యువతను బాధించే వార్త, పెట్టుబడులు దండిగా వచ్చాయ్, జాబ్స్ రాలేదు: రీసెర్చ్ పేపర్

తెలంగాణా రాష్ట్రం వచ్చాక కొలువులేవీ అంటూ చాలా కాలం కొలువుల కొట్లాట అని ఒక ఉద్యమం నడిపారు. తెలంగాణ వచ్చాక కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయలేదని, నిరుద్యోగులు నిరాశకుగురవుతున్నారని  2017నవంబర్లో తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో   నిరుద్యోగులు  ర్యాలీ  తీశారు.
కారణం ఏంటంటే ఉద్యోగాలు కనుచూపుమేరలో కనపించం లేదని ఉస్మానియాలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదువుతున్న ఇ. మురళి(21) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
అదేవిధంగా నిర్మల్ జిల్లాకు చెందిన ఒక నిరుద్యోగ యువకుడు నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
మూడు రోజుల కిందట తెలంగాణలో  ఒక టైలర్ కుమారుడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఎంతకూరాక విసుగు చెంది ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ పరిస్థితి తెలాంగాణలోనే కాదు,పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లోనూ ఉంది. పంజాబ్ లో ఉంది. యుపిలో ఉంది. ప్రభుత్వాలన్నీ ఉద్యోగాల  రిక్రూట్ మెంట్లు నిలిపివేశాయి. ఆర్థిక వ్యవస్థ బాగలేదు, గవర్నమెంటులో ఉద్యోగాల్లేవు,, పెట్టబడులొస్తే, అందిరికీ ఉద్యోగాలొస్తాయని న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా పాలకులు మిద్దెక్కి అరచి నమ్మించారు. పెట్టబడులయితే వచ్చాయి గాని, ఉద్యోగాలు మాత్రం రాలేదు. ఇది రెండు దశాబ్దాల అనుభవం.
1991లో New Economic Policy వచ్చింది. అప్పటి నుంచి 2018దాకా ఇండియాలోకి వచ్చిన విదేశీపెట్టబడులు, అవితీసుకొచ్చిన ఉద్యోగాల ఎన్ని?  ఈ విషయాన్ని  ప్రభుత్వం అందించిన అంకెలతోనే  విశ్లేషించి రొనిస్మిత మిశ్రా (Ronismita Mishra), స్వప్పమోయి పాలిత్   (Swapnamoyee Palit) అనే ఇద్దరు పరిశోధకులు కళ్లు తిరిగే వాస్తవాలను వెల్లడించారు.
ఈ విశ్లేషణ International Journal of Recent  Technology and Engineering- IJRTE) 2020  మార్చి లో Role of FDI on Employment Scenario in India శీర్షికతో అచ్చయింది.
విదేశీ పెట్టుబడులు భారీగా వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మించడం సులభమని, అయితే  మిధ్య అని, గత రెండుదశాబ్దాలు ఈ విషయాన్ని రుజువు చేశాయని ఈ రీసెర్చ్ పేపర్ వెల్లడించింది.
ఈ పరిశోధకులు 1991  నుంచి 2018 మధ్య భారత దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు, వివిధ రంగాలలో ఈ పెట్టుబడులు సృషించిన ఉద్యోగాల మీద ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంకు విడుదలచేసిన సమాచారం సేకరించి విశ్లేషించారు.
ఆర్థిక వ్యవస్థను సరళీకరించిన తర్వాత విదేశీపెట్టుబడులు రాక బాగా పెరిగింది.  1991-2001 మొదటి దశాబ్దంలో కంటే రెండో దశాబ్దంలో అంటే 2002 నుంచి 2012 మధ్య విదేశీపెట్టుబడు లు పెరిగాయి.  పెట్టుబడులు బాగా ఎక్కువ గా వచ్చింది సర్వీస్ సెక్టర్ లో . ఆ తర్వాత బ్యాకింగ్, ఇన్య్సూరెన్స్ రంగం రెండవ స్థానంలో ఉంది.  సర్వీస్ సెక్టర్ లోకి వచ్చిన పెట్టబడుల వల్ల సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలు  వచ్చినా దేశంలో  ఉద్యోగాల కల్పనను మొత్తం తీసుకుంటే ఈ ఉద్యోగాల పెరుగుదల బాగా తక్కువ.
ఇదెలా జరిగిందో చూద్దాం.
విదేశీ పెట్టుబడు (FDI)లొస్తే ఉద్యోగాలు కుప్పలొస్తాయని 1991 నుంచి 2018 దాకా అధికారంలోకి వచ్చిన వాళ్లు, అధికారంలోకి రావాలనుకుంటేన్న వాళ్లు, ఆర్థిక వేత్తలు పదే పదే చెబుతూ వచ్చారు. ఒక కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఉద్యోగం చాలా అవసరం. కుటుంబం ఆర్థికంగా బాగుంటే దేశం బాగుంటుంది.ఉద్యోగాలు వస్తే కుటుంబాల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు జీవం పోస్తుంది.
పెట్టుబుడులు, అందునా విదేశీ పెట్టుబడులు వస్తే  ఉద్యోగాలు వస్తాయని చెప్పి విదేశీ కంపెనీలకు చవగ్గా భూములిచ్చారు. అనేక ఇతర రాయితీలు ఇచ్చారు. అయితే,ఇవన్నీ ఉత్తిమాటలే. కంపెనీలు భూములు తీసుకున్నాయి. ప్రారంభోత్సవాలు జరిగాయి. ఫోటోలు ప్రతికల్లో వచ్చాయి. టివిల్లో వీడియోలు వచ్చాయి.వీటిని చూసి దేశం చాలా ముందుకు పోతున్నది కొంత మంది దేశభక్తి పూసుకున్నారు.
అయితే, అంతిమంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయని పట్టణాల్లో అద్దెకు గదులు తీసుకుని, ఖరీదైన కోచింగ్ లు తీసుకుంటూన్న యువకులకు ఎదురుచూపులే మిగిలాయని ఈ రీసెర్చ పేపర్ చాలా స్పష్టంగా చెప్పింది.
ఈ అన్యాయమయిన పరిస్థితి ఇప్పట్లో మారేలా  కనిపించడం లేదు.  ఇదే బాధాకరం.

