మళ్లీ డిఎస్ రాజకీయాల్లో యాక్టివ్ కావడం సాధ్యమేనా?

ఈ ఫోటోలో ఉన్న నాయకుడు తెలంగాణలో ఒకప్పుడు ప్రముఖ నాయకుడు.పేరు ధర్మపురి శ్రీనివాస్.ఆయన రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన గెలుపు గుర్రం అని  పేరు తెచ్చుకున్నారు.  పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు. మంత్రిగా పని చేశారు. అయితే, ఇవి ఎక్కువ కాలం మిగల్లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం  రావడంతో  కాంగ్రెస్ కు అనుకోని కష్టలొచ్చాయి.  ఆయనకు నష్టాలొచ్చాయి.  రాజకీయనాయకులందరిలాగానే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతిన్నాక, టిఆర్ ఎస్ లోకి ఫిరాయించారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇక జీవితం సాఫీగా సాగుతుందునుకున్నారు.లే.
సాధారణంగా ఆకుకూరలు, పప్పుదినుసులు, గుండ్లు, చేపలు మాంసం,పళ్లు తింటే ఇమ్యూనిటి పెరుగుతుందంటారు. ఇంత శ్రమ లేకుండా   వీటన్నింటిని కలిపి ఆరోగ్యాన్ని,ఇమ్యూనిటీని  అందించే ఒకే గుళిక ఇంతవరకు వైద్యం శాస్త్రంలో తయారు కాలే. రాజకీయాల్లో తయారయింది. ఆగుళికయే పవర్. పవర్ వస్తే ప్రకాశిస్తారు. హోదా పెరుగుతుంది.ఎ టు జడ్ విటమిన్లన్నీ బాగా అందుతాయి. మనిషి ముఖంలో కళ వస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.దీనితో ఆనందం పెరుగుతుంది.ఉల్లాసం జరాజరా పాకుతుంది. దీనితో ఆయుష్షు పెరుగుతుంది.
పదవి పోతే, మళ్లీ ప్రకాశం రావాలంటే చాలా కష్టం. ముఖం నల్లబడుతుంది. కోమార్బిడిటీస్ పుంజుకుంటాయి. మళ్లీ ఆకులు,చేపలు, మాంసం, గుడ్లు, పండ్లు,డ్రై ఫ్రూట్స్ తినాలి. షుగర్ బిపి  రెగ్యులర్ గా చెక్ చేయించుకోవాలి.
అయితే, పదవి వచ్చాక ప్రకాశం రావడానికి బదులు డి.శ్రీనివాస్ కు అన్నీ కష్టాలే వచ్చాయి. ఆయన పదవిని అనుభవిస్తున్నట్లనిపించలేదు. ఎందుకంటే రాజ్యసభలో ఒక్క ప్రశ్న వేసింది లేదు. ఒక ఉపన్యాసమూ లేదు. ఒక ప్రెస్ కాన్ఫరన్స్ లేదు. ఒక కామెంట్ లేదు.  జిల్లాలో ఒక  సభ లేదు. ఒక కార్యక్రమమూ లేదు.మనిషే పత్తాలేడు. రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దానికి తోడు కొడుకు బిజెపి, తండ్రి టిఆర్ ఎస్ అని చెడ్డపేరు.
ఆయన కనిపించక ఆయన గొంతు వినిపించక సరిగ్గా రెండేళ్లయింది. 2018 జూన్ ,జూలై నెలలో ఆయన పేరు రోజూ ప్రతికల్లో వచ్చింది. ఆయన టిఆర్ఎస్ కు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని, మళ్లీ ‘పాత ఇల్లు’ కాంగ్రెస్ లోకి వస్తారని వార్తలొచ్చాయి. అని ఆయన అనుకుంటున్నట్లు రిపోర్టర్లు వార్తలు రాశారు. ఆయన గత వైభవం, వర్తమాన కష్టాలు, భవిష్యత్తు అంధకారం గురించి రాజకీయ పండితులు రోజూ పొద్దునే విశ్లేషిస్తూ వచ్చారు. ఈ జ్యోతీషాలేవి నిజం కాలే. ఆయన ఎక్కడున్నారో ఇంకా తెలియడంలేదు.

ఆయన విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానం -2020 మీద వ్యాఖ్యానించేందుకేమయినా అజ్ఞాతం నుంచి బయటకొస్తారా. లేక ఇసోలేషన్ లోనే ఉండిపోతారా?

