Home Features రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి, చంద్రబాబు సాక్ష్యం

రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి, చంద్రబాబు సాక్ష్యం

276
0

(యనమల నాగిరెడ్డి)

“రాజకీయాలలో  ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి.” ఇందుకు తాజా ఉదాహరణ ఎపి ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు.  40 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ అనుభవం ఉందని, తాను మాత్రమే రాజకీయ ఎత్తుగడలు వేయగలనని, రాజకీయాలలో తనను మించిన మేధావి లేడని విర్రవీగి తప్పుడు ఎత్తుగడలు వేసిన చంద్రబాబు 2109లో రాజకీయంగా తన గోయి తానే తవ్వుకున్నాడని చెప్పక తప్పదు. 2014 ఎన్నికలలో బీజేపీ, పవన్ కళ్యాణ్ లతో జతకట్టడంతో పాటు, జగన్ అనుభవ రాహిత్యం అండగా ఆయన  అతి తక్కువ ఓట్ల తేడాతో అధికారపీఠం కైవసం చేసుకున్నారు. బీజేపీ తో జత కట్టిన ఆయన కేంద్రంలోను, రాష్ట్రం లోను సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు.

శాసనసభ నిర్వహణలో విఫలం

2014 ఎన్నికలలో 102 స్థానాలు గెలిచినా ఆయన సరిపెట్టుకోక ప్రతిపక్ష వైసిపి నుండి 23 ఎం.ఎల్.ఏ లను తన పార్టీలోకి తెచ్చుకొని మంత్రి పదవులు కట్ట పెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా “గ్రామ కక్షలలో కరుడు కట్టిన” కోడెలను స్పీకర్ స్థానంలో పెట్టి (ఆ స్తానం మర్యాద తీయడంతో పాటు) ప్రతిపక్షం నోరు నొక్కారు. ప్రతి పక్షానికి ఇవ్వవలసిన కనీస గౌరవం ఇవ్వక పోగా ప్రతి అంశంలోనూ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారు. ప్రతిపక్షం లేని శాసనసభలో తనకిష్టమైన ప్రసంగాలు చేయడం ఇష్టమైనపుడు బీజేపీని, కేంద్రాన్ని బట్రాజు వలే పొగడటం, లేకపోతె తెగడటం లాంటి అనేక జిమ్మిక్కులు చేశారు. ఇకపోతే రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను తన నమ్మిన బంట్లతో నింపి ఇష్టారాజ్యంగా పాలన సాగించారు. తన కిష్టమైన వారికి ప్రమోషన్లు, లేని వారికి శంకరగిరి మాన్యాలు అన్నదే విధానం గా ఐదేళ్ల కాలం రాజ్యము  సాగించారు. ఏతావాతా ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్నారు.

అలాగే ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న బాబు గారి స్వకులస్తులు గత ఐదేళ్లుగా ప్రభుత్వ శాఖలలోను, పల్లెలలోను, పనుల విషయంలోనూ  చేసిన హంగామా, అక్రమాలు, ఇతర కులస్తులను బ్రష్టు పట్టించడానికి చేసిన కుటిల యత్నాలు లాంటి అంశాలు బాబు గారి రాజకీయ పతనానికి శ్రీకారం చుట్టాయి.

కోడికత్తి  టీడీపీ కొంప ముంచింది

వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి పై విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి దాడిపై ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిజిపి ఠాకూర్, బాబు గారి కోటరీ వ్యవహరించిన తీరు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు టీడీపీ అధినేత చేసిన రాజకీయ తప్పిదంగా చెప్పకతప్పదు. ఆ ఘటనపై చంద్రబాబు విజ్ఞత కలిగిన నేతగా జగన్ కోరిన విచారణకు ఆదేశించి ఉంటె దాని ప్రభావం జనం పై తక్కువ ఉండేది కాదు. విచారణకు ఆదేశించక పోగా హై కోర్టు కు వెళ్లి వ్యతిరేకించడం, ఎన్ ఐ ఏ విచారణను అధిక్షేపించడం లాంటి చర్య లు ప్రజలలో టీడీపీ పట్ల వ్యతిరేకత పెంచాయి.

