ముఖ్యమంత్రి గ్యాస్ లీక్ మీద క్యాజువల్ గా మాట్లాడుతున్నారు: చంద్రబాబు

(చంద్రబాబు ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు)
విశాఖపట్నం ఆర్ ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజి దుర్ఘటన బాధాకరం. ఒకవైపు కరోనాతో రాష్ట్రం, ప్రపంచం భయభ్రాంతులు అవుతోన్న పరిస్థితుల్లో, జన జీవనం స్థంభించిన పరిస్థితిలో, విశాఖలో ఇలా జరగడం చాలా బాధేస్తోంది. రాత్రంతా అసలు నేను నిద్ర పోలేక పోయాను.
తెల్లవారు జామున 3గంటలకు ఈ ప్రమాదంలో విష వాయువులు పీల్చి జనం ఎక్కడికక్కడే పడిపోవడం, 12మంది చనిపోవడం, 350మందిపైగా తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల పాలు కావడం, అందులో 44మంది పిల్లలు ఉండటం, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్లందరినీ ఆసుపత్రుల్లో చేర్చడం, అక్కడి విష వాయువులకు పాడి పశువులు విపరీతంగా చనిపోవడం, 200పశువులు అస్వస్థత కావడం, చెట్లు రంగుమారడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం.
సమాచారం నాకు అందగానే హుటాహుటిన స్పందించాను. గణబాబు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు ధైర్యంగా వెళ్లి రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడం అభినందనీయం.
ప్రధాని హైలెవల్ కమిటి మీటింగ్ పెట్టడం, హోం, డిఫెన్స్ మంత్రులతో సమీక్షించడం, హుటాహుటిన ఎన్ డిఆర్ ఎఫ్ ను మొహరింపజేసి సహాయ పునరావాస చర్యలు చేపట్టడం చూశాం.
జరిగింది తలచుకుంటే చాలా బాధేస్తోంది, మనసు కలిచివేస్తోంది. నిస్సహాయంగా చూడటం తప్ప మనం ఏమీ చేయలేక పోయామనే బాధ వేస్తోంది.

సంఘటనా స్థలానికి వెళ్లడానికి అనేక విధాలా నేను ప్రయత్నించా. కేంద్రమంత్రికి, కేబినెట్ సెక్రటరీకి, అందరినీ అనుమతులు కోరాను. ఇప్పటిదాకా రాలేదు. దీనిపై రోజంతా సమీక్షలు చేశాను. కేంద్రానికి కూడా ఎప్పటికప్పుడు లేఖలు రాశాను.

స్టెరైన్ ప్రమాదం గతంలో ప్రపంచంలో ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు.. ఇది జరిగితే ఎలా ఎదుర్కోవాలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లు లేవు. పర్యావరణ పరంగా, ఆరోగ్యపరంగా వాటిల్లే దుష్ప్రభావంపై సమాచారం లేదు. ఇలాంటి సమయంలో దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సివుంది. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు అంతా ఇక్కడికి రావాలి, ఆయా రంగాల శాస్త్రవేత్తలు ఇక్కడికొచ్చి పరిశోధనలు చేయాలి.
ప్రజల ఆరోగ్యంపై దీని దీర్ఘకాలిక దుష్ప్రభావాన్ని అధ్యయనం చేయాలి. నిన్న కూడా నేను అనేకమంది మేధావులు, నిపుణులతో చర్చించాను, వారిచ్చిన సమాచారంపై చర్చించాను.

లాక్ డౌన్ లో దీనిని మూసివేసినా, మళ్లీ తెరిచేటప్పుడు ఇదేమీ నిత్యావసర వస్తువుల పరిశ్రమ ఏమీ కాదు. లాక్ డౌన్ తర్వాత ఇప్పుడు తెరిచేటప్పుడు అన్నీ ముందే తనిఖీ చేసి ఆయా శాఖలన్నీ ఇవన్నీ పరిశీలించాకే దీనికి అనుమతులు ఇవ్వాల్సివుంది. ఒకప్పుడు ఇది పట్టణ శివారు అయినా ఇప్పుడు నగరానికి మధ్యలో ఉంది.

