Home Features జగన్ గారూ, మీ పాలనా బాబు పాలనలాగే ఉందంటున్నారు: ఐవైఆర్ కృష్ణారావు

జగన్ గారూ, మీ పాలనా బాబు పాలనలాగే ఉందంటున్నారు: ఐవైఆర్ కృష్ణారావు

115
0
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు
గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి,
అఖండ విజయం సాధించి తమరు తమ ప్రభుత్వం పాలనా బాధ్యతలు చేపట్టి ఇప్పటికి దాదాపు ఎనిమిది నెలలు. ఈ అఖండ విజయానికి ఒక ప్రధాన కారణం అంతకు పూర్వం పాలన నిర్వహించిన చంద్రబాబునాయుడు గారు వారి తెలుగుదేశం పార్టీ ఒక వర్గ ప్రయోజనాల కే కొమ్ముకాసాయి అని ప్రజలు బలంగా నమ్మడం వలన.
ఈ ఎనిమిది నెలల తమ పాలన కూడా అదేవిధంగా సాగుతూ ఉన్నది అనే అపోహ ప్రజలలో ముఖ్యంగా హిందూ సమాజంలో ఏర్పడింది. యాదృశ్చికంగా తమరి ప్రమేయం లేకుండా ఈ సంఘటనలు జరిగి ఉంటే తగిన నివారణా చర్యలు వెంటనే తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ అంశాలను మీ ముందు ఉంచుతున్నాను.
ప్రప్రథమంగా అంతకు ముందు ప్రభుత్వాలు చేయనివిధంగా కొన్ని ముఖ్య నిర్ణయాలు హైందవ సమాజానికి మేలు కలిగే విధంగా తీసుకున్నందుకు మీ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు.
ఇండ్ల స్థలాల భూసేకరణలో దేవాదాయ భూముల ను మినహాయిస్తూ మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు దోహదం చేస్తుంది. దేవుని ఆస్తి ఎవరి ఆస్తి కాదు అనే విధంగా గత ప్రభుత్వాలు విచ్చలవిడిగా దేవాదాయ భూముల ను కారుచౌకగా వివిధ సంస్థలకు పందారం చేయడం జరిగింది.
మిగిలిన విలువైన భూములను బలవంతులైన వారు ఆక్రమించుకున్నారు. వీరి చర నుంచి కూడా దేవాదాయ భూములను ఆస్తులను పరిరక్షించడానికి వెంటనే చర్యలు తీసుకుంటే దేవాలయాల సంపద పెరిగి దానిని హిందూ ధర్మ ప్రచారానికి వినియోగించు కోవచ్చు.
తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను దేవాదాయ ధర్మాదాయ శాఖ క్రింద ఉన్న సంస్థలకు కేటాయిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం.
ఇది దేవాదాయ ధర్మాదాయ చట్టంలో పేర్కొన్న అంశం కూడా. ఈ నిధులను సమర్థవంతంగా సక్రమంగా హిందూ ధర్మ ప్రచారానికి వాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.అదేవిధంగా దశాబ్ద కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న చిన్న దేవాలయాల అర్చకుల సమస్యలను తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిష్కరించి వారికి తగిన వేతన సౌకర్యాలు ఏర్పాటు చేయడం శుభపరిణామం.
ఈ అర్చకులకు సామాజిక బాధ్యత ఒక ప్రధాన ఉద్యోగ ధర్మంగా ఏర్పాటు చేసి వారి సేవలను హిందూ మత ప్రచారానికి వాడుకోవాలని అవసరం ఎంతైనా ఉంది. ఇతర మతాలలో లాగా కాకుండా అన్ని హైందవ సంస్థలు ఈనాడు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా హిందూ ధర్మ ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంది. ఈ దిశగా వెంటనే దేవాదాయ ధర్మాదాయ శాఖ చర్యలు ప్రారంభిస్తుందని ఆశిస్తున్నాను.
అదేవిధంగా హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ కు చట్టబద్ధత కల్పించి సమరసతా వేదిక కు అనుసంధానం చేసి హిందూ ధర్మ ప్రచారానికి కార్యక్రమాలు తీసుకోవడం కోసం గా మీ ప్రభుత్వంలో చర్యలు ప్రారంభమైనాయి అని విన్నాను. గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిన ఈ అంశాన్ని త్వరితగతిన అమలు చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.
దేవాదాయ ధర్మాదాయ చట్టం క్రింద దేవాలయ వ్యవహారాలు చూడటానికి ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి. దురదృష్టం గత ప్రభుత్వం దీనిని పూర్తిగా విస్మరించింది. తమరిని వెంటనే అర్హులైన వ్యక్తులతో ధార్మిక పరిషత్ ని ఏర్పాటు చేసి దానికి సరైన అధికారాలు ఇచ్చి దేవాలయాల ధార్మిక సిబ్బందిని, వివిధ మఠాలను ధార్మిక పరిషత్ క్రిందికి తేవలసినదిగా కోరుచున్నాను.
అదేవిధంగా చాలా హిందూ దేవాలయాల్లో ఇతర మతస్తులు కీలకమైన ఉద్యోగాలను నిర్వహిస్తున్నారు. మతం నమ్మకంతో కూడిన అంశం. నమ్మకం లేని నాడు అటువంటి వారి ప్రవర్తన హిందూ భక్తుల మనోభావాలు నొచ్చు కునే విధంగా ఉంటుంది. అటువంటి వారిని గుర్తించి వారి జీవనభృతికి భంగం కాని విధంగా ఇతర కార్యాలయాలలో వారికి పని కల్పించటం సమస్యకు పరిష్కారం.
