ప్రపంచంలో మొదటి మాడరన్ యూనివర్శిటీ ఎక్కడుంది? (యూరోప్ యాత్ర 8)

(డా. కే.వి.ఆర్.రావు)
మా యూరప్ యాత్ర, ఎనిమిదో భాగం: ఫ్లోరెన్స్, పీసా (ఇటలి);
పదమూడోరోజు ఉదయం ఫ్లోరెన్స్ కి బయలుదేరాము. రెనయజెన్స్ ఐరోపా సాంస్కృతిక పునరుజ్జీవనం) సాధికారిక పుట్టుక ఫ్లోరెన్స్ లోనే పదిహేనవ శతాబ్ధపు ద్వితీయార్థంలోనే జరిగిందని చెబుతారు.
అంతవరకూ ఉన్న కక్షారాజకీయాలు, వాణిజ్యస్పర్థలను కాదని అప్పటి ఆ నగరపాలకుడు లారెంజో డి మెడిసి ఉదాత్తభావాలను ప్రచారంచేయడమేకాక వాటిని లలితకళలద్వారా వ్యాప్తిచేసేందుకు కృషిచేసారని దాని ఫలితంగానే రెనయజెన్స్ భావజాలం ఆవిష్కరింపబడి, రోమ్ తోసహా అనేకప్రాంతాలలో పుంజుకుని ప్రపంచ ఆలోచనావిధానాన్ని మార్చివేసిందని అంటారు.
పైగా డాంటే, మాకియవెల్లి, గెలీలియో, ఫ్లోరెన్స్ నైటింగేల్, డోనెటెల్లో, లియనార్డో దవిన్సి, మైఖేలాంజిలో లాంటి గొప్పవాళ్లు ఈవూరివాళ్లే. మా సహచరులలో ఈవిషయాలు తెలిసిన కొందరు ఉత్సాహంగా ఉన్నారు. రెండుగంటల ప్రయాణం తరువాత ఫ్లోరెన్స్ చేరాము.
దారిలో బొలోనా నగరపు పొలిమేరల మీదుగావెళ్లాము. ప్రపంచంలోని మొట్టమొదటి ఆధునిక యూనివర్సిటీ ఇక్కడే ప్రారంభమవడమేకాక, విశ్వవిద్యాలయాలకు భావనాస్వాతంత్రం ముఖ్యలక్షణమనే ఆధునికభావన ఇక్కడే రూపుదిద్దుకుంది (నిజానికి మన నలందా, తక్షశిలలే మొట్టమొదటి విశ్వవిద్యాలయాలు, కానీ అవి తరువాతి కాలంలో అంతరించిపోయాయి).
ఫ్లోరెన్స్ మూడువైపులా కొండల శ్రేణి ఒక పెద్ద కోటగోడలా ఉంది. ఆవూరిని జూలియస్ సీజర్ క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్ధారంభంలో రోమన్ రాజ్య మాజీ సైనికులకోసం కట్టించాడట. నగరకేంద్రప్రాంతంలోనే చూడవలసిన యాత్రా స్థలాలన్నీ ఉన్నాయి. వాటికి కొంతదూరంలో బస్సు ఆపారు. మా ఫ్లోరెన్స్ లోకల్ గైడ్ అక్కడికే వచ్చివున్నారు. అక్కడినుంచి నడస్తూ ఊర్లోకి వెళ్లాము.
ఫ్లొరెన్స్ లో చాలామంచి మ్యూజియంలు ఉన్నాయి. ఐతే దురదృష్టమేమంటే ఆరోజు (సోమవారం) వాటన్నికి సెలవు. ముఖ్యంగా మైకేలాంజిలో చెక్కిన ప్రఖ్యాతిగాంచిన ‘డేవిడ్’ అసలు పాలరాతి శిల్పం ‘అకడెమియ గెలీరియ’ అనే మ్యూజియంలో ఉంది. అంతదూరం వెళ్లి, ఆ మ్యూజియం పక్కనుంచీ నడుస్తూ వెళ్లికూడా దాన్ని చూడలేకపోయినందుకు చాలానిరాశ చెందాము.
