Home Features తెలుగు మాండలికాల నిఘంటువులు రావాలి

తెలుగు మాండలికాల నిఘంటువులు రావాలి

258
0

(పిళ్లా కుమారస్వామి)

ప్రపంచంలోని ఏ జాతికైనా ఒక భాష ఉంటుంది.దానికో యాస ఉంటుంది. అది ఆ జాతి సంస్కృతి సంప్రదాయాలను నాగరికతను ప్రతి బింబిస్తుంది. ప్రతి జాతి తన జాతి అస్తిత్వాన్ని,ముద్ర చెప్పుకోవాలన్న తపన ఉంటుంది. కానీ ప్రపంచీకరణ లో చాలా భాషలు అంతరించి పోతున్నాయి.

ఃఈ నేపథ్యంలో లో ప్రతి జాతికి దాన్ని కాపాడుకోవాలన్న తపన ఉంటుంది.
తెలుగు భాషకు ఇప్పటి రూపం రావడానికి ముందు ఎన్నో పదాలు ప్రజల నోళ్ళలో నాని అవి అందరికీ ఆమోద యోగ్యమైన తర్వాత ఒక ప్రామాణిక రూపం లోకి వచ్చాయి. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు భాషను ఇటలీ శాస్త్రవేత్త నికోలా డి కోంటె అన్నాడు ఆయన రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం కడప జిల్లాలో క్రీస్తుశకం 1420_28లో పర్యటించాడు. తెలుగు అజంత భాష .ప్రతి తెలుగు పదం అచ్చులతో అంతం కావడాన్ని గమనించాడు ఇటలీ భాష కూడా అజంత భాష అందువల్ల తెలుగును తూర్పుదేశపు ఇటలీ భాష గా వర్ణించాడు.

ఇలాంటి తెలుగు భాషకు సొగసుతనమంతా జానపదులు మాట్లాడే యాసలో ఉంది.యాసతో పలికే భాష సామెతల్లో నిలిచి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాడే పదాలలో, పనిముట్లలో, సంప్రదాయాల్లో ఉంటుంది.ఆయా సందర్భాలను గుర్తించి ఆ పదాల వాడకం వెనుక ఉన్న ఆచారవ్యవహారాలను కనుక్కొని తెలియజేస్తే పాఠకుడికి ఆ పదం విశిష్టత అర్థమవుతుంది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఒక వస్తువుకు సంప్రదాయాన్ని అనుసరించి రకరకాల పేర్లు జిల్లాలను బట్టి వేరు వేరుగా ఉంటాయి.వీటినే ప్రాంతీయ మాండలికం అంటారు.ఈ మాండలికాల పై పక్క రాష్ట్రాల ప్రభావం కూడా ఉంటుంది.ఈ మాండలికమే సీమ అస్తిత్వాన్ని నిలుపుతోంది.

రాయలసీమ అస్తిత్వం భాష తోనే కాక సంస్కృతి తో అనుసంధానమై ఉంది. సీమలో సంస్కృతి జాతరలు నిర్వహించడం. ముఖ్యంగా గంగమ్మ జాతర.ఈ గంగమ్మ జాతర సీమలోని నాలుగు జిల్లాల్లో జరుగుతూ ఉంటుంది. తెలంగాణలో జరిగే బతుకమ్మ పండగ లాంటిది ఈ జాతర. ఆహార ఆచార వ్యవహారాల్లో ప్రజల నోళ్ళలో వాడే పదాలు మాండలికాలయ్యాయి.
ప్రజల్లో ఉన్న వాడుకని బట్టి యాస కలిగిన పదాలను 27 రకాలుగా అనంతపురం జిల్లా కు చెందిన రాయపాటి శివయ్య విభజించాడు. వాటి నానార్ధాలు, పర్యాయపదాలు దాని వెనుక ఉన్న వ్యవహారాలు కూడా సేకరించి రాశాడు.

ఇదే విధంగా కడపకు చెందిన శివారెడ్డి కూడా కడప జిల్లా మాండలికాల గురించి ఒక గ్రంథాన్ని వెలువరించారు.ఒక పదాన్ని విరివిగా వాడుతున్నారు అంటే అదే ఆ ప్రాంత యాసగా గుర్తించవచ్చు. గోదావరి జిల్లాల్లో ఆయ్ అనే పదం అందరూ వాడుతుంటారు. ప్రతి పదానికి దీర్ఘం కూడా తీస్తారు. ఇది ఆ ప్రాంత వ్యవహారిక మాండలిక భాష గా మనం గమనించవచ్చు.

మాండలికంలో ఎంత బాగా మాట్లాడినా అందరికీ అర్థం కాదు. ఎందుకంటే కాలగమనంలో భాష, యాస మారిపోతూఉంటుంది. ముఖ్యంగా ఆంగ్ల భాష ప్రభావం వల్ల తెలుగు భాషలో పలు మార్పులు వచ్చాయి. పాళీ భాషలో తెలుగు పదాలు ఎక్కువగా ఉండేవంటారు. మెల్లగా పాళీ భాష అంతరించిపోయినా తెలుగు భాష మాత్రం నిలబడింది. ద్రవిడ భాషా కుటుంబం నుంచి విడివడి నిలదొక్కుకుంది. రాయలసీమలోని కడప జిల్లాలో కమలాపురం మండలంలో లభించిన కలమళ్ళ శాసనం ( క్రీ.శ.575),ఎర్రగుడి పాడు శాసనం(క్రీ.శ.600) మొదలైన శాసనాల ద్వారా తెలుగు భాషకు రెండు వేల ఏళ్ల చరిత్ర ఉందని ప్రపంచానికి తెలిసింది. రాయలసీమే తెలుగు భాషకు ఆయువు పట్టుగా నిలిచింది.
భాష నిరంతర మార్పులకు గురవుతూ వచ్చింది. నన్నయ కాలంలో సంస్కృత పదాలకు చివర డు,ము,వు,లు చేర్చి తెలుగు పదాలు గా మార్చారు. అందువల్ల తెలుగు ఒక రకంగా సంస్కృతీకరింపబడింది. చాలా కాలం తెలుగు భాష ఇలాగే కొనసాగింది.అయితే గురజాడ ,గిడుగు భాషోద్యమం ఫలితంగా తెలుగు భాష నేటి వాడుక భాష రూపంలోకి వచ్చింది. అయినప్పటికీ నేటికీ సీమవాసులు తమ రచనలను ప్రామాణిక భాషలోనే రాస్తున్నారు. పులికంటి, సడ్లపల్లి, యామిని లాంటివారు మాండలికంలో రచనలు చేయడం వల్ల కూడా మాండలిక రచనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.వాటికి అర్థాలు కావాలంటే ఒక నిఘంటువు కావాలి.

