FLASH కరోనా దూకుడు, ICMR కొత్త గైడ్ లైన్స్, దగ్గినా కరోనా పరీక్ష తప్పదు

(Dr Srikanth Arja)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎమ్ఆర్) కోవిడ్ టెస్టింగ్ విధానాలపై కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
ఐసిఎమ్ఆర్ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఇన్ ఫ్లుయెంజా (దగ్గు, జలుబు) లాంటి అనారోగ్యపు లక్షణాలు ఉన్నా కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించింది. కరోనా పరీక్షల కేటగిరీలను మరింత పెంచింది.
ఈ క్రింది లక్షణాలు ఉన్నవారందరికి ఇకనుంచి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఐసిఎమ్ఆర్ రాష్ట్రాలకు సూచించింది.
1) 14 రోజుల క్రితం అంతర్జాతీయంగా ప్రయాణం చేసిన వారిలో ఇన్ ఫ్లుయెంజా (దగ్గు, జలుబు) తరహా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలి.
2) కరోనా నిర్ధారణ అయిన వ్యక్తులను కలిసిన వారిలో ఇన్ ఫ్లూయెంజా వంటి లక్షణాలు కలిగిన వ్యక్తులందరికీ టెస్టులు చేయాలి.
3) కరోనాపై పోరాడుతున్న వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులలో ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలతో బాధపడుతున్న వారు.
4) తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి.
5) కరోనా నిర్ధారణ అయిన వ్యక్తిని నేరుగా కలిసిన, కరోనా లక్షణాలు లేనివారికీ పరీక్షలు చేయాలి.
6) హాట్ స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లలో ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలున్న వారికి.
7) ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారు.
8) విదేశాల నుంచి వచ్చినవారు, వలస కార్మికుల్లో ఏడు రోజులుగా ఇన్ ఫ్లుయెంజా లక్షణాలతో బాధపడుతుంటే..
పైన చెప్పబడిన కేటగిరీ వారందరికీ కరోనా టెస్టులు నిర్వహించాలని ఐసిఎమ్ఆర్ స్పష్టం చేసింది.
అంతే కాకుండా కరోనా టెస్టులు చేయలేదన్న కారణం చూపిస్తే అనుమానితులకు అత్యవసర వైద్య సేవలు చేయడంలో ఆలస్యం చేయవద్దని ఐసీఎంఆర్ సూచించింది.
(Dr Srikanth Arja, Special Secretary, State Nodal Officer COVID-19)