అమరావతి కోసం రాయలసీమ, ఉత్తరాంధ్ర మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గం: మాకిరెడ్డి

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి*)
అమరావతి ప్రయోజనాల కోసం పుట్టిన ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టడానికి కొన్న రాజకీయ పార్టీలు సిద్ధపడుతున్నాయి. చివరకు రెండు వెనుకబడిన ప్రాంతాలయిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య చిచ్చు రేపడానికి సిద్ధం కావడం దుర్మార్గం.
రాజధాని అమరావతిలొనే ఉండాలని డిమాండు చేయడం తప్పులేదు. లేదా రాయలసీమకు ఇవ్వాలని కోరినా కూడా తప్పుకాదు. అమరావతి రాజధాని కోసం జరుగుతున్న పోరాటం పట్ల ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా  రాయలసీమలో పెద్దగా స్పందన లేకపోవడంతో అమరావతి అనుకూల రాజకీయ పార్టీలు కొత్త రాజకీయాలకు తెరతీశాయి. ఉంటే అమరావతిలో రాజధాని ఉండాలి లేదు అంటే కడపలో పెట్టాలి. దీని అర్థం స్పష్టం కడపకు రాజధాని కావాలని కాదు విశాఖలో రాజధాని వద్దు అమరావతిలోనే ఉండాలనే దురుద్దేశం. దాన్ని నేరుగానే చెప్పవచ్చు డొంక తిరుగుడు దేనికి ? రాయలసీమ పట్ల ప్రేమ ఉంటే సీమ ఉద్యమ సంస్థలు చేస్తున్నట్లుగా నేరుగా రాజధాని రాయలసీమకు ఇవ్వాలని అడగాలి. కడప , అనంతరపురం , తిరుపతి , కర్నూలు ఇలా ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి రాజధాని కావాలని లేని పక్షంలో అమరావతిలొనే రాజధాని నిర్మాణం చేయాలని కోరడం వెనక రాయలసీమ ప్రయోజనమా ? అమరావతి ప్రయోజనమా ?
హైకోర్టు కూడా సీమకు ఇవ్వకూడదు అన్న అమరావతి కోసం రాయలసీమ ప్రజలు పోరాడాలా ?
ఇంత జరుగుతున్నా రాయలసీమకు హైకోర్టు అయినా ఇచ్చి కలుపుకు పోదాం అన్న కనీస సానుభూతి సీమ పట్ల చూపని అమరావతి కోసం సీమ ప్రజలు ఎందుకు పోరాటాలు చేయాలి. వారి కోసం విశాఖ ప్రజలను రాయలసీమ ప్రజలు దూరం చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది. రాయలసీమకు హైకోర్టు కావాలి అన్న డిమాండుకు ఏరోజు ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడలేదు. రాయలసీమ ప్రయోజనాలకు ఉత్తరాంధ్ర ప్రయోజనాలకు పేచీకూడా లేదు కానీ రాజధాని , నీళ్లు విషయంలో అమరావతితో కూడిన కృష్ణా డెల్టాతో నిత్యం సమస్య ఉన్నది. నీటి విషయంలో దశాబ్ధాలుగా రాయలసీమ ప్రయోజనాలకు నష్టం వాటిల్లింది కృష్ణా డెల్టాతోనే అన్న విషయం దాచినా దాగాదు.
అదే సమయంలో దత్త మండలాలు అని అవమాన కరంగా పిలుస్తున్న ప్రాంతానికి రాయలసీమ అని ఆత్మగౌరవ పేరును ప్రతిపాదించింది ఉత్తరాంధ్రకు చెందిన చీలుకురి నారాయణరావు. అలా రాయలసీమ ఉత్తరాంధ్రకు అవినాభావ సంబంధం ఉంది. అలాంటి ప్రాంతంపై అమరావతి కోసం రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టడం దుర్మార్గపు చర్య కాక ఏమవుతుంది.
రాయలసీమ నీళ్లను కోల్పోయింది. వివక్షకు గురిఅవుతున్నది. చెన్నై నగరాన్ని ఒకసారి కర్నూలును మరోసారి రాజధానిని కోల్పోయింది. రాయలసీమ ప్రజలు నేడు చేయాలసింది అమరావతి కోసం మనలాగా మరో వెనుకబడిన ప్రాంతం అయిన ఉత్తరాంధ్ర పట్ల వ్యతిరేకత పోరాటం కాదు. హక్కుగా రావాల్సిన రాజధాని సాధన కోసం పోరాడటం మాత్రమే. అమరావతి ప్రయోజనాల ముసుగులో రెండు వెనుకబడిన ప్రాంతాలయిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టె రాజకీయ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
(*యం. పురుషోత్తమ రెడ్డి,సుమన్వయ కర్త,రాయలసీమ మేధావుల ఫోరం
తిరుపతి)