Home Features నిరుద్యోగులతో ఆటలాడుతారా.. వాళ్లంటే అంత చులకనా

నిరుద్యోగులతో ఆటలాడుతారా.. వాళ్లంటే అంత చులకనా

350
0
SHARE

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలపై నిప్పులు చెరిగే విధంగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ జరుగుతోందని, తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) తప్పిదాలకు ఎంతోమంది ఆశావహులైన అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయిందని అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్ల పోస్టులు 18,435 భర్తీ చేసేందుకు వివిధ నోటిఫికేషన్లు విడుదల చేస్తే దరఖాస్తు రుసుం చెల్లించిన వారిలో 7.19 లక్ష మంది పరీక్షలకు హాజరయ్యారని, అయితే అభ్యర్థులకు శాస్త్రీయ విధానంలో పారదర్శకంగా, అందరికీ సమ న్యాయం జరిగేలా పరీక్షలు నిర్వహించడంలో టీఎస్ఎల్‌పీఆర్‌బీ ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని గవర్నర్‌ ఈఎస్ఎన్‌ నర్సింహన్‌ను కోరుతూ ఆయన బహిరంగ లేఖ రాశారు.

తమ ఉద్యోగాలు తమకే చెందాలని యువత ఉద్యమించి తెలంగాణను సాధించిందని, అయితే ఉద్యోగాలు లేక ఆఖరికి కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం పోస్టు గ్రాడ్యుయేషన్, రీసెర్చ్‌ స్కాలర్స్‌ సైతం దరఖాస్తు చేసుకునే పరిస్థితులు మన ప్రభుత్వంలో ఏర్పడ్డాయి. దీనిని బట్టి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా దారుణంగా ఉందో అర్ధం అవుతోంది. దాదాపు అయిదేళ్లు నిరీక్షించించారు.

దరఖాస్తుదారుల్లో అత్యధికులు పేదలు, బడుగు బలహీనవర్గాల వారే ఉన్నారు. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఎంతో కష్టపడటమే కాకుండా వేల రూపాయల్ని కోచింగ్‌ కోసం వెచ్చించారు. అయితే టీఎస్ఎల్‌పీఆర్‌బీ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించడంలో దారుణంగా వైఫల్యం చెందింది.. అని డాక్టర్‌ శ్రవణ్‌ వివరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో అనర్హులు పోలీస్‌ ఉద్యోగాలకు ఎంపికైతే ఎదురయ్యే పరిణామాలు ఘోరంగా ఉండే ప్రమాదం ఉంది. మీరు ఒక పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసిన వ్యక్తిగా ఈ విషయాన్ని ఎక్కువగా వివరించాల్సిన అవసరం లేదు. అర్హులైన అభ్యర్థులకు పూర్తి న్యాయం జరిగి వారిని పోలీస్‌ ఉద్యోగాల్లో నియమిస్తే న్యాయం చేసినట్లే కాకుండా పోలీస్‌ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.

ఆర్ఎఫ్ఐడి పరీక్షను ప్రైవేటు వ్యక్తులకు చెందిన వారి ఏజెన్సీల ద్వారా నిర్వహించారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొద్ది మాత్రమే ఉన్న ఇ–సాఫ్ట్‌ అనే కన్సల్టెన్సీ సంస్థ ద్వారా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. ఆర్ఎఫ్ఐడి పరీక్ష ఫలితాల్ని ఆ ఏజెన్సీ తారుమారు చేసే అవకాశం ఉంది. దీనిపై లోతుగా దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయకపోతే కుట్రదారుల గుట్టు బట్టబయలు కాదు. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో లోపాలు, అక్రమాలపై అనేక పత్రికల్లో వార్తా కథనాలు కూడా వచ్చాయి. అయితే ప్రభుత్వపరంగా ఎలాంటి స్పందన లేదు. దాంతో మీకు ఈ లేఖ రాయాల్సివస్తోంది.. అని డాక్టర్‌ శ్రవణ్‌ తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేదు. కనీసం వారి గోడు వినేందుకు కూడా ఎవరకూ ముందుకు రావడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాని అయోమయ పరిస్థితుల్లో అర్హులైన అభ్యర్థులు ఆందోళనతో ఉన్నారు. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ అక్రమాలపై దర్యాప్తునకు ఆదేశించాలని కాంగ్రెస్‌ పార్టీ బహిరంగంగా డిమాండ్‌ చేసినా ప్రభుత్వంలో యథాతథంగానే చలనం లేకుండా పోయింది… అని ఆయన లేఖలో వివరించారు.

