Home English కాళేశ్వరం యాత్ర లో జగన్ చేయాల్సిన పని…

కాళేశ్వరం యాత్ర లో జగన్ చేయాల్సిన పని…

213
0
SHARE
ఈనెల 21న తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అతిథిగా పిలవడానికి ఆరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడకు వస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ జగన్ ని రావద్దని కోరుతుంది. ఏపీలో కొందరు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. పూర్తిగా ఇవి రాజకీయ అంశాలే. కాళేశ్వరం అంశంలో ఏపీ ప్రజలు ఆలోచించాలసింది 1. ఆప్రాజెక్టు వలన మనకు ఏమైనా నష్టమా.
2.ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి మనము ఏమైనా సహకారం కొరాలా, అనే విషయాలనే.
1. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నీటి వినియోగం కోసం ఉద్దేశించిన ఎత్తిపోతల పథకం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కృష్ణా , గోదావరి నదులు ప్రవహిస్తాయి. కృష్ణ నీటిని మిగులు జలాలతో సహా పంపకాలు చేసుకున్నారు. మిగిలింది అపారంగా నీటి లభ్యత ఉన్నది గోదావరి మాత్రమే. గోదావరి మన రాష్ట్రంలో సముద్ర మట్టానికి 40 , 50 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. ఫలితంగా పోలవరం ప్రాజెక్టు ద్వారా గ్రావిటీ పద్ధతుల్లో నీటిని వాడుకోవచ్చు. అదే తెలంగాణ ప్రాంతంలో 700 , 900 అడుగులు ఎత్తిపోతల పధకం ద్వారా నీటిని సరఫరా చేయాలి. మనకన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో గోదావరినది ఉన్నా ఈ పరిమితి ఆరాష్ట్రానికి ఆటంకంగా ఉన్నది. 2 , 3 వేల టీఎంసీల నీరు ప్రతిఏటా వృధాగా సముద్రంలో కలుస్తుంది. కనుక తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం వలన మన రాష్ట్రానికి వచ్చే నష్టం లేదు.
2. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా కేసీఆర్ పుష్కలంగా లభిస్తున్న గోదావరి నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉపయోగించే విధంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించడానికి వస్తున్న కేసీఆర్ తో ఇరు రాష్ట్రాలకు మేలుచేసే దుమ్ముగూడెం టెల్ పాండు పథకం పునరుద్ధరణ అంశాన్ని జగన్ ప్రస్తావించాలి.
దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టెల్ పాండును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి…...
రాయలసీమ నుంచే కృష్ణానది , ఇతర ఉపనదుల ద్వారా ప్రతి ఏటా 1000 టీఎంసీల నీరు ప్రవహిస్తున్నా నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేయకపోవడం వలన సీమలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. నేడు నిర్మిస్తున్న పోలవరం పూర్తి అయినా రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి పరిమితులు ఉన్నాయి. గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు సరఫరా చేస్తే ఆమేరకు రాయలసీమ ప్రాంతంలో నీటిని విడుదల చేయకుండా సాగర్ జలాశయం నుండి కృష్ణా డెల్టాకు వదులు తున్న నీటి విడుదలను ఆపి ఆనీటిని సీమకు వినియోగించే ఆలోచన పాలకులది. వినడానికి బాగున్నా కొన్ని పరిమితులు ఉన్నాయి. రాష్ట్రం తన వాటాను శ్రీశైలంలో నిలుపుదల చేయచ్చు కానీ అదే శ్రీశైలం నుంచి అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం 99.5 టీఎంసీల నీటిని విడుదల చేసుకునే అవకాశం ఉంది. గోదావరి నది నుండి ఎత్తిపోతల పథకం దుమ్ముగూడెం టెల్ పాండు ద్వారా నాగార్జున సాగర్ జలాశయంలోకి తొడితే శ్రీశైలం నుంచి నీటిని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు కృష్ణ నీటిని పూర్తిగా రాయలసీమ , వెనుకబడిన ప్రకాశం జిల్లాకు వెలుగొండ ద్వారా అదేవిధంగా తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా లాంటి ప్రాంతాలకు ఉపయోగించే అవకాశం ఉంటుంది….
వైయస్ రాజశేఖర రెడ్డి నీటి ప్రాజెక్టుల విషయంలో దూరదృష్టితో ఆలోచించారు. ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయకుండా పోతిరెడ్డిపాడు తూముల వెడల్పు చేసిన ఫలితంగా నేడు రాయలసీమ జిల్లాల్లో కొంత మేరకు అయినా నీరు అందుతుంది. వారి దూరదృష్టికి మరో కీలక ప్రాజెక్టు దుమ్ముగూడెం. వారు దాదాపు 500 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసినారు. వారు మరణించడం ఆతర్వాత విభజన జరిగింది. రాయలసీమ నాయకులకు పదవులు తప్ప ప్రాంతం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేకపోవడం వల్ల విభజన చట్టంలో పోలవరంతో బాటు దుమ్ముగూడెం జాతీయ ప్రాజెక్టు కాలేకపోయినది. రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా జగన్ ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి.

జగన్ మోహన్ రెడ్డిపై నమ్మకం ఉంది…….

ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత విషయంలో జగన్ కు పూర్తి అవగాహన ఉంది. నేను తిరుపతిలో ఈ అంశాన్ని జగన్ దృష్టికి తీసుకువచ్చినపుడు. వారు నాకు ఇచ్చిన సమాదానంలో హామీ ఇవ్వడంతో బాటు ప్రాజెక్టు పట్ల తనకు సరైన అవగాహన ఉన్నట్లు వెల్లడించారు. ఇపుడు వారే ముఖ్యమంత్రి కావడం వలన ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చి రాయలసీమ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కాగలదని ఆకాంక్షిస్తున్నాను…….
-యం. పురుషోత్తమ రెడ్డి,సమన్వయకర్త,రాయలసీమ మేధావుల ఫోరం
తిరుపతి.