Home Features బోనాలు రద్దు చేసి ప్రత్యక్ష ప్రసారాల్లో ఏం చూపిస్తారు?

బోనాలు రద్దు చేసి ప్రత్యక్ష ప్రసారాల్లో ఏం చూపిస్తారు?

424
0
(నిరంజన్ గోపిశెట్టి)
బోనాల పండుగను ప్రజలు ఇళ్ల వద్దనే జరుపుకోవాలని అమ్మవారి దేవాలయాలలో పూజారులు మాత్రమే పూజలు నిర్వహిస్తారని  దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏకపక్షంగా ప్రకటించడము ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.  అంతేకాదు,బోనాల సంబురాలను నలిపివేసి గుడిలో పూజలను ప్రత్యక్ష ప్రసారము చేస్తామని కూడా ఆయన ప్రకటించారు.
బోనాల పండుగ రోజున కేవలము బోనాల సమర్పణ మరియు దర్శనాలు మాత్రమే ఉంటాయి. ఇతర పూజలేవి సాధారణముగా ఉండవు. అసలు ప్రజలే లేనప్పుడు బోనాలు లేనప్పుడు, పూజలే లేనప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు ఎవరిని చూపడానికి. వెలవెల బోయే మందిరాలను చూపడానికా?
అమ్మవారు ప్రకృతి స్వరూపము. ప్రకృతి ప్రకోపించడము వలనే కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలమౌతున్నాయని ప్రజలు విశ్వసిస్తున్నారు.
సాకలు పెట్టి, బోనాలు సమర్పించుకుని అమ్మవారిని శాంతిపచేసి కరోనా దరి చేరకుండా రక్షణ పొందాలనుకున్న భక్తులకు ప్రభుత్వ నిర్ణయము
ఆశనిపాతము లాంటిది.
అమ్మవారికి బోనము సమర్పిస్తే కరోనా రాదు. పారిపోతుంది. పాలకులు ఈ విషయం గమనించాలి.  ఇది ప్రజల మూఢ నమ్మకము కాదు అనుభవరీత్యా ఎన్నో దృష్టాంతాలు ఉన్న విషయము మరువద్దు.
కరోనా నుండి ప్రజలను కాపాడలేని ప్రభుత్వము ఈ నిర్ణయము ద్వారా ప్రజలకు అమ్మవారి రక్షణ కూడా లేకుండా చేయడము తగదు.
కరోనావైరస్ నేపథ్యములో నిబంధనలు అమలు చేసే సాధ్యాసాధ్యాలను స్థానిక పరిస్థితులను ఆయా మందిర కమిటీలతో చర్చించకుండా నిర్ణయించడము ఆత్మహత్యాసదృశ్యము.
బోనాల పండుగ రోజున సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి మందిరము, లాల్ దర్వాజా మహంకాళి మందిరము , శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరములలో జరిగే సంబరాలు చూసి కట్టడికి నిర్ణయించవద్దు.
రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న వేలాది చిన్న చిన్న గుళ్లను, పూజారులు కూడాలేని గుళ్లను, సందడి ఉండని గుళ్లను కూడా పరిగణనలోనికి తీసుకుని  ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి.
బోనాల పండుగ అంటే త్రాగే తినే పండుగనే భావన సరి కాదు. సాంప్రదాయబద్దముగా విధిగా, నిష్ఠతో 11 రోజుల పాటు నిర్వయించే పూజా కార్యక్రమాలుంటాయి. అమ్మవారి ఘటాన్ని స్థాపించడము జరుగుతుంది. 11వ రోజు ఉరేగింపుగా అమ్మవారి ఘట్టానికి వీడుకోలు పలుకడము తదితర విధి విధానాలుంటాయి. ఇవన్నీ ఒకరిద్దరు పూజారులతో జరిగే పనికాదు.
ముఖ్యముగా పాత నగరములో శతాబ్దాలుగా జరుగుతున్న బోనాల ఉత్సవాలలో, అమ్మవారి మందిరాల నిర్వహణలో దేవాదాయ శాఖ ప్రమేయము శూన్యమని చెప్పక తప్పదు.  డి.సి.రోశయ్య, పిన్సిపల్ సెక్రటరీ రెవిన్యూ (ఎండోమెంట్స్) గా ఉన్నప్పుడు కనీసము  ప్రభుత్వము తరపున కనీసము అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని కోరితే,  వారి ఆదేశము మేరకు పట్టు వస్త్రాలు సమర్పించడము మొదలైనది.
తెలంగాణా రాష్ట్ర మేర్పడిన తర్వాత ఆర్ధిక సహాయము అందజేసినా అమ్మవారి దేవాలయాల నిర్వహణలో దేవాదాయ శాఖ ప్రమేయము లేదు.
ముఖ్యమంత్రి  కె చంద్రశేఖర్ రావు గారు జోక్యం చేసుకునుని కట్టుదిట్టముగా ప్రజల విశ్వాసాలకు అనుగుణముగా బోనాలు నిర్వయించుకునే విధముగా ఆదేశించాలి.
(జి.నిరంజన్,అధికార ప్రతినిధి, తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
ప్యాట్రన్, శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరము)