Home Features జగన్ గారూ, పోలవరం అవినీతే కాదు, ముంపు బాధితుల గురించి మాట్లాడండి

జగన్ గారూ, పోలవరం అవినీతే కాదు, ముంపు బాధితుల గురించి మాట్లాడండి

233
1
(Dr EAS Sarma)

జగన్మోహన్ రెడ్డి గారూ…

మీ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టులో గతంలో జరిగిన అవకతవలగురించి, ప్రాజెక్టు పనులను త్వరితగతిలో పూర్తిచేయడం గురించి, మాత్రమే మాట్లాడుతున్నారు కాని, ప్రాజెక్టు క్రింద ముంపుకు గురి ఆవుతున్న గిరిజన గ్రామాల కష్ట నష్టాల గురించి, వారికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడకపోవడం చాలా బాధకారమైన విషయం.
ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురి అవుతున్న గిరిజనులకు కేంద్ర అటవీ హక్కుల చట్టం వర్తిస్తుంది. ఆచట్టం క్రింద, వారు అటవీ ప్రాంతంలో తరతరాలుగా సాగు చేసిన భూములకు వ్యక్తిగతమైన పట్టాలు, గ్రామప్రజలకు అక్కడి వనరుల విషయంలో ఉమ్మడి పట్టాలు రావలిసిఉంది. కాని ముందు ఉన్న ప్రభుత్వం చూపిన ఉదాసీనత కారణంగా, అటవీ హక్కుల చట్టం అమలు జరగలేదు. ఈ విషయం జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమీషన్ వారు, కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు గుర్తించారు.
అటవీ హక్కుల చట్టం క్రింద, మరియు పీసా చట్టం క్రింద, గిరిజన గ్రామ సభలకు ప్రత్యేక అధికారులు ఉన్నా, ప్రభుత్వం గ్రామసభల సమ్మతి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవడం చట్ట విరుద్ధం. గ్రామ ప్రజలకు వ్యక్తిగత పట్టాలు, ఉమ్మడి పట్టాలు ఇవ్వకుండా వారి భూములను బలాత్కారంగా సేకరించడం, చట్ట విరుద్ధమే కాకుండా, వారికి అపారమైన నష్టం కలిగించడం అయినది.
గిరిజనులకు ఈ విధంగా జరిగిన అన్యాయం గురించి కొన్ని నెలల క్రితం మీకు ఒక విపులమైన లేఖ రాసాను, కాని  మీ ప్రభుత్వం స్పందించలేదు. అంటే మీ ప్రభుత్వానికి కూడా గిరిజనుల విషయంలో ఉదాసీనత ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇప్పుడైనా మీరు జోక్యం చేసుకుని పోలవరం ముంపు ప్రాంతాలలో అటవీ హక్కుల చట్టాన్ని తత్క్షణం అమలు చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి అన్యాయం చేసి, గోదావరి నీళ్లను తీసుకోవడాన్ని ప్రజలు హర్షించరు.
గోదావరి జలాలలో ఉత్తరాంధ్రకు రావలసిన భాగం పూర్తిగా రావడం లేదనే సందేహం ఇక్కడి ప్రజలలో వస్తున్నది. ఈ విషయంలో మీప్రభుత్వం ఒక జ్యూడిషియల్ కమీషన్ ను నియమించి, ఇక్కడి ప్రజల వాదనలను విన్నతరువాత వారికి సంతృప్తి కలిగించే విధంగా పరిష్కారాన్ని కనుక్కోవాలని ఆదేశిస్తే బాగుంటుంది.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన, 7,214 కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన, “బాబూ జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సృజల స్రవంతి” ప్రాజెక్టు 2009 సంవత్సరం జనవరి 2వ తారీఖున ఆమోదింపబడినది. ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా వరకు 8 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కలిగిస్తుంది. ప్రాజెక్టుకు 2009 లోనే శంకుస్థాపన జరిగినా, పది సంవత్సరాల తరువాత కూడా ఆ ప్రాజెక్టు ముందుకు పోలేదు. ఇందుకు కారణం అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఉత్తరాంధ్ర పురోగతిమీద ఉదాసీనత.
ఈ ప్రాజెక్టు గురించి మీరు చేసిన ప్రకటనను చూసాను. ప్రాజెక్టు ఖర్చు 15,500 కోట్ల రూపాయలకు పెరిగినది. మీ ప్రభుత్వం ప్రాజెక్టును ఆరు ప్యాకేజిలలో త్వరలో ప్రారంభిస్తారని ప్రకటించడం మంచి విషయం. