారులు తమ సంప్రదాయ రీతిలో జ్ఞాపికలు అందజేస్తుండడాన్ని గమనించాడు. రైతులైతే నాగలి, కల్లు గీతదారులు తమ వృత్తిపరికరాలు, గిరిజనులు తమ సంప్రదాయం ప్రకారం నేతలను సత్కరించేవారు. అదే చేనేతలయితే చిలపల నూలు మెడలో హారంలా వేస్తుండే వారు. ఈ నేపథ్యంలో భావన్నారాయణకు మన చేనేత వృత్తిని తలపించే విధంగా చిన్న మగ్గం ఎందుకు తయారు చేయకూడదనే ఆలోచన కలిగింది. అలా పుష్కరకాలం కిందట తన మదిలో కలిగిన ఈ ఆలోచనకు క్రమక్రమంగా ఓ రూపాన్నిచ్చారు. అదే  ఈ మినీ లూమ్.

ఈ క్రమంలో చిన్ని రాట్నాన్ని తయారుచేసి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణకు బహూకరించాడు భావన్నారాయణ. అలాగే గణపతి సచ్చిదానందస్వామికి కూడా రాట్నాన్ని అందించాడు.

నేత యజమాని లక్ష్మణరావు  భావన్నారాయణలోని సృజనాత్మకతను గమనించి వాటిని నల్లి శిల్క్ షోరూం వాళ్లకు పరిచయం చేశాడు.

చెన్నయ్ లోని నల్లి శిల్క్స్ షోరూమ్ లో చేనేతకు సంబంధించి ఉపకరణాలన్నీ స్క్రోల్ అవుతుంటాయి. అలాగే వారి నివాస భవనంలో పాలరాతిపై చేనేతకు సంబంధించిన ఉపకరణాలను ప్రత్యేకంగా చెక్కించుకుని ప్రోత్సహించారు.

క్రమక్రమంగా తన ఆలోచనలకు పదును పెట్టి అచ్చు మగ్గాన్ని తలపించేలా చిట్టి మగ్గాన్ని నెలరోజుల పాటు శ్రమించి తయారుచేశాడు.

చేనేత షోరూమ్ లో చిన్ని మగ్గాన్ని ఆతిలకిస్తున్న ఆకాశవాణి విజయవాడ రీజనల్ న్యూస్ హెడ్ డాక్టర్ గుత్తికొండ కొండలరావు

తన ఉపాధి మార్గంలో తోడ్పాటునందించిన లక్ష్మణరావుకు వారి నూతన చేనేత వస్త్రాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ చిన్ని మగ్గాన్ని బహూకరించాడు.

ఆ షాపింగ్ కు వచ్చే కొనుగోలుదారులందరికి అద్దాల మందిరంలో ఒదిగి వున్న ఆ చిన్నిమగ్గాన్ని ప్రత్యేక ఆకర్షణగా మారింది.

చంద్రబాబుకు చిన్ని మగ్గం అందజేస్తున్న భావన్నారాయణ, టీడీపీ నేత గంజి చిరంజీవి తదితరులు

కేరళ నుంచి వచ్చిన వస్త్ర వ్యాపారి ఒకరు ముచ్చటపడి తాను కూడా పాతిక వేల రుపాయలకు చిట్టి మగ్గాన్నికొని తీసుకువెళ్లారు. స్థానిక తెలుగుదేశం నాయకులు మరొకటి తయారు చేయించి రెండేళ్ల కిందట అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు బహూకరించారు.

చిట్టి మగ్గాలు తయారుచేయాలంటే ఎంతో ఓపిక, నేర్పు అవసరం. స్వతహాగా నేత కార్మికుడు కావడం ఆపై వడ్రంగి పనిలో నైపుణ్యం సాధించిన భావన్నారాయణకు సృజనాత్మకత తోడయింది. ఇంకేముంది చిన్ని మగ్గానికి మరిన్ని సొబగులు అందించే పనిలో నిమగ్నమయ్యాడు. ఇటీవల ఇది బాగాపాపులర్ అవుతున్నది.    చిట్టి మంగాన్ని ఒక కళా ఖండాంగా భద్రపరుచుకోవాలనుకునే వారు ఎక్కువవుతున్నారు. మన చేనేత కళకిప్రోత్సాహమివ్వాలనుకునే వారు  జంజనం శివభావన్నారాయణను సెల్ నెంబర్  79817 43547 తో కాంటాక్ట్ చేయవచ్చు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here