Home Features జగన్ బడ్జెట్ లో ఇరిగేషన్ కు నిధుల్లేవ్, ఎమ్మెల్యేలందరికి షాక్

జగన్ బడ్జెట్ లో ఇరిగేషన్ కు నిధుల్లేవ్, ఎమ్మెల్యేలందరికి షాక్

488
0
(వి. శంకరయ్య)
గతంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో వున్నా శాసన సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు మరు రోజు కూడా అందరి దృష్టి సాగు నీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులపై వుండేది. మీడియా కూడా ప్రాజెక్టులకు కేటాయించిన నిధులపై కథనాలు వెలువరించేవి. టివి ఛానల్స్ వీటి పైననే చర్చలు పెట్టేటివి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వైయస్సార్ జగనన్న తోడు చేదో డులతో బడ్జెట్ నిండి పోయింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అన్న పూర్ణగా ప్రసిద్ధి కెక్కివ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులు అప్రధానమైన విభాగంగా మారి పోయాయి.
ముందుగా ఒక్క విషయం చెప్పి తర్వాత అసలు విషయానికి వద్దాం.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వెలువడిన తొలి బడ్జెట్ లో సంక్షేమానికి 14142.99 కోట్లు కేటాయించితే ఈ ఏడు 41456.29 కోట్లు కేటాయించారు. అదే సాగునీటి ప్రాజెక్టులకు గత బడ్జెట్ లో 13139 కోట్లు కేటాయించితే ఈ ఏడు మరీ బక్కచిక్కి పోయి 11805 కోట్లకు దిగజారి పోయింది. ఈ ఏడు రాష్ట్రంలో లబ్దిదారులకు నగదు రూపంలో 37 659 కోట్లు బదలీ చేయ నన్నారు సాగునీటి రంగానికి మూడవ భాగం కూడా కేటాయించ లేదు. పోనీ గత ఏడాది బడ్జెట్ లో సాగునీటి రంగానికి కేటాయించిన నిధులు ఖర్చు చేశారా? అంటే అదీ లేదు.నాలుగైదు వేల కోట్లు కూడా వ్యయం చేసివుండరు.
రాష్ట్రానికి జీవనాడిగా ప్రచారం జరిగే పోలవరం ప్రాజెక్టుకు గత ఏడు రాష్ట్ర బడ్జెట్ లో 5129 కోట్లు పెడితే ఈ సంవత్సరం 4804 కోట్లు కేటాయించారు. గమనార్హమైన అంశమేమంటే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు భరిస్తుంది. ఇటీవల 1800 కోట్లు విడుదల చేస్తే ఈ నిధులు దారి మళ్లాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల కావాలంటే వ్యయం చేసిన నిధులకు ఆడిట్ చేసి పంపితేనే తాము నిధులు విడుదల చేస్తామని షరతు విధించింది. ఈ ఏడు పోలవరం కాపర్ డ్యాం 41.15 మీటర్ల స్థాయికి పనులు పూర్తి కావాలంటే మూడు వేల కోట్లు కావాలి. పునరావాస కార్యక్రమాలకు ముందుగా నిధులు వ్యయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏలా సమీకరించుతుందో వేచి చూడాలి.
ఇదిలా వుండగా ముందుగా మెట్ట ప్రాంతాల పథకాలు పరిశీలిద్దాం. చంద్రబాబు నాయుడు హయాంలోనే కాకుండా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నట్లు గోదావరి కృష్ణ నదుల అనుసంధానం గురించి ఈ బడ్జెట్ లో నిధులు లేవు. కడప కర్నూలు చిత్తూరు జిల్లాకు సాగునీరు అందించే గాలేరు నగరి పథకం 30 సంవత్సరాలుగా అంగలార్చుతోంది. తొలి దశ ఓమాదిరిగా వున్నా రెండవ దశ గాలిలో దీపంగా వుంది. గత ఏడు ఈ పథకానికి 391 కోట్లు కేటాయించారు.
