Home Features 1982లో చంద్రబాబును కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసిందెవరు? రేపు ఆయన జయంతి

1982లో చంద్రబాబును కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసిందెవరు? రేపు ఆయన జయంతి

61
0
SHARE
Kona Prabhakar Rao (credits: Sakshi)
ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కార్యాలయం అజమాయిషీలో కాకుండా  స్వత్రంత్ర పవర్ సెంటర్ గా ఉన్న రోజుల్లో  కోన ప్రభాకర్ రావు  ఎపిసిసి అధ్యక్షుడయ్యారు. పిసిసి ప్రెశిడెంట్ పవరేంటో చూపించారు. మంత్రులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఒక ముఖ్యమంత్రి దిగిపోవడంలో కీలక పాత్రపోషించారు. ఒక దశలో ముఖ్యమంత్రి పదవిరేసులోకి కూడా వచ్చారు. క్యాబినెట్ మంత్రి చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసింది ఆయనే. రేపు ఆయన జయంతి.   
కోన ప్రభాకర్  ఎపిసిసి ప్రెశిడెండ్ కావడానికి పివి నరసింహారావు కారణం. అపుడు ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య (అక్టోబర్ 11, 1980).  అపుడు ఆంధ్ర కాంగ్రెస్ లో పవర్ స్ట్రగుల్ చాలా తీవ్రంగా ఉంది. నాటి పిసిసి అధక్షుడు ఎంఎ అజీజ్ . ఆయనను తీసేయాలని  పార్టీ భావిస్తున్నది. ఆయనను తీసేస్తే మాజీ మంత్రి కెఇ కృష్ణ మూర్తిని పిసిసి అధ్యక్షుడిని చేయాలని అంజయ్య భావిస్తున్నారు. అసలు అంజయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని నాదెండ్ల భాస్కర్ రావు వంటి వారు తిరుగుబాటు చేస్తున్నారు.
ఈ దశలో అంజయ్య మాట కాదని పివి నరసింహారావు సిఫార్సు చేసిన కోన ప్రభాకర్ రావును హైకమాండ్ పిసిసి అధ్యక్షుడిని చేసింది.
కోన ప్రభాకర్ రావు  వెంటనే  పార్టీ క్రమశిక్షణ ఉలంఘిస్తున్నారని ఇద్దరు క్యాబినెట్ మంత్రులను పార్టీ నుంచి సస్పండ్ చేశారు. ఆ ఇద్దరిలో ఒకరు కొత్తా దాసు కాగా, రెండో వ్యక్తి ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు. 
ఆపుడు ముఖ్యమంత్రి అంజయ్యతో సంప్రదించకుండానే కోన ప్రభాకర్ రావు మంత్రులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.ఇది సంచలనం.
ఆరోజు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి లాగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పదవి. కోన ప్రభాకర్ రావు వచ్చిన కొద్ది రోజుల్లోనే అంజయ్యను ముఖ్యమంత్రి పదవినుంచి (ఫిబ్రవరి20,1982) తీసేశారు. నిజానికి కోన ప్రభాకర్ రావు ముఖ్యమంత్రి అవుతాడనుకున్నారు. కాలే.
ఆయనకు పోటీగా రంగంలోకి చాలా మంది వచ్చారు.పోటీలో ఎన్ జనార్ధన్ రెడ్డి, బాగారెడ్డి కూడా  ఉన్నారు. కాని హైకమాండ్ భవనం వెంకట్రామ్ రెడ్డిని నియమించింది.
కోన ప్రభాకర్ జయంత్రి సందర్భంగా  ఒక ప్రత్యేక వ్యాసం :
(డా. జె.వి.ప్రమోద్ కుమార్, పైడిమెట్ట. 9490833108)
కోన ప్రభాకరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభా పతిగా 1981 లో పనిచేశారు. 1916 జూలై 10 న గుంటూరు జిల్లా బాపట్లలో వీరు జన్మించారు.
ప్రాధమిక విద్య బాపట్లలో పూర్తి చేసుకుని మద్రాసు లయోలా కళాశాల నుండి పట్టబధ్రులయ్యారు. తరువాత పూణె లో ఐ.ఎల్.ఎస్. న్యాయ కళాశాల నుండి న్యాయ శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు.పాఠశాల లో చదువుతున్న రోజుల్లో మోతీలాల్ నెహ్రూ మరణించినప్పుడు తరగతులు బహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం లో వీరు పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో ఒక యువ బృందాన్ని నిర్వహించి ఖాదీ వాడకాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేశారు.
