భూభకాసురులు గద్దల్లా వాల్తారు, భూములమ్మవద్దు : జగన్ కు ఇఎఎస్ శర్మ హెచ్చరిక

 ప్రజా సౌకర్యాలను కలిగించేందుక్కు ప్రాజెక్టు ‘బిల్డ్ ఎపి ’ (Build AP) కార్యక్రమం అభిలషణీయమే దాని కోసం ప్రభుత్వం అమ్మేయడం మానుకోవాలని భారత  ప్రభుత్వ మాజీ కార్యదర్శి, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న రిటైర్డు ఐఎఎస్ అధికారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచించారు.
ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు  ప్రాజెక్టులు ఎంతో అవసరం, వాటికి అవసరమయిన  నిధులకోసం  ప్రభుత్వ భూములను అమ్మడం వల్ల లాభాలకన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన ముఖ్యమంత్రి కి రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు.  ఇలా ప్రభుత్వ భూములను అమ్మాలనుకుంటే ఇపుడున్న వాతావారణంలో వాటిని రియల్ఎస్టేట్ మాఫియా గద్దల్లా వాలి తన్నుకుపోతారని ఆయన హెచ్చరించారు.అంతేకాదు, ఇలా ప్రభుత్వ భూములను అమ్మాలనుకోవడం సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లవుతుందని కూడా ఆయన ముఖ్యమంత్రికి గుర్తు చేశారు.

*రాష్ట్రంలో తలసరి భూ విస్తీర్ణం తగ్గు ముఖంలో ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఖాళీ భూముల కోసం  గ్రద్దలలాగ ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ భూములను వేలం వేస్తే, వారు కుమ్మక్కయ్యి తక్కువ ధరకు కొనే అవకాశం బాగా ఉంటుంది. పైగా భూముల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కాని తగ్గడం లేదు. కనుక ప్రభుత్వ భూములను “మార్కెట్ ధర” కు అమ్ముతామని అనుకోడం మనను మనమే వంచించు కోవడం అవుతుంది. వేలంలో అమ్మకం అయిన ప్రభుత్వ భూమి ధర కొన్నిరోజులలోనే అంతకన్నా అధికమైన ధరకు ఇంకొకరి చేతులలోనికి వెళ్లే అవకాశం ఉంది. అందువలన ప్రభుత్వం విమర్శలకు గురి అవుతుంది. 

*భూములను వేలం వేయడం వలన ఆ ప్రాంతంలో భూముల ధరలు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి వలన తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు నష్టం కలుగుతుంది. అందువలనే, ప్రభుత్వాలు భూములను అమ్మే ప్రయత్నాలు ఎప్పుడూ చేయకూడదు. 

*ప్రభుత్వావసరాల కోసం పెద్ద ఎత్తున భూములు కావాలి. ఒక వైపు తమ అధీనంలో ఉన్న భూములను అమ్ముకుని, ఇంకొక వైపు తమ అవసారాల కోసం భూములను అంతకన్నా అధికమైన ధరలకు కొనడం సబబుగా ఉండదు. 

*గ్రామీణ ప్రాంతాలలో బంజరు, పోరంబోకు, బీల భూములవంటి ప్రభుత్వ భూముల మీద ప్రజల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అటువంటి భూములకు పర్యావరణ దృష్ట్యా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది. అటువంటి భూములను ఏ పరిస్థితిలోనూ ప్రైవేటు వ్యవస్థలకు ఇవ్వకూడదని సుప్రీం కోర్టువారు ఒక పంజాబ్ కేసు [Jagpal Singh & Ors vs State Of Punjab & Ors in SLP(C) CC No. 19869/2010] లో 28-1-2011 న అన్ని రాష్ట్రాలను ఉద్దేశించి ఉత్తరువు ఇచ్చారు.  అటువంటి భూములను మీ పథకం క్రింద అమ్మడం ఉన్నత న్యాయస్థానం ఉత్తరువును ధిక్కరించినట్లు అవుతుంది.
*రాష్ట్రంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ప్రైవేటు కంపెనీల అధీనంలో, SEZ ల పరిధిలో, Industrial Park ల పరిథిలో, ఖాళీగా పడి ఉన్న సమయంలో ఇతర ప్రభుత్వ భూములను అమ్మడం ప్రజాహితం కాదు. ఆ భూములను ప్రజల అవసారాలకోసం వెనక్కు తీసుకోవాలి. అటువంటి ఖాళీ భూములను ప్రైవేట్ కంపెనీలు బ్యాంకులకు తనఖా పెట్టి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని స్వార్థ పరమైన అవసరాలకోసం దుర్వినియోగం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం అటువంటి భూములను వెనక్కి తీసుకొంటే ఆ కుంభకోణాలు బయటికి వస్తాయి.
*ప్రభుత్వానికి నిధులు కావాలంటే గతంలో ప్రైవేటు కంపెనీలకు భారీగా ఇచ్చిన రాయితీలను వెనక్కు తీసుకోవాలి. మైనింగ్ కంపెనీల మీద వేలాదికోట్ల రూపాయల జరిమానాలు గత ప్రభుత్వాలు వేశారు కాని స్వార్థ కారణాల వలన వసూలు చేయలేదు. అటువంటి జరిమానాలు అమలు చేస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రంలో పురపాలక సంస్థలు పెద్ద పరిశ్రమలకు టాక్స్ రాయితీలను ఇచ్చారు. ఆ రాయితీలను రద్దు చేయాలి. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలాగే దుబారా ఖర్చులను తగ్గించవలసిన అవసరం కూడా ఉంది.
 ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ భూములను అమ్ముకొనే నిర్ణయాన్ని పునః పరిశీలించాలని ఆయన ముఖ్యమంత్రి ని కోరారు.