పొద్దున లేచినప్పటినుంచి రాత్రి నిద్రపట్టే దాకా ప్రపంచమంతా వినిపిస్తున్నమాట, కనిపిస్తున్నబొమ్మ ఒక్కటే కరోనా. కరోనా పరిశోధనలు, కరోనా పాజిటివ్ కేసులు, కరోనా మృతులు, కరోనా రాజకీయాలు, కరోనా పుట్టుపూర్వోత్తరాలు , కరోనా లాక్ డౌన్, కరోనా వ్యాక్సిన్, కరోనా మందు, కరోనా క్వారంటైన్ వంటి మాటలు తప్ప మరొక మాటేది వినిపించడం లేదు. అగ్రరాజ్యాదినేత డొనాల్డ్ ట్రంపు మొదలుకుని వీధిచివర అరుగుమీదో కాకపోతే నేల మీదో కూర్చునే కూరగాయలమ్మ దాకా మాట్లాడేది ఒక భాష, ఒకటే సబ్జక్టు. కరోనా.
వాళ్లు మాట్లడుకుంటున్నది ఇపుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న నావెల్ కరోనా వైరస్ గురించే నని అందరికి తెలుసు. అయితే దాన్నికుదించి కరోనా అని చెప్పుకుంటున్నాం. ఈ మాట పుట్టి సరిగా 54 సంవత్సరాలయింది. అపుడు గొంతువాపును తీసుకువచ్చే ఒక రోగకారకానికి (pathogen) ఈ పేరు పెట్టారు. అప్పటి నుంచి చాలా వైరస్ లు నాటి కరోనాను పోలి ఉండటంతో వీటన్నింటిని కరోనా వైరస్ లని పిలుస్తున్నారు. అంటే కరోనా అనేది ఒక వైరస్ జాతి అయిపోయింది. ఇది కొత్తగా చేరిన సభ్యురాలు నావెల్ కరోనా వైరస్.
ఈ జాతి వైరస్ ని కళ్లతో చూసి, ఫోటో తీసి, పేరు పెట్టిందెరనుకుంటున్నారు.
ఒక శాస్త్రవేత్తకాదు, డాక్టర్ కాదు.కేవలం ల్యాబ్ టెక్నిషియన్ మాత్రమే.
ఆమె పేరు జూన్ అల్మీదా. స్కాట్లెండ్ కు చెందిన అల్మీదా ఒక బస్సు డ్రైవర్ కూతురు. రెండో ప్రపంచయుద్ధానంతరం వచ్చిన ఆర్థిక సంక్షోభం సృష్టించిన పేదరికం వల్ల ఫీజులు కట్టే శక్తి లేనందున చదవును16 సంవత్సరాలకే వదిలేసి గ్లాస్గో హాస్పిటల్ హిస్టాలజీ (Histology) డిపార్ట్ మెంట్ లో జూన్ అల్మీదా చిన్న ఉద్యోగం (ల్యాబ్ అసిస్టెంట్) లో చేరాల్సి వచ్చింది. జబ్బుల లక్షణాలను పరిశీలించేందుకు మనిషి శరీరం నుంచి సేకరించిన శ్యాంపిల్స్ ను మైక్రోస్కోపు నుంచి చూడటం ఆమె ఉద్యోగం. ఆచిన్న ఉద్యోగంనుంచి ఆమెకే కాదు, శాస్త్ర ప్రపంచానికి, వైద్య ప్రపంచానికి ఎనలేని ప్రయోజనం చేకూరింది తర్వాత్తర్వాత.
మైక్రోస్కోపు నుంచి రోగలక్షణాలను, రోగకారకాలను పరిశీలించి, పరిశీలించి చివరకామె ఆ రంగంలో ఎనలేని ప్రావీణ్యం సంపాదించారు.