ప్రభాకర రావు 1940 లో అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని బాపట్లలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1967లో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు తొలి సరిగా ఎన్నికైనారు. ఈయన బాపట్ల శాసన సభ నియోజకవర్గం నుండి  మూడు పర్యాయాలు 1967,1972,1978 లలో విజయం సాధించారు.
1967  ప్రభాకర్ రావు కాంగ్రెస్ నుండి పోటీ చేయగా కే.వెంకటేశ్వర రావు సి.పి.ఎం నుండి పోటీచేశారు. ఈ ఎన్నికల్లో ప్రభాకర్ విజయం సాధించారు.
Dr JV Pramod Kumar
1972 లో కాంగ్రెస్ నుండి పోటీచేసి ఇండిపెండెంట్ అభ్యర్థి ముప్పలనేని శేషగిరి రావు పై విజయం సాధించారు. తిరిగి 1978 లో జనతా పార్టీనుంచి పోటీ చేసిన ముప్పలనేని శేషగిరి పై విజయం సాధించారు. 1983 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సి.విజయ రామరాజు చేతిలో ఓటమి పాలైనారు.
1980-81 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతిగా నియమితులైన రు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. భవనం వెంకట్రామిరెడ్డి మరియు కోట్ల విజయ భాస్కర రెడ్డి ల మంత్రి వర్గాలలో ఆర్ధిక మరియు ప్రణాళిక శాఖ మంత్రిగా పనిచేశారు. వీరు 1983 సెప్టెంబర్ 2 న అప్పట్లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న పాండిచ్చేరి గవర్నర్ గా నియమితులైన రు.ఆ పదవిలో 1984 జూన్ వరకు కొనసాగి, 1984 జూన్ 17 న సిక్కిం గవర్నర్ గా భాద్యతలు చేపట్టారు.
ఆ తరువాత 1985 మే 30 న మహారాష్ట్ర గవర్నర్ (31.05.1985 నుంచి 02.04.1986) గా నియమితులైన రు. 1986 ఏప్రిల్ లో బొంబాయి విశ్వవిద్యాలయం లో మార్కుల విషయంలో చెలరేగిన దుమారం లో ఆయన పాత్ర పై సంశయం ఏర్పడడంతో ఆరోగ్యం కారణాలతో మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా   చేశారు.
క్రీడలలో ఆసక్తి కలిగిన ప్రభాకరరావు 1938 లో బొంబాయి విశ్వవిద్యాలయం లో టెన్నిస్ ఛాంపియన్ అయ్యారు. బాపట్ల మరియు ఇతర ప్రదేశాలలో శివాజీ వ్యాయామ మండలి స్థాపనకు తోడ్పడ్డారు. పూణె లో కళాశాల రోజుల్లో ప్రభాకర్ కుస్తీలు పట్టేవారు మరియు బాట్మెం టన్ ఛాంపియన్ గా కూడా పేరు తెచ్చుకున్నారు.
ఈయనకు అనేక సాంస్కృతిక సంస్థలతో అనుబంధం ఉంది. తొలినాళ్ళలో అనేక తెలుగు సినిమాలు నిర్మించి,దర్శకత్వం వహించారు. కొన్నింటిలో స్వయంగా నటించారు. ఈయన సినిమాలలో కొన్ని మంగళ సూత్రం, నిర్దోషి, ద్రోహి మరియు సౌదామిని. బాపట్ల శాసన సభ్యులు గా ఉన్నత కాలంలో వీరు బాపట్ల అభివృద్ధికి విశేష కృషి చేశారు. విద్యారంగం లో బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి సొంత ఊరిలో అనేక విద్యాసంస్థలు అభివృద్ది చేసేందుకు దోహదం చేశారు.
కృష్ణా జలాలను బాపట్ల కు రప్పించడానికి కృషిచేసి వ్యవసాయ రంగానికి దోహదపడ్డారు. ఈయన 1990 అక్టోబర్ 20 న మరణించారు. ఈయన కుమారుడు కొన రఘుపతి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఉప సభాపతి గా ఉన్నారు.