Home Features పేదలందరికి ఇళ్ల స్థలాలు బాగానే ఉంది, ఆ షరతులేమిటి?: జగన్ కు ఇఎఎస్ శర్మ లేఖ

పేదలందరికి ఇళ్ల స్థలాలు బాగానే ఉంది, ఆ షరతులేమిటి?: జగన్ కు ఇఎఎస్ శర్మ లేఖ

254
0
Dr EAS Sarma IAS (rtd)
(EAS Sarma)
నగరాలలో పేదలకు ఇళ్లస్థలాల పట్టాలు ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం, మంచి ఉద్దేశంతోనే GO 463 తేదీ 6-11-2019 ఇచ్చింది.
విశాఖపట్నం వంటి నగరంలో మూడవవంతు జనాభా పేద కుటుంబాలు. వారు భవన నిర్మాణ శ్రమ జీవులు, వీధి వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు, కార్పెంటర్లు, ఎలెక్ట్రీషియన్లు, ఇతర చిన్నకారు వృత్తి చేసే వారు. వీరు నగరాన్ని నిర్మిస్తున్న వారు.
నగరాన్ని నడిపిస్తున్న వారు. అటువంటి కుటుంబాలు, కనీస సౌకర్యాలకు దూరమై,  మురికి వాడలలో అతి దైన్య స్థితిలో నివసిస్తున్నారనే విషయం అందరికీ తెలిసినదే.
వారి సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వాలు అరుదు. అటువంటి పేదల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మీ ప్రభుత్వం, వారికి ఇళ్లస్థలాల పట్టాలను ఇచ్చే లక్ష్యంతో  GO 463 (రెవిన్యూ) తేదీ 6-11-2019 ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాను.
కాని,  ఆ GO ఆధారంగా మీరు పేదలకు ఎటువంటి సౌకర్యం కలిగించాలి అని అనుకున్నారో, GO లో చేర్చిన షరతులవలన అటువంటి సౌకర్యాలను అధికారులు తిరస్కరించి, పేదలకు నష్టం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా గమనించవలసిన విషయం, మురికి వాడలలో నివసిస్తున్న కుటుంబాలు నలభై, ఏభై సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధులు లేకపోవడం వలనో, ప్రభుత్వ ప్రోజెక్టుల కారణంగా నిర్వాసితులు అవ్వడం వలనో, ఉపాధులకోసం నగరాలకు వలస వచ్చిన వారు.
నగరాభివృద్ధి ప్రణాళికలలో వారిని స్థిరపరచే పథకాలు లేకపోవడం కారణంగా, వారు ప్రభుత్వ స్థలాలలో స్థిరపడ్డారు. వారి సంక్షేమం కోసం JNNURM వంటి పథకాలలో ఉన్న షరతుల ప్రకారం ఖర్చు చేయవలసిన నిధులను, ఉదాసీనత వలనో, నిర్లక్ష్యం వలనో, నగరపాలకులు ఖర్చు చేయలేదు.
వారు స్థిరపడ్డ ప్రభుత్వ స్థలాలు, వారికి ఉపాధులు కలిగిస్తున్న రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ల వంటి ప్రదేశాలకు దగ్గిరలో ఉన్నాయి. అటువంటి వారిని “పునరావాసం” చేస్తామని ప్రభుత్వం దూర ప్రాంతాలకు తరలిస్తే, వారు ఇప్పుడు ఉన్న ఉపాధిని కోల్పోతారు.
అటువంటి పునరావాస ప్రక్రియవలన, మహిళల, పిల్లల సంక్షేమానికి  కూడా హాని కలుగుతుంది.  ఈ విషయం దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వము ఎక్కడ ఉన్న వారికి అక్కడే ఇళ్లస్థలాల పట్టాలు ఇచ్చి,  నివాస యోగ్యమైన ఇళ్లను కట్టి ఇచ్చే విధానాన్ని అమలుచేయాలి.
GO 463 ఉద్దేశం మంచిదే అయినా, అందులో 15వ పేరాలో సూచించిన షరతులు GO లక్ష్యాన్ని భంగపరుస్తాయి.
ఉదాహరణకు, GO లో 15వ పేరాలో (అ) షరతు, నగర మాస్టర్ ప్లాన్ కు సంబంధించినది. మాస్టర్ ప్లాన్ తయారు చేసినప్పుడు మురికివాడల ప్రజల కష్ట నష్టాలను దృష్టిలో పెట్టుకోలేదు. వారి అభ్యంతరాలను తెలుసుకోలేదు. కొన్ని మురికివాడలు, మాస్టర్ ప్లాన్ లో సూచించిన రోడ్డులమీద ఉన్నాయి. అదే రోడ్డుల మీద బడాబాబులు ప్రైవేట్ కళాశాలలను, అపార్ట్ మెంట్ భవనాలను విచ్చలవిడిగా నిర్మించినపుడు అధికారులు వారిని ఆపలేదు.
పైగా బిల్డింగ్ పర్మిట్లు ఇచ్చి సత్కరించారు. ఆ రోడ్ల దిశగా ఉన్న స్థలాలలో నివసిస్తున్న పేద ప్రజలకు మాత్రం పట్టాలు ఇవ్వడం లేదు. GO 463 మళ్ళీ అదే అభ్యంతరాన్ని లేవనెత్తిసున్నది. అంటే, పెద్దలకు ఒక రూలు, పేదలకు ఇంకొక రూలు. ఇది ప్రజా స్వామ్య వ్యవస్థకు వ్యతిరేకమైన పద్ధతి.
15(సి), 15(డి), 15(ఈ) ప్రకారం, మురికివాడలు ఒకవేళ వాగులు, గెడ్డలు, చెరువుల దగ్గర ఉంటే, GO 463 ప్రకారం పట్టాలు ఇవ్వబడవు. విశాఖపట్నంలో బడాబాబుల భవనాలు, స్టార్ హోటళ్లు ఎన్నో CRZ ను ఉల్లంఘించి కట్టబడ్డ నిర్మాణాలు. వాటికి పట్టాలు వచ్చాయి. బిల్డింగ్ పేర్మిట్లు వచ్చాయి. అలాగే వాగుల మీద చెరువుల మీద పెద్దలు భవనాలను కట్టారు. అధికారులు లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ భూముల మీద అదే పరిస్థితిలో నివసిస్తున్న పేదలకు ఆర్ధిక స్థోమత లేకపోవడం వలన, ఇటువంటి షరతులవలన పట్టాలు లభించవు. ఇది ఎంత వరకూ న్యాయం?
“ప్రజా ప్రయోజనాలకు కావాలి” అనే నెపంతో,  15(ఎఫ్) షరతు ప్రకారం, మురికివాడలున్న ప్రభుత్వ స్థలాలవిషయంలో పేదలకు పట్టాలు రాని అవకాశాలు ఉన్నాయి. విశాఖలో IT కంపెనీలకు, ప్రైవేట్ వ్యవస్థలకు ప్రభుత్వ భూములను ఇచ్చినప్పుడు, అది  “ప్రజాప్రయోజనం” గా పరిగణించబడుతున్నది. కాని, పేదలకు అటువంటి భూములను ఇవ్వడం ప్రజాప్రయోజంగా ఎందుకు పరిగణించబడదు? ఈ విషయం GO 463లో స్పష్ట పరచాలి.
15(జి) ప్రకారం, మురికివాడ ప్రజలు ఉన్న భూముల  ధరలు  అధికంగా ఉంటే, ప్రభుత్వం వారికి పట్టాలు ఇవ్వరు. మురికి వాడప్రజలు నివసిస్తున్న ప్రభుత్వ భూములు నగరం మధ్యలో ఉండడం వలన, వాటి ధరలు అధికంగానే ఉంటాయి. విశాఖలో రాజధాని పెట్టడం వార్త రాగానే, భూమి ధరలు బాగా పెరిగాయి. ఆ కారణంగా పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను ఇవ్వకపోవడం వారికి అన్యాయం చేసినట్లు అవుతుంది.
ఈ విధంగా GO 463 ద్వారా మీరు అనుకున్న లాభం పేదలకు లభించక పోవచ్చును.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ క్రింది విధంగా  ప్రభుత్వం  ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను.
నగరాలలో, మురికివాడ ప్రజలను, ఎక్కడ ఉన్నవారిని అక్కడే ఉంచాలి. వారిని ఎటువంటి పరిస్థితులలోను నిర్వాసితులుగా చేయకూడదు
వారందరికీ, ఎక్కడ ఉన్నవారికి అక్కడే ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి, నివాస యోగ్యమైన ఇళ్లను కట్టి ఇవ్వాలి
ప్రతీ నగరంలో, పేదలకు ఎక్కడ ఉన్నవారికి అక్కడే ఇళ్లస్థలాల పట్టాలు ఎలాగ ఇవ్వాలి అని అధికారులు ఆలోచించాలి కాని, వారిని ఎలాగో ఒకలాగ “నగర సుందరీకరణ” ముసుగులో నిర్వాసితులుగా చేయాలనే విధానాన్ని వదులుకోవాలి
GO 463లో 15వ పేరాలో ఉన్న షరతులను, మీది మూడు ఆదేశాలకు అనుగుణంగా సడలించాలి. GO 463 పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే GO గా ఉండాలి గాని, వారిని నిర్వాసితులుగా చేసే GO గా ఉండకూడదు
మీది విషయాలను దృష్టిలో పెట్టుకుని తత్క్షణమే ఆదేశాలను ఇవ్వమని కోరుతున్నాను. ఇందులో ఆలస్యమవుతే, నగరాలలో మురికివాడ ప్రజానీకానికి అపారమైన హానికలిగే అవకాశం ఉందని ఇందుమూలంగా తెలియచేస్తున్నాను.
(కేంద్ర ప్రభుత్వం మాజీ కార్యదర్శి ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి రాసిన లేఖ నుంచి)