కృష్ణ శాస్త్రి పేరు దళిత పిల్లలకూ పెట్టారంటే అర్థం ఏంటి? : రచయిత రాఘవ శర్మ

సంఘ సంస్కర్తలకు, దివంగతులైన కమ్యూనిస్ట్ అగ్ర నాయకులకు కులాలను అంటగడుతూ ప్రొఫెసర్ కంచె ఐలయ్య  పాలక వర్గాల మెప్పు కోసం విషం చిమ్ముతున్నారు.
ఆగస్ట్ 2 వ తేదీన జరిగిన ఉ. సాంబశివరావు  ఆన్ లైన్ సంస్మరణ సభలోనూ, ఆగస్టు 4వ తేదీన రాసిన వ్యాసంలోనూ ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు గమనిస్తే ఐలయ్య  మనకాలపు ఆధునిక మనువుగా అవతారమెత్తినట్టు స్పష్ట మవుతోంది.
” ఆంధ్రాలోని బ్రాహ్మణత్వం దుర్మార్గ మైంది. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం తమ బ్రాహ్మణ మహిళలకు కొన్ని సంస్కరణలతో కూడిన మెరుగైన జీవితం కోసం కృషిచేశారు తప్ప మంగలి వాళ్ళ జీవితాలు పట్టించు కోలేదు.” అని ఐలయ్య  ఆరోపించారు.
విశాఖ జిల్లాలో కన్యాశుల్కం తీసుకుని చేసిన పెళ్లిళ్ల పైన విజయనగరం సంస్థా నాధీసుడు అయిన ఆనంద గజపతి రాజు ఒక సర్వే నిర్వహించారు. ఆ సంస్థానంలో ఉద్యోగి అయిన గురజాడ ఆ సర్వేలో పాలు పంచుకున్నారు. ఆ సర్వే ఆధారంగా కన్యా శుల్కం నిషేధం కోరుతూ 1888 ఫిబ్రవరిలో మద్రాసు శాసన సభలో ఆనంద గజపతి రాజు పెట్టిన బిల్లు వీగి పోయింది.
బ్రిటిష్ వారు తమ పాలనను సుస్థిర పరచు కోడానికి భారతీయుల సాంఘిక జీవితాల్లో జోక్యం చేసుకో దలచుకో లేదు. ఈ విషయం గురజాడ ను తీవ్రంగా కలిచి వేసింది. ఈ నేపథ్యంలో కన్యాశుల్కం నాటకాన్ని రాసారు.
భారత దేశంలో ఆధునిక జీవితం కాస్త ఆలస్యంగా ప్రారంభ మైంది.
ఆ సమయంలో ఇంగ్లీషు చదువులు చదువుకున్న గురజాడ ఆధునిక ఆలోచలను అందిపుచ్చు కున్నాడు. కన్యాశుల్కం దుష్ట సంప్రదాయం అనేక కులాలలో ఉన్నప్పటికీ, బ్రాహ్మణ కులంలో ఎక్కువగా ఉంది. ఆ నాటకంలో బ్రాహ్మణీకాన్ని గురజాడ తన వ్యంగ్య బాణాలతో ఎగతాళి చేసి, వెక్కిరించాడే తప్ప, వారిని సమర్ధించ లేదు.
తాను పుట్టిన కులంలోని మకిలిని బహిర్గతం చేసి, బయట పడేసాడు. ఇలాంటి సంఘసంస్కర్తకు ఐలయ్య కులాన్ని అంటగట్టడం ఏమిటి? ఐలయ్య గారు ఏం చేశారు ?
