Home Features నవ్వు

నవ్వు

155
0
(పిళ్ళా కుమార స్వామి)
“సుఖమంటే ఏమిటి.? ఎలా ఉంటుంది? అదెక్కడ దొరుకుతుంది?” అంటూ అయినాపురం కోటేశ్వరరావనే మధ్యతరగతి జీవి అడుగుతాడు 1965లో దేవరకొండ బాల గంగాధర తిలక్ సిఐడి రిపోర్ట్ కవితలో.
ఇప్పుడు”నవ్వంటే ఏమిటి?అదెలా ఉంటుంది?” అనడుగుతున్నాడు నేటి మనిషి.
నవ్వు మనిషికిప్పుడు సులభంగా దొరికే వస్తువు కాకుండా పోయింది. డబ్బు సంపాదనలో పక్కవారి కన్నా పదిమెట్లు అధికంగా ఉండాలన్న తపనలో ఆనందంగా నవ్వడం మరిచిపోతున్నాడు మనిషి.
నడి సంద్రంలో మునకే సుఖంగా మారింది.
కవులు ఒక్కోసారి నిరంతరం ఉత్తేజాన్ని, నవ్వులు కురిపించే కవిత్వాన్ని చిలికించి ఆనందాన్ని పరిమళింప జేస్తుంటారు.”అగ్ని చల్లినా/అమృతం కురిసినా/అందం, ఆనందం దాని పరమావధి” అని తిలక్ చెప్పినట్లు కవిత్వం ఆనందాన్నిచ్చే సాధనం కూడా.
ఒక్కోసారి మనలో మనం ఏకాంత లోకంలో స్వప్న సౌందర్యాన్ని చిత్రించుకొని ఆనందిస్తూ ఉంటాం.శ్రీశ్రీ కూడా తన ఏకాంతలోకంలో  “ఒకనాటి రాత్రినే స్వ/ప్న కుటీరం అల్లుకొనుచు నాలో నేనే/పకపక నవ్వుచు ఊహల/షికార్లు పోదోడునాడ సిరిసిరిమువ్వా !” అంటూ.. తన సిరిమువ్వలలో తెలియజేస్తాడు.
“నవ్వుతూ బతకలిరా తమ్ముడు/నవ్వుతూ చావలిరా తమ్ముడు” అంటూ ఒక సినిమా కవి నవ్వుపై పాటను కూడా రాస్తే, “సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి నవ్వల్లె నవ్వు చిరకాల ముండాలి నీ నవ్వు చిగురిస్తూ ఉండాలి నీ నవ్వు”అంటూ మరో కవి రాశాడు.
source:wikimedia commons
నవ్వు హృదయంలో పూలు పూయిస్తుంది. పెదాలపై నవ్వు పువ్వులను వికసింపజేస్తుంది. నవ్వు మనిషికి టానిక్ లాంటిది. ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. నవ్వు మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. ఆరోగ్యంగా, ఉత్సాహంగాఉంచుతుంది.
నవ్వు అంటూ వ్యాధి లాంటిది. నవ్వు నాలుగు విధాలా చేటు కాదు. నవ్వు నాలుగందాల మేలు. మనం నవ్వితే ఎదుటివారూ నవ్వుతారు.
“నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును,
నవ్వులు చిత్తవృత్తికి దివ్వెలు,
పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు
విశుద్ధమైన లేనవ్వులు, సర్వదుఃఖశమనంబులు,
వ్యాధులకున్ మహౌషధుల్” అంటూనవ్వు గొప్పతనాన్ని, నవ్వు ఔషధంగా ఉపయోగపడే విధాన్ని జాషువా ఏనాడో చెప్పాడు.
స్మితం, హసితం, విహసితం అంటూ నవ్వులో రకాలున్నాయని అలంకారికులు చెపుతాడు. మనుషుల్లో రకరకాల వాళ్ళుంటారు. కొంత మంది పగలబడి నవ్వేవారు, కొంత మంది మందస్మితులు, చిరునవ్వు మాత్రమే చిద్విలాసముగా చిందిస్తూ ఉంటారు.
మరికొంత మంది నవ్వే బయటికి కనిపించనీయక బుద్ధునిలా ఉంటారు. మరికొంత మంది చాలా సీరియస్ విషయాలు కూడా హాస్యంగా చెప్పగల చతురులై ఉంటారు.
నవ్వు సహజంగా వచ్చేది. సహజంగా వచ్చే నవ్వు అందరిలో ఒకేలా ఉండదు. కొందరుపగలబడి, మరి కొందరు విరగబడి, మరికొందరేమో నవ్వితే రత్నాలు రాలుతాయేమోనన్నంతగా నవ్వకుండా మూతి ముడుచుకొని ఉంటారు. దీనికి కారణం వారిలో ఉండే జీన్స్ కారణమని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. మనలో నవ్వో మీటరు ఉంటుంది. ఇదే మన నవ్వును నియంత్రిస్తుంది.
