మిస్టరీగా మారిన వివేకా హత్య కేసు… చిక్కుముడి వీడేదెన్నడో?

(యనమల నాగిరెడ్డి)

అంతుచిక్కని ఆధారాలు … లోక సంచారం చేస్తున్న అనుమానాలు 

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి కుడిభుజంగా వ్యవహరించి తనదైన శైలిలో అన్నకు అండగా ఉండి కడప జిల్లాలో తనకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరుచుకున్న మాజీమంత్రి  వివేకానందరెడ్డి అనూహ్యరీతిలో గత మార్చి 15 తెల్లవారుఝామున దారుణంగా హత్యకు గురైన విషయం విదితమే. ఆయన హత్యకు గురై 7 నెలలైంది. ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రికి స్వయానా చిన్నాన్న కూడా. ఆయన కడప ఎం. పి గా, ఎంఎల్ఏ గా, మంత్రిగా కూడా పనిచేసారు.  వివాద రహితుడుగా గుర్తింపు పొందారు. ఇంత చరిత్ర, బలం, బలగం ఉన్న నాయకుడు అత్యంత కిరాతకంగా హత్య చేయబడితే అందుకు కారణాలు కానీ, నిందితులకు సంబందించిన ఆచూకీ కానీ కనుక్కోవడంలో “భారీ ప్రత్యేక విచారణ బృందాలు” విఫలం కావడంతో ఈ హత్యపై అనేక అనుమానాలు తలెత్తుతుండగా ప్రజలలో  అనేక పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. 

రాజకీయ సంచలనం   

ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన  ఈ హత్య రాజకీయ దుమారానికి కారణమైంది. ప్రధాన రాజకీయ పక్షాలైన టీడీపీ, వైసిపిలు పరస్పర ఆరోపణలతో ఒకరిపై ఒకరు దారుణంగా బురద చల్లుకున్నారు. జమ్ములమడుగులో ఎంఎల్ఏగా పోటీ చేస్తున్న మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఓటమి భయంతో ఈ హత్య చేయించారని, అప్పటి పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవికి ఈ హత్యలో ప్రమేయముందని  వైసీపీ నేతలు భారీగా ఆరోపణలు గుప్పించారు. అయితే జగన్ అండదండలతో వై.ఎస్. కుటుంబంలో కొందరు రాజకీయ ప్రయోజనాలకోసం హత్య చేయించారని టీడీపీ ఎదురుదాడి చేసింది. నిజానిజాల నిర్దారణకు సీబీఐ విచారణకు ఆదేశించాలని వైసీపీ డిమాండ్ చేసింది.

పోలింగ్ ముగిసిన తర్వాత ఈ హత్యకు రాజకీయ రంగు తగ్గినా అసలు విషయం మాత్రం అతీగతీ లేకుండా పోయిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 

ప్రత్యేక విచారణ బృందాలు   

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంచలనాత్మక హత్యకేసులో దోషులను వెలికితీయడం కోసం  నిజాయతీపరుడని పేరున్న ఒక ఐజి నేతృత్వంలో 7 మంది సభ్యులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసారు. అయితే వివేకా కుటుంభ సభ్యులతో పాటు  వైసీపీ నాయకులు కూడా ఈ హత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు

నాటి మిడిల్ క్లాస్ కలల రాణి బజాజ్ చేతక్ మళ్లీవస్తాంది, ఈసారి కరెంటుతో…

ఎన్నికల అనంతరం వైసీపీ సునామీతో ఏర్పడిన  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందున్న సిట్ ను రద్దు చేసి కొత్తగా ఈ కేసు విచారణకు 32 మంది సభ్యులతో మరో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ రెండు బృందాలు వందలాది మందిని విచారించాయి. ప్రత్యేకించి వివేకానందరెడ్డి పిఎ, వాచ్ మాన్ లాంటి వాళ్లకు లై డిటెక్టర్ పరీక్షలు కూడా నిర్వహించారు. అలాగే ప్రధాన అనుమానితుడిగా పోలీసులు భావించిన  పరమేశ్వర రెడ్డిని విచారించారు. ఆయన లై డిటెక్టర్ పరీక్షకు అంగీకరించక పోవడంతో మిన్నకుండి పోయారు. 

సిసిటివి ఫుటేజిలు పరిశీలించారు. మార్చి 14 వ తేదీ రాత్రి హీరోహొండా మోటార్ బైక్ తో కొందరు అనుమానాస్పదంగా సంచరించారని పులివెందులలో హీరోహొండా మోటార్ బైక్ లు   ఉన్నవారినందరినీ విచారించారు కూడా. అయినా ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు సేకరించలేక పోయారు.  