ప్రపంచంలోనే సమకాలీన సాంఘిక సమస్యలపై వచ్చిన తొలి నాటకం ఇది. ఈ నాటకం ప్రదర్శించిన మూడు నెలల తరువాత లండన్ లోని మురికి వాడల గురించి జార్జ్ బెర్నార్డ్ షా రాసిన ‘ విడో వర్స్ హౌసెస్ ‘ (Widower’s Houses)అన్న నాటకాన్ని ప్రదర్శించారు. వర్తమాన సాంఘిక సమస్యలపై వచ్చిన ప్రథమ నాటకం గురజాడ గారి కన్యాశుల్కం కాగా, బెర్నార్డ్ షా రాసిన ‘ విడోవర్స్ హౌసెస్ ‘ నాటకం ద్వితీయ నాటకంగా చరిత్రలో నిలిచి పోయింది. గురజాడ తన రచనల ద్వారా సంఘ సంస్కరణకు కృషి చేశాడు. అభ్యుదయ కవిత్వానికి నాంది పలికాడు.
భారత దేశంలో ఆధునిక జీవితం ప్రారంభమయ్యే నాటికి కొందరు సంఘ సంస్కర్తలు తయారయ్యారు. మధ్య యుగాలనాటి మూఢ విశ్వాసాల నుంచి ప్రజలను విముక్తి చేయడానికి వారు నడుం బిగించారు. ఉత్తర భారత దేశంలోని అగ్ర కులాలతో బాటు, ఇతర కులాలలో కూడా ఉన్న సతీ సహగమన ఆచారానికి వ్యతిరేకంగా
రాజారామ్మోహన్ రాయ్ పోరాడాడు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. విగ్రహారాధనను, పూజా పునస్కారాలను, కుల వ్యవస్థను నిరసించాడు. తద్వారా హిందూ సమాజాన్ని సంస్కరించాలని భావించాడు. వీటికి ఆకర్షితుడైన కందుకూరి వీరేశలింగం బ్రహ్మ సమాజస్తుడై, కుల వ్యవస్థను నిరసించాడు. బాల్య వివాహాలను వ్యతిరేకించి వితంతు పునర్ వివాహాలను జరిపించాడు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు బ్రాహ్మణ కులాల్లో ఎక్కువగా, ఇతర కులాల్లో తక్కువగా ఉన్నాయి. కందుకూరి ఆచరణ వాది. మఠాధిపతులతో, సనాతన ఛాందసవా దులతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కందుకూరి చేపట్టిన సంస్కరణల వెనుక ఉన్న సామాజిక వాస్తవాలను గమనించకుండా, కులాన్ని నిరసించిన ఆ మహాను భావుడిని కులానికి పరిమిత మయ్యాడని ఐలయ్య గారు అ రోపించడంలో ఔచిత్యం లేదు.
చాలా మంది దళితులు తమ పిల్లలకు కృష్ణ శాస్త్రి అని పేరు పెట్టుకున్నారు. ప్రముఖ దళిత నాయకుడు బొజ్జా తారకం గారి అన్న పేరు కూడా కృష్ణ శాస్త్రి.
భావ కవిత్వాన్ని ఉచ్చ స్థితికి తీసు కెళ్ళిన కృష్ణ శాస్త్రి కూడా బ్రహ్మ సమాజస్తుడు. దళిత వాడలలో కెళ్ళి, వారి పిల్లలకు పాఠాలు చెప్పి, వా రి ఉద్ధరణకు ఎంతో కృషి చేశారు.
అందుచేతనే ఆయన పేరును దళితులు తమ పిల్లలకు పెట్టుకున్నారు. కృష్ణశాస్త్రి కులవ్యవస్థ ను నిరసించాడు. బ్రహ్మ సమాజస్తులు అంతా స్త్రీ జనోద్ధరణకు కృషి చేసినవారే. బ్రాహ్మణ సమాజం కృష్ణ శాస్త్రి ని వెలివేసినా ఆయన లెక్క చేయలేదు.
Prof Kancha Ilaiah Shepherd ( A facebook picture)
విశ్వనాథ సత్యనారాయణ మనువాదానికి, హిందూ ఫాసిజానికి ప్రతినిధి కాగా, సంస్కరణ వాదానికి కృష్ణ శాస్త్రి ప్రతినిధి. విప్లవ వా ది అయిన శ్రీ శ్రీ విశ్వ నాథ సాహిత్య కుంభ స్థలాన్ని బద్దలు కొట్టాడు. మను ధర్మం మీద చావు దెబ్బ కొట్టాడు.