ఈ ఏడు మాత్రం 1173.90 కోట్లు చూపెట్టారు. ఎందుకంటే ఏమైనా ఈ ఏడు గండికోట లో 26 టియంసిల నీరు నిలపాలని భావిస్తున్నందున కేటాయింపులు పెంచారు. గండికోట భూసేకరణకు 500 కోట్లు కావలసి వుంది. పైగా పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం కొత్తగా ఎత్తిపోతల పథకానికి 6829 కోట్లు బడ్జెట్ లో చూప లేదు. బహుశా ఈ నిధులు వ్యయం చేస్తారేమో. ఒక వేళ ఇదే నిజమైతే గాలేరు నగరి రెండవ దశ పథకం శాపగ్రస్తమౌతుంది.
ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన ఎమ్మెల్యే ఆర్ కె రోజా ముఖ్యమంత్రికి సన్నిహిత మిత్రుడుగా ప్రచారంలో వున్న ఎమ్మెల్యే మధుసూదనరెడ్డిలు నగరి, శ్రీ కాళహస్తి నియోజకవర్గ వర్గ ప్రజలకు ఏం చెప్పకుంటారు?
ఈ ఏడు గాలేరు నగరి రెండవ దశకు నిధులు మాట మరచి పోవలసినదే. దీనితో పాటు తిరుపతి తిరుమల తాగునీటికి ఉద్దేశించిన బాలాజీ రిజర్వాయర్ అటకెక్కినట్లే.
ఈ సందర్భంలో మరో ట్విస్ట్ వుంది. ఒక వేళ టిటిడి నిధులతో దాని కాచ్ మెంట్ ఏరియాకు పరిమితం చేసి బాలాజీ రిజర్వాయర్ మూడు టిఎంసిల సామర్థ్యం నుండి ఒక టియంసికి పరిమితం చేస్తే గాలేరు నగరి చిత్తూరు జిల్లాకు చెందిన రెండవ దశ పథకానికి ముగింపు పలికి నట్లే.
అంతే కాదు సోమశిల స్వర్ణ ముఖి లింకు కెనాల్ కు గత ఏడు 42 కోట్లు కేటాయించి 9 కోట్లు విడుదల చేశారు. ఈ ఏడు కేవలం పది కోట్లు కేటాయించారు. పాపం చిందులు తొక్కుతున్న వెంకటగిరి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో
పాటు శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి ఇద్దరికీ షాకే.
హంద్రీనీవా ప్రాజెక్టు కథ మరీ ఘోరంగా వుంది. గత ఏడాది ఈ పథకానికి 1136 కోట్లు కేటాయించారు.అయినా నిధుల జాడ లేదు. ఈ సంవత్సరం మరి చిక్కిపోయింది. కేవలం 565.12 కోట్లు కేటాయించినారు. గత ఏడాది 229 కోట్లు విడుదల చేశారు. కనీసం రెండు వేల కోట్లు లేనిదే వున్న విధంగా ఈ పథకం పూర్తి కాదు.
టిడిపి హయాంలో 2018-19 బడ్జెట్ లో 524.31 కోట్లు మాత్రమే కేటాయించినా వాస్తవంలో 819 కోట్లు వ్యయం చేశారు. అందుకే చిత్తూరు జిల్లా వరకు హంద్రీనీవా కాలువ నీళ్లు పారాయి.
ప్రస్తుతం కేటాయించిన నిధులతో హంద్రీనీవా ద్వారా చిత్తూరు జిల్లా కు సాగునీరు అటుంచి తాగు నీరు కూడా లభించదు. ఒక విధంగా మంత్రి రామచంద్రారెడ్డి ఇరుకున పడక తప్పదు.
కొసమెరుపు ఏమంటే రాయలసీమ సముద్దరణకు తయారు చేయబడిన పథకంలో ఇప్పుడు వున్న హంద్రీనీవా కాలువ విస్తరణ 630 కోట్లు ప్రత్యామ్నాయ కాలువ తవ్వకానికి 20 వేల కోట్లు అవసరమని అంచనాలు ప్రభుత్వానికి పంపారు. ప్రస్తుతం అంతా హుష్ కాకి అయింది.
హంద్రీనీవా కాలువ విస్తరణ ప్రత్యామ్నాయ మైన కాలువ తవ్వకం బడ్జెట్ లో ఆ ఊసే లేదు. రాయలసీమ వాసుల చిరకాల వాంఛితమైన నికర జలాలు కేటాయింపులు వున్న గుండ్రేవుల రిజర్వాయర్ గాని దీనికి తోడు సిద్దేశ్వరం అలుగు ప్రస్తావన లేదు. తుంగభద్ర ఎగువ కాలువకు ప్రత్యామ్నాయ కాలువ అంతే.