ఫ్లోరెన్స్ పాతవూరంతా శతాబ్దాలకిందట ముఖ్యంగా రెనియజెన్స్ వాస్తుశైలిలో కట్టిన పొడవైన భవనాలు కనిపిస్తాయి. ఊరిమధ్యలో యాత్రీకులు ముఖ్యంగా చూసే రెండు కేంద్రాలున్నాయి, మొదటిది మతసంబంధమైన కేంద్రం, రెండవది రాజకీయసంబంధమైన కేంద్రం.
మొదటగా ‘సాంటా మారియా బాసిలికా’ దాని సంబంధించిన భవనాలను చూశాము. గైడ్ అన్నీ అర్థమయ్యే ఇంగ్లీషులో ఓపిగ్గా వివరించారు. ఆ బాసిలికా నిర్మాణం 15వ శతాబ్ధంలో పూర్తైంది. పాలరాయి ప్రధానంగా ఫ్రెస్కోలు. బొమ్మలతో కూడిన అనేక పలకలు కలిగి సంక్లిష్టమైన శైలి లో తెలుపు, ముదురాకుపచ్చ రంగులలో నిర్మించబడిన పెద్ద నిర్మాణం.
కాస్త వెనుకగావున్న దాని గోపురాన్ని (డోం) గోధుమరంగులో ఇటుకలు, సున్నంతో నిర్మించారు. అలాంటి నిర్మాణాల్లో ఇప్పటికీ ప్రపంచంలో అదే పెద్దది. మొత్తం బాసిలికా ఒకేసారి కనపడాలంటే చాలాదూరంనుంచి చూడాలి.
బాసిలికా ఎదురుగావున్న బాప్టిస్ట్రి భవనశిల్పంకూడా గొప్పగావుంది. ముఖ్యంగా దాని కంచుద్వారాలు (ప్రస్తుతం నకలులున్నాయి) అద్భుతమైన శిల్పనగిషిలతో కూడి, పౌరాణిక గాధలు చెక్కబడిన 24 పలకలతో మెరుస్తున్నాయి (శిల్పి గిబెర్టో 14వ శతాబ్ధంలో నిర్మించిన అసలు ద్వారాలు తరువాతికాలంలో తరలించి మరో మ్యూజియంలో ఉంచారట. వీటినే మైకెలాంజిలో ‘స్వర్గద్వారాలు’ అని కీర్తించాడు).
బాసిలికాను చూశాక కొంచెందూరంలోవున్న రాజకీయ ప్రాంగణానికి (స్క్యేర్) వెళ్లాము.
అక్కడ పురాతన కాలంనుంచీ ఉన్న ఒక బహుళ అంతస్తుల నగరపాలక భవనం చూశాము. దానిముందరే ఆరుబయలులో మూడు పాలరాతి విగ్రహాలు నెప్ట్యూన్, డేవిడ్ (నకలు), హెర్క్యులెస్ వి ఉన్నాయి.
ఇందులో నెప్ట్యూన్ విగ్రహంతోపాటు 16వ శతాబ్దంలో ఎమ్మనటి నిర్మించిన ఫౌంటేన్ ఇప్పటికీ పనిచేస్తుండడం విశేషం. మైకేలాంజిలో 1504 లో ఇక్కడే చెక్కిన పదిహేడడుగుల డేవిడ్ పాలరాతి విగ్రహాన్ని 1783 వరకూ ఇక్కడే ఉంచారట. ఆతరువాత ‘అకడెమియ గెలీరియ’ మ్యూజియంకి మార్చి దాని నకలును అదేస్థలంలో ఉంచారు.
ప్రస్తుతం మ్యూజియంలోవున్న ఐదువందల యేళ్లనాటి డేవిడ్ పాలరాతిశిల్పం ప్రపంచంలో అత్యుత్తమ శిల్పమని, ఇప్పటివరకు యాభైకోట్లకు పైగా యాత్రీకులు దాన్ని సందర్శించారని అంటారు.
ఈ ఆవరణలోనే ఫ్లొరెన్స్ ని ఒక ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేసిన ‘కాసిమో డె మెడిసి’ (లొరాంజో తాత) విగ్రహం ఉంది. ఇవేకాక ఆ చారిత్రక భవనం ఎదురుగా ఉన్న ఒక ఒపెన్ గ్యాలరిలో అనేక పాలరాతి విగ్రహాలున్నాయి.
