అదిగో పులి-ఇదిగో తోక లాగా తయారయింది వ్యాక్సిన్ ల పరిస్థితి!

(CS Saleem Basha)
అదిగో పులి ఇదిగో తోక లాగా తయారయింది వ్యాక్సిన్ ల పరిస్థితి! అదిగో వ్యాక్సిన్ ఇదిగో వ్యాక్సిన్ అని వార్తలు వస్తున్నాయి. ఇంకా వాక్సిన్ రాలేదు.
ప్రపంచపు మొట్టమొదటి వ్యాక్సిన్ సృష్టికర్త ఇంగ్లాండ్ శాస్త్రవేత్త” ఎడ్వర్డ్ జెన్నర్”. 18 వ శతాబ్దపు చివర్లో జెన్నర్ రూపొందించిన ఈ వ్యాక్సిన్ వెనక కామన్(సైన్సు) సెన్స్ ఉంది! అప్పట్లో పాలు పితికే మహిళలకి ” Cow pox ” అనే వైరస్ రావడం గమనించాడు ఎడ్వర్డ్ జెన్నర్. అయితే అది అంత తీవ్రమైనది కాదు. అప్పుడు ఎడ్వర్డ్ జెన్నర్ తొమ్మిది సంవత్సరాల తన తోటమాలి కుమారుడికి దీన్ని ఎక్కించాడు. ఆ తర్వాత అతనికి Small pox వైరస్ కు expose చేశాడు. అప్పుడు ఆ పిల్లవాడికి Small pox రాలేదు.. ” నేను చేసిన ఈ పని యొక్క అంతిమ ఫలితం మానవజాతిని పీడిస్తున్న Small pox ను అంతం చేయటమే కావాలి. ” అని చెప్పాడు. అదీ 1801 లో!
అతను చెప్పినట్లే జరిగింది. 1980 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ “Small pox ఈ భూమ్మీద పూర్తిగా నిర్మూలించబడింది” అని ప్రకటించింది. కానీ దానికి దాదాపు రెండు వందల సంవత్సరాలు పట్టింది! అదీ ఒక ప్రయోగం ఫలితం! అప్పుడు శాస్త్ర ప్రపంచం ఇంతగా అభివృద్ధి చెందలేదు. ఇంకా వ్యాక్సిన్ ల గురించి అవగాహన లేదు.

