కాంగ్రెస్ మీద ‘గ్వాలియర్’ రెండో తిరుగుబాటు, జ్యోతిరాదిత్య రాజీనామా

(TTN Desk)
గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు.  ఆయనప్రధాని నరేంద్ మోదీని, హెం మంత్రి అమిత్ షాను కూడా కలుసుకున్నారు. అందుకే ఆయన బిజెపిలో చేరేందుకు రంగం సిద్దమయిందని చెబుతున్నారు. మధ్య ప్రదేశ్ రాజకీయాలే దీనికి కారణమని, ముఖ్యమంత్రి పదవిని జ్యోతిరాదిత్య ఆశిస్తున్నారని , దాని వల్లేఆయన కాంగ్రెస్ పార్టీని చీల్చి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహకరిస్తున్నారని సర్వత్రా వినబడుతూ ఉంది.
అసలెందుకు గ్వాలియర్ రాజకుటుంబంలో కలకలంమొదలయింది. గ్వాలియర్ రాజవంశం నుంచి ఇది కాంగ్రెస్ మీద జరిగిన రెండో తిరుగుబాటు. మొదటి తిరుగుబాటు 1966లో వచ్చింది.
 గ్వాలియర్ రాజకుటుంబం తొలిసారిగా రాజకీయాల్లో బలహీన పడింది. 1952 నుంచి 2019 దాకా ఈ కుటుంబానికి చెందిన ఎవరో ఒకరు ఎపుడూ లోక్ సభలో అధికార పక్షంలోనో, ప్రతిపక్షంలో నో ఉంటూ వచ్చారు.రాజమాతగా పేరుండిన విజయరాజె సింధియా (బిజెపి), ఆమెకుమారుడు మాధవరావ్ సింధియా (కాంగ్రెస్) లేదా వసుంధరరాజే సింధియా(బిజెపి),యశోధర రాజే సింధియా(బిజెపి) జ్యోతిరాధిత్య సింధియా(కాంగ్రెస్) ఇలా ఈకుటుంబ ప్రతినిధులు పార్లమెంటులో ఉంటూ వచ్చారు. రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.
2019లో అంతా తలకిందులయింది. జ్యోతిరాధిత్య సింధియా మధ్య ప్రదేశ్ గుణ నియోజకవర్గం నుంచి లోక్ సభ కు పోటీ చేసి ఓడిపోయారు. రాజస్థాన్ లో విజయరాజె సింధియా ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 1952 నుంచి 2014 దాకా 15 ఎన్నికల్లో గెలిచిన కుటుంబం ఓడిపోయింది.
వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ లోక్ సభకు ఎన్నికయినా, ఆయనదోల్ ఫూర్ రాజవంశానికి చెందిన వాడు, సింధియాకుటుంబంలో చేర్చలేం.
ఈ కుటుంబం మొత్తం 32 ఎన్నికల్లో గెల్చింది. ఇది ఆల్ ఇండియా రికార్డు. ఇలా రికార్డు ఇందిరా గాంధీ ఫామిలీకి మాత్రమే ఉంది. ఈ కుటుంబం మొత్తం 33 ఎన్నికల్లో గెల్చింది. (మేనకా 7 సార్లు, సోనియా 6, ఇందిరా గాంధీ, రాహుల్ నాలుగు సార్లు, నెహ్రూ, రాజీవ్, వరణ్ మూడేసి సార్లు, ఫిరోజ్ గాంధీ 2 సార్లు, సంజయ్ గాంధీ ఒక సారి) అయితే, 1977-79మధ్య ఈ కుటుంబం నుంచి ఎవరూ పార్లమెంటులో లేరు. అపుడు ఇందిరాగాంధీ, కుమారుడు సంజయ్ గాంధీ వోడిపోయారు. ఇలాగే 1991-1996 మధ్య కూడా ఈ కుటుంబం నుంచి ఎవరో సభలో లేరు. దీనికి కారణం 1991 ఎన్నికల క్యాంపెయిన్ ఉన్నపుడే రాజీవ్ గాంధీ హత్య జరిగింది.
సింధియా కుటుంబం కాంగ్రెస్ బిజెపి రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. గ్వాలియర్ సంస్ధానాధీశుడు జియాజీరావ్ సింధియా స్వాతంత్ర్యానంతరం భార్య విజయరాజేను రాజకీయల్లోకి పంపారు. ఆమె కాంగ్రెస్ లో చేరారు. మూడు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. తర్వాత ఆమె కు ఇందిరాగాంధీతో విబేధాలొచ్చాయి. దీనితో 1967లో ఆమె భారతీయ జనసంఘ్ (బిజెపి మాతృక)లో చేరారు. ఆపార్టీకి కొండంత అండ అయ్యారు.
మొదట 1957లో ఆమె గుణ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికయ్యారు. తర్వాత 1962,1989,1991,1996,1998 లలో కూడా లోక్ సభ కుఎన్నికయ్యారు. 1967 నుంచి 1971 దాకా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1978 నుంచి 1989 దాకా రాజ్యసభలో ఉన్నారు. 1975 ఎమర్జీన్సీలో జైలుకు కూడా వెళ్లారు. బిజెపికి ఉపాధ్యక్షురాలిగా కూడా పని చేశారు.
ఆమె కుమారుడు మాధవ్ రావ్ సింధియా 1971లో జనసంఘ్ తరఫున లోక్ సభకు పోటీ చేశారు.గెలిచారు. ఇండిపెండెంటుగా పోటీ చేసి గెలిపారు. తర్వాత 1980లో కాంగ్రెస్ కు వచ్చారు. ఆయన తొలినుంచి తల్లితో బాగా విబేధాలున్నాయి. మాధవ్ రావ్ సింధియా మొత్తంగా 9 సార్లు లోక్ సభకు ఎన్నికయి రికార్డు సృష్టించారు. ఆయన విమాన ప్రమాదంలో మరణించాక జ్యోతిరాధిత్య మొదట గుణ ఉప ఎన్నికల్లో తర్వాత మూడు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2019లో ఆయన ఓడిపోయారు.