బ్రాహ్మణ కులంలో పుట్టి నప్పటికీ, బ్రాహ్మణీకాన్నీ వ్యతిరేకించిన వారందరి పట్ల ఐలయ్య  శత్రు పూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు.

” విప్లవోద్యమం కూడా బ్రాహ్మణ ఆధిపత్యంలో ఉందని ఉ సా గుర్తించారు ” అని విప్లవోద్య మాని కి తమ జీవితాలను అర్పించిన దివంగత కమ్యూనిస్టు యోధుల పైన మనువాద దృష్టి తో విమర్శలు చేశారు.
” భారత కమ్యూనిస్టు పార్టీ జీవిత కాలమంతటి లో వ్యవసాయ, వృత్తిపర అవగాహన లేని బ్రాహ్మణు లే సిద్ధాంతాన్ని రాస్తూ వచ్చారు. వారే మేధావులు, నాయకులు అవడం విషాద కరం. ఇదే వైరుధ్య పూరితం.” అని మనువు లాగా వారు పుట్టిన కులాన్ని బట్టి అంచనా వేయడానికి ఐలయ్య గారు విఫల యత్నం చేశారు. డాంగే, రణదివే, చారుమజుందార్, నంబూద్రి పాద్, దేవులపల్లి వెంకటేశ్వర్ రావు, వినోద్ మిశ్రా వంటి దివంగతులు అయిన కమ్యూనిస్టు నాయకుల పైన కులం పేరుతో బురద చల్లడానికి యత్నించారు.
మనువాదం, వర్ణాశ్రమ ధర్మాలను, వర్ణ భేదాలను ప్రవచిస్తుంది. అంటరాని తనాన్ని ప్రోత్సహిస్తుంది. ఆధునిక మనువు ఐలయ్య గారు కమ్యూనిస్టు నాయకులను వారి పుట్టుకను బట్టి ఛాందస దృక్పథం తో అంటరాని వారుగా పరిగణిస్తున్నారు. ఐలయ్య గారి ఆలోచన ఏ మిటి? తమ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బ్రాహ్మణ కులంలో పుట్టిన వారు కమ్యూనిస్ట్ పార్టీ లో కి రాకూడదా? వర్గ రహిత సమాజం కోసం పని చేయ కూడదా!?
మను ధర్మం స్త్రీలకు, బ్రాహ్మణేతరులకు వేదాల అధ్యయనాన్ని నిరాకరించినట్లు, ఆధునిక మనువు ఐలయ్య కూడా బ్రాహ్మణ కులంలో పుట్టిన వారికి కమ్యునిస్టు పార్టీలో చేరికను నిషేధించ జూస్తున్నారు . ఏ కమ్యూనిస్టు నాయకుడు ఏ కులంలో పుట్టారు అన్న విషయం పైన ఒక పనికి మాలిన పరిశోధన చేసినట్టున్నారు.
Tarimela Nagireddy (facebook picture)
వీరు చెప్పే వరకు ఈ కమ్యూనిస్టు నాయకుల్లో చాలా మంది ఏ కులంలో పుట్టారో నాతో పాటు చాలా మందికి తెలియదు. మితవాదిగా ముద్రపడిన డాంగే ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ లో ఉండగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించిన చరిత్ర ఉంది.
ప్రభుత్వాన్ని పడగొట్ట డానికి కార్మికుల మూకుమ్మడి తిరుగు బాటు ( ఇన్సర్జెన్సీ)కు పిలుపు ఇచ్చిన రణదివే విఫల మైనప్పటికీ గొప్ప సాహసి. ఆయన వల్ల పార్టీ చాలా నష్టపోయింది. ఒక మిత్రుడు చెప్పిన ప్రకారం రణదివే భారత దేశంలో స్థిరపడిన గ్రీకుల /యవనుల సంతతికి చెందిన వారు తప్ప బ్రాహ్మణ కులంలో పుట్టినవారు కాదు.
