Home Features సజ్జలను గుమాస్తా అనొచ్చా, ఇంతకీ సజ్జల ఎవరో చంద్రబాబుకి తెలుసా?:మాకిరెడ్డి

సజ్జలను గుమాస్తా అనొచ్చా, ఇంతకీ సజ్జల ఎవరో చంద్రబాబుకి తెలుసా?:మాకిరెడ్డి

283
0
సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి జగన్ సలహాదారు

సజ్జలను చులకన చేసేందుకు గుమాస్తా అని సంబోదిస్తూ తన స్థాయిని తగ్గించుకుంటున్న చంద్రబాబు…

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని విపక్ష నేత చంద్రబాబు గారు ఈ మధ్య గుమాస్తా అంటూ పదే పదే సంభోదిస్తున్నారు. వారి ఉద్దేశ్యం సజ్జలను అవమానించాలనుకోవడంలో భాగంగా అలా మాట్లాడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలలో ప్రత్యర్థిని విమర్శించడం , వారికి అలా మాట్లాడే స్థాయి లేదు అని గుర్తు చేయడం సహజంగా జరిగేవి. కానీ చంద్రబాబు సజ్జలను తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకుని తను చులకన అవుతున్నారు అని గుర్తించలేక పోతున్నారు.

సజ్జల గుమాస్థానా….

చంద్రబాబు తరచూ అనే మాట సజ్జల సాక్షి పత్రికలో పనిచేసే గుమాస్తా. ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు , ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన చేయాలని అనుకున్నప్పుడు సజ్జల మీడియా ముందుకు వస్తుంటారు. వారి వైపు నుంచి వచ్చే రాజకీయ ప్రకటనను విమర్శించవచ్చు , ప్రతి విమర్శలు చేయవచ్చు. అందుకు భిన్నంగా చంద్రబాబు సజ్జలను స్థాయి తక్కువ వ్యక్తి అని సంభోదిస్తున్నారు. వారి స్థాయికి సజ్జల తగడు అనుకుంటే తన పార్టీలోని దిగువ శ్రేణి నేతలతో మాట్లాడించాలి. లేదా సజ్జల మాటలలో స్థాయి లేని మాటలు ఏమో చెప్పాలి అంతే గాని గుమాాస్తా అనే పదం ఎందుకు వాడుతున్నారు కేవలం తక్కువ చేసి హేళన చేయడమే. గుమాస్తా ఉద్యోగం చిన్నదే కానీ అవమానకర వృత్తి మాత్రం కాదు.

మీడియా గురించి చంద్రబాబు కున్నంత పరిజ్ఞానం మరో నేతకు ఉండదు. దివంగత నేత వైఎస్ సాక్షిని ప్రారంభించారు. తొలి బోర్డులో సజ్జల డైరెక్టర్. కీలక స్తానం. తనకు నచ్చని అంశంతో లేదా వ్యక్తితో విబేధించడంలో తప్పు లేదు కానీ అవమానించడం తప్పే. ఆవేశంగా మాట జారితే అర్థం చేసుకోవచ్చు. కానీ చంద్రబాబు సజ్జలను ఆవేశంతో అన్న మాట కాదు వారిని అవమానించాలనే ఉద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.

