ఇటలీ యాత్ర వెళ్తున్నారా? అక్కడ దొంగలెక్కువ, జాగ్రత్త! (యూరోప్ యాత్ర 7)

(డా. కే.వి.ఆర్.రావు)
మా యూరప్ యాత్ర, ఏడో భాగం: వెనిస్ (ఇటలి)
పన్నెండవరోజు ఆస్ట్రియాలోని సీఫెల్ లో బయలుదేరి ముప్పై మైళ్లు పర్వతప్రాంతంలో ప్రయాణంచేశాక బ్రెన్నెర్ పాస్ వచ్చింది. అది దాటి ఇటలిలో ప్రవేశించాక కొంత దూరంనుంచి మైదానప్రాంతం మొదలైంది. అక్కడినుంచి ల్యాండ్ స్కేప్ మనదేశంలోలా మారిపోయి చుట్టూ ద్రాక్షతోటలు, గోధుమ, టొమాటోలాంటి పంటపొలాలతో పచ్చగా కనపడ్డం మొదలైంది. పరిశ్రమలుకూడా బాగానే కనపడ్డాయి.
మిగతా యూరప్ దేశాలతో పోలిస్తే ఇటలీ మనదేశానికి దగ్గరగా ఉంటుందని, ఐతే యాత్రీకులెక్కువగా ఉండడంవల్ల దొంగతనాలెక్కువగా ఉంటాయని, చాలా జాగ్రత్తగా ఉండాలని మా టూర్ మేనేజర్ మరోసారి అందరికీ జాగ్రత్త చెప్పాడు.
వెనిస్ కాలవల నగరంగా ఉండడం విశేషం కాబట్టి ఆనగరం గురించి చాలామందికి తెలుసు. షేక్ స్పియర్ నాటకాలైన మర్చెంట్ ఆఫ్ వెనిస్, ఒథెల్లో లలో వెనిస్ ప్రస్తావన ఉండడం మరో కారణం. మా సహప్రయాణీకుల్లో దాదాపు అందరికీ వెనిస్ గురించి ఎంతో కొంత తెలుసు కాబట్టి ఆనగరం చూడడానికి ఉత్సాహంగా ఉన్నారు.
నాలుగ్గంటలపైగా ప్రయాణం చేసి వెనిస్ నగర పొలిమేర చేరాం. బస్సులని అక్కడివరకే అనుమతిస్తారుట. వెనిస్ యాత్రాకేంద్రమైన పాతనగరంలో రోడ్లు ఉండవుకాబట్టి ఎక్కడదిగినా బోట్లలో వెళ్లాల్సిందేనన్నారు.
వెనిస్ నగరమంతా గ్రాండ్ కెనాల్ కి రెండువైపులా ఉన్నా, పాతవూరంతా ఒకవైపునే ఉంటుంది. అసలు గ్రాండ్ కెనాల్ అనేది కూడా సముద్రమే, అడ్రియాటిక్ సముద్రం అక్కడ ఒక వెడల్పైన కాలువలాగా భూభాగంలోపలొకి చొచ్చుకుని వచ్చివుంటుంది. మైదానంలోనుంచి రెండునదులు వచ్చి అక్కడే సముద్రంలో కలుస్తాయి. మొత్తంగా కలిపి అదొక లాగూన్ ప్రాంతం.
ఆనగరం మొత్తం 118 చిన్న చిన్న ద్వీపాలతో ఏర్పడింది. వాటిని కలుపుతూ 400 వంతెనలున్నాయి. ఆవూరు చారిత్రకంగా అంతర్జాతీయ సముద్రవర్తకానికి ప్రముఖ కేంద్రంగా, ధనిక నగరంగా ఉండేది.
పొలిమేరలో బస్సుదిగిన మేము ఒక పెద్ద మోటారు బోటు ఎక్కి గ్రాండ్ కెనాల్ లో ముప్పావుగంట ప్రయాణం చేసి వెనిస్ పాతనగరం చేరాము. చాలా వెడల్పున్న గ్రాండ్ కెనాల్ కి రెండువైపులా పెద్ద పెద్ద భవనాలున్నాయి. ఒకవైపు ఓడరేవుంది. వచ్చీపోయే నౌకలతో, క్రూసర్లతో సందడిగా ఉంది. బోటులో వేడిగావున్నా, వాటిని చూస్తూ నీటిలో ప్రయాణం చేయడం ఉల్లాసంగా అనిపించింది.
