Home Features ‘ఎమర్జెన్సీ’ అరెస్టు ఎలా జరిగిందంటే… గవర్నర్ బండారు దత్తాత్రేయ అనుభవం

‘ఎమర్జెన్సీ’ అరెస్టు ఎలా జరిగిందంటే… గవర్నర్ బండారు దత్తాత్రేయ అనుభవం

2894
0
ఎమర్జన్సీ రోజుల నాటి బండారు దత్తాత్రేయ ఫోటో
(బండారు దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ )
25 జూన్, 1975 అర్ధరాత్రి న “ఎమర్జెన్సీ” (అత్యయిక పరిస్థితి) విధించి 45 సంవత్సరాలైన సందర్భంగా నాటి చీకటి రోజులను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ  గుర్తుచేసుకున్నారు. ఎమర్జన్సీ రోజుల్లో ఆయనను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది జైల్లో ఉంచారు. ఒక సారి అరెస్టు నాటకీయంగా తప్పించుకున్నా, రెండో సారి పోలీసుకు దొరికిపోయారు.
ఇవీ ఆయన జ్ఞాపకాలు:
అప్పుడు నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) ప్రచారక్ గా, సామాజిక కార్యకర్త గా పనిచేస్తున్నాను. ఆ రోజుల్లో లోక్ నాయక్ శ్రీ జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వం లోని లోక్ సంఘర్ష సమితి – ఆంధ్ర ప్రదేశ్ రాష్ర విభాగ్ ప్రచారక్ గా కూడా పనిచేస్తున్నాను.  ఆ రోజుల్లో  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) పై నిషేధం విధించడం జరిగింది.  ఆర్ ఎస్ ఎస్ నేతలను ఎక్కడిక్కడ అరెస్టు చేస్తున్నారు. దీనితో నేను అరెస్టు తప్పించుకునేందుకు  మారువేషం లో “ధర్మేందర్” అనే పేరుతొ కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చాను. నన్ను కలవాలంటే మరొక వ్యక్తి  వద్దకు వచ్చి “మామాజీ” ని కలవాలి అని అడగాలి. అపుడే  ఆ వ్యక్తి నా దగ్గరకు తెచ్చే వాడు. పోలీసులకుదొరక కుండా ఉండేందుకు రహస్యజీవితం సాగిస్తూ వచ్చాను
ఒక రోజు  భిక్నూర్ నుండి  1 1/2 కిలోమీటర్ల దూరంలోని రామేశ్వర్ పల్లి దేవాలయం లో ఆర్ ఎస్ ఎస్  కార్యకర్తల సమావేశానికి  నన్ను ఆహ్వానించారు.నేను హైదరాబాద్ నుండి ప్రయాణమయ్యాను.నా రాక ను గోప్యంగా ఉంచేందుకు ఆ సమావేశానికి సత్యనారాయణ స్వామి వ్రతం అని పేరు పెట్టారు. వ్రతం జరుగుతుందని  కార్యకర్తలందరికి  సమాచారం ఇవ్వడం జరిగింది.  ఒక కార్యకర్త నన్ను స్కూటర్ పై అక్కడకు చేర్చాడు.   ఆ సమావేశానికి 150 మంది వరకు హాజరయ్యారు.   ఈ సమావేశం సమాచారం నిజామాబాదు జిల్లా ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ కు పొక్కింది. అపుడు ఒక అధికారి తాను కూడా భక్తుని లాగా ఈ సమావేశానికి వచ్చి వంటవారిలో కలసి పోయా, సమావేశంలో కూర్చున్న వారిని గమనిస్తున్నాడు.  నేను ఈ సమావేశం లో పంచ కట్టుకొని కూర్చున్నానని తెలుసుకున్నట్లుంది,  ఇంటలిజెన్స్ అధికారి కూడా పంచ కట్టుకొని భక్తునిలాగానే వచ్చి వంటవారిని కలసి  ఇక్కడ ఏమి సమావేశం జరుగుతుందని వాకబు చేశాడు.  వాళ్లు అక్కడ వెంకట్రామి రెడ్డి అనే వ్యక్తి సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తున్నాడని సమాచారమిచ్చారు.