ఇదేరకమైన ప్రమాదాలు భోపాల్ తదితర చోట్ల జరిగాయి. అక్కడ కూడా సహాయ చర్యలు, ఆర్ధిక సాయం, పరిహారం పంపిణీ ఇలాంటివి చేశారు. ఆయా దుర్ఘటనల్లో ఏం చేశారు, ఎలా చేశారు అనేది చూడాలి. స్టైరీన్ ప్రమాదం ఎక్కడా జరగలేదు. అటువంటప్పుడు దీనిపై మరింత నిశితంగా సమగ్రంగా పరిశీలించాలి, విచారించాలి. దీనికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ , సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా క్రియేట్ చేయాలి.
ఇప్పుడు ఆసుపత్రులలో చికిత్స పొందే వాళ్లకు రేపు మళ్లీ సమస్యలు వస్తే ఏం చేయాలో ముందే అధ్యయనం చేయాలి. భవిష్యత్తులో దీనివల్ల ఎదురయ్యే దుష్పరిమాణాలను కూడా ఎదుర్కొనేలా సంసిద్దం కావాల్సివుంది. వాటన్నింటినుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దేశంలో నిపుణులైన వైద్యులు,శాస్త్రవేత్తలు వీటన్నింటిపై సమగ్రంగా విచారించాలి.
ముఖ్యమంత్రి చాలా క్యాజువల్ గా మాట్లాడారు.
కానీ దీనిని హ్యాండిల్ చేసిన తీరు చూస్తే చాలా బాధేస్తోంది.
ముఖ్యమంత్రి మాటల్లోనే, ఆయన ఏమన్నారంటే ‘‘ఎల్ జి పాలిమర్స్ మల్టీ నేషనల్ కంపెనీ. మృతుల కుటుంబాలకు రూ కోటి పరిహారం అందించేలా చూస్తా. ఎల్ జి సంస్థ ఏ మేరకు పరిహారం ఇస్తుందో చూస్తాం. ఆ పై సాయం ప్రభుత్వం నుంచే అందిస్తాం. చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఎల్ జి కంపెనీలో ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నా. సంస్థను తిరిగి ప్రారంభించాక అక్కడే ఉన్నా,వేరే చోటకు తరలించినా బాధిత కుటుంబాలకు ఉపాధి చూపిస్తామని’’ చాలా క్యాజువల్ గా మాట్లాడారు.
ఇది క్యాజువల్ గా తీసుకోవాల్సిన అంశం కాదు. ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు బాధితులను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని మహాత్మాగాంధీ చెప్పారు.
ఇందులో కూడా బాధితులను దృష్టిలోపెట్టుకుని మాట్లాడాలే తప్ప పరిశ్రమ యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడరాదు.
దీనిని ముఖ్యమంత్రి తేలిగ్గా తీసుకోవడం కరెక్ట్ కాదు:
హైకోర్టు సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేసింది. మానవ హక్కుల కమిషన్ సుమోటాగా దీనిని చేపట్టింది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ 50కోట్ల స్థానిక కోర్టులో ఎల్జీ పాలిమర్స్ డిపాజిట్ చేయాలని ఆదేశాలిచ్చింది. ప్రధానమంత్రి హైలెవల్ కమిటి పెట్టి దీనిపై సమీక్షించారు. కేబినెట్ సెక్రటరీ దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
గ్యాస్ అడ్డుకోడానికి కావాల్సిన మెటీరియల్ ఇక్కడ లేదంటే, గుజరాత్ నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడకు పంపేలా చేశారు.
ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అక్కడికొచ్చి, దీనిపై దర్యాప్తు అంతా అదేదో తూతూమంత్రంగా మా అధికారుల కమిటి విచారిస్తుందని చెప్పడం సరి కాదు. ఇది సబ్జెక్ట్ తెలిసిన నిపుణులు చేయాలి. వాళ్లు ఆపరేషనల్ ప్రొసీజర్ కరెక్ట్ గా ఫాలో అయ్యారా లేదా..? తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా…? అనే కోణాల్లో దీనిపై విచారణ చేయాలి.
తేలిగ్గా ఏదేదో చెప్పేసి 278, 284,285,337,338(2) సెక్షన్ల కింద కేసు బుక్ చేస్తే చాలదు. సింపుల్ కేసులు పెట్టి నార్మల్ గా ఈ కేసును పరిగణించడం కరెక్ట్ కాదు.
ఎల్జీ పాలిమర్స్ ప్రకటన కూడా చాలా తేలిగ్గా ఉంది
ఎల్జీ పాలిమర్స్ వాళ్లు ఏమన్నారంటే, ‘‘ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అన్వేషిస్తున్నాం. మా సాంకేతిక బృందాలకు ఆ పని అప్పగించాం. స్థానికంగా ఉన్న దర్యాప్తు అధికారులతో కలిసి ప్రమాదానికి కారణాలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ సంస్థగా అత్యున్నత పర్యావరణ పరిరక్షణ, భద్రతా ప్రమాణాలకు తాము కట్టుబడి ఉన్నామని’’ ప్రకటనలో చెప్పారు.
నిన్న జరిగిన దుర్ఘటనలో వేలాది ప్రజలు ఊళ్లు వదిలి పెట్టి ఖాళీ చేశారు. లక్షలాది ప్రజలు భయభ్రాంతులు అయ్యారు.
ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉండేవ్యక్తికి అధికారం ఉంది. కేంద్రంతో మాట్లాడవచ్చు. నిపుణులతో మాట్లాడి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అవన్నీ చేపట్టవచ్చు.
తప్పు చేసినవాళ్లు ఏ స్థాయిలో ఉన్నా, ఎవరైనా శిక్షకు అర్హులు:
ఇక్కడ ముఖమాటానికి అవసరం లేదు. తప్పు చేసినవాళ్లు ఏ స్థాయిలో ఉన్నా, ఎవరైనా శిక్షకు అర్హులు.
ఇది మూమూలుగా పరిశ్రమల్లో జరిగే ప్రమాదం వంటిది కాదు.ఇదేదో పరిశ్రమల్లో ఉద్యోగులు చనిపోయిన దుర్ఘటన కాదు. దీని కారణంగా బైట జనం చనిపోయిన దుర్ఘటన. నిన్న సాయంత్రం కూడా గుజరాత్ నుంచి మెటీరియల్ తెప్పించాక, ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఎవరూ ఉండవద్దని ప్రచారం చేశారు. దానితో విశాఖ అంతా భయభ్రాంతులకు లోనయ్యారు. నేరుగా బీచ్ రోడ్డుకు పరుగులు తీశారు.
ఇదంతా ప్రభుత్వ వైఫల్యమే. ఇలాంటప్పుడు ప్రజలు భీతి చెందకుండా ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సివుంది. అది చెప్పకుండా ఇలాంటివి చేయడం వల్లే అనేక సమస్యలు వస్తున్నాయి.
500మీటర్ల కన్నా ఎక్కువ దూరం ఈ గ్యాస్ పోదని కొంతమంది అంటున్నారు. 40రోజుల లాక్ డౌన్ వల్ల ఇది జరిగిందా, లేక ఏదైనా రసాయనం కలిసి గ్యాస్ విడుదల కావడం వల్ల జరిగిందా అనేవన్నీ సీరియస్ గా తీసుకుని విచారించాల్సివుంది.
