ధనా ధన్ ‘ధోనీ’ నిశ్శబ్ద నిష్క్రమణ!

(సిఎస్ సలీమ్ బాషా)
“హెలికాప్టర్ షాట్” అంటే గుర్తుకొచ్చే ఏకైక క్రికెటర్ మహేందర్ సింగ్ ధోనీ. వన్డేల్లో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్!(ప్రపంచంలో 5 స్థానం.) అందులో చాలా భాగం హెలికాప్టర్ షాట్ లే ఉంటాయి. (helicopter shot of dhoni)

కెప్టెన్ గా భారత జట్టుకు ప్రపంచ కప్ అందించిన రెండవ కెప్టెన్. మొదటిది 1983 లో కపిల్ దేవ్ మొదటిసారి భారతదేశానికి ప్రపంచ కప్ అందించాడు.
భారతదేశానికి వరల్డ్ కప్ తో కలిపి 3 కప్పులు ( 2007 ఐసీసీ టి20 ప్రపంచ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ) అందించిన వాడు. భారత క్రికెట్ బ్యాటింగ్ లో … లో సచిన్ కు ముందు సచిన్ కి తర్వాత అని చెప్పుకుంటాం.
అలాగే బౌలింగ్ లో కపిల్ కు ముందు, కపిల్ తర్వాత అని అను కుంటారు. అదేవిధంగా కెప్టెన్సీలో ధోని కి ముందు, ధోని కి తర్వాత అని చెప్పుకుంటాం.
జార్ఖండ్ లో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ధోనీ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎన్నో విలువైన రికార్డులను నెలకొల్పాడు.
మిస్టర్ కూల్ గా భారత జట్టులో పేరుపొందిన వాడు. అంతే కూల్ గా ” శనివారం( 15.09.2020) 7 గంటల 19 నిమిషాల నుండి నన్ను రిటైర్అ యిన ఆటగాడి పరిగణించండి” అని ప్రకటించాడు. ఇది పెద్దగా ఊహించనిది ఏమి కాదు. కానీ కాస్త తొందరగా ప్రకటించబడింది అంతే.
మిస్టర్ కూల్ గా పేరుగాంచిన ధోని తన పేరిట ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. కెప్టెన్గా మూడు ఐసీసీ టోర్నమెంట్లు గెలిచిన ఒకే ఒక్కడు.
దశాబ్దన్నర క్రితం పవర్ హిట్టర్లు అంటే.. వెస్టిండీస్, ఆస్ట్రేలియా క్రికెటర్లనే ఎక్కువగా చూపించేవారు. కానీ.. విదేశీ క్రికెటర్లకి ఏమాత్రం తీసిపోని విధంగా బంతిని భారతీయులు కూడా బలంగా బాదగలరని ధోనీ నిరూపించాడు. టీమిండియాకు బెస్ట్ ఫినిషర్ గా పేరుపొందాడు.
ధోని ఎన్నో మ్యాచ్ లను చివరి వరకు తీసుకెళ్లాడు. మ్యాచ్ ని ఫినిష్ చేయడంలో ధోని కి మించిన ఆటగాడు మరొకడు లేడు. అందుకే అతనికి” బెస్ట్ ఫినిషర్” అని పేరు. కొద్దిమంది అతన్ని టెర్మినేటర్ అని కూడా పిలుస్తుంటారు.
సచిన్ లా బ్యాటింగ్ చేయడు, సెహ్వాగ్ లాగా దూకుడుగా ఆడడు, రాహుల్ ద్రావిడ్ లాగా గోడ కట్టే లేడు. అయినా మైదానంలో ధోనీ ఉంటే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు, జట్టు ఆటగాళ్లలో పైకి కనిపించని ధైర్యం, ప్రేక్షకుల్లో ఉవ్వెత్తున లేచే ఉత్సాహం మామూలే.
వికెట్ల వెనక బౌలర్లలో ఉత్సాహాన్ని నింపుతూ, వారిని అర్థం చేసుకుని నడిపించే వికెట్ కీపర్ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ.
“చివరి ఓవర్లలో 30 పరుగులు కూడా అవతలి జట్టు కి ధైర్యాన్ని ఇవ్వదు. ధోని ఉంటే 30 పరుగులు కూడా సాధిస్తాడు” అని నమ్మేది భారత జట్టు కాదు, ప్రేక్షకులు కాదు, అవతలి జట్టు బౌలర్లు.
చాలామంది వ్యాఖ్యాతలు, ” ధోని కి బౌలింగ్ చేసేటప్పుడు చాలా మంది బౌలర్లు ఏదో తెలియని ఇబ్బందికి లోనవుతారు” అని చెప్పడం విశేషం.
2000 వ దశకం ప్రారంభంలో భారత వన్డే జట్టు వికెట్-కీపర్ స్పాట్ బ్యాటింగ్ ప్రతిభను కలిగి లేదని నిర్ధారించి వికెట్-కీపర్ గా రాహుల్ ద్రావిడ్ ను ఎంపిక చేసింది. టెస్ట్ జుట్టులో ఉన్న పార్థివ్ పటేల్, దినేష్ కార్తీక్ (భారతదేశం U-19 కెప్టెన్లు) వంటి వారు అందుకే వన్ డే జట్టు కు ఎంపికయ్యారు.
భారతదేశం A జట్టులో ధోనీ చోటు సంపాదించడంతో, అతను 2004/05లో బంగ్లాదేశ్ పర్యటన కోసం వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.
తన వన్డే కెరీర్లో ధోనికి గొప్ప ఆరంభం లభించలేదు, తొలి మ్యాచ్ లో లేని పరుగుకి ప్రయత్నించి డక్ అవుట్ అయ్యాడు.మొదటి సిరీస్ లో విజయవంతం కానప్పటికీ, ధోనీ పాకిస్తాన్ తో ODI సిరీస్ కోసం ఎంపిక చేయబడ్డాడు.
పాకిస్తాన్తో విశాఖపట్నంలో జరిగిన వన్డే మ్యాచ్ లో ధోని విశ్వరూపం చూపించాడు. తన ప్రతిభను చెప్పకనే చెప్పాడు. ఆ మ్యాచ్ లో ధోని చేసిన 183 పరుగులు ధోనీ జీవితంలో( వన్డేల్లో) అత్యధిక పరుగులు.
ఆ మ్యాచ్ ను తిలకించిన పాక్ అధ్యక్షుడు ముషర్రఫ్ ధోని కి ఫ్యాన్ అయిపోయాడు. అప్పటి నుంచి”ధోనీ” కాలం ప్రారంభమైంది అని చెప్పవచ్చు.
ధోనీ గురించి చెప్పాలంటే “ఫర్ఫెక్ట్ ప్లానర్”, ఎక్కడ సంయమనం కోల్పోకుండా, మ్యాచ్ ను చివరి బంతి వరకూ తన చేతుల్లో ఉంచుకునే వాడు.
బౌలర్ ని ఉత్సాహపరుస్తూ, వెనకనుంచి బ్యాట్స్ మెన్ వీక్నెస్ ని బౌలర్ కి బాడీ లాంగ్వేజ్ ద్వారానో, సైగల ద్వారా నో తెలియపరచడం ధోని ప్రత్యేకత. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మ్యాచ్ ను … చేజారనివ్వకుండా చూసుకుంటాడు.
ధోని ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రత్యర్థి ఆటగాడు అవుట్ అయినప్పుడు, DRS (Decision Review System) తీసుకోవాలా వద్దా అని ఒక్క సెకండ్ లో బౌలర్ల కి చెప్పగలిగే సామర్థ్యం. అందుకే DRS అంటే ( Dhoni Review System) అయిపోయింది!
గెలిచినా పెద్దగా సంబర పడడు, ఓడిపోయిన పెద్దగా నిరాశ పడడు. ఈ విధమైన ఉద్వేగ ప్రజ్ఞ ధోని సొంతం. 2011 ప్రపంచకప్ లో సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించి, కప్పును సాధించినప్పుడు, ధోనీ అందరిలాగా పిడికిలి బిగించి గాల్లో ఎగరడం, మైదానం మొత్తం పరిగెత్తడం, బ్యాడ్ ఊపడం లాంటివి చెయ్యకపోవడం మనం చూడవచ్చు. దాన్నిబట్టి ధోని గురించి అర్థమవుతుంది.
ధోని తనని ఇబ్బంది పెట్టిన బౌలర్ల కు మాటలతో కాకుండా, ఆటతో జవాబిస్తాడు. పైగా ప్రతి బంతిని కొత్త బంతి లాగానే ఆడతాడు. అంతకు ముందు బంతికి ఏం జరిగిందో పట్టించుకోడు. ఫ్లింటాఫ్ బౌలింగ్ లో బౌన్సర్ హెల్మెట్ కు తగిలిన తర్వాత, ధోనీ రియాక్షన్ ను మనము ఈ వీడియోలో చూడొచ్చు. దాన్ని బట్టి ధోని మనస్తత్వం అర్థం చేసుకోవచ్చు

