Home Features సంతోషం అంటే సమస్యలు లేకపోవటం కాదు!

సంతోషం అంటే సమస్యలు లేకపోవటం కాదు!

142
0
SHARE
(CS Saleem Basha)
చాలామంది సంతోషంగా ఉండటం అంటే సమస్య లేకపోవడం అనుకుంటారు. అది చాలా పొరపాటు. సమస్యలు లేకపోవటం కాదు సంతోషం అంటే! సంతోషం అంటే సమస్యలను అర్థం చేసుకోవటం, వాటిని మేనేజ్ చెయటం. సంతోషంగా ఉన్న వాళ్ళకీ సమస్యలు ఉంటాయి. కానీ వాళ్ళు సమస్యల కన్నా సంతోషంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలా అని సమస్యలు పట్టించుకోరని కాదు. వాళ్లకి బాగా తెలుసు సమస్యలు జీవితంలో భాగమని. అప్పుడు జీవితంలో ఏ భాగానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నది వాళ్లు నిర్ణయించుకుంటారు.
అది బాగా తెలిసిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. సమస్యల గురించి వాళ్లకు తెలిసినంత బాగా మరి ఎవరికి తెలియదు. అసలు సమస్య అంటే ఏమిటి? సమస్య ఉంటే జీవితంలో ఒక సంఘటన. సమస్యను నెగటివ్ గా కాకుండా జీవితంలో ఒక సంఘటనగా చూడటమే, సంతోషానికి కారణం! సమస్య పరిష్కార ప్రక్రియ ఎలా ఉంటుందంటే ( బొమ్మ చూడండి).
గందరగోళంగా ఉంది కదా? కొంచెం అలోచిస్తే సింపుల్ గా ఉంటుంది.
ఇందులో ఉన్న3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవి ఒకసారి చూద్దాం.
మొదటిది:
మనకు సమస్య ఉందా? అవును
దానిగురించి ఏమైన చెయ్యగలుగుతామా? అవును.
మరి చింత ఎందుకు?
రెండోది:
మనకు సమస్య ఉందా? అవును
దానిగురించి ఏమైన చెయ్యగలుగుతామా? లేదు.
మరి చింత ఎందుకు?
మూడోది
మనకు సమస్య ఉందా? లేదు
మరి చింత ఎందుకు?
దాన్నిబట్టి సింపుల్ గా అర్థమయ్యే విషయమేమిటంటే, సమస్య ఉన్నా లేకపోయినా “వర్రీ” కాకూడదు. ఇదే “ప్రాబ్లెం మేనేజ్ మెంట్!” . ఇక్కడ ఒక చిన్న నిత్య జీవిత ఉదాహరణ చూద్దాం. నలుగురు మిత్రులు సినిమాకి వెళ్లారు. మొదటి రోజు కాబట్టి టికెట్ల సమస్య. టికెట్ ల కోసం ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ వెళ్ళాడు. రష్ గా ఉంది. ఇప్పుడు టికెట్లు ఒక సమస్య. ఏం చేయాలి. క్యూలో నిలబడి తే టికెట్లు దొరుకుతాయా? దొరకవు. వేరే సినిమాకు వెళ్ళొచ్చు. లేదా ఇంటికి వెళ్ళిపో వచ్చు. టికెట్ల కోసం ఏమైనా చేయగలుగుతారా( థియేటర్లో పలుకుబడి, సరే నచ్చకపోయినా బ్లాక్ టికెట్లు, ఎవరైనా సినిమా చూడకుండా ఇవ్వాలనుకుంటే దొరకొచ్చు). ఈ ప్రత్యామ్నాయాలు చేయగలిగితే చేయొచ్చు. లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది సమస్యగా చూసినప్పుడు చాలా పెద్దది. సంఘటనగా చూసినప్పుడు, ఎప్పుడో ఒకసారి అందరికీ జరిగేదే. కాబట్టి పెద్దగా సమస్య ఉండదు.
ప్రతి మనిషికి సమస్యలుంటాయి అనుకున్నాం. ఆ సమస్యలు ఉత్పత్తి అయ్యే( లేదా చేసే) స్థలాలు కూడా మూడు ఉంటాయి. ఒకటి ఇల్లు, రెండు పనిచేసే ప్రదేశం, మూడు సమాజం. సమస్యలన్నీ ఈ మూడు చోట్ల నే పుడతాయి లేదా ఉత్పత్తి చేయబడతాయి. అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఏ ఇంట్లో అయినా సమస్యలు ఉంటాయి. బీద ధనిక పెద్దా చిన్నా తేడా ఉండదు. అలాగే పనిచేసే ప్రదేశంలో కూడా సమస్యలు ఉంటాయి, ఇక సమాజం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ పెద్ద పెద్ద సమస్యలు క్రియేట్ చేయబడతాయి. వచ్చిన సమస్య అంతా(!), ఒక చోట పుట్టిన సమస్యను, ఇంకో చోటికి మోసుకొని పోవడం.