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే, ఈ ప్రోజెక్టుకూడా ప్రజలకు లాభం కలిగించడం కన్నా, కాంట్రాక్టర్లకు లాభాలు కలిగించే ప్రాజెక్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అప్పుడే, “ఉత్తరాంధ్ర సృజల స్రవంతి” ప్రాజెక్టు ఆయకట్టులో భూములను సాగుచేస్తున్న చిన్నకారు రైతులను,  ప్రలోభాలతో మభ్యపెట్టి, కొంతమంది పెద్దలు వారి భూములను ఆక్రమిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో డీ-పట్టా, ఇనాము, సీలింగ్ సర్ప్లస్, భూదాన్ వంటి భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూములను ఉపాధికోసం సాగుచేస్తున్న చిన్నకారు వ్యవసాయదారుల పేర్లు గ్రామ రికార్డులలో చూపకపోవడం వలన, వారికి నష్టం కలగవచ్చు. మీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ల్యాండ్ పూలింగ్” పథకం ముసుగులో, కొంతమంది ఆక్రమణదారులు, అటువంటి చిన్న వ్యవసాయదారులను వారి వారి భూములనుంచి నిర్వాసితులను చేస్తున్నారని, ఎన్నో ఉదాహరణలతో  నేను కొన్ని రోజులక్రితం మూడు లేఖలు  రాయడం జరిగినది. ఇంత ఖర్చుతో కూడిన ప్రాజెక్టువల్ల, కాంట్రాక్టర్లకు, మోతుబరి అబ్సెంటీ రైతులకు, ఆక్రమణదారులకు లాభం కలిగితే ప్రజలు హర్షించరు. సాగునీటి లాభం చిన్నకారు రైతులకు, సాధ్యమైనంత వరకు మెట్ట ప్రాంతాలలో ఉన్న వారికి లభిస్తే, ప్రజా నిధులను సద్వినియోగం చేసినట్లు అవుతుంది.
ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ప్రస్తావించినప్పుడు, మరో రెండు ప్రోజెక్టులగురించి మీకు విజ్ఞప్తి చేయవలసి ఉంది.
వంశధార మీద నేరడి ప్రాజెక్టు నిర్మిస్తే, శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. ఇందుకు 550 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఇందుకు కేవలం 106 ఎకరాల భూమిని ఒరడిశాలో సేకరించవలసి ఉంది. ఈ విషయంలో వంశధార ట్రిబ్యునల్ వారు కొన్ని నెలలముందే అవార్డు ఇచ్చారు. ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేస్తే, ఇంతవరకు ఆలస్యమైన ఈ ప్రాజెక్టు ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఖర్చు కూడా పెరుగుతుంది.
అలాగే విజయనగరం జిల్లాలో జంఝావతి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే 40 కోట్ల రూపాయల ఖర్చుతో  40,000 ఎకరాలభూములకు సాగునీటి సౌకర్యం లభించగలదు. ఇందుకుగాను ఒడిశాలో 1175 ఎకరాల భూమిని సేకరించవలసి వస్తుంది.
ఈ రెండు ప్రోజెక్టుల విషయంలో, శీఘ్రంగా, మీరు  ఒడిశా ముఖ్యమంత్రిగారిని కలిసి, ఉత్తరాంధ్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎవరికీ నష్టం రాకుండా పరిష్కారాలను  కనుక్కోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
విజినగరం జిల్లాలోనే, ముందున్న ప్రభుత్వాలు, “వనకబాడి గెడ్డ’ ప్రాజెక్టు ఆయకట్టులో, వేలాది  ఎకరాల భూమిని   ఆల్ఫా ఇంఫ్రొ ప్రాప్ అనే ఒక ప్రైవేటు కంపెనీకి తక్కువ ధరకు ఇచ్చారు. నష్టపోయినవారు దళితులు, చిన్నకారు రైతులు. పది సంవత్సరాలు అయినా, ఆభూమి మీద ఎటువంటి ప్రాజెక్టు రాలేదు. బహుశా, కంపెనీవారు ఆ భూమిని తనఖా పెట్టి బ్యాంకులవద్దనుంచి పెద్దఎత్తున రుణాలు తీసుకొని దుర్వినియోగం చేసిఉండవచ్చు. మీ ప్రభుత్వం ఆ భూమిని వెనక్కు తీసుకుని చిన్నకారు రైతులకు తిరిగి ఇస్తే వారికి న్యాయం చేసినవారు అవుతారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాలలో, ముఖ్యంగా సాంప్రదాయక మత్స్యకారులు, చిన్నకారు వ్యవసాయదారులు, డైరీలకు పాలు సప్ప్లై చేసేవారు, మురికివాడలలో నివసించి నగరాలను నడిపిస్తున్న ప్రజలు, ఆదివాసీలు, భాగస్వాములు అయినప్పుడే, అది నిజమైన అభివృద్ధిగా పరిగణించబడుతుంది. వారిని ఏ పరిస్థితులలోను నిర్వాసితులుగా చేయకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ప్రభుత్వం అభివృద్ధి పధకాలను చేపడితే, సామాన్య ప్రజానీకానికి మంచి చేసినది అవుతుంది.
ప్రజాస్వామ్య విధానాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం వారి సమ్మతితో ముడుకుపోతే, మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచిన వారు అవుతారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ ప్రాంతాలలో, పీసా, అటవీ హక్కుల చట్టాలను, గిరిజనుల భూములను ఇతరుల స్వాధీనం లోనికి రాకుండా నిషేధించే చట్టాన్ని (1/70 చట్టం) చిత్త శుద్ధి తో అమలు చేసినప్పుడే, అక్కడి గిరిజనులకు ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతుంది. 
మీరు ఈ సలహాలను పరిశీలించి ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తారని ఆశిస్తున్నాను.
(Dr EAS Sarma ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖ నుంచి…)