Home Features ఢిల్లీ రైతాంగ పోరాటం నీడలో ‘రిపబ్లిక్ డే’

ఢిల్లీ రైతాంగ పోరాటం నీడలో ‘రిపబ్లిక్ డే’

149
0
Tractor Rally Credits: @IYC twitter

(ఇఫ్టూ ప్రసాద్-పిపి)

ఏడు దశాబ్దాలకు పైబడ్డ భారతదేశ రిపబ్లిక్ డే చరిత్ర ని మొట్టమొదటి సారి భారత దేశ సమరశీల రైతాంగం నేడు తిరగ రాస్తోన్నది. ఇలా కొత్త చరిత్ర లిఖిస్తోన్న భారత దేశ సమరశీల రైతాంగానికి  పిడికిళ్ళెత్తి జై కొడదాం.

రెండు శతాబ్దాల పాటు సాగిన వలసవాద వ్యతిరేక భారత స్వాతంత్య్రో ద్యమం ఒక గొప్ప రాజకీయ పోరాట వారసత్వాన్ని దేశ ప్రజలకు అందించింది. అది భారతదేశ నూతన పాలకుల ఇష్టాఇష్టాల తో సంబంధం లేకుండా, నూతన భారత రాజ్యాంగం లో స్ఫూరించింది.

1.సామ్రాజ్యవాద వ్యతిరేక దేశభక్తియుత జాతీయవాదం  2.కేంద్రీకృత రాజ్య విధాన వ్యతిరేక సమాఖ్యవాదం (ఫెడరలిజం) 3. ఫ్యూడల్ వ్యతిరేక ప్రజాతంత్ర విధానం (డేమోక్రసీ) 4. మతతత్వ వ్యతిరేక లౌకికవాదం (సెక్యులరిజం) అనే అంశాల స్పూర్తితో భారత రాజ్యాంగం రూపొందింది.

దానికి మధ్యలో ఐదవదిగా సమసమాజ (సోషలిస్టు) రంగు కూడా అద్దుకుంది.

గత ఏడు దశాబ్దాలుగా నడిచిన చరిత్ర సారం ఏమంటే, ఈ నాలుగైదు విధానాల్ని ఆచరణలో నిస్సారంగా మార్చడమే. ఫలితంగా భారత రిపబ్లిక్ రాజ్యాంగ వ్యవస్థ ఆచరణలో క్రమంగా  అస్థిపంజరంగా మార్చబడుతూ వచ్చింది. అదే ఇప్పటి వరకు సాగిన చరిత్ర!

ఐతే ఇప్పుడు కొత్త చరిత్ర మొదలైనది. అదే ఆ మిగిలిన అస్థిపంజరాన్ని సైతం కూకటి వేళ్ళతో పెకలించే పని! వాటికి చిరునామాగా మిగిలి ఉన్న అవశేషాలపై కూడా దాడి!  అంతే కాక, భారత రిపబ్లిక్ కి ఒక ప్రతీకగా మిగిలివున్న నేటి పార్లమెంట్ భవనాన్ని కూడా సహించలేని ఫాసిస్టు రాజకీయ శక్తులు నేడు భారత దేశాన్ని ఫాసిస్టు రాజనీతితో పాలిస్తున్నాయి.

ఈ తరహా ఫాసిస్టు రాజకీయ విషపు శక్తులు విచ్చు కత్తులతో విరుచుకు పడే పాడు కాలమిది. నాటి రిపబ్లిక్ కి 71ఏళ్ళు గతించిన సందర్భ రిపబ్లిక్ డే నేడు తటష్టించింది. ఈ పాడు కాలంలో భారత రైతాంగం రిపబ్లిక్ డే చరిత్రకి కొత్త రూపం ఇస్తోందే తాజా రైతాంగ ట్రాక్టర్ పెరేడ్!

ఈ రోజుకు రిపబ్లిక్ డే కి 71 ఏళ్ళు నిండింది. నేటికీ రైతాంగ ముట్టడి కి 62 రోజులు నిండింది. ఈ తాజా ముట్టడిలో మృతులు 150 దాటింది. గడ్డకట్టే చలిలో మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతాంగ పోరాటం కొత్త మలుపు తిరుగుతోంది. కొత్త చరిత్ర లిఖిస్తోంది. కొత్త రాజకీయ కోణాల్ని కూడా రైతాంగం ఆవిష్కరిస్తోంది.

ఫాసిజం నేడు ఒక విష సర్పంగా పడగ విప్పి బుసలు కొట్టే వేళ;  ఫెడరల్ వ్యవస్థ ద్వారా ఉనికి లోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలు ఆ ఫాసిస్టు విషసర్పపు పడగ నీడ కోసం వెంపర్లాడే కాలంలో; రిపబ్లిక్ కి నేడు కొత్త భాష్యం చెప్పాల్సిన చారిత్రక, రాజకీయ ఆవశ్యకత ఏర్పదింది. ఈ నిర్దిష్ట కాలం లో భారత సమరశీల రైతాంగం ఈరోజు ఢిల్లీలో లక్షల ట్రాక్టర్లతో కవాతు చేయబోతోంది. రిపబ్లిక్ కి ఆఖరి ఆనవాలుగా మిగిలిన పార్లమెంట్ భవనాన్ని కూడా కూల్చివేస్తోన్న నేటి కాలంలో ప్రభుత్వం నిర్వహించే రిపబ్లిక్ వేడుకకి అర్ధం లేదు. ప్రత్యామ్నాయ రిపబ్లిక్ రాజకీయ స్ఫూర్తి ఉనికిలోకి కొత్తగా రావాల్సిన కాలమిది.  ఈ నేపథ్యంలో కొత్త చరిత్ర ఆవశ్యకతకి నేటి ఢిల్లీ ట్రాక్టర్ పెరేడ్ ఒక గొప్ప ప్రతీకగా వర్ధిల్లుతుంది. మరికొన్ని గంటల్లో జై కిసాన్ ర్యాలీ ఢిల్లీ మహానగరంలో   జరగ బోతోంది. రిపబ్లిక్ డే అంటే సైనిక వందనం చేసేది మాత్రమే కాదనీ, అది కాయకష్టం చేసే రైతాంగపు పోరాట పెరేడ్ కి  ఆలంబన గా నిలుస్తుందని కూడా ఇది చరిత్రలో నమోదు కానుంది. ఈ రిపబ్లిక్ రోజు జై జవాన్ మాత్రమే కాదనీ, జై కిసాన్ రోజు కూడానని కొత్త చరిత్ర లిఖిస్తోన్నది. ఈరోజు భారత దేశ చరిత్రలో రైతు మృత వీరుల రక్త సిరాతో లిఖిస్తోన్న ఈ జై కిసాన్ ట్రాక్టర్ పెరేడ్ కి నిండు మనస్సుతో పిడికిళ్ళెత్తి వందనాలు చెబుదాం.

(వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ట్రెండింగ్ తెలుగు న్యూస్ వాటితో ఏకీభవించినట్లు కాదు.)

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here