స్త్రీ లు బహిష్టు కావడాన్ని బయట చేరడం,ముట్టు లాంటి పదాలు నేడు పల్లెల్లో ఇప్పటికీ వాడుతున్నారు.ఈ పదాలు మెల్లగా డేట్ రావడం గా మారిపోతున్నాయి.ఈపదాల అర్థాలు,మూఢ విశ్వాసాలగురించి రచయిత వివరణ బాగుంది.దీనికి సంబంధించి అనేక మూఢ విశ్వాసాలు నేటికీ ఉన్నాయి.ఇటీవల గుజరాత్లో వంటశాలలో కి బహిస్టైన అమ్మాయిలు ప్రవేశించారని వంట అపవిత్రమైందని వారందరినీ నగ్నంగా నిలబెట్టి ఎవరు బహిస్టయ్యారో పరిశీలించారని పత్రికల్లో వచ్చింది. ఇంకా ఇలాంటి మూఢ విశ్వాసాలు అనంతపురం జిల్లాలోని మడకశిర ప్రాంతంలో ఉన్నాయి. దీనిని ప్రముఖ రచయిత శాంతినారాయణ ‘ముట్టుగుడిసెలు’కథలో కూడా ప్రస్తావించారు.ఇంకా కొన్ని ఛాందస వర్గాల ఇళ్ళలో అమ్మాయి లను బహిష్టు సమయంలో అంటు పేరుతో విడిగా ఉంచడం చాలా శోచనీయం.
‘పొద్దున్నే లేచి నాడు ఖాదరయ్యా, సద్ది మొగం కడిగి నాడు ఖాదరయ్యా’ అనే ప్రసిద్ధ జానపద పాట ఒకటుంది. ముందురోజు అన్నాన్ని నీళ్ళలోనో,మజ్జిగలోనో నానబెట్టి మరుసటి రోజు పొద్దున్నే తింటారు. రాయలసీమలో దీన్ని సద్ది అంటారు. వేసవి కాలంలో ఇది సల్ల(చలువ) చేస్తుందని భావిస్తారు. పెద్దల మాట సద్ది మూట అని ఒకసామెత కూడా ఉంది.

ఆనకాగు,గోరుబిళ్ళ, ఉక్కిరి (తీయని ముద్ద), దొగ్గడ( రేగు పండ్ల పచ్చడి) ,తొణక్కట్టి ,మక్కిరి (వెదురు అల్లిక )ఇలా చాలా పదాలు వ్యవసాయ సంబంధిత పదాలు కదిరి ప్రాంతం లో ఎలా వాడుకలో ఉన్నాయో వివరించారు రాయపాటి తన అనంత రాసి గ్రంథంలో.

అచ్చ తెలుగు పదాలు ప్రజా వ్యవహారంలో ఉండేవి.అవి కాస్త ఇంగ్లీషు భాషా ప్రయోగంలో వాటి వాడకం పూర్తిగా కనుమరుగైంది. కమాను ను ఇప్పుడు ఆర్చ్ అంటున్నారు.చౌరస్తా ను సర్కిల్ అంటున్నారు. లోటాను ఇప్పుడు గ్లాసు అంటున్నారు. ఉద్దరగా వస్తుంటే అనే మాటను అన్నీ ఫ్రీగా వస్తుంటే అని చెప్తున్నారు.పాలిమాలికి అనేదాని బదులు రెస్ట్ లేక అని అంటున్నారు. బిరీన, బిరిక్కిన బదులు అంతా స్పీడు అనంటున్నారు.
ప్రపంచీకరణ ప్రారంభమయ్యాక కంప్యూటర్లు నిత్యజీవితంలో చొచ్చుకొని వచ్చాక అనేక వృత్తులు ధ్వంసమయ్యాయి. వృత్తులతో పాటు వాటి సంబంధ పనిముట్లు,పనులు వాటి పదాలు మెల్లగా వాడుకలోంచి పోయాయి. దాంతో ఆయా మాండలికాలు నేడు చాలా మందికి అర్థంకానివి గా మారిపోయాయి. అయితే వాటి అర్థాన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా ఇలాంటి మాండలిక నిఘంటువులు అవసరం.కర్నూలు కడప చిత్తూరు మాండలికాల నిఘంటువులు కూడా తయారుచేసి వాటన్నిటినీ కలిపి సీమ మాండలికాలు గా ఒక గ్రంథాన్ని వెలువరిస్తే అది భాషావేత్తలకు, సాహిత్యాభిలాష గలవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Pilla Kumaraswamy

(పిళ్లా కుమారస్వామి,రచయిత, విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here