Home Features యుపిలో బ్రాహ్మణోద్యమం వస్తున్నదా? వికాస్ దూబేని అమరుని చేసే ప్రయత్నం

యుపిలో బ్రాహ్మణోద్యమం వస్తున్నదా? వికాస్ దూబేని అమరుని చేసే ప్రయత్నం

180
0
SHARE
వికాస్ దూబేని నిన్న పోలీసులు ఎన్ కౌంటర్లో హత్య చేయడంతో మొదట ఉలిక్కి పడింది రాష్ట్రంలో ని బ్రాహ్మణలు. ఇది బ్రాహ్మణ హత్య అంటున్నారు. పోలీసులు హతమార్చింది గ్యాంగస్టర్ వికాస్ మోదీని కాదు,  బ్రాహ్మణ సింహాన్ని అంటున్నారు.
ఇది బ్రాహ్మణుల ఆత్మగౌరవం మీద జరిగిన దాడి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బ్రాహ్మణలు సెగలు గక్కుతున్నారు. అరుస్తున్నారు. కరుస్తున్నారు. శపిస్తున్నారు. యుపిలో ఇక ఏముంది, బ్రాహ్మణ వర్సెస్ ఠాకూర్ యుద్ధం మొదలయిందని తీర్మానించారు.  గద్దెమీద ఉన్న ఠాకూర్ గ్యాంగ్ స్టర్ (ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్ యోగి)ని కాపాడేందుకు బ్రాహ్మణ గ్యాంగ్ స్టర్  చంపేశారని ట్విట్టర్ లో  ఆగ్రహిస్తున్నారు.
దీనికి విపరీతంగా బ్రాహ్మణులు స్పందించారు. సౌత్ లో లాగా కాదు, నార్త్ లో బ్రాహ్మణల కథ వేరు, ఆఫీస్ వాచ్ మన్ దగ్గిర నుంచి ల్యాండ్ లార్డులు,గ్యాంగ్ స్టర్ల దాకా బ్రాహ్మణులు కనబడతారు.వాళ్ల జనాభా బాగా ఎక్కువ. వికాస్ దూబేని చంపడంతో వాళ్లంతా ఆగ్రహిస్తున్నారు. బ్రాహ్మణులను అణగదొక్కేందుకు ఠాకూర్ వర్గం కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. బ్రాహ్మణలు ఐక్యం కావాలని పిలుపు నిచ్చారు.
బ్రాహ్మణులు బతికితే వికాస్ దూబేలాగా బతకాలి అని  ఆయన అమరత్వం ప్రసాదిస్తున్నారు. తుపాకి పట్టండంటున్నారు.
 తాము విష్ణు దేవుడి ఆరో అవతారం పరశురాముడి వారసులమనే విషయం బ్రాహ్మణులు మర్చిపోరాదని, పోరాడటం నేర్చుకోవాలని చెబుతున్నారు. వికాస్ దూబే బ్రాహ్మిణుడు కాకపోతే, చంపే వాళ్లే కాదని, బ్రాహ్మణుడయినందుకే ఆయనను చంపారని  ఆరోపిస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న ఠాకూర్ కులానికి,బ్రాహ్మణ కులానికి మధ్య కులయుద్ధం మొదలయిందని ది ప్రింట్ రాసి సంచలనం సృష్టించింది.
ది ప్రింట్ లో జ్యోతియాదవ్ రాసిన ఈ వార్త తెగ వైరలైంది.
మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సాధారణంగా ఇలాంటివి రాసేందుకు జంకుతారు. కులం గురించి మాట్లాడటం, రాయడం కులతత్వం పోషిస్తున్నట్లు ఎవరైనా అనుకుంటారేమో నని ఫీలవుతారు. అయితే, భారత దేశంలోరాజకీయాలు, అధికారం,కులం అన్నివిడదీయలేనంతగా అల్లుకునిపోయాయి. ముఖ్యంగా నార్త్ లోని అగ్రకులాలలో ఉన్నకులాన్ని ఆమె పిండి, ఆర పోశారు.
‘మీరు చంపింది కేవలం వికాస్ దూబేని కాదు,  మీరు చంపింది బ్రాహ్మణ విశ్వాసాన్ని. మీరు మా విశ్వాసాన్ని ఖూనీ చేశారు.  మా వికాసాన్ని ఖూనీ చేశారు. దేశంలోని మిశ్రా, పాండేలు, చౌబేలు,తివారీలు, భూమిహారుల్లారా!  పరశురాముడెవరితో తలపడ్డాడో బ్రాహ్మణులంతా గుర్తుంచుకోవాలి,’ అని శివమ్ బ్రాహ్మిణ్ దాదాబాయ్ అనే వ్యక్తి ఫేస్ బుక్ లో ఘీంకరించాడు. దూబే   మీద మీరు సినిమా తీయాలనుకుంటున్నారా, ధియేటర్లను కాల్చేస్తామని హెచ్చరించాడు.