చారు మజుందార్ నక్సల్బరిలో రగిలించిన నిప్పు రవ్వ శ్రీకాకుళం లో మాత్రమే కాదు, దేశమంతా పాకి దండకారణ్యంలో నిలదొక్కుకుంది. వైద్యం అందక చారుమజుందార్ జైల్లోనే మృత్యువు పాలయ్యారు. వీరు కూడా బ్రాహ్మణ కులంలో పుట్టలేదని ఆ మిత్రుడు చెప్పారు.
ప్రపంచం లోనే తొలిసారిగా ఎన్నికల ద్వారా అధికారాన్ని చేపట్టిన వ్యక్తిగా నంబూద్రి పాద్ చరిత్రలో నిలిచి పోయారు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒక్క కలం పోటుతో నంబూద్రి పాద్ ప్రభుత్వాన్ని కూలగొట్టి చెడ్డ పేరు మూట గట్టుకున్నారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ ఏ ఐ సీ సీ అధ్యక్షు రాలిగా అసలు కథ నడిపించారు. నంబూద్రి పాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ మత శక్తులను ప్రోత్సహించిందని పార్లమెంటులోయిందిర భర్త ఫిరోజ్ గాంధీ నే ఆరోపించారు.
దేశ చరిత్ర లోనే అతి పెద్ద సాయుధ పోరాటంగా గుర్తింపు పొందిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి గుండె వంటి నల్గొండ జిల్లాలో ఆ పోరాటాన్ని నడిపించిన యోధుడు దేవుల పల్లి వెంకటేశ్వర్ రావు. నలభై అయిదేళ్ల రాజకీయ జీవితంలో ఇరవై ఏళ్ళు మాత్రమే బహిరంగం గా ఉన్నారు. అయిదేళ్ళు జైలు జీవితం, ఇరవై ఏళ్ళు అజ్ఞాతం లో గడిపారు. ఆ అజ్ఞాతంలోనే తుది శ్వాస విడిచారు.
తెలంగాణా పోరాట సమయంలో కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుల్లో దేవులపల్లి ఒకరు. స్వాతంత్య్రం వచ్చాక సాయుధ పోరును విరమించాలని పార్టీ కేంద్ర నాయకత్వం పిలుపు ఇచ్చినప్పటికీ 1951 వరకు సాయధ పోరాటాన్ని కొనసాగించాలన్న వాదన వైపు డి.వి. నిలబడ్డారు.
వినోద్ మిశ్రా కూడా బీహార్ లో విప్లవ ఉద్యమాన్ని నిర్మించారు.
ఈ నాయకుల మధ్య విప్లవాన్ని విజయవంతం చేసే పంథా లో భిన్నాభి ప్రాయాలు ఉండవచ్చు.భారత దేశంలో వర్గ రహిత సమాజం ఏర్పాటు చేయాలన్న విషయంలో ఏ మాత్రం భిన్నాభిప్రాయం లేదు.
ఐలయ్య  లాగా కుల వలయం నుంచి బయటపడ లేని వారు బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యలేరు. అగ్రవర్ణాల నుంచి వచ్చిన శ్రీ శ్రీ, రావి శాస్త్రి, కాళీపట్నం రామారావు వంటి రచయితలు అగ్రవర్ణాల కోసం రచనలు చేయలేదు. పీడిత ప్రజల కోసమే వారు రాసారు.
అలాగే అగ్రవర్ణాల లో పుట్టిన కమ్యూనిస్ట్ యోధులు అగ్రవర్ణాల కోసం తమ జీవితాలను త్యాగం చేయలేదు. పీడిత ప్రజల కోసం, వర్గ రహిత సమాజాన్ని నెలకొల్పడానికి తమ జీవితాలను అర్పించారు.
ఈ సందర్భంగా కులం గురించి త్రిపురనేని మధుసూదన రావు రాసిన విషయాలను ఒక్క సారి మననం చేసుకోవడం మంచిది.