ఇవన్నీ చూశాక దగ్గర్లోనేవున్న అర్నో నదిమీద కట్టిన మొట్టమొదటి వంతెన దానికిరువైపులా ఉన్న ఆభరణాల షాపులు చూశాము. ఒకప్ప్పుడు ఆ వంతెనకవతల ఇతరదేశాలనుంచి వచ్చిన వర్తకులు, సంపన్నులు బస చేసేవారట. ఆకాలంలో నదివొడ్డున మాంసంకొట్లుండి వాళ్లు వేస్తున్న వ్యర్థపదార్థాలతో నది కలుషితమై ఆచోటు చెడువాసనతో ఉండేదట. అందుకని ఒక రాణిగారు వాళ్లకు వేరే చోటు చూపించి తెలివిగా ఆ వంతెనమీద నగల దుకాణాలు ఏర్పాటు చేశారట.
యాత్రల్లో అక్కడక్కడా ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ పరిష్కారాలు కూడా చూడొచ్చని మాకు అవగతమైంది.
రెండో ప్రపంచయుద్దం చివరన ఫ్లోరెన్స్ ని వదిలి వెళ్లిపోతూ అన్ని బ్రిడ్జిలనూ పేల్చేసిన జర్మన్ సైనికులు పురజనుల కోరిక మీద ఈ పాతవంతెనను మాత్రం వదిలేశారట. ఫ్లోరెన్స్ లో ఇంకా చూడాల్సినవి చాలావున్నా ప్యాకేజి సమయపరిమితులవల్ల ఇవే చూడగలిగాం. ముఖ్యంగా లియనార్డో దవిన్సి, మైకేలాంజిలో, మెడిసిల ఇళ్లు (దవిన్సి జన్మస్థలం ఆవూరే), పెరిగిన ప్రదేశాలు చుడలేకపోయాం
ఆ మధ్యాహ్నం ఫ్లొరెన్స్ లో ‘గాంధిజీ’ పేరుతోవున్న ఇండియన్ రెస్టారెంట్లో భోజనం చేసి బస్సెక్కి ఊరిబయట ఒక కొండమీద ఎత్తులోవున్న మైకేలాంజిలో ప్లాజాకెళ్లాము. అది మైకేలాంజిలో గౌరవార్థం ఏర్పాటు చేసిన చిన్న పార్కులాంటి సమతల ప్రదేశము. అక్కడొక పెద్ద డేవిడ్ విగ్రహం నకలును ప్రతిష్ఠించారు.
అక్కడినుంచి ఫ్లోరెన్స్ పానోరమిక్ వ్యూ ఆవూరి చరిత్రాత్మక, కళాత్మక భవనాలతో సాయంకాలపు సూర్యకాంతిలో సుందర దృశ్యంగా కనిపించింది. ఫ్లొరెన్స్ లో ఈ కళాత్మక నిర్మాణాలను మరుగు పరుస్తాయని అక్కడ ఆకాశ హర్మ్యాలను అనుమతించరని చెప్పారు.
మానవుని ఆలోచనా విధానాన్ని సరళీకృతం చేసి ఆధునికతవైపు విస్తరింపజేయడమేకాక, కళారంగంలో కొత్త పరిణామాలకి బాటలు వేసిన ఫ్లొరెన్స్ నగరాన్ని సందర్శించిన తృప్తితో అక్కడినుంచి పీసా చూడ్డానికి బయలుదేరాం.
ఆర్నో నది సముద్రంలో కలిసేచోటుకు దగ్గర్లో వున్న పీసా 90 వేల జనాభాగల నగరం. ఆనగరంలో అనేక చారిత్రక స్తలాలున్నా ‘లీనింగ్ టవర్ ‘ మాత్రమే ముఖ్యాకర్షణ.
సాయంత్రం నాలుగుగంటలకు పీసా చేరాం. బస్సుదిగి కొద్దిదూరం షాపుల మధ్య నడిచి ఒక ఎత్తైన ప్రహరీగోడలోవున్న ద్వారంగుండా లోపలికెళ్లాం. అక్కడ విశాలమైన ఆవరణలో నాలుగు పెద్ద నిర్మాణాల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన ‘లీనింగ్ టవర్’ ఉంది. యాత్రీకులు అక్కడ అధిక సంఖ్యలో ఉన్నారు.