విజయరాజే సింధియా కాంగ్రెస్ ఎందుకు వీడారు?
మధ్య ప్రదేశ్ ముఠా రాజకీయాల వల్లే విజయరాజే సింధియా కాంగ్రెస్ కు రాజీనామా చేసి జనసంఘ్ లో చేరారు. కేంద్రంలో క్యాబినెట్ లో మంత్రికావాలని లేదా ముఖ్యమంత్రి కావాలని రాజమాత కోరికఅనిచెబుతారు. అయితే, 1966లో ప్రధాని అయిన ఇందిరా గాంధీ దీనికి అంగీకరించలేదు. మరొక వాదన ప్రకారం, ఇందిరా గాంధీ  రాజభరణాలను, రాజప్రముఖ్ హోదాలకు తొలి నుంచి వ్యతిరేకమని, అందుకే పార్టీలో రాజవంశీకుల పెత్తానాన్ని సహించలేదని ఒక వాదన వుంది.దీని వల్లే ఆమె మధ్య ప్రదేశ్ “ఉక్కుమనిషి” గాపేరున్న డిపి మిశ్రాకు సర్వాధికారాలు కట్ట బెట్టటారు. ఫలితంగా మధ్య ప్రదేశ్  రాజకీయాలలో ఇందిరాగాంధీ గ్వాలియర్ రాజవంశ వ్యతిరేకులను  ప్రోత్సహించారని చెబుతారు.
.దీనితో నిరాశచెందిన రాజమాత మొదట సి.రాజగోపాలాచారి నాయకత్వంలోని స్వతంత్ర పార్టీలో చేరారు. 1967 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరఫున లోక్ సభకు, జనసంఘ్ తరఫున అసెంబ్లీకి పోటీచేశారు.రెండు గెలిచారు అయితే, లోక్ సభకు  రాజీనామా చేశారు. జనసంఘ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలుమోపారు. అపుడు మధ్య ప్రదేశ్ డిపి మిశ్రా నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వారిద్దరికి పొసిగేదికాదు.కాంగ్రెస్ లోకూడా ముఠాలున్నాయి. ఒక వర్గం మిశ్రామీద తిరుగుబాటు చేసింది. జనసంఘ్ వారికి సహకరించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. దీనికి రాజమాత నాయకత్వం వహించారు.తర్వాత సంయుక్త విధాయక్ దళ్ నాయకత్వంలో కొత్త కాంగ్రెసేతర ప్రభుత్వం కాంగ్రెస్ రెబెల్ గోవింద్ నాారాయణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఏర్పడింది. ముఖ్యమంత్రి పదవి ఆమెకు దక్కలేదు. అయితే, కొత్త ప్రభుత్వం 20 నెలలు మించి సాగలేదు.ఎందుకంటే సింగ్ మళ్లీ కాంగ్రెస్ వైపు వెళ్లారు.
 బిజెపి ఏర్పడ్డాక అందులోనే చివరి దాకా కొనసాగారు. అయితే, ఆమె ఎపుడూ మంత్రి కాలేకపోయారు.
ఈ నేపథ్యంలోనే ఆమె కుమారుడు మాధవ్ రావ్ సింధియా జనసంఘ్ అభ్యర్థిగా గుణ నుంచి గెలుపొందారు.
వాజ్ పేయికి సలహాదారుగా ఉన్న బ్రజేష్ మిశ్రా ఎవరనుకున్నారు, డిపి మిశ్రా కుమారుడే, ఇది వేరే కథ. చివరకు1980లో రాయ్ బరేలిలో ఇందిరాగాంధీ మీద కొత్తగా ఏర్పాటయిన బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఓడిపోయారు.
1998లో బిజెపి అధికారంలో కి వచ్చినపుడు కూడా ఆమె మంత్రి కాలేకపోయారు. ఆపుడామె వృద్ధాప్యం, అనారోగ్యం అడ్డు వచ్చాయి. కేంద్ర మంత్రి కావాలన్న ఆమె కోరిక ఎపుడూ నెరవేరలేదు. అయితే, ఆమె కొడుకు, కూతురు, చివరకు మనవడు కూడాకేంద్రంలో ఎదో ఒక పార్టీ నుంచి మంత్రి అయ్యారు.
జ్యోతిరాధిత్య సింధియా నాయనమ్మ బాటలో…
కాంగ్రెస్ తో జ్యోతిరాధిత్య సింధియా మధ్య ప్రదేశ్ ముఠారాజకీయాల వల్లే విబేధాలొచ్చాయి.ఆయన పార్టీకి రాజీనామా చేశారు. జ్యోతిరాధిత్య కేంద్రంలో సహాయ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. 15 సంవత్సరాల తర్వాత మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. అయితే, ఆయనకుముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఉంది.
అయితే, మోదీ ఉప్పెన లో ఆయన ఓడిపోయారు. ఆయనకు ఇతర రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు విబేధాలున్నాయి.
 రాహుల్ గాంధీ సింధియా కంటే కమల్ నాథ్ ను ఇష్టపడ్డారు.ముఖ్యమంత్రిని చేశారు.
కాంగ్రెస్ అధిష్టానం 1967నాటిలాగే రాజవంశానికి వ్యతిరేకంగా ఉన్నవారిని ప్రోత్సహిస్తున్నదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. అదే ఇప్పటి తిరుగుబాటు కారణం, దీనికి భారతీయ జనతా పార్టీ తగినంత సాయం అందిస్తున్నది.