“కమ్యూనిస్టు పార్టీ నాయకుల లో ఎక్కువమంది అగ్ర కులాల్లో పుట్టి ఉండవచ్చు. భారతీయ సమాజ విలక్షణ నిర్మాణం వల్ల ఏ రంగం లో అయినా ముందు అగ్ర వర్ణాలలో పుట్టినవారే ప్రవేశిస్తారు. తరువాత మధ్య కులాల్లో పుట్టినవారు, ఆ తరువా త నిమ్న కులాల్లో పుట్టినవారు ప్రవేశిస్తారు. పీడిత కులాలు, పీడిత మతాలు అన్న విభజన ఆధునిక సమాజంలో జడాత్మక విభజన. కుల ప్రమేయం లేకుండా పీడిత, పీడక విభజనే శాస్త్రీయ మైంది. అప్పుడే అన్ని కులాల్లో పీడితులు కులతత్వంతో కాకుండా ఆర్థిక, రాజకీయ చైతన్యంతో ఏకం కాగలుగుతారు. పీడిత కులం అంటే పీడక కులాలుగా మీరు పరిగణిస్తున్న పీడకులకు, దోపిడీ దారులకీ ప్రయోజనం. ఈ కులాలలోని దోపిడీ దారులు అగ్ర కులాల్లో ఉన్న దోపిడీ దారులతో ఏ కమవుతారు. కులం పేరుతో పీడిత కులాల్లోని దోపిడీ దారులు ముసుగుతో యథేచ్ఛగా దోపిడీ చేస్తారు. అగ్ర వర్ణాలలో పీడితులు కూడా ఇంకా పీడించ బడతారు. కులం పేరుతో దోపిడీని ‘లెజిటమేట్ (చట్ట సమ్మతం)చేస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యత ఒక యుగ భ్రమ. ఈ ఐక్యతకు ఎలాంటి ప్రాతిపదికా లేదు. వీళ్ళ మధ్య విపరీతమైన వైరుధ్యాలు ఉన్నాయి.
వీరిది బూర్జువా నినాదం కాదు. ఫ్యూడల్ నినాదం. ఇది పునరుద్ధరణ వాద విషం. చారిత్రక అసందర్భ శక్తుల క్షీణ గానం. ” త్రిపురనేని మధుసూదన రావు ( సాహితీ సర్వస్వం నుంచి )
Dr B R Ambedkar (credits Wikipedia)
మానూరులో 1937 లో జరిగిన దళితుల మహా సభలో అంబేడ్కర్ ప్రసంగిస్తూ ” ఈ కమ్యూనిస్టుల తో సంబంధాలు పెట్టుకోవడం నాకు అసాధ్యమైన విషయం. కమ్యూనిస్టులకు నేను బద్ధ శత్రువును ” అని ప్రకటించారు.పార్లమెంటులో అంబేడ్కర్ కు, పుచ్చలపల్లి సుందరయ్య కు కులం విషయంలో వాదోపవాదాలు ఇలా జరిగాయి.
” ఆంధ్ర లో కొన్ని పెద్ద కులాలు, మరి కొన్ని చిన్న కులాలు ఉన్నాయి. పెద్ద కులాల వారిలో రెడ్డి, కమ్మ, కాపులు ఉన్నారు. చిన్న కులాల్లో వ్యవసాయ కూలీలుగా ఉన్న దురదృష్ట వంతులైన నిమ్న జాతుల వారున్నారు. దాదాపు భూమి అంతా రెడ్ల చేతుల్లోనే ఉంది. పై కులాలవారి నియంతృత్వం నుంచి , దౌర్జన్యాల నుంచి నిమ్న జాతుల వారిని కాపాడేందుకు దేశ వ్యవహారాల మంత్రి ఎలాంటి రక్షణ పొందు పరిచారు.? ” అని అంబేద్కర్ మాట్లాడారు.