సమావేశంలో నేను కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు ఆయన ఏదో  అనుమానం వచ్చినట్లుంది. అంతే,  సమావేశం లోపల జరుగుతూ ఉంది, వ్యాన్లల్లో  పెద్ద ఎత్తున పోలీసులు దేవాలయానికి చేరుకున్నారు.  ఈ విషయాన్ని ఒక కార్యకర్త తెలియజేయడంతో కార్యకర్తలను సమావేశం మీరే జరుపుకోండని చెప్పాను. అక్కడ నుంచి పారిపోయేపనిలో పడ్డాను.  అంతే,    మళ్ళీ వేషం మార్చుకొని, దేవాయలం వెనుక ప్రహరీ గోడను దూకి పొలాలనుండి పారిపోవాలని అనుకున్నాను మరికొందరితో కలిసి..  కానీ ప్రహరీ గోడ 20 ఫీట్లు ఉంది.   నేను మొత్తానికి అతికష్టం మీద గోడ దూకాను.కాని కాలు బెనికింది.  కాలు వాచి నొప్పి  మొదలైంది. అయినా సరే లెక్క చేయకుండా  పంట పొలాల నుండి నడుచుకుంటూ మెదక్ చేరుకొని అక్కడినుండి బస్సు ద్వారా హైదరాబాద్ కు చేరుకున్నాను.
ఇక అక్కడ దేవాలయంలో  పోలీసులు మాత్రం మిగితా వారిని విచారించి 5 గురిని పోలీసు స్టేషన్ కి తరలించి నా గురించి వాకబు చేసి వదిలేశారు. అపుడు తెలిసింది, పోలీసులు వచ్చింది తన కోసమేనని. ఇలా ఎమర్జీన్సీలో పోలీసు  అరెస్టు చేయడానికి మొదటి సారి వచ్చినపుడు   మారువేషంలో  తప్పించుకున్నాను.
ఇంత బందోబస్తున్నా నేను  ఎలా తప్పించుకున్నాననేది పోలీసులకు అంతుచిక్కలేదు. అప్పటిలో నిజామాబాదు మరియు ఆదిలాబాద్ జిల్లాల పోలీసులు నన్ను  మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా ప్రకటించారు.
అయితే, రెండో సారి అరెస్టు తప్పించుకోలేకపోయాను. మొత్తానికి  బెల్లంపల్లిలో ఉన్నపుడు   పోలీసులు పసిగట్టారు.  “మీసా”  చట్టం క్రింద నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ చంచల్ గూడ సెంట్రల్ జైలు కు తరలించారు.అక్కడ ఒక్క సంవత్సరం నిర్బంధించారు.
 ఎమర్జీన్సీ లో అరెస్టయిన అనేక మంది నాయకులు, కవులు కళాకారుల మధ్యఆ ఏడాది జైలు జీవితం సాగింది. అక్కడ జైలులో అలె నరేంద్ర , నాయిని నరసింహారెడ్డి తో బాటు ఆ జైలులో వివిధ రాజకీయ పార్టీలైన సి పి ఐ, సి పి ఎం, సి పి ఐ (ఎం ఎల్), అతివాద కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వరవరరావు, చెరబండరాజు, జమైత్ ది ఇస్లామీయ అనుబంధంగా ఉన్న అజిజ్ పాష లు అన్నారు. ఇంకా  వివిధ రంగాలకు చెందిన మేధావులు, కవులు, కళాకారులు కూడా ఉండేవారు.  వారి సాన్నిహిత్యంలో చాలా విషయాలు తెలిసాయి. రాజకీయల మీద  వారి అభిప్రాయలాను వారి రాజకీయ సిద్ధాంతాలను నేను తెలుసుకున్నాను. అరెస్టయినా చంచల్ గూడ జైలు జీవితం  రాజకీయాలపై మరింత అవగాహన కలిగించింది.