వైయస్ తో రాజకీయ పయనం ప్రారంభించిన సజ్జల నాటి నుంచి నేటి వరకు వైయస్ కుటుంబంతోనే సాగుతోంది. వైయస్ జగన్ రాజకీయ పార్టీని ప్రారంభించిన నాటి నుంచి కీలక వ్యక్తిగా ఉన్నారు. జగన్ కు నమ్మిన వ్యక్తిగా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారు కీలక సలహాలను తాను నమ్మిన వారినుంచి తీసుకుంటారు. అందులో భాగంగానే సజ్జలను ప్రభుత్వ సలహాదారుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియమించారు. ఎవరిని ఏ స్థానంలో నియమించాలని కూడా చంద్రబాబు చాలా సందర్భాలలో చెపుతున్నారు. సలహాదారులలో నిబంధనలకు భిన్నంగా నియామకాలు ఉంటే తప్పు పట్టవచ్చు. మరో అంశం హోమ్ శాఖను గుప్పెట్లో పెట్టుకున్నారు. సజ్జల సలహాలు ముఖ్యమంత్రికి ఇస్తారు. ఆ సలహాలు బాగున్నా బాగలేకున్నా బాధ్యత వారిని వారి సలహాలను తీసుకున్న ముఖ్యమంత్రిది. హోమ్ వ్యవహారాలలో సజ్జల జోక్యం చేసుకోవడం గురించి మాట్లాడాల్సినది సంబంధిత మంత్రి. వారితో సంబందం లేకుండా విమర్శలు చేస్తే ప్రయోజనం శూన్యం.

సజ్జల రాజకీయ నేపద్యం…

విద్యార్థి సంఘాలతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనది. తదనంతరం ఉదయం , సాక్షి లో కీలక భూమిక పోషించారు. వైయస్ మరణాంతర పరిణామాలతో జగన్ కోరిక మేరకు వైసిపిలో కీలక భూమిక పోషించారు. నమ్మకం , అప్పగించిన బాధ్యతలు విజయవంతం చేస్తారు అన్న అంచనా జగన్ కు ఏర్పడింది. దాదాపు దశాబ్ద కాలంలో అధికారంలో లేనప్పుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ జగన్ తోనే ఉన్నారు. ఎన్నికల సమయంలో కూడా అంతర్గతంగా పార్టీ వ్యవహారాలను సజ్జలే చుసుకున్నారు. 2019 లో అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే సజ్జలకు ముఖ్యమంత్రి కీలక బాధ్యతలు అప్పగించారు. కీలక బాధ్యతలలో ఉన్నవారు నిర్ణయాలలో కీలకంగా వ్యవహరిస్తారు. ఆ నిర్ణయాలను విమర్శించవచ్చు అంతే గాని తులనానడం , అవమానించడం రాజకీయాలకు పనికిరావు.

వ్యక్తిగతంగా నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో 2018 లో పరిచియం ఏర్పడింది. ప్రతిపక్ష పార్టీ , అధికార పార్టీనేతగా ఉన్న సజ్జల వ్యవహార శైలి హుందాగా ఉంటుంది. జర్నలిస్ట్ , విద్యార్థి ఉద్యమ అనుబంధం అందుకు కారణం కావచ్చు. రాయలసీమ సమస్యల విషయంలో , ముడు రాజధానులు వ్యవహారం , ప్రాధాన్యతా క్రమంలో నిర్మించడం లాంటి అంశంపై నేను కొన్ని భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు నా స్థాయిని వారు ఎన్నడూ ప్రశ్నించలేదు. ఎందుకు అలాంటి అభిప్రాయంతో ఉన్నావు , కొన్ని సందర్భాలలో తొందరపడొద్దు అని కోరేవారు. సమగ్ర నివేదిక ఇవ్వు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తాను అనేవారు తప్ప మాటతూలే వారు కాదు.సజ్జలను వ్యక్తిగతంగా అవమానించాలనుకుంటున్న చంద్రబాబు గారు గమనంలో ఉంచుకోవాల్సిన విషయం. వ్యక్తిని బౌతికంగా అవమానిస్తే వారి స్థాయి తగ్గదు. వారి మాటలలో బలహీనతలను ఎత్తి చూపితే తగ్గుతుంది. నేడు సజ్జలను గుమాస్తా అని చులకనగా మాట్లాడుతున్న విపక్ష నేత తాను చులకన కాకముందే తన వైఖరిని మార్చుకుంటే చంద్రబాబు గారికి మంచిది.

(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి, రాజకీయ సాంఘిక విశ్లేషకుడు, తిరుపతి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here