దానికి సమాధానంగా పుచ్ఛల పల్లి సుందరయ్య లేచి ఇలా చెప్పారు…
” ఆంధ్ర నుంచి వచ్చిన నాకు ఆంధ్ర సాంఘిక వ్యవస్థ స్వరూపాన్ని గురించి అంబేత్కర్ కంటే ఎక్కువగా తెలుసు. ఆంధ్ర లో పీడింప బడే వారిలోనూ కాపు, కమ్మ, రెడ్డి కులాలకు చెందిన వారు కూడా ఉన్నారు. పీడించే వారు, పీడింపబడే వారు అన్ని కులాల్లోనూ ఉన్నారు. ఒక్క నిమ్న జాతుల వారిలో మాత్రమే పీడింపబడే వారు ఉన్నారన్న విషయాన్ని మా పార్టీ అంగీక రించదు. అన్ని కులాల్లో ఉన్న పీడకులకు వ్యతిరేకంగా మేం పని చేస్తున్నాం. కమ్యునిజం ఒక కులాన్ని మరొక కులం పైకి రెచ్చగొట్టదు. పీడకుల పై పీడితులు పోరాడాలన్న సిద్ధాంతం పైనే మేము పని చేస్తున్నాము. అలా పోరాడాము కాబట్టే ఇక్కడకు వచ్చి మీ లాంటి కులతత్వ వాదులను ఖండించ గలుగుతున్నాం.
ఒక కులం పై మరొక కులాన్ని రెచ్చ గొట్టే అంబేడ్కర్ లాంటి వారు ఐక్య భారత దేశం కోసం మాట్లాడుతున్నట్టు నటించడం ఆశ్చర్యకరంగా ఉంది. నిమ్న జాతి ప్రజల కష్టాలను పోగొట్టాలంటే ఒక కులాన్ని మరొక కులం పై రెచ్చ గొట్టడం మార్గం కాదు.
1947 నుంచి 1951 వరకు గల కేంద్ర మంత్రి వర్గంలో డాక్టర్ అంబేడ్కర్ కూడా సభ్యులుగా ఉన్నారు. వారు సభ్యులుగా ఉన్న మంత్రి వర్గమే భూమి కోసం పోరాడిన ప్రజలను తెలంగాణా లోనూ, ఆంధ్ర లోనూ కాల్చి చంపింది. అక్కడే కాదు, దేశమంతా కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో చాలా మంది ప్రజలు, ముఖ్యంగా నిమ్న జాతుల వారు కూడా మరణించారు.
ఆంధ్ర లో ఒక గ్రామాన్ని అంబేడ్క ర్ ఉదహరిస్తూ ఒక రెడ్డికి 1400 ఎకరాల భూమి ఉంటే, తతిమ్మా వారందరికీ కలిపి 14 ఎకరా లు మాత్రమే ఉన్నా యని తెలిపారు. సరే, అంబేత్కర్ తన సహ చరులతో ఆ భూస్వామి భూమిని స్వాధీనం చేసుకుని భూమి లేని పేదలకు పంచడానికి మాతో రాగలరా? అని ప్రశ్నిస్తున్నా. ఇప్పుడేమో డాక్టర్ అంబేత్కర్ అప్పుడు కిరాయిగా ( మంత్రి వర్గంలో ) పని చేశానం టారు. ఇలాంటి వ్యక్తి మాటలకు ఎంతటి విలువ నివ్వాలో సభ వారు పరిశీలించాలని కోరుతున్నాను. నాలుగు డబ్బులు చేతి కిస్తే, తన కులానికి చెందిన ప్రజలనే కాల్చి చంపడానికి కూడా ఈ పెద్ద మనిషి సిద్ధపడతారన్న మాట.” 4/9/53(విశాలాంధ్ర)