హత్యకు మోటివ్ ఇంకా వెలుగు చూడలేదు 

ప్రతి హత్యకు కొన్ని కారణాలుంటాయి. వాటిలో ఆస్తి, ఆర్థిక పరమైన తగాదాలు, పౌరుషానికి (పంతానికి) సంభందించిన అంశాలు, అక్రమ సంభందాలు, అధికార ప్రయోజనాలు లాంటి కారణాలుంటాయి. 

వివేకా దారుణంగా నరికి చంపబడిన వెంటనే అనేక పుకార్లు రాష్ట్రంలో షికార్లు చేశాయి. అందులో మొదటిది రాజకీయాల పరంగా టీడీపీ నాయకులు హత్య చేయించారని ఆరోపణలు వెల్లువెత్తగా, వై.ఎస్ కుటుంబీకులే ఆయన రాజకీయ ప్రాధాన్యత చూడలేక హత్య చేయించారని కూడా ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత బెంగుళూరు ప్రాంతంలో జరిగిన ఒక సెటిల్మెంట్ విషయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు కారణమనే అంశం ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత అక్రమ సంభందం వల్ల ఆయన హత్యకు గురయ్యాడని పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి.   

అయితే వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు హత్యకు ఉన్న “మోటివ్” కనుక్కోవడంలో పోలీసులు విఫలమయ్యారు. హత్య చేయడానికి  గల కారణం తెలియకుండా ముద్దాయిలను ఎలా పట్టుకోగలరు?. 

ఈ హత్య పై అనేక అనుమానాలు 

హత్య జరిగిన రోజు నుండి జరిగిన సంఘటనలు, హత్య జరిగిన విధానం, తర్వాత జరిగిన పోలీసు విచారణ ఈ ఘటనపై ఉన్న అనుమానాలను పెంచింది తప్ప తీర్చలేదు. హత్య జరిగిన వెంటనే వివేకానంద రెడ్డి గుండె పోటుతో మరణించారని సాక్షి టివిలో ప్రసారమైంది. ఆ తర్వాత బాత్ రూమ్ లో ఉన్న శవాన్ని బెడ్ రూమ్ కు తరలించడం, ఆయన తలకు తగిలిన గాయాలకు కట్లు కట్టడం, ఆ గదులలో ఉన్న రక్తం మరకలను కడిగి వేయడం లాంటి విషయాలు అనుమానాస్పదంగా మిగిలాయి. 

ఆ తర్వాత జరిగిన రాజకీయ గందరగోళం అసలు విషయం బయటకు రాకుండా అడ్డుపడిందనే  చెప్పక తప్పదు . 

చంద్రబాబు మొదట సిట్ లో నియమించిన నిబద్దత కల అధికారులను (అసలు) పని చేయకుండా కొసరు పనులు చేయించారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. 

టీడీపీ హయాంలో సిబిఐ విచారణ కోరిన వైసీపీ నాయకులు జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిబిఐ విచారణకు ఆదేశించకుండా “32 మందితో మరో భారీ సిట్” వేసి చేతులు దులుపుకున్నారనే విమర్సలు తీవ్రంగా ఉన్నాయి. వీటికి తోడు టీడీపీ,వైసీపీ నియమించిన  రెండు సిట్ బృందాలు కూడా ఇప్పటి వరకు హత్యకు మోటివ్ నిర్దారించలేక పోవడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. 

సునీల్ గ్యాంగ్ పై అనుమానాలు 

వివేకా హత్యలో సునీల్ గ్యాంగ్ హస్తం ఉందని,  ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన శ్రీనివాసరెడ్డి సునీల్ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చారని, ఎవరికోసం ఈ సుపారీ కుదిరించారో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని వచ్చిన వార్తలు మరోసారి ఈ కేసును కదిలించాయి. 

అయితే ఇవన్నీ పుకార్లేనని, ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కడప జిల్లా కొత్త పోలీసు బాసు ఒక పత్రికా ప్రకనలో హెచ్చరించారు. ఐతే ఆయన కూడా ఈ కేసు పురోగతిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. వివేకానంద రెడ్డి లాంటి రాజకీయ నాయకుడి దారుణ హత్య ఉదంతంలో నేరస్తులను గుర్తించడానికి ఇంత ఆలస్యమైతే సాధారణ కేసులలో పురోగతి ఎలా ఉంటుందనే ప్రశ్న ఉంది. అయితే ఈ కేసు విఐపిది కాబట్టే తొందరగా తేలడం లేదని పోలీసులు అంటున్నారు. దీంతో వివేకా హత్యకేసు మళ్ళీ మొదటికి వచ్చినట్లే నని  చెప్పవచ్చు. 

 ఈ కేసును పోలీసులు ఎప్పుడు ఛేదించి అసలు నేరస్తులను పెట్టుకుంటారో ? ఉన్న అనుమానాలను తొలగించి షికార్లు చేస్తున్న వదంతులకు ఎపుడు పులుస్టాప్ పెడతారో ? కాలమే నిర్ణయించాలి.