FDI inflows and Unemployment rate in India from the year 1991 to 2018 in percentages

ఈ గ్రాఫ్ లో నిరుద్యోగం ఎలా పెరిగిందో ఉద్యోగాలెల పెరిగాయో సులభం చూడవచ్చు. 2017లో నిరుద్యోగం నాలుగు శాతం పెరిగితే, విదేశీ పెట్టబడుల వచ్చిన ఉద్యోగాల గ్రోత్  ఒకటిన్నర శాతం మించలేదు. ఎంతగ్యాప్ ఉందో వూహించవచ్చు.
1991 న్యూ ఎకనమిక్ పాలసీ వచ్చాక  విదేశీపెట్టుబడులు రావడం మొదలయింది. 2008లో ఇది పతాకాస్థాయికి చేరింది. దీని ప్రభావంతో జిడిపి  3 శాతం పెరిగింది.  అయితే, ఈ వృద్ధి ఉద్యోగాలలో కనిపించలేదు.

Inflows and Employment to Population Ratio

ఈ టేబుల్ ప్రకారం, 1990-1991లో విదేశీ పెట్టుబడులు 0.02(జిడిపిలో ) ఉన్నపుడు  ఉపాధి 57.21 శాతం మందికి లభించేది.2001-2002 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 1.05 (జిడిపిలో) ఉన్నపుడు ఉపాధి56.09 శాతం మందికి ఉండేది. ఇలా విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు పెరిగిపెరిగి  1.54 శాతం (జిడిపిలో ) కు చేరకున్నాయి. ఉపాధి లో 50.67 శాతం మందికి లభిచింది. దేశంలో రెండు దశాబ్దాల కాలంలో  మొత్తం ఉపాధి కల్పనలో విదేశీ పెట్టుబడులు తీసుకువచ్చిన మార్పు చాలా స్పల్పం.6.54 శాతం మాత్రమే. (ఈ అంకెలన్నీ ప్రపంచ బ్యాంకు సేకరించిన సమాచారం)
విదేశీపెట్టుబడులన్నీ స్టార్ట్ అప్ లలోకి ప్రవేశించడంతో ఉద్యోగాల సంఖ్య పెద్దగా పెరగలేదు. ఇతర బ్రిక్స్ (BRICS) దేశాలకంటే కూడా ఇండియా ఉద్యోగాలు బాగా తక్కువ వచ్చాయి.
ఉదాహరణకు 2001-2012 మధ్య విదేశీపెట్టుబడులు  రు. 10,732 కోట్లనుంచి 64,583  కోట్లకు (25.58 శాతం) పెరిగాయి.  ఉద్యోగాల సంఖ్య 277.9లక్షల (2001) నుంచి 295.8లక్షల కు పెరిగింది.  అంటే ఉద్యోగాలు పెరిగింది కేవలం 0.49శాతమే. అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టబడులు భారత దేశంలో ఉద్యోగాలను పెంచలేకపోయానని ఈ పరిశోధకులు తేల్చి, ప్రభుత్వం విధానాల్లో ఉద్యోగాల కల్పనకు అనుకూలమయిన మార్పులు చేయకపోతే, పరిస్థితి ఇలాగే ఉంటుందని హెచ్చరించారు.