ఈ పోస్టును ఫేస్ బుక్ ఇపుడు తొలగించింది.
ఠాకూర్ల మీదకు కత్తులు దూస్తున్న బ్రాహ్మణులు, మధ్యలో కాంగ్రెస్ బ్రాహ్మణోద్యం
వికాస్ దూబేని కాల్చిచంపగానే నార్త్ లో ముఖ్యంగా యూపిలో బ్రాహ్మణ ఆత్మాభిమానం బాగా గాయపడింది. దీనిని కాంగ్రెస్ పార్టీ సొమ్ము చేసుకుంటుందా? ఏమోగాని, ఇపుడయితే ప్రయత్నాలు జోరుగా మొదలుపెట్టింది.
ఎందుకంటే గత 30 సంవత్సారాలలో  అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలకు వికాస్ దూబేతో సంబంధాలున్నాయి. ఆయనతో  సంబంధాలు లేని పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. ఎందుకంటే, కాంగ్రెస్ యూపిలో అధికారం పొగొట్టుకుని 31 సంవత్సరాలయింది. అందువల్ల  యూపిలో ప్రభుత్వాలు  గూండాలను ఎంకరేజ్ చేస్తున్నాయనగలిగే క్వాలిఫికేషన్ సంపాయించుకుంది. ఈ మాదిరి  కాంగ్రెస్ పార్టీ మాత్రమే గొడవచేయగలదు. అందుకే  ప్రియాంక గాంధీ కూడా యాక్టివ్  గా వికాస్ దూబే ఎన్ కౌంటర్ మీద దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
మరొక విషయమేమిటంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్రాహ్మణ నాయకుడు  మాజీ కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద బ్రాహ్మణోద్యమం నడపిస్తానంటున్నారు.  తన దగ్గిర ఉన్న బ్రాహ్మిణ్ చేతన్ పరిషత్ (బ్రాహ్మణ చైతన్యపరిషత్ )ను క్రియాశీలం చేయాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ ఉద్యమం గురించి బ్రాహ్మణులందరిలో సోషల్ మీడియా ద్వారా చర్చ ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా తాను అణచివేతకు గురవుతున్న బ్రాహ్మణులను ఐక్యం చేయాలనుకుంటున్నట్లు ఆయన ఈ పరిషత్ లెటర్ హెడ్ మీద ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఆయన విలేకరులకు చెప్పడం వేరే విషయం.
బ్రాహ్మిణ్ చేతన్ పరిషత్ ను ఎపుడో 2017లో అసెంబ్లీ ఎన్నికలపుడు ప్రారంభించాం. లక్నో, కాన్పూర్ లలో బ్రాహ్మణ సమ్మేళనాలు నడిపాం. బస్తి,ప్రతాప్ గడ్, అమేధీ,  అలహాబాద్ లలో బ్రాహ్మణ యాత్రలు కూడా నిర్వహించాం అని చెబుతూ ఈ సంస్థకు తాను కన్వీనర్ నని కూడా జితిన్ ప్రసాద ప్రకటించుకున్నారు.
ఉత్తర ప్రదేశ్ లో శాంతిభద్రలు అంతరించిపోయాయి, ప్రభుత్వం బ్రాహ్మణుల మీద దాడులు చేస్తూ ఉందని ఆయన అక్కసు వెళ్లగక్కారు. బ్రాహ్మణ కులం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల మీద తొందర్లోనే ‘బ్రాహ్మణ జాగరణ్ సంవాద్ ’ ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
ఈ వేదిక మీద  యూపి బిజెపి ప్రభుత్వంలో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను, దాడులను, అణచివేతను  చర్చిస్తామని ఆయన వెల్లడించారు.
ఈ విషయాన్ని వికాస్ దూబే ఎన్ కౌంటర్ కు రెండు రోజులమందుగానే జితిన్ ప్రసాద ప్రకటించారు. అంటే రాష్ట్రంలో బిజెపి ఠాకూర్ పాలనలో  బ్రాహ్మణులంతా బాగా అసంతృప్తితో ఉంటున్నారనే వాస్తవాన్ని కాంగ్రెస్ ఎపుడో గమనించిందన్న మాట.దీనిని తనవైపు తిప్పుకునేందుకుకాంగ్రెస్ ప్రయత్నిస్తున్నపుడు దూబే ఎన్ కౌంటర్ జరిగింది.