ఇలాంటి అనేక ప్రతిపక్ష వ్యతిరేక చర్యలతో పాటు చంద్రబాబు అంతా తనకే తెలుసు అన్న అహంకారంతో రాజకీయ తప్పటడుగులు వేశారు. అందులో మొదటిది బీజేపీ తో తెంచుకోవడం, బీజేపీకి వైసీపీకి అంట కట్టడం, టీఆరెస్ ను వైసీపీతో జత చేసి కేసీఆర్ ను తూలనాడటం చేశారు. అలాగే తెలంగాణా లో కాంగ్రెస్ తో కలిసి చక్రం తిప్పి, కేసీఆర్ ను దెబ్బ కొట్టడంతో పాటు కేంద్రంలో మరోసారి పెత్తనం సాగించాలని  ఆశించి కాంగ్రెసును ముంచి తెలంగాణలో టీడీపీని నామరూపాలు లేకుండా చేశారు.

ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్, జనసేనతో పొత్తు పెట్టుకొని పోటీ చేసి ఉంటె ఇంకా కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉండేది. అయితే  ఆయన తనదైన శైలిలో ఆత్మహత్యా సదృశమైన దొంగాట ఆడి (జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు- రాష్ట్ర స్థాయిలో పొత్తు లేదు) పూర్తిగా దెబ్బ తిన్నారు. పవన్ తో లోపాయికారి ఆట ఆడటం కూడా ఆయనకు వ్యతిరేకంగా మారింది.

విష్వసనీయత లేని రాజకీయాలు

అన్ని రకాల ఆదుకుంటామని, అనేక ప్రలోభాలకు గురి చేసి వైసిపి నుండి తన పార్టీలోకి తెచ్చుకున్న 23 మందిలో అనేక మందికి పార్టీ టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపారు. బలం, బలగం ఉన్న కొందరు నాయకులు టీడీపీకి వ్యతిరేకంగా పని చేయడం జరిగింది. అలాగే ప్రజావ్యతిరేకులుగా ముద్ర పడిన తెలుగు రాక్షసులను భుజాలకు ఎత్తుకొని జనం ఆగ్రహానికి ఆజ్యం పోయడం కూడా బాబు చేసిన తప్పు.

ఐకపోతే తన ఆస్థాన భజన మీడియా అండదండలతో ఫుఙ్ఖాను ఫుఙ్ఖాలుగా టీడీపీ అనుకూల, వైసీపీ వ్యతిరేక వార్తలు వండించి, వడ్డిస్తే జనం తన వెంటే ఉంటారనే భ్రమ లో ఆయన మితిమీరిన ప్రచారం చేసుకున్నారు. బాబు భజన పత్రికలుగా ముద్ర పడిన ఆ మీడియా పడరాని పాట్లు పడినా అవి వ్యర్థముగా మిగిలాయి. తన అనుకూల మీడియా, తెలుగు దండు, నిఘా విభాగం, ప్రయివేటు సర్వేలు బాబును గెలుపు భ్రమలలో ముంచి కట్ట కట్టుకొని బాబు కొంప ముంచాయి.

పాలనా పరమైన వైఫల్యాలు కూడా కొంప ముంచాయి

బీజేపీతో జట్టు కట్టి కేంద్ర మంత్రి వర్గంలో చేరినప్పటి నుండి ఆయన ఆడింది ఆటగా పాలన సాగించారు.  జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర పరిధిలోకి తేవడం నుండి, రాజధాని కోసం అడ్డగోలుగా జరిపిన భూసేకరణ, గ్రాఫిక్స్ లో చూపిన కట్టడాలు, అందుకోసం ఆయన పడిన పాట్లు జనానికి విసుగు కల్పించాయి.

