భారత్ లో మే 21న కోవిడ్ ముగింపు : సింగపూర్ నిపుణుల అంచనా

కరోనా కట్టడిలో తల్లడిల్లి పోతున్నారా? కనుచూపు మేరలో ఆశారేఖ కనిపించడం లేదా? మీ వూర్లో లేదా మీజిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్నదా? భయపడకండి. కష్టాల కలకాలం ఉండవు. మంచిరోజులు ఎంతో దూరంలో లేవు, మహా అంటేనెలరోజుల దూరంలో ఉన్నాయని సింగపూర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  ఏప్రిల్ 25 నాడు ప్రపంచదేశాలలో నమోదయిన కరోనాకేసులు, మృతుల సంఖ్య, కోలుకున్నవారు… ఇలా రకరకాల డేటా సేకరించి, లెక్కకట్టి ప్రపంచానికి వారు ఒక శుభవార్త అందిస్తున్నారు. వీరి లెక్క ప్రకారం ప్రపంచమంతా కరోనా కష్టాలు ఇంకొక నెలరోజుల్లో తొలగిపోతున్నాయి.
ఒక అంచనా ప్రకారం భారతదేశంలో కరోనా సమస్య దాదాపు 97 శాతం దాకా మే 21 నాటికి పరిష్కారమవుతుంది. ఇదే విధంగా ప్రపంచస్థాయిలో కరోనా సమస్య మే 29 నాటికి 97 శాతం ముగుస్తుంది. డిసెంబర్ 8,2020 నాటికి 100 శాతం కరోనా కనుమరుగవుతుంది.
సింగపూర్ యూనివర్శిటీ టెక్నాలజీ అండ్ డిజైన్ కు చెందిన SUTD Data-Driven Innovation Lab నిపుణులు ప్రపంచ దేశాలలో కరోనా వ్యాప్తి గురించిన డేటా అధారంగా కోవిడ్ -19 నుంచి దేశాలు ఎపుడెపుడు విముక్తి అవుతాయోలెక్క కట్టారు.
అయితే, తమకు అందిన డేటా ప్రకారం చేసిన అంచనాయే నని, ఇందులో తప్పులు కూడా వుండవచ్చని హెచ్చరిక చేస్తూనే తమ అంచనా వివరాలను వారు వెల్లడించారు.
ఈ అంచనా కట్టినబృందంలో పేరుమోసిన నిపుణులున్నారు. ఈ బృందానికి 2018 ఉత్తమ పరిశోధన అవార్డు అందుకున్న  ప్రొఫెసర్ జియాంగ్జి ల్యూవో (Jianxi Luo)   నాయకత్వం వహించారు. ఆయన ఇన్నొవేషన్ ల్యాబ్ డైరెక్టర్. ఆయన బృందంలో మరొక 21 మంది సభ్యులున్నారు.
వీళ్ల అంచనా ప్రకారం భారతదేశంలో తగ్గు ముఖం ఏప్రిల్ 20న మొదలయింది,  మే 21 నాటికి కరోనా గ్రాఫ్  పూర్తిగా పడిపోతుంది. ఈ లెక్క ప్రకారం మే 21 నాటికి 97 శాతం దాకా కరోనా భారత్ లో అదుపులోకి వస్తుంది.  మే 31 నాటికి 99 శాతం అదుపులోకి వస్తుంది. ఇక 100 శాతం వైరస్ అదుపులోకి వచ్చేందుకు జూలై 25, 2020 దాకా ఆగాల్సి ఉంటుంది. ఇది వాళ్లు తయారు చేసిన భారత్ కోవిడ్-19 వ్యాప్తి, తగ్గుదల, ముగింపు గ్రాఫ్.
ఇక ప్రపంచం మొత్తానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఏప్రిల్ 11నే తగ్గు ముఖం పట్టింది. మే 29 నాటికి కరోనా గ్రాఫ్ 97 శాతం పడిపోతుంది. జూన్ 16 నాటికి 99 శాతానికి పడిపోతుంది. డిసెంబర్ 8 నాటికి 100 శాతం కరోనా అదుపులోకి వస్తుంది.
కరోనాతో తల్లడిల్లుతున్న అమెరికాకు మే11 నాటికి మంచి రోజులురానున్నాయి. అప్పటికి 97 శాతం తగ్గుతుంది. మే 23 నాటికి  99 శాతం,  ఆగస్టు 26 నాటికి నూరు శాతం తగ్గుతుందని ఈ బృందం అంచనా వేసింది.
కోవిడ్ -19 కల్లోలం ఎపుడు ముగుస్తుందని అంచనా వేసేందుకు  SIR (Susceptible-infected-recovered) model ను వాడారు.  తమకు అవసరమయిన డేటాను వారు Our World in Data నుంచి తీసుకున్నారు. ఈ అంచనా వేసేందుకు ఈ నిపుణులు వాడిని ధియరీ, మెథడాలజీ Luo, Jianxi(2020)When Will COVID-19 End? Data-Driven-Predictionలో వివరించారు. ఆసక్తి వున్న వారు  లింక్ ను క్లిక్ చేసి ధియరీ మెధడాలజీని పరిశీలించవచ్చు. తమ వెబ్ పేజీలో  అమెరికా, ఇండియా, సింగపూర్, యుకె, జోర్డాన్,  ఇటలీ, సౌ దీ అరేబియా, యుఎఇ, స్పెయిన తదితర 29 దేశాల వివరాలు పోస్టు చేశారు. 131 దేశాల అంచనాలు ఇక్కడ ఉన్నాయి. ప్రత్యామ్నాయ కోవిడ్-19 ముగింపు తేదీలు కావాలేంటే ఇక్కడ క్లిక్ చేయండి. అయితే, ఇందులో దోషాలండే అవకాశం ఉందని కూడా వారు హెచ్చరిస్తున్నారు.