పోలీస్‌ పోస్టులకు నిర్వహించిన శరీర దారుఢ్య పరీక్షల కోసం 2,24,741 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో 1,17,660 మంది అర్హత సాధించారు. అయితే ఈ పరీక్ష నిర్వహించే విధానం లోపభూయిష్టంగా ఉందని, ఎలాంటి శాస్త్రీయ పద్ధతిని పాటించకుండా నిర్వహించారని అనేక మంది అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

తొలిసారి తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్టు స్టైపండరీ కానిస్టేబుల్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోలీసులకు నిర్వహించిన శరీర ధారుఢ్య పరీక్షలకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్ఎఫ్ఐడి) ట్యాగ్స్‌ వినియోగించారు. ఆర్ఎఫ్ఐడి ప్రైవేట్‌ ఏజెన్సీ అయిన ఇ–సాఫ్ట్‌ ద్వారా పరీక్ష నిర్వహించింది. ఆ ట్యాగ్స్‌ వినియోగం వల్ల వేలాది మంది అర్హులైన అభ్యర్థులు పోలీస్‌ ఉద్యోగాలకు అనర్హులు అయ్యారు.

వివిధ నోటిఫికేషన్లు జారీ చేసిన పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అభ్యర్థులందరికీ అన్ని పోలీసులకు ఉమ్మడిగానే శరీర ధారుఢ్య పరీక్షలు నిర్వహించి తప్పిదానికి పాల్పడింది. ఎస్‌.ఐ, కానిస్టేబుల్‌ పోస్టులకు సగటు వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండానే అందరికీ కలిపే పరీక్ష నిర్వహించేశారు. అభ్యర్థుల అనుభవాలు, వారి సామర్ధ్యాలను కూడా గమనంలోకి తీసుకోకుండానే పరీక్ష నిర్వహించడం అశాస్త్రీయమే అవుతుంది.. అని డాక్టర్‌ శ్రవణ్‌ ఆ లేఖలో గవర్నర్‌కు వివరించారు.

ఎనిమిది వందల మీటర్లు (400్ఠ2) అర్హత సమయం 170 సెకన్లు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌పై ఒకేసారి 50–60 మంది అభ్యర్థులతో గొర్రెల మందల తరహాలో పరుగులు తీయించారు. దీని వల్ల అభ్యర్థులు సజావుగా పరుగుపెట్టలేకపోయారు. ఎంతో సయమం వృధా అయింది. మానవతప్పిందం వల్ల నిర్వహించిన ఈ తప్పుడు విధానం ఫలితంగా ఎంతోమంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు. ఎంతో అభ్యర్థులు నాలుగైదు సెకన్ల సమయాన్ని నష్టపోయారు. దాంతో అర్హత ఫలితం తారుమారు అయింది… అని ఆయన వివరించారు.

ఆర్ఎఫ్ఐడీ విధానం ద్వారా అభ్యర్థులకు పరుగు పోటీ ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు. పైగా పరీక్ష నిర్వహించే ముందుకు దాని గురించి అభ్యర్థులకు తర్పీదు ఇవ్వలేదు. ఒలింపిక్‌ వంటి ప్రతిష్టాత్మక పోటీల్లో సైతం మిల్లీ నానో సెకన్‌ సమయాన్ని కూడా వృదా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే తెలంగాణ సర్కార్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో ఆర్ఎఫ్ఐడి విధానంలో అభ్యర్థులు నష్టపోయేలా అశాస్త్రీయ పద్ధతిలో నిర్వహించింది.

ఆర్ఎఫ్ఐడి విధానం గురించి అభ్యర్థులకు చెప్పాపెట్టకుండా పరీక్ష నిర్వహించి నిరుద్యోగుల జీవితాలతో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆడుకుంది. అనుకున్న వారిని ఎంపిక చేసేందుకు ఈ విధానం దోహదపడింది. ఆర్ఎఫ్ఐడి విధానం ఎలా మొదలు అవుతుందో.. ఎలా ముగుస్తుందో తెలియని గందరగోళ పరిస్థితిలో పరుగు పోటీ నిర్వహించారు. విజిల్‌ వేయడం ద్వారా పరుగు పోటీ ప్రారంభిస్తే.. ఆర్ఎఫ్ఐడి విధానంలో ఆ పోటీని ముగించారు.. అని ఆయన వివరించారు.