కులాన్ని పట్టుకుని ఐలయ్య లాంటి వారు వేలాడడం వల్ల కొన్ని విప్లవశ్రేణులలో కూడా కులతత్వం పెరిగి వర్గ పోరాటానికి అవరోధం గా మారుతోంది. మనుధర్మం అంటే కుల దృక్పథం. అది అగ్రవర్ణ కుల దృక్పథం అయినా, నిమ్నకుల దృక్పధం అయినా అది మనువాద దృక్పథమే. వర్గ నిర్మూలన జరగ కుండా కుల నిర్మూలన జరగదు. వర్ణాశ్రమ ధర్మాలు, వర్ణ భేదాలు పాటించడం మనువాదం. మనువాదం రాచరిక వ్యవస్థకు రాజ్యాంగం లాంటిది . ఆధునిక మనువుగా అవతరించిన ఐలయ్య గారు తన ప్రసంగాలలో, రాతల లో కుల చిచ్చు పెట్టి కమ్యూనిస్టు ఉద్యమాన్ని దెబ్బ తీయడం ద్వారా అధికారంలో ఉన్న సంఘ్ పరివార్ శక్తులకు, రాజ్యాంగం లాగా వ్యవహరిస్తున్నారు. ”మోదీ రాముడు .. అందరివాడు ! ” అన్న శీర్షికన ఈనెల ( ఆగస్టు ) 14 వ తేదీ మంగళ వారం ఐలయ్య ‘సాక్షి’ లో రాసిన వ్యాసం ఈ విధానాన్ని ధ్రువ పరుస్తోంది.
మరో ఇద్దరు కమ్యూనిస్టు అగ్ర నాయకులు తరిమెల నాగిరెడ్డి, దేవుల పల్లి వెంకటేశ్వర్ రావు లు కులం, అంటరానితనం గురించి చేసిన విశ్లేషణలతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
” ఆర్థిక, సామాజిక అసమానతల వల్లనే అంటరానితనం ఉన్నది. గ్రామీణ భూ సమస్య, సంబంధాలతో ఇది ముడి పడి ఉన్నది. గ్రామీణ పేదరికం నుంచి దీన్ని వేరు చేసి విడిగా పరిష్కరించలేము. భూస్వామ్య విధానాన్ని బల ప్రయోగం ద్వారా కూల దోయకుండ, విప్లవం ద్వారా భూమిని పంచ కుండా ఏమీ సాధించలేెం.”
– తరిమెల నాగిరెడ్డి
” చారిత్రక వాస్తవాలను ఆధారం చేసుకుని పరిశీలిస్తే, ఆదిమ గిరిజన జాతుల నుంచి వచ్చిన గిరిజన జాతులు, ఉప గిరిజన జాతుల నుంచి వచ్చినవే నేటి కులాలు. కులం, కులతత్వం, అంటరానితనం భూస్వామ్య వ్యవస్థతో ముడిపడి ఉన్నవి. ప్రజలను వర్గపోరాటం నుంచి దూరం చేయడం కోసం పాలకులు కులతత్వం తో ప్రజలను ముడి వేశారు. భూస్వామ్య వ్యవస్థ, బానిసత్వాలు కొనసాగడానికి కుల వ్యవస్థ ప్రస్తుత రాజకీయ వ్యవస్థతో ముడిపడి పని చేస్తూ ఉంది. కులాల మధ్య శ త్రుపూరిత వైఖరి వ్యవసాయ విప్లవం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఉపయోగ పడుతోంది. ప్రజలలో కుల విభజన తెస్తే వారిని ఐక్యం చేయడం కష్టం. ప్రజలను కులం ప్రాతిపదికన కాకుండా వారి సమస్యలపైన ఐక్యం చేయాలి. తెలంగాణా సాయుధ పోరాట సమయంలో కుల ఘర్షణలు, మత ఘర్షణలు లేవు. అంటరాని తనం లేదు. ప్రజలందరూ కలిసి జీవించారు. కలిసి పని చేశారు. కలిసి పోరాడారు”(దేవులపల్లి వెంకటేశ్వరరావు)
ఈ ప్రాతిపదికన ప్రజలను ఐక్యం చేయడం ద్వారానే కులాన్ని అంతం చేయగలుగుతాం.
Aluru Raghava Sarma

(అలూరు రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్టు, రచయిత, తిరుపతి)

Source: Facebook