ఇకపోతే  ప్రత్యేక హోదా సంజీవిని కాదని ఢంకా భజాయించి చెప్పిన బాబు చివరకు ‘యు’ టర్న్ తీసుకొని హోదానే కావాలని, ఇందుకు బీజేపీనే అడ్డంకి అని తన అనుకూల  మీడియాతో దేశ వ్యాప్తంగా గగ్గోలు పెట్టారు. ఇకపోతే కేంద్రం ఇచ్చిన నిధులను పుష్కారాల పేరుతొ తెలుగు తమ్ముళ్ల(కృష్ణార్పణం) పాలు చేశారు. అధికారులపై దాడులు, విచ్చలవిడిగా ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టడం, మట్టి నుండి మాన్యాల వరకు అస్మదీయులకు పంచిపెట్టడం, ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణాలో తెలుగు తమ్ముళ్ల పాత్ర, నిబంధనలకు విరుద్ధంగా/( పక్కన పెట్టి) తన వారికి పెద్ద,పెద్ద కాంట్రాక్టులు కట్టపెట్టడం, జన్మభూమి కమిటీల పేరుతొ తెలుగు తమ్ముళ్ల సామంత రాజ్యాలు  స్థాపించి నియోజకవర్గ స్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, నీరు-చెట్టు పేరుతొ అడ్డగోలుగా ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టడం లాంటి పాలనాపరమైన ఘోరాలు జనంలో టీడీపీపై తీవ్ర అసంతృప్తి కలిగించాయి.

అడ్డగోలుగా అపద్దాలు చెప్పి, గణాంకాల అండదండలతో ప్రచారం చేసుకుంటే ఫలితం ఉంటుందన్న బాబు ఆశలు కూడా అడియాశలుగా మిగిలాయి.

రైతులకు, ద్వాక్రా మహిళకు రుణ మాఫీ చేస్తామని చెప్పి ఆ వాగ్దానాలను సక్రమంగా అమలు చేయకపోగా కంటి తుడుపు మాటలతో వారిని రుణాల ఊబిలో ముంచారు. ఎన్నికల ముందు ఆయన ప్రకటించిన “పసుపు-కుంకుమ, రైతు బంధు” లాంటి ఫథకాలు కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోవడం వల్ల ప్రజలలో ఆయన విశ్వసనీయత పూర్తిగా దెబ్బ తినింది.

బాబు ఓటమికి కారణంగా (మిగిలింది) చెప్పగలిగింది  ఇవిఎం ల టాంపరింగ్ మాత్రమే!!!

అన్ని రకాల ప్రజా వ్యతిరేక మూటకట్టుకుని చరితర్లో లేని విధంగా ఓటమి పాలౌతున్న చంద్రబాబుకు మిగిలింది ఇవిఎం ల టాంపరింగ్ చేయడమా వల్లనే తానూ ఓటమి పాలైనానని  చెప్పుకోవడం మాత్రమే మిగిలింది. ఎన్నికలు ముగిసినప్పటి నుండి ఇవిఎం లు టాంపరింగ్ చేయడానికి అవకాశం ఉందని, బీజేపీ చేస్తుందని, అన్ని వివి ఫ్యాట్ స్లిప్పులను లెక్కించాలని, 22 రాజకీయ పక్షాలను కూడా గట్టి మిన్ను-మన్ను ఏకం చేసిన బాబు ప్రస్తుతం బీజేపీతో కుమ్మక్కైన వైసిపి , బీజేపీ అండదండలతో ఇవిఎం లను మార్చి ఇంతటి అసాధారణ గెలుపు సాధించిందని చెప్పుకోవడం మాత్రమే బాబుకు పేస్ సేవింగ్.

కేంద్రంలో చక్రం తిప్పి తనను తానూ బీజేపీ, వైసిపి దాడి నుండి కాపాడుకోవాలని ప్రాకులాడిన చంద్రబాబు ఎన్ని కతలు చెప్పినా, కేంద్ర రాజకీయాలలో తలపండిన మహా మహులు తలలు పంకించి పక్కకు పోవడం తప్పా చేయగలిగింది ఏమి లేదు. రాష్ట్రంలో ఘోర పరాభవం మూటకట్టుకొని తన ఓటమికి కుంటి  సాకులు వెదుక్కోవడం, జాతీయ రాజకీయాలలో తన ఉనికి కాపాడుకోవడానికి, సుప్రీం కోర్టు తీర్పు మేరకు కోరలు చాచనున్న కేసుల నుండి బయట పడటానికి ప్రత్నించడం చేయడానికి నిజాయతీగా ప్రయత్నించవలసి ఉంది. రాజకీయాలలో వచ్చిన ప్రజా తీర్పుకు కాలం ఏమి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సిందే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here