 వికాస్ దూబేని ఎన్ కౌంటర్ చేయడంతో  సోషల్ మీడియాలో పెల్లుబికిన ఆగ్రహం ఈ అసంతృప్తి ప్రదర్శనే.
రెండింటా నష్టపోయిన యూపి బ్రాహ్మణులు
ఉత్తర ప్రదేశ్ లో బ్రాహ్మణుల జనాభా 10 నుంచి 12 శాతం దాకా ఉంటుంది. కాంగ్రెస్ మెల్లిగా ఈ వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చాలా రోజుల కిందటే  మొదలుపెట్టింది.ఉత్తర ప్రదేశ్ ఇలాగైనా సరే పునర్జన్మ ఎత్తేందుకు కాంగ్రెస్ తెగ ఆశపడుతూ ఉంది..
మొన్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  ప్రియాంక గాంధీని వారణాసి నుంచి నిలబెట్టాలనుకోవడం వెనక బ్రాహ్మణ రహస్యముందని కారవాన్ మ్యాగ్ జైన్ రాసింది.
అయితే, అది వీలుపడ లేదు. చివరకు ప్రియాంకను అక్కడి నుంచి నిలబెట్టేందుకు కాంగ్రెస్ జంకింది. అజయ్ రాయ్ అనే మరొక బ్రాహ్మణుని నిలబెట్టారు.
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ని నడిపింది యూపి బ్రాహ్మణులు. ఇది గతవైభవం. బిజెపిలో ఈ యోగం దక్కేట్లు లేదు. బిజెపిని ఠాకూర్లు ఆక్రమించేసుకున్నారు.బ్రాహ్మణులను దూరంగా పెట్టేశారు.  అందుకే ఇపుడు ’ఠాకూర్ వర్సెస్ బ్రాహ్మణ‘ కుల యుద్దం యుద్ధం మొదలయింది. ఈ కొత్త యుద్ధం బ్రాహ్మణులంతా మళ్లీ కాంగ్రెస్  సొంత గూటికి  వచ్చేందుకు దోహపడతుందేమోనని కాంగ్రెస్ నాయకులు  అశగా చూస్తున్నారు.
నిజానికి బ్రాహ్మణులు నేరుగా  కాంగ్రెస్ నుంచి బిజెపికి వెళ్లలేదు. మొదట బిఎస్ పిలో కూడా చేరి తమ రాజకీయ జాతకం పరీక్షించుకున్నారు. కొంతకాలం వారి మద్దతు కూడగట్టడంలో  బిఎస్ పి నేత మాయావతి విజయవంతమయ్యారు.
 అక్కడ దళితులతో బ్రాహ్మణులు ఇమడలేకపోయారు. తర్వాత పెద్ద ఎత్తున బిజెపి వైపు మళ్లారు. కాని బిజెపి యుపిలో బ్రాహ్మణుల అధికారం పునరుద్ధరించేందుకు సముఖంగా లేదు. మోదీ వచ్చాక బిజెపి, యుపిలో ఠాకూర్లను ప్రోత్సహించింది.  ఇది బ్రాహ్మణులకు నచ్చలేదు. దీనికి ఆజ్యం పోస్తూ ముఖ్యమంత్రిగా  యోగి ఆదిత్య నాథ్ ని ఎంపిక చేయడంతో బ్రాహ్మణులు బాగా నిరాశకు గురయ్యారు. భగ్గున మండారు  ఇపుడు వికాస్ దూబే ఎన్ కౌంటర్ తో పెల్లుబుకుతున్న ఆగ్రహం వెనక  పేరుకు పోయిన ఈ అసంతృప్తి ఉంది.
ఒక విధంగా చెబితే  సెక్యులర్ భాష మాట్లాడే కాంగ్రెస్ లోనే యుపి బ్రాహ్మణులు స్వర్ణయుగం చూశారు. హిందూమతం పేరు చెప్పుకుంటున్న  భారతీయ జనతా పార్టీ హిందూ మతానికి పూజారులైన బ్రాహ్మణులను యుపిలో లెక్కచేయడం లేదు.
ఈ పార్టీ వైశ్యులకు, ఠాకూర్లకే స్వర్ణయుగం చూపిస్తూ ఉంది.  కాబట్టి బిజెపితో కలసి యుపిలో  బ్రాహ్మణులు కలసిముందుకు సాగడం కష్టమేనని బ్రాహ్మణులు భావిస్తున్నారు.
ఒక్క మాటలో చెబితే యుపి  బ్రాహ్మణులు కాంగ్రెస్ ను పొగొట్టుకున్నారు, బిజెపిని గుప్పిట్లో పెట్టుకోలేక పోయారు. రెండింటా చెడిపోయారు.
దీనిని సొమ్ము చేసుకోవడంలో కాంగ్రెస్ ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.