ప్రకృతి విసిరిన పావు (కరోనా కవిత)

ప్రకృతి విసిరిన పావు

అసలేమి జరుగుతుందంటూ
గుబులు చెందకు
ప్రకృతి‌కన్నెర్ర చేసి
మౌన‌యుద్ధాన్ని ప్రకటించింది
ఇక్కడ ఏ అశ్వదళాలు
గజదళాలు లేవు
యుద్ధ ట్యాంకులు‌ మి స్సైల్స్
బాంబులు‌ అణుబాంబులు
అసలే లేవు..
కంటికి కనిపించని శత్రువేదో
మానవునిమీద స్వైర్యవిహారం చేస్తుంది
దానికి బీదా గొప్ప
రాజు బంటు తేడా లేదు
ఎదుర్కొనే శక్తి యుక్తుల కోసం ఎక్కడ వెతుకుతావు
అడుగు బయటవేయకు
చావు గుమ్మం కాడ కాపాల కాస్తుంది
ఓ మనిషీ‌..స్థంభించిన
ప్రపంచాన్ని చూసి బెంబేలెత్తకు
ఇంటిలో కూర్చొనే
సమరశంఖం పూరించు
బ్రతుకూ బ్రతికించు…
మనసును విశాలం చేసుకో
నీ చుట్డూ గిరిగీసుకో
ఉబలాటం‌ మాని
మనుగడ కోసం పోరాటంచేయి
కాళ్లకు సంకెళ్లు వేసుకుని
హృదయద్వారాలు తెరువు
లాక్ డౌనంటే శిక్షకాదు నీకు
ప్రాణబిక్ష అని గ్రహించు
గతించిన కాలంలో పోగొట్డుకున్న నీ అస్థత్వాన్ని
వెతికి పట్డుకో
నీ‌ మనో పేఠిక‌ తెరచి
జ్ఞాపకాల దొంతరలను విప్పిచూడు…
ఏమి పోగొట్టుకున్నావో
ఏమి‌ కూడబెట్టుకున్నావో
బేరీజు వేసుకో
ఏ బంధాలను నిలబెట్టుకున్నావో
ఏ విలువలు పోగేసుకున్నావో
లెక్కేసుకో
మరోకంటికి కనపడకుండా
ఏ చెవిని చేరకుండా
నీ‌మనసును ప్రక్షాళన చేసుకో
పుట్టుట గిట్టుటల నడుమ
ఏ రంగువేయని నీ నాటకాల
రీలు తిప్పి చూడు
నటించడం‌‌ మాని
జీవించడం మొదలుపెట్టు
బేషజాలను మూటగట్టి తగులబెట్టు
అటకెక్కిన
అనురాగ ఆప్యాయతలను కిందకు దింపు
నీఇంటిలో నవ్వుల కాంతినింపు
మనసుకు కమ్మిన
తప్పుల కుబుసాలు వదిలి
మరో నూతనశకానికి
నాంది పలుకు
త్వరలోనే ఈ యుద్ధం లో
మానవుడే విజేతగా నిలుస్తాడు
నీలో‌ జరిగిన అంతర్యుద్ధం లో
అహాన్ని వీడిన నీవే విజేతవు
నిండైన తేజస్సుతో
మరో తొలి అడుగు వేయడానికి
సన్నద్ధంగా ఉండు
అపుడొక్కసారి తిరిగి చూడు
కరోనా రక్కసి కాదు
నీలో మనిషిని నిద్రలేపేందుకు
ప్రకృతి విసిరిన పావులా
నీకు గోచరిస్తుంది…
-డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి
అసిస్టెంట్ ప్రొఫెసర్‌
9441993044