గుడ్డిలో మెల్లగా ఆశాజనకంగా వెలుగొండ ప్రాజెక్టు కనిపిస్తోంది. గత ఏడు 485 కోట్లు కేటాయించితే ఈ ఏడు 965.41 కోట్లు కేటాయించారు.
మెట్ట ప్రాంతాల్లో అమలులో వున్న మిగిలిన ప్రాజెక్టులు అన్నీ దీనాతి దీనంగా తయారైనవి. తెలుగు గంగ ప్రాజెక్టుకు గత సంవత్సరం 435 కోట్లు కేటాయించితే ప్రస్తుతం 273.07 కోట్లకు దించేశారు.
సీమకు నికర జలాలతో దిక్కుగా వున్న తుంగభద్ర ఎగువ కాలువకు గత ఏడు 90 కోట్లు కేటాయించినా ఏ మేరకు నిధులు విడుదల అయ్యాయో పక్కన పెడితే ఈ ఏడు 77.09 కోట్లకు కుదించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గానికి చెందిన పులివెందుల కాలువకు గత ఏడు 112 కోట్లు బడ్జెట్ లో చూపెడితే ప్రస్తుతం కోత బడి 68.74 కోట్లకు పరిమితం చేశారు. మరీ గుండ్లకమ్మ పథకం అనాధ వుంది. గత బడ్జెట్లో 28 కోట్లు చూపెట్టినా ప్రస్తుతం 17.80 కోట్లకు దించారు.
ఇదిలా వుండగా చింతలపూడి ఎత్తిపోతలకు గత ఏడు 720 కోట్లు కేటాయించగా ఈ ఏడు 115 కోట్లు మాత్రమే కేటాయించారు. గోదావరి కృష్ణ డెల్టాల పరిస్థితి అంతే. గోదావరి డెల్టాకు 115 నుండి 60.60 కోట్ల కు కృష్ణ డెల్టాకు 512 నుండి 201 కోట్ల కేటాయింపులు కుదించారు. ముందుగా ఒక బండ సూత్రం పెట్టుకోవాలి. గత బడ్జెట్ కాలంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు చేసి నిధులు విడుదలై వ్యయం చేసిన అంశాల గురించి అడగ కూడదు. ప్రతి పథకంలో కూడా నామ మాత్రంగా నిధులు వ్యయం చేశారు. కేవలం రెండు బడ్జెట్ అంకెలను మాత్రమే చూసి సంత్రుప్తి పడాలి. అద్రుష్టం కొద్ది కెసి కెనాల్ కు గత సంవత్సరం ఎంత వ్యయం చేశారో పక్కన పెడితే ప్రస్తుతం మాత్రం 101 కోట్లు చూపెట్టారు.
ఇందులో వుండే మరో ట్విస్ట్ పరిగణన లోనికి తీసుకోవాలి. ఈ ఏడు 11805 కోట్లు సాగు నీటి రంగానికి కేటాయించినా ప్రణాళిక వ్యయం 10640 కోట్లుమాత్రమే. ఇదిలా వుండగా సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు అయిదు వేల కోట్లు బకాయిలు వున్నాయని చెబుతున్నారు. మరి ఈ
సంక్షేమ పథకాల మధ్య సాగునీటి పథకాలకు కేటాయించిన నిధులల్లో ఏమేరకు విడుదల చేస్తారో ఇందులో పాత బిల్లులు ఎంత మేరకు చెల్లించి కొత్త పథకాలను ఏ మేరకు పూర్తి చేస్తారో వేచి చూడ వలసినదే. ఒక శుభ సూచికమేమంటే ఎన్ని ఆరోపణలు విమర్శలు ఎదుర్కొన్నా చంద్రబాబు నాయుడు సాహసం చేసి పట్టిసీమ పూర్తి చేశారు – కాబట్టి గోదావరి డెల్టా రైతులతో సమానంగా అటు ఇటుగా కృష్ణ డెల్టా రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఉచితానుచితాలు పక్కన బెట్టి సాహసం చేసి రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సాగునీరు ఇవ్వ గలిగితే చరిత్రలో మిగులు తారు. నగదు పంపిణీలు రోగానికి పై పూత మందు మాత్రమే.
(వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013)
(విశాలాంధ్ర దిన పత్రిక సౌజన్యంతో)