లాక్ డౌన్ లిఫ్ట్ చేసినప్పుడు అనుకున్న ప్రొటోకాల్ అయినా పాటించారా మీరు..? అక్కడ సైరన్ కూడా మోగలేదు, మోగితే మేము వెళ్లిపోయేవాళ్లం అని జనం అంటున్నారు. నిద్రపోతూ అక్కడే చనిపోయారు. కొంతమంది ఎక్కడివాళ్లక్కడే కుప్పకూలారు. పరుగెత్తి బావిలో పడి చనిపోయారు.
బాధితులను ఆదుకున్న వారందరికీ అభినందనలు:
బాధితులను కాపాడిన ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్ ఇతర సిబ్బందిని అభినందిస్తున్నాను.
టిడిపి తరఫున విశాఖకు త్రిసభ్య బృందం:
 టిడిపి తరఫున అచ్చెన్నాయుడు, చినరాజప్ప, రామానాయుడు త్రిసభ్య బృందాన్ని పంపిస్తున్నాం.అక్కడి ప్రజానీకానికి భరోసా ఇవ్వడానికి, వారిని అన్నివిధాలా ఆదుకోడానికి, అండగా ఉండటానికి పంపిస్తున్నాం.
ఫాక్టరీ తరలింపుపై కావాలంటే ఆలోచిస్తాం, పరిహారంపై ఫాక్టరీపై చర్చిస్తాం అని తేలిగ్గా తీసుకోరాదు. ఆ ఫ్యాక్టరీని ముందుగా క్లోజ్ చేయాలి. అక్కడ నుంచి ఫాక్టరీని వెంటనే తరలించాలి. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సురక్షిత ప్రాంతానికి ఈ ఫ్యాక్టరీని తరలించాలి. ప్రజల ప్రాణాలు ఆరోగ్యం అన్నింటికన్నా ముఖ్యం.
ముఖ్యమంత్రి అవగాహనా లోపం-బాధ్యతా రాహిత్యం:
ముఖ్యమంత్రిలో అవగాహన లోపం కనిపిస్తోంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సీఎం స్థాయిలో పదిమందితో మాట్లాడాలి. అవసరమైతే ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్లాలి. నేనైతే వెంటనే అక్కడికి వెళ్లేవాడిని. ఏదో కలెక్టర్ తో మాట్లాడి ప్రకటన చేస్తే చాలదు. అక్కడే అవగాహనా రాహిత్యం కనిపిస్తోంది. ఎన్ జిటి రూ 50కోట్లు ఎందుకు డిపాజిట్ చేయమంది. హైకోర్టు ఎన్ హెచ్ ఆర్సీ ఎందుకు సుమోటాగా తీసుకున్నాయి. అందులో తీవ్రత అర్ధం చేసుకోవాలి. అంతా నాకే తెలుసు అనేది సబబు కాదు. అక్కడే ఆయనలో లోపం కనిపిస్తోంది
ప్రజల జీవితాలకు భరోసా ఉంటామని ఒక మాండేట్ తీసుకున్నాక, ఇలా చేయడం సరైందికాదు.
అంతకు ముందు కూడా కరోనాపై ఇలాగే ‘‘అదేదో చిన్న జ్వరం, పారాసిటమాల్ వేసుకుంటే పోతుందని, బ్లీచింగ్ జల్లాలని’’ అని తేలిగ్గా మాట్లాడారు. ఇప్పుడు ఇంత తీవ్ర ప్రమాదాన్ని కూడా చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు.
దీని దుష్ప్రభావం సుదీర్ఘకాలంలో తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు, మీడియాలో కథనాలు వస్తున్నాయి,వీటన్నింటిని పరిశీలనలోకి తీసుకోవాలి.
వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మార్గదర్శకం చేయాలి. ఆర్టీజిఎస్ ఉంటే ఇలాంటప్పుడు ఎంతో ఉపయోగపడేది. అక్కడి ప్రజలను సకాలంలో అప్రమత్తం చేసేది.
రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటిలో కెమికల్ ఇంజనీర్లు, సైంటిఫిక్ నిపుణులు లేరు. అధికారులతో కమిటి వల్ల కొత్తగా వెల్లడయ్యేదేమీ ఉండదు.