ఎత్తైన ప్రహరీగోడ లోపల, విశాలమైన ఆవరణలో, శిల్పసౌందర్యంతో కూడిన ఈ నాలుగు ఎత్తైన భవనాలే ఉండడంవల్ల, వాటి కాంతివంతమైన తెలుపురంగువల్ల అవి మన కనుచూపుమేరా ఆవరించి కనిపిస్తాయి (ఈ అనుభవం మన తాజ్ మహల్, బృహదీశ్వరాలయంలాంటివి చూసినప్పుడు కూడా కలుగుతుంది).
పద్నాలుగవ శతాబ్ధంలో కట్టిన 183 అడుగుల ఎత్తుతో, నాలుగు డిగ్రీలు వాలిన ఈ ‘గంటస్తంభం’ ఒక చర్చి సముదాయంలో భాగంగా ఉంది. ఈ ‘వాలిన స్తంభం’కాక పెద్ద గోపురం గల బాసిలికా, సమాధుల నిలయం, బాప్టిస్ట్రి ఈ సముదాయంలో ఉన్నాయి.
ఎత్తైన ప్రహరీగోడ లోపల, విశాలమైన ఆవరణలో, శిల్పసౌందర్యంతో కూడిన ఈ నాలుగు ఎత్తైన భవనాలే ఉండడంవల్ల, వాటి కాంతివంతమైన తెలుపురంగువల్ల అవి మన కనుచూపుమేరా ఆవరించి కనిపిస్తాయి (ఈ అనుభవం మన తాజ్ మహల్, బృహదీశ్వరాలయంలాంటివి చూసినప్పుడు కూడా కలుగుతుంది).
గంటస్తంభం వాలు స్పష్టంగా కనిపిస్తుంది. రెండస్తులు కట్టాక ఒకవైపు నేలకుంగిపోవడంవల్ల ఆ స్థంభం వాలిందని. కొన్ని దశాబ్దాలపాటు పని ఆపేశారని, తరువాత మళ్లీ మొదలుపెట్టి ఏడంతస్తులూ పూర్తి చేశారని చెప్పారు.
ఈ కట్టడంలో వాలనివైపున అంతస్తులు ఎత్తుతక్కువగా కట్టి స్థంబాన్ని నిలువుగా మార్చే ప్రయత్నం చేసారు. ఒకవైపు అంతస్తులు చిన్నవిగా ఉండడం మనకు కనిపిస్తుంది.
ఆధునికపద్దతులు ఉపయోగించి 1990-98 మధ్యకాలంలో స్థంభాన్ని స్థిరపరిచారని, మరో రెండొందల యేళ్లు డోకాలేదని చెప్పారు. అప్పటికే ఎన్నోసార్లు ఫోటోల్లో, విడియోల్లో చూసిప్పటికీ ఈ ‘లీనింగ్ టవర్ వింతగా, ఆకర్షణీయంగా’ ఉంది.
ఒక గంటసేపు ఆవరణంతా తిరిగి ఫోటోలు తీసుకుని, షాపింగ్ చేసి బస్సుదగ్గరికి తిరిగి వచ్చాము. వెనిస్ లో లాగే ఇక్కడకూడా బయట షాపింగ్ ప్రాంతంలో పేద ఆఫ్రికన్ దేశాలవాళ్లు కొందరు రోడ్లమీద అనధికారికంగా హ్యండ్ బ్యాగులు, గొడుగులు లాంటివి అమ్ముతూ కనిపించారు. మేం వాళ్లదగ్గరకూడా కొన్ని వస్తువులు కొన్నాం.
అక్కడనుంచి మళ్లీ రెండుగంటలకు పైగా రోం నగరదిశగా ప్రయాణం చేసి అరెజో అనే ప్రాంతంలోని హోటల్లో ఆరాత్రి బసచేశాం. ఆరాత్రి థామస్ కుక్ వారు మాకు ప్రత్యేక డిన్నర్ ఇచ్చారు. ఆ సందర్భంగా అక్కడి లేడి డ్యాన్సర్లతో చిన్న డ్యాన్స్ ప్రోగ్రాంకూడా పెట్టారు. మాలో కొందరుకూడా వాళ్లతోకలసి ఉత్సాహంగా గ్రూప్ డ్యాన్స్ చేసారు. (తరువాయి తొమ్మిదవ ఆఖరిభాగంలో)

ఇక్కడ ఏడవ భాగం చదవండి

https://trendingtelugunews.com/english/features/in-italy-the-guide-cautioned-us-about-theives-europe-tour/