వేష భాషల్లో, స్వరూపాల్లో, స్వభావాల్లో సహజానికి విరుద్దంగా ఉండే విధంగా మనకు కనిపిస్తే మనిషిలో కలిగే భావననే హాస్యం అంటారు. ఇది మన నవ్వు రూపంలో వ్యక్తమౌతుంది.నవ్వు ఒక భావోద్రేకం.మెదడు కుడి భాగంలోని ఫ్రంటల్ లోబ్ నవ్వుకు కారణమని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో కనుగొన్నారు.ఈ భాగం దెబ్బ తింటే మనుషుల వ్యక్తిత్వం మారిపోయి అనవసరంగా, అసందర్భంగా నవ్వుతూ ఉంటారని తేలింది.
నవ్వుతో అనేక లాభాలున్నాయి. నవ్వడం వలన నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. దీని వాళ్ళ ఒత్తిడి తగ్గుతుంది. ఎక్కువగా నవ్వే వారిలో శ్వాస కోశ సంబంధ వ్యాధులు రావని అనేక సందర్భాల్లో తేలింది.
ఎక్కువగా నవ్వితే గుండె జబ్బులు దూరంగా ఉంటాయి. దానికోసం విదేశాల్లో ఆసుపత్రుల్లో లాఫ్ రూమ్స్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపడానికి నవ్వు ఒక మంచి సాధనం. మెదడు, శరీరం కలిసి ఉన్నందున నవ్వినప్పుడు చాలా కండరాలు కదులుతాయి.
నవ్వుతూ బతికే వారు, ఆశాజీవులుగా ఉంటారు. ఆశాజీవులు ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని నవ్వు పెంపొందిస్తుంది. ఒత్తిడికి సంబంధంచిన నాలుగు హార్మోన్ల స్థాయిని నవ్వు తగ్గించేస్తుంది. దాంతో హాస్య పూరిత వాతావరణంలో ఆందోళన, ఒత్తిడి తగ్గిస్తాయి.
నవ్వినప్పుడు ఎండార్ఫిన్లు విడుదలై నొప్పిని, బాధను మరిచిపోయేటట్టు చేస్తాయి. నొప్పి నుంచి మన మనస్సు దూరంగా పోయి బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది.నవ్వించే వాళ్ళుంటే ఎంతటి సీరియస్ విషయాన్నైనా అవలీలగా నవ్విస్తూ, కవ్విస్తూ దాటవేయగలం.
రోగి మరణించాడని విని… “ఏమిటి అప్పుడే చనిపోయాడా? నేనింకా రాకుండానే, మందివ్వకుండానే” అని అన్నాడో డాక్టరు.
అంత సీరియస్ విషయం వాతావరణం కూడా ఒకింత మార్చేస్తుంది. “అత్తగారు చనిపోయారు. ఇంతలో మబ్బులు కమ్ముకొచ్చి పెళ పెళ మని మెరుపులు మెరుపులతో వర్షం కురుసింది. అప్పుడే అత్తమ్మ పైకి చేరిపోయింది. అందుకే ఈ ఉరుములు మెరుపులు..” అంది కోడలు. ఇలాంటివి అనుకోకుండానే మనలో నవ్వు తెప్పిస్తాయి.
“అన్ని అప్పులకు అమృతాంజనం
అన్ని సమస్యలకు హాస్యాంజనమే బెస్ట్” అన్నాడు ఆరుద్ర.
మనసు ఆనంద తరంగితమైనపుడు ఏటి మీదకు వెన్నెలొచ్చినట్లు అలవోకగా పెదవుల మీద చిరునవ్వు మెర్తునుంది.“విషాదం జీవితాన్ని కమ్మినప్పుడు/ పసిపిల్లల నవ్వుల్ని చూడాలి/ చిగురించే లేలేత పచ్చదనం చూడాలి!
ఉల్లాసం మోసులెత్తిస్తుంది/ సంతోషం ప్రపంచాన్ని జయించేందుకు అపార శక్తినిస్తుంది”అంటాడు కుమారస్వామి తన నవ్వు ఒక నిత్య వసంతం కవితలో.
కాస్త నవ్వుతూ మసలుతుంటే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. నవ్వడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి.అన్ని గ్రంథులు సక్రమంగా పనిచేసి మనసు ఉల్లాసంగా చలాకీగా తయారవడానికి నవ్వు చక్కని మార్గం.
మరి మీరూ నవ్వుతూ ఉంటారు కదూ.
పిళ్లా కుమారస్వామి
(పిళ్లా కుమారస్వామి, రచయిత, విమర్శకుడు, అనంతపురం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here