హుద్ హుద్ విపత్తులో నేను 9రోజులు అక్కడే ఎందుకున్నాను..? మూడు మజిలీలు దాటి పట్టుబట్టి అక్కడికి వెళ్లాను. విశాఖలో 9రోజులు మకాం పెట్టి ప్రజల్లో ధైర్యం నింపాం, భరోసా ఇచ్చాం, సహాయ పునరావాస చర్యలు పర్యవేక్షించాం. అది మన బాధ్యత.
ఇప్పుడీ ముఖ్యమంత్రి నిన్న విశాఖ వెళ్లి మళ్లీ కొన్ని గంటల్లోనే ఎందుకని వెనక్కి వెళ్లిపోయారు..? అక్కడే ఉండి పరిస్థితులను ఎందుకని చక్కదిద్ద లేక పోయారు..? దీనిని అందరూ ఆలోచించాలి.
గ్యాస్ లీకేజి టిడిపి చేసిందనే దుష్ప్రచారం చేయడం హేయం:
తామేం చెప్పినా ప్రజలు నమ్ముతారనే దురాలోచనలో వైసిపి నేతలు ఉన్నారు. గ్యాస్ లీకేజి తెలుగుదేశం పార్టీయే చేసిందని కొందరు విమర్శిస్తున్నారు. సభ్యత లేకుండా ఏది పడితే అది అంటున్నారు. ఇది సరైంది కాదు.
రాజధాని విశాఖకు మార్చడం ఇష్టంలేకే టిడిపి ఈ ప్రమాదానికి పాల్పడిందని విమర్శించడం దారుణం.
మద్యం షాపుల దగ్గరకు జనాన్ని టిడిపినే తరలించిందని కూడా వైసిపి నాయకులు విమర్శలు చేశారు. ప్రజా వేదిక విధ్వంసం నుంచి ప్రతి దానిలో ఇలాగే చేస్తున్నారు. పోలీసులు ఉన్నారు కదా అని ఇష్టారాజ్యంగా చేస్తున్నారు.
విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటనపై ప్రధానికి లేఖ రాస్తాను. విశాఖలో ఎయిర్ క్వాలిటి పరీక్షించాలి. ఎంత గాఢత ఉంది..? ఎంత విస్తీర్ణంలో వ్యాపించింది అధ్యయనం చేయాలి.
స్టైరైన్ దుష్ప్రభావంపై సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు కాబట్టి తక్షణం వెంటనే ఏం చేయాలి, బాధితులకు దీర్ఘకాలంలో ఏం చేయాలి, తక్షణమే ఎలా ఆదుకోవాలి అనేదానిపై ఆ లేఖలో పేర్కొంటాం.
ప్రజలందరికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు రూపొందించాలి:
అక్కడి ప్రజలందరికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు రూపొందించాలి. భవిష్యత్తులో ఏమీ జరగకపోతే బాధ లేదు. ఏదైనా జరిగితే మాత్రం దానికి కూడా వీళ్లే బాధ్యత తీసుకోవాలి. ఏదైనా సమస్య భవిష్యత్తులో వస్తుందని తేలితే ఇప్పటినుంచే వాటికి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి.
ఈ దుర్ఘటనపై నిజ నిర్దారణ జరగాలి. సుందర నగరం విశాఖను కాపాడుకోవాలి.
ప్రజల జీవితాలను దీర్ఘకాలంలో ప్రభావితం చేసే ప్రమాదం ఇది. దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో కూడా అధ్యయనం చేయాలి. సైంటిస్ట్ లు చెప్పే అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలి. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేసిన నిపుణులను, ఇలాంటి వ్యాధులకు చికిత్స చేసిన వైద్యులు, ఇతర నిపుణులతో చర్చించాలని’’ చంద్రబాబు పేర్కొన్నారు.