ఆ రెండునెలల్లో ఆయన పేరు రెగ్యులర్ గా వినిపించేందుకు  టిఆర్ ఎస్ లో లేచిన  తిరుగుబాటే  కారణం.. ఆయన ఇలాంటి తిరుగుబాట్లకు బయపడే బాపతు కాదు. చాలా తిరుగుబాట్లను ఎదిరించినవాడు.నిలదొక్కుకున్నవాడు.  అయితే, నిజామాబాద్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది స్వయాన కల్వకుంట్ల కవిత. నిజామా బాద్ ఎంపి. ఆమె ఉత్త  నిజాంబాద్ ఎంపి కాదు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు. అందుకే తిరుగుబాటు విజయవంతమయింది.
డిఎస్ పార్టీని పట్టించుకోవడంలేదని, పార్టీలో హోదాని, రాజ్యసభ  పదవిని బిజెపి లో చేరిన కొడుకు డి. అర్వింద్ ప్రయోజనాలు ప్రమోట్ చేసేందుకు వాడుతున్నారని వారు గోల చేశారు. ముఖ్యమంత్రికి ఒక ఫిర్యాదు లేఖ రాసి దానిని ఏకంగా ప్రెస్ వాళ్లకిచ్చి నానా యాగీ చేశారు.
కెసిఆర్ మనసులో ఏముందో గాని, కాంగ్రెస్ నాయకుడయిన డిఎస్ ను టిఆర్ ఎస్ లోకి (2015జూలై 8) తీసుకున్నారు, ఆయనకు క్యాటినెట్ ర్యాంకిచ్చి ప్రభుత్వ సలహాదారు చేశారు. ఆ పైన రాజ్యసభ టికెట్టూ గౌరవించారు. బహుశా, ఇక గమ్మున ఉండమని చెప్పడమే కావచ్చిదంతా.
 ఒక పవర్ సెంటర్  ఉన్న జిల్లాలో మరొక పవర్ సెంటర్ వస్తే … రాజకీయాలు భగ్గున మండుతాయి.  ఇది రాజకీయాల్లో ‘న్యూటన్స్ లా’ వంటిది. అసలే డిఎస్ . ఎంతైనా రాజకీయాల్లో జుట్టు నెరిసిన వాడు. దానికి తోడు కొడుకు బిజెపి. ఈ కాంబినేషన్ కవితకు నచ్చలేదు.అంతే పితూరి మొదలయింది. “నిజామాబాద్ జిల్లా 2001 నుంచి టిఆర్ ఎస్ కు కోట, పేట. అపుడు 9 అసెంబ్లీ స్థానాలు పార్టీవే. ఇద్దరు ఎంపిలు పార్టీ వారే. మేయర్ , జడ్ పి ఛెయిర్మన్ మన వాళ్లే. ఇలాంటి జిల్లాలో డిఎస్ కరప్ట్ ప్రాక్టీసెస్ కు పూనుకుంటున్నారు. పబ్లిక్ లో పార్టీని వీక్ చేయాలనుకుంటున్నారు. కొడుకు కోసం బిజెపిని బలపరుస్తున్నారు,’ అని వారు ముఖ్యమంత్రి రాసిన లేఖలో చాలా సీరియస్ గా ఆగ్రహించారు.
అంతే, డిఎస్ పెద్ద వార్తయిపోయారు.ఇక ఆయన ‘ఫసక్‘   అనుకున్నారు. కెసిఆర్ ఏ చర్య తీసుకుంటారు, డిఎస్ ఎంచేస్తారు, కెసిఆర్ డిఎస్ కు అప్పాయంట్ మెంట్ ఇస్తారా, అసలు అప్పాయంట్ మెంట్ డిఎస్ అడుతారా, డిఎస్ ముందున్న కర్తవ్యాలేమిటి, ఆత్మాభిమానం ఉన్న డిఎస్ ఇంక టిఆర్ ఎస్ ఉంటారా? అసలు రాజ్యసభకి టిఆర్ ఎస్ సభ్యుడిగా వెళ్తారా, డిఎస్ దారెటు, మళ్లీ కాంగ్రెస్ లోకి డిఎస్, కాషాయం కండువా కప్పుకోనున్న డిఎస్ … ఇలా వెయ్యిన్నొక్క కంతల్లోంచి డిఎస్ ను  తొంగిచూసి పండితులు విశ్లేషించారు. ఏమీ జరగలేదు. ఇది జరిగి రెండేళ్లయింది.
గతంలో ఆయన విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న ‘నూతన విద్యావిధానం -2020’ మీద వ్యాఖ్యానించేందుకేమయినా అజ్ఞాతం నుంచి బయటకొస్తారా?. లేక ఐసోలేషన్  లోనే ఉండిపోతారా? ఏమీ తెలియడం లేదు.
 పవర్  తీసేశాక పదవి ఉంచుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఒకరిద్దరు కాంగ్రెసోళ్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఆయనకు సన్నిహితులయిన ఒకరిద్దరిని అడిగితే, ‘అన్న అవసరమయినపుడు ప్రకటన చేస్తారు,’ అని మాత్రం సమాధానమిచ్చారు. అదీ సంగతి!

Like this story? Share it with a friend?