పలు పరీక్షా నిర్వహణ కేంద్రాల వద్దకు భారీగా జనం హాజరయ్యారు. ఎవరు అభ్యర్థో, ఎవరు సాధారణ వ్యక్తో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులు కాని వారు సైతం శరీర దారుఢ్య పరీక్షకు హాజరైనా పట్టుకుని గుర్తించి బయటకు పంపే పరిస్థితులు ఆ కేంద్రాల వద్ద లేవు… అని డాక్టర్‌ శ్రవణ్‌ చెప్పారు.

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయని కొన్ని ఉదాహరణల్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. మంత్రి రజిత 2016 రిక్రూట్‌మెంట్‌కు హాజరైంది. మెయిన్‌కు కూడా హాజరైంది. అదే వ్యక్తి 2018లో దరఖాస్తు చేసుకుంటే ఎత్తు లేదని చెప్పి (ఒక అంగుళం తక్కువగా ఉందని చెప్పి) అనర్హురాలిగా ప్రకటించడం విడ్డూరంగా ఉంది. 2016లో మెయిన్స్‌కు హాజరైన అభ్యర్థిని 2018 పరీక్షల్లో ఎలా అనర్హురాలు అవుతారో అర్ధం కావడం లేదు.

ఒక అభ్యర్థి గతంలో కంటే ఎత్తు ఎలా తగ్గుతారో కూడా తెలియడం లేదు. ఈ ఒక్క కేసును చూస్తే చాలు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు ఏవిధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మరో కేసును కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నిఖిల్‌ రాజ్‌ ఎత్తు 168 సెంటీమీటర్లు. అర్హతల్లో ఎత్తు 167.8 సెంటీమీటర్లని, అయితే ఆర్ఎఫ్ఐడి విధానంలో అతని ఎత్తు 172.5గా చూపించింది. ఈ అభ్యర్థి రిక్రూట్‌మెంట్‌కు అర్హత సాధించాడు. ఎత్తులో ఇంత భారీ వ్యత్యాసం ఉన్నా ఎంపిక అయ్యారంటే ఆర్ఎఫ్ఐడి పద్ధతి లోపభూయిష్టమని స్పష్టం అవుతోంది… అని డాక్టర్‌ శ్రవణ్‌ గవర్నర్‌కు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

సంగారెడ్డి, నల్లగొండ ఎంపిక కేంద్రాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. వంద మీటర్ల పరుగు పోటీని మాన్యువల్‌గాను, ముగింపునకు వచ్చే సరికి సెన్సర్‌ బేస్‌ పద్ధతిలోనూ చేశారు.  ఇలాంటి విధానాల వల్ల అనేక మంది అర్హులైన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయినట్లుగా ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు… అని తెలిపారు.

ఆర్ఎఫ్ఐడి విధానం వల్ల తాము నష్టపోయామని వేలాది మంది అర్హులైన అభ్యర్థులు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బాధిత ఫిర్యాదుదారులైన  అభ్యర్థులను మార్చి 28, 29 తేదీల్లో స్వయంగా అంబర్‌పేట్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌కు వచ్చి వివరించుకోవాలని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ ఎ.శ్రీనివాస్‌రావు చెప్పారు. అయితే అయిదు వేల మందికిపైగా అభ్యర్థులు వెడితే వారిని లోపలికి కూడా అనుమతించలేదు. బాధిత అభ్యర్థుల గోడు వినకుండానే వారిని బెదిరించి చివరికి లాఠీచార్జి చేసి అక్రమంగా అరెస్ట్‌ చేశారు. వారందరినీ ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌తో బలవంతంగా అక్కడి నుంచి తరిమివేయించారు.. అని డాక్టర్‌ శ్రవణ్‌ చెప్పారు.

ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. తిరిగి పరీక్ష నిర్వహించి అర్హులైన వారికి న్యాయం చేయాలి. శాస్త్రీయ విధానంలో పారదర్శకంగా చట్టబద్ధంగా తిరిగి అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి వారి జీవితాలకు పూర్తి న్యాయం చేయాలి.. అని ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు రాసిన బహిరంగ లేఖలో డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ కోరారు.