 

ధోనీ మైదానం లోపల, బయట వివాద రహితుడు. తన గురించి ఎవరేమి అనుకున్న పట్టించుకునే నైజం కాదు. “ఎదిగిన కొద్దీ ఒదగమని మొక్క నీకు చెబుతుంది” అన్నది అక్షరాల ధోని కి సరిపోతుంది. నాయకత్వం గురించి విమర్శలు వచ్చినా, తన ఆట గురించి విమర్శలు వచ్చినా కూల్ గా ఉండడం, స్పందించకపోవడం ధోని స్పెషాలిటీ.
ధోనీ జీవితంలో చాలా తక్కువ సార్లు తన ఎమోషన్స్ ని బయట పెట్టాడు. ధోని మీద తీసిన సినిమా ” ధోనీ ది అన్టోల్డ్ స్టోరీ” హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ధోనీ కొంచెం ఫీల్ అయ్యాడు. ధోని లాంటి ఫైటర్ నిజ జీవితం మీద ఆధారపడి తీసిన ఆ సినిమా హీరో ఆత్మహత్య చేసుకోవడం చిత్రమే.
భారత కెప్టెన్ లలో ఒక విశిష్టతను సంపాదించుకున్న ధోనీ తన మొదటి వన్డే ఇన్నింగ్స్ లో రనౌట్ అయ్యాడు, చివరివన్డే ఇన్నింగ్స్ లో కూడా రనౌటే అయ్యాడు. కానీ మొదటి మ్యాచ్ లో సున్నా పరుగులు చేసిన ధోనీ, చివరి మ్యాచ్ లో 50 పరుగులు చేయడం విశేషం! అదే ధోనీ క్రికెట్ కెరీర్ ను సూచిస్తుంది.

 

(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)