ఉదాహరణకు ఆఫీసులో సమస్య( పై అధికారి తో గొడవ, కొలీగ్స్ తో వాదనలు. ఇలా ఏవైనా కావచ్చు) ఇంటికి తీసుకు రావడం , సాధారణంగా చాలా ఇళ్లలో జరిగే విషయమే. దాంతో ఇంట్లో సంతోషం మాయమవుతుంది. అలాగే ఇంట్లో సమస్యలను ఆఫీసుకు తీసుకెళ్లడం. ఇంకా ముఖ్యమైనది సమాజంలో సమస్యను ఇంటికి గాని ఆఫీస్ కి గాని తీసుకెళ్లడం. దీన్ని “ప్రాబ్లం ట్రయాంగిల్ “ (problem Triangle) అంటారు. ట్రయాంగిల్ ను సరిగ్గా మేనేజ్ చేయకపోతే చాలా పెద్ద సమస్య ఉత్పత్తి అవుతుంది.
ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను( నిజంగానే జరిగింది). మా ఫ్రెండు కర్నూల్ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న ఊర్లో స్కూల్ టీచర్. రోజు ఉదయాన్నే 6:30 కి టిఫిన్ క్యారియర్ రెడీ చేసుకుని . బస్సులో చాలా దూరం, మళ్లీ ఆటోలో , 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి స్కూల్ కి వెళ్లాలి. మళ్లీ తిరుగు ప్రయాణం కూడా అంతే. అలా ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇంట్లో కరెంటు లేదు. అది ఒక సమస్య. దాని గురించి ఏమైనా చేయగలుగుతాడా అంటే లేదు. ఎందుకంటే కరెంటు కట్ చేశారు, బిల్లు కట్టనందుకు. దాంతో చికాకు వేసింది. భార్యను కోప్పడ్డాడు. పిల్లల్ని ఏం చేసి ఉంటాడో చెప్పాల్సిన అవసరం లేదు. దానికి కారణం అంతకు ముందు స్కూల్లో హెడ్మాస్టరు పిల్లల ఆన్సర్ పేపర్ లు ఇంకా దిద్ది ఇవ్వనందుకు ఓ మాట అనడం, ఆ చికాకును, ఉక్రోషాన్ని, కోపాన్ని మోసుకొని ఇంటికి రావడం!
ఆ రాత్రికి ఎలాగోలా గడిపేశాడు. ఈ కథ ఇంతటితో అయిపోలేదు. మర్నాడు పొద్దున రాత్రి తిట్టిన పర్యవసానంగా క్యారియర్ లేదు. ఆ సమస్యను మోసుకొని తయారయ్యి బస్సు ఎక్కాడు. కండక్టర్ వచ్చినప్పుడు చిల్లర లేదు. ఐదు వందల రూపాయలు ఇచ్చాడు. కండక్టర్ చిల్లర అడిగితే చికాకు పడ్డాడు. కండక్టర్ కూడా ఇల్లు ఉంటుంది కదా. ఆయన కూడా ఒక సమస్యను బ్యాగులో వేసుకుని వచ్చి ఉన్నాడు. దాంతో ఆయన కూడా ఒక మాట అన్నాడు. మాటా మాటా పెరిగింది. ఎవరో కొలీగ్ సర్దిచెప్పి చిల్లర ఇచ్చాడు. స్కూల్కు వెళ్లిన తర్వాత పిల్లల్ని ఉతికి ఆరేసాడు. స్టాఫ్ రూం లో కొలీగ్స్ తో వాదన. హాఫ్ డే సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. మళ్లీ ఇంట్లో చిరాకు కోపం గొడవ ప్రదర్శించాడు. తర్వాత ఏమైందంటే భార్యాభర్తల మధ్య గొడవ చాలా దూరం వెళ్ళింది. ఒక వారం పాటు ఇంట్లో సంతోషం కనిపించలేదు. స్కూల్లో అంతే. దీనికంతటికీ కారణం స్కూల్లో సమస్యను ఇంటికి తీసుకురావడమే. అంతటితో ఊరుకుంటే అయిపోయేది. మళ్లీ ఇంట్లో గొడవ స్కూలుకి తీసుకెళ్లడం. మళ్లీ ఇంట్లో సమస్యని స్కూలుకి తీసుకెళ్లడం. ఇంకా విషయం ఉంది. ఈ వారం రోజుల్లో ఒకరోజు ఫ్రెండ్స్ తో హషారుగా టీ  (tea) తాగడానికి వెళ్లి అక్కడ కూడా వాదనలు, చికాకు.ఫ్రెండ్సతో కలసి టీ తాగిన థ్రిల్లూ లేదు, దానికి తోడు చీకాకుని ఇంటికి మోసుకో రావడం. అదీ సంగతి
దీనికి సింపుల్ సొల్యూషన్ ఉంది. ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేస్తే, సమస్య ఉండదు. సంతోషం ఉంటుంది. దాన్నే trimming అంటారు. అంటే ఇంట్లో సమస్యను ఇంట్లోనే వదిలి trim చేసి పనికి గాని, సమాజంలో గాని వెళ్లడం. మళ్లీ సమస్యను వదిలేసి రావటం. ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేయడం అంటే వాటిని పట్టించుకోవద్దని కాదు, పరిష్కారం వెతకవద్దని కాదు. ఎక్కడి సమస్యకు పరిష్కారం అక్కడే వెతకాలి. అంతే!

 

CS Saleem Basha

(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)