బోటులోనే మధ్యాహ్న భోజనం పూర్తిచేసి గ్రాండ్ కెనాల్ తీరాన వెడల్పైన గట్టుమీద బోటుదిగాము. అంతవరకూ అల్ప్స్ పర్వతప్రాంతాల్లో చల్లని వాతావరణంలో గడిపిన మాకు వెనిస్ లో తీవ్రమైన ఎండ, వేడి ఆహ్వానం పలికాయి. ఆ గట్టు వెడల్పుగా ఉన్నా దాని వెంబడి సరైన నీడలేక యాత్రీకులందరం చాలా ఇబ్బంది పడ్డాం. కొంతమంది అక్కడున్న రెస్టారెంట్ల షామియానాలకిందకి వెళ్తే వాళ్లు నిర్దాక్షిణ్యంగా ‘నీడ ఉచితంకాదు’ అనిచెప్పి బయటికి పంపారు.
ఇంకా తమాషా ఏమిటంటే అక్కడ కొన్నిచోట్ల టి లేక కాఫీ లాంటివి తీసుకుని షామియాన బయటికి వెళ్తే ఒక యూరో, షామియాన కింద నిలబడి తాగితే రెండు యూరోలు, కుర్చిలో కూర్చుని తాగితే మూడు యూరోలని చెప్పారు.
షేక్ స్పియర్ మర్చంట్ ఆఫ్ ‘వెనిస్’ అని అందుకే అన్నాడా అనుకున్నాము. వెనిస్ కి యాత్రికుల తాకిడి ఎక్కువైపోయి వాళ్లు యాత్రికులు రావడాన్ని ప్రోత్సహించడంలేదని మాటూర్ మేనేజర్ మాకు సర్దిచెప్పాడు. అలాంటి ముఖ్యప్రదేశంలో ఖాళీగావున్న నేల దొరకడం చాలా కష్టం కావడంకూడా ఒక కారణమన్నారు.
గ్రాండ్ కెనాల్ తీరం వెంబడి ఉన్న వెడల్పైన గట్టుకి మరోవైపున వెనిస్ పాత నగరముంది. గట్టును ఆనుకుని భవనాలు, వాటిమధ్య రోడ్లకు బదులుగా కాలవలు ఉన్నాయి. గట్టువెంబడి భవనాల్లోనే కాక గట్టుమీదకూడా రేకుల కప్పులతో షాపులు, రెస్టారెంట్లు ఉన్నాయి.
తీరంనుంచి నగరంలోని వీధులన్నీ కాలవలే. రోడ్లలాగా కాలవలు కూడా అక్కడక్కడా కూడళ్లుగా ఉన్నాయి. అక్కడే మేము ఆరుగురం చొప్పున ఒక గొండోలా అనబడే ఓపెన్ బోటులో ఎక్కి కాసేపు వీధుల్లో అనగా కాలవల్లో తిరిగి అక్కడి ఇళ్లూ అవీ చూశాము. కాలవలే రోడ్లగా లోపల్లోపలికి చాలా పెద్ద నగరముంది. అక్కడక్కడా భవనాలను కలుపుతూ కాలవలమీద చిన్న బ్రిడ్జిలున్నాయి
ఎప్పుడైనా ఒకసారి చూడ్డానికి ఫరవాలేదుగానీ అక్కడే ఉండేవాళ్లకి నిత్యం అన్నిటికీ ఆ కాలవల్లోనే పడవల్లో తిరగాలంటే కష్టమే అనుకున్నాము.
ఆతరువాత అక్కడే ఉన్న ఒక గాజుతో బొమ్మలుచేసే కుటీర పరిశ్రమకు తీసుకెళ్లి చూపించారు. మాముందరే అప్పటికప్పుడే ఒక కళాకారుడు అక్కడేవున్న చిన్న యంత్రాలను ఉపయోగించి ఒక చక్కటి గాజు గుర్రం బొమ్మను తయారుచేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దానికి అనుబంధంగా ఆ బొమ్మలు, గాజుతో చేసిన ఆభరణాలు అమ్మే షాపుంది. అలాంటి గాజు పరిశ్రమలు వెనిస్ ప్రత్యేకతల్లో ఒకటి అని చెప్పారు.
ఆ ఎండలోనే గొడుగులు వేసుకుని ఆ తీరం వెంబడే నడుస్తూ కొన్ని వంతెనలు దాటుకుంటూ సెయింట్ మార్క్స్ స్క్యేర్ చేరాము. దానిలోకి అనుమతించే సమయం అప్పుడే ఐపోవడంతో లోపలికి వెళ్లి చూడలేకపోయాము.