ముఖ్యమంత్రి స్థాయిలో ఈ అంశం పైన దృష్టి పెట్టనిది ఇది నెరవేరదు. ఈ అంశంపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించవలసిందిగా తమరిని కోరుతున్నాను.
ఇక గత ఎనిమిది నెలలుగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా జరుగుతున్న కొన్ని సంఘటనలను తమ దృష్టికి తీసుకొని వస్తున్నాను.
తమ పార్టీ ప్రణాళికలో ఇమామ్లకు పాస్టర్లకు ఆర్థిక సహాయం చేసే విధంగా పేర్కొన్నారు. కానీ ఈ చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ ప్రణాళికను పరిశీలించి రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్యను ఆపేసి ఉంటే బాగుండేది. అలా కాకుండా తమరు ఈ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా చర్యలు ప్రారంభించారు.
ఈ అంశంపై సుధీష్ రాంభొట్ల గారు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు అవుతుంది. అంతకు ముందే ఒకసారి పరిశీలించి ఈ చర్యలను విరమిస్తే మంచిది.
అదేవిధంగా జెరూసలేం యాత్ర కు ఇచ్చే సహాయం పెంపు, చర్చిల నిర్మాణానికి మైనారిటీ కార్పొరేషన్ సహాయం వంటి అంశాలలో ప్రభుత్వ ఉత్తర్వులను కూడా ఇవ్వటం జరిగింది. నిజమే ఇవి గత ప్రభుత్వాల కాలం నుంచి కొనసాగుతున్న కార్యక్రమాలు. కానీ ఈ రోజు ఈ అంశాలను కోర్టులో ప్రశ్నించటానికి మేము కొంతమంది మి నిర్ణయించుకున్నాం. కోర్టు నుంచి ఉత్తర్వులు రాకముందే ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన కార్యక్రమాలను విరమించుకుంటే మంచిది.
కొందరు వ్యక్తులు సంస్థల కార్యక్రమాలు వాటిమీద ప్రభుత్వం నిశ్శబ్దత పలు అనుమానాలకు తావిస్తున్నాయి. కృష్ణా గోదావరి నదులలోని స్నాన ఘట్టాలు హిందువులకు దేవాలయాల వలనే చాలా పవిత్ర ప్రాంతాలు. ఎప్పుడూ లేని విధంగా కొందరు వ్యక్తులు సంస్థలు విజయవాడ స్నాన ఘట్టం దగ్గర కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద క్రైస్తవ మత ప్రచారాన్ని ప్రారంభించారు.
అదేవిధంగా ఒక జిల్లా కలెక్టర్ గ్రామ సచివాలయాలు ఎంపిక చేయబడిన స్వచ్ఛంద కార్యకర్తలు లు ఒకే మతానికి చెందిన వారిని బహిరంగ సభ లో పేర్కొన్నారు. దీనిని ప్రభుత్వం ఏ స్థాయిలోనూ ఖండించలేదు. ఆ కలెక్టర్ పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీని అర్థం ఆయన చెప్పిన మాటలో సత్యం ఉన్నది అనా? అదే నిజమైతే ఇది చాలా తీవ్రమైన విషయం. ప్రభుత్వ ధనంతో గ్రామస్థాయిలో మత ప్రచారకులు నియమించినట్లు అవుతుంది. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన వివరణ ఇవ్వడంతో పాటు, అటువంటి నియామకాలు ఏమైనా జరిగి ఉంటే వెంటనే తొలగించాలి.
ఎప్పుడూ లేని విధంగా పిఠాపురం పట్టణంలో హిందూ దేవతా విగ్రహాలను అగౌరవ పరచటం జరిగింది. ఒక పాకిస్థాన్ దేశంలో తప్పితే ఇటువంటి చర్యలను మనం ఇంకెక్కడా వినలేదు. శోచనీయం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఘటనా స్థలాన్ని సందర్శించ లేదు. ఇది ఎవరో మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన చర్యగా నేను భావించడం లేదు. దీనిపై పూర్తి స్థాయిలో విచారించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది.
రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించడానికి తీసుకునిన మీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. తూర్పు తీరంలో మహా నగరంగా అభివృద్ధి చెంద గలిగిన సామర్థ్యం ఉన్న నగరం విశాఖ.
అమరావతి మహానగర నిర్మాణం ఆచరణ సాధ్యం కాని ఒక ఊహాజనిత ఆలోచన. రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ ఈ తరలింపు జరగాలని కోరుకుంటున్నాను.
చంద్రబాబు నాయుడు గారికి కొన్ని వ్యవస్థలతో ఉన్న దీర్ఘకాలిక బలమైన సంబంధాల దృష్ట్యా ఈ తరలింపుకు బలమైన ప్రతిబంధకాలు వచ్చే అవకాశం ఉన్నా వాటిని అధిగమించి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను.
పైన నేను పేర్కొన్న కొన్ని అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన వివరణలు ఇవ్వవలసిన అవసరం, చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అవి జరగని నాడు ఈ ప్రభుత్వం నిగూఢమైన మతపర అజెండాతో నడుస్తూ ఉన్నది అనే భావన ప్రజలలో బలపడే అవకాశం ఉన్నది.
( ఐవైఆర్ కృష్ణారావు, విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఫ్లాట్ నెంబర్ 306, ట్యులిప్ అపార్ట్మెంట్స్, సివిల్ సప్లై కార్పొరేషన్ దగ్గర,
సోమాజిగూడ హైదరాబాద్)