ఇవి కూడా చదవండి

కానీ ఇప్పుడు ఉంది కదా? మరి గత గత 20 సంవత్సరాలుగా ఎందుకు వ్యాక్సిన్ రూపొందించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? వాక్సిన్ తయారు చేయటం కష్టమా? చాలా డబ్బులు ఖర్చవుతాయా? తయారు చేస్తే ఎవరికి లాభం, చెయ్యకపోతే ఎవరికి లాభం, అసలు వాక్సిన్ అవసరం లేదా? ఇది మీ ఊహకే( తర్వాత మీ మధ్య జరిగే చర్చలకి కూడా) వదిలేస్తున్నా! అయితే ఒక్క విషయం మాత్రం నిజంగా నిజం! ఇంకా వాక్సిన్ రాలేదు.
ఇంకో విషయం. వ్యాక్సిన్, వైరసు రెండు చేసే పని ఒకటే అంటే ఆశ్చర్యపోవద్దు!. వ్యాక్సిన్ ను లోపలికి పంపించినా, వైరస్ లోపలికి వెళ్ళిన ఫలితం ఒక్కటే! మన శరీరం యాంటీబాడీస్ ఉత్పత్తి చేయడం మొదలుపెడుతుంది. వాక్సిన్ యాంటీ బాడీస్ ను మన శరీరం ఉత్పత్తి చేయటానికి ఒక ఉత్ప్రేరకంగా(catalyst) మాత్రమే పనిచేస్తుంది. వైరస్ కూడా అంతే. రెండు చేసే పని ఒకటే అయినా, వైరస్ తో ప్రమాదం, నష్టం కూడా ఉండవచ్చు. వ్యాక్సిన్ తో ఏ ప్రమాదం ఉండదు, పైగా లాభం ఉంటుంది.
అంతిమంగా వైరస్ నుండి మనల్ని కాపాడేది(చంపేది) మన శరీరం ఉత్పత్తి చేసే “యాంటీ బాడీస్” మాత్రమే! వాక్సిన్ కాదు. అందుకే వాక్సిన్ వచ్చేంతవరకు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. దానికి మన “ఇమ్మ్యూనిటీ పవర్” ని పెంచుకోవాలి. ఆ దిశగా అందరమూ కృషి చేయాలి, చేస్తూ ఉండాలి, కనీసం వాక్సిన్ వచ్చేంతవరకు! దానికి ఏం చేయాలన్న విషయం పై కుప్పలు తెప్పలుగా ఇప్పటికే చాలా సమాచారం ఉంది. అది తెలుసుకుని, పాటించి ఆరోగ్యంగా ఉండండి. అయితే వాళ్లు వీళ్లు చెప్పింది, అక్కడ ఇక్కడ వచ్చింది, చదివింది లాంటివన్నీ కరెక్ట్ కాకపోవచ్చు. అందుకే అధికారిక సమాచారం మీద మాత్రమే మీరు ఆధారపడాలి. ఒకటికి రెండు సార్లు నిజానిజాలు చెక్ చేసుకోవాలి.
నాకు తెలిసిన రెండు మూడు విషయాలు చెప్తాను… (చెప్పే పద్ధతి మాత్రం సరదా, కాని విషయాలు సీరియస్ అని గుర్తుపెట్టుకోండి)
** మీ చేతులకు ఏ పాపం అంట లేదు – అయినా కడుక్కోవాలి, కడుక్కుంటూనే ఉండాలి
** మనుషులు అంటే మీకు చాలా ప్రేమ ఉంది- అయినా వారికి (అయినవారికి కూడా)
దూరంగానే ఉండాలి
** పని పాట లేకుండా ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేదు- అయినా సరే ఇంట్లోనే ఉండాలి
** దొంగ లాగా ముఖానికి ముసుగు వేసుకోవడం మీకు నచ్చదు- అయినా సరే వేసుకోవాలి.
** మీకు నాన్ వెజ్ అంటే ఇష్టం, అది మాత్రమే తింటాను అంటే కుదరదు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, నువ్వుల ఉండలు, మునగ కాయలు, కూడా తింటూ ఉండాలి. నాకు ఇష్టం లేదు అంటే కుదరదు. తినాల్సిందే. నిమ్మకాయలు, ఉసిరికాయలు, అల్లం, బెల్లం(షుగర్ లేకపోయినా సరే షుగర్ తినకూడదు) పసుపు, మిరియాలు, ఆవాలు జీలకర్ర, కరివేపాకు, మునగ ఆకు రెండు మూడు రోజులకు ఒక్కసారైనా తినాల్సిందే.
** నవ్వు, నడక, నడత. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూడు “న” లు చాలా ముఖ్యమైనవి. నవ్వు అన్నది చాలా లాభదాయకమైనది. ఇంటిల్లిపాదీ, స్నేహితులు కలిసి (వీడియో కాల్ లేదా ఫోన్ కాల్ మాత్రమే సుమా!) తరచూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే
ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. లాఫ్ థెరపీ లాఫ్టర్ యోగాలు చాలా ఉపయోగకరమైనవని అంటున్నారు. ఉపయోగం ఉన్నా లేకపోయినా, నవ్వితే పోయేదేముంది!
** రోజూ కనీసం 15 నిమిషాలు నడిస్తే( అది ఎండలు అది ఎండలో) ఆరోగ్యానికి చాలా మంచిది. మన రోగనిరోధక వ్యవస్థ ని బలోపేతం అవుతుంది. ఎండలో అయితే “డి” విటమిన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇక నడత గురించి చెప్పే అవసరం ఏముంది? అంటే మన ప్రవర్తన. Covid సందర్భంగా మన నడత,( ప్రవర్తన లేదా బిహేవియర్) ఎలా ఉండాలన్నది ఇంత ముందే చెప్పడం జరిగింది.
చివరగా ఒక చిత్రమైన విషయం చెప్తాను. మీకు వాక్సిన్ వేయాలంటే, మీరు ఇదివరకు పాజిటివ్ అయి( మళ్లీ నెగిటివ్ అయ్యి)ఉండకూడదు. ప్రస్తుతం పాజిటివ్ అయి ఉండకూడదు. క్లియర్ గా చెప్పాలంటే మీకు Covid వచ్చి ఉండకూడదు, వచ్చి వెళ్లిపోయి ఉండకూడదు. ఈ రెండు సందర్భాల్లో వాక్సిన్ పెద్దగా ఉపయోగపడదు!
ఏది ఏమైనా, వాక్సిన్ వచ్చేంతవరకు, లేదా వైరస్ పూర్తిగా నిర్మూలించబడేంత వరకు మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా అవసరం. మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే, నాతో మాట్లాడవచ్చు, నన్ను అడగవచ్చు. లేదా ప్రభుత్వం సూచన మేరకు డాక్టర్లను సంప్రదించవచ్చు.
Saleem Basha CS

(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)

ఇది కూడా చదవండి
ప్రపంచంలో ఒకే ఒక్క మెడికో విగ్రహం ఇది…. దీని వెనక వొళ్లు గగుర్పొడిచే కథ ఉంది…