అది చాలా పెద్ద ప్రాంగణము. అందులో ప్రధానంగా తూర్పువైపు విశిష్టమైన శిల్పసౌష్టవంతో గల సెయింట్ మార్క్స్ బాసిలికా (St Mark’s Basilica)అనబడే చారిత్రకమైన పెద్ద చర్చి ఉంది (పై ఫోటో). దీని శిల్పం ప్రధానంగా గోథిక్ దే ఐనా, ఇక్కడ బైజాంటియన్, టర్కిష్ ప్రభావంకుడా చూడొచ్చు. దాని గోపురం ముందుభాగాన కంచు గుర్రాల విగ్రహాలున్నాయి. అవి చాలా పాతవని, రొమన్ కాలంనాటివని చెప్పారు.
బాసిలికాకు ఒకవైపున క్లాక్ టవర్ మరోవైపున డోజె ప్యాలెస్ ఉన్నాయి. శతాబ్దాలకిందట కట్టిన క్లాక్ టవర్ పైనున్న మనుషుల విగ్రహాలు ఇప్పటికీ ప్రతిగంటకి కదిలి వాటిమధ్యనున్న గంటను కొట్టడం విశేషంగా చెబుతారు. డోజె (నగరపు ముఖ్యాధికారి) భవనంకూడా మంచి శిల్పనిర్మాణంతో ఉంది. బాసిలికా ఎదురుగా ఉన్న స్క్యేర్ లో ఎత్తైన బెల్ టవర్, ఆవెనక నెపోలియన్ పునర్నిర్మించిన భవనాలు కూడా చూడచ్చు.
అవన్నీ చూసి తిరిగొచ్చేటప్పుడు డోజె భవనానికి, పక్కనగల మరో భవనానికి మధ్యనున్న కాలవమీదవున్న ఒక చిన్న వంతెనను చూశాము. దాని పేరు బ్రిడ్జ్ ఆఫ్ ‘సైస్’ (Bridge of sighs) . అంటే ‘నిట్టూర్పు వంతెన’ అని చెప్పారు. ఆపేరు ఎందుకంటే, ఆరోజుల్లో శిక్షలు చాలా కఠినంగా ఉండేవట. డోజె భవనంలో విచారణ జరిగి ఉరిశిక్షగాని, యావజ్జీవఖైదుగాని పడ్డవాళ్లు పక్కనగల జైలు భవనానికి వచ్చేప్పుడు మధ్యలోవున్న ఆ వంతెన మీదినుంచి చివరిసారిగా వెలుతురును, వెనిస్ నగరాన్ని చూసి ‘అదే ఆఖరు’ అని నిట్టూర్పు వదిలేవారట.
అది విని ఇప్పుడు కాస్త మంచి కాలంలోఉన్నందుకు మేమంతా సంతోషంగా నిట్టూర్పు విడిచాము. ఆ తీరరహదారిగుండా ఒకవైపు గ్రాండ్ కెనాల్ ని, మరోవైపు వీదులనబడే కాలవల్నీ చూసుకుంటూ బోటు దిగినచోటికి తిరిగొచ్చాము.
వీధులకు బదులు కాలవలున్న వెనిస్ లాంటి నగరం యొక్క ప్రత్యేకతను, అక్కడి మనుషుల జీవన విధానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే అక్కడ కొన్నిరోజులపాటు ఉండక తప్పదు అనిపిస్తుంది.
నిజానికి వెనిస్ ప్రత్యేకత మేము చూసిన టూరిస్ట్ ప్రదేశాలలో లేదు. నేల కనపడని నీటి నుంచి వెలువడే పాతనగరపు ఇళ్లు, భవనాలు, కాలువల మ్యాట్రిక్స్ లో ఉంది. బహుశా దాని అందం చూడాలంటే ఆ నగరంలోపల వెన్నెల రాత్రిళ్లు ఉండాలేమో.
ఏ ప్రదేశమైనా అంతే. ఆ ప్రాంతం గురించి సహానుభూతితో తెలుసుకోవాలంటే అక్కడ సామాన్యుల్లో కలిసిపోయి తీరిగ్గా చూడాలేమో అనుకున్నాము.
కాసేపు షాపింగ్ చేశాక మా బోటెక్కి గ్రాండ్ కెనాల్ లో తిరుగు ప్రయాణం చేసి అవతలి ఒడ్డుకు చేరి మా బస్సు ఎక్కాము. బస్సులో ఉన్న ఏసి వల్ల ప్రాణం లేచొచ్చినట్టయింది. ఆసాయంత్రం మరికొంతసేపు ఫ్లోరెన్స్ వైపు ప్రయాణంచేసి ఫెరారా అనేచోట రాత్రి బసను చేరుకున్నాము. (తరువాయి ఎనిమిదవభాగంలో)
ఆరోభాగం ఇక్కడ చదవండి

https://trendingtelugunews.com/english/features/europe-tour-liechtenstein-vaduz-tiny-nation-great-experience/