సాంకేతిక అంశాలతో మాతృభాష సంరక్షణ సాధ్యమా ?

(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి)

రాజకీయ సంకల్పంతోనే మాతృ భాష పరిరక్షణ !

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక విద్యలో ఆంగ్లమాధ్యమ బోధనకు సంబంధించిన ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పు ద్వారా మాతృభాషకు మంచి జరిగిందని లేదు పేదలకు అన్యాయం జరిగిందని రెండు వాదనలు వినిపిస్తున్నాయి. స్థూలంగా ఈ తీర్పుతో మాతృభాష పరిరక్షణ జరిగిపోతుంది అని చెప్పలేము.

సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే కోర్టు తీర్పు ఇచ్చింది అని చెప్పక తప్పదు. భారత రాజ్యాంగం ప్రకారం భాషకు సంబంధించి ఎంపిక చేసుకునే అంశం ప్రజల ప్రాథమిక హక్కు మాతృభాషను బోధించే విషయంలో మాత్రమే ఆదేశాలను జారీచేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇది తెలిసి కూడా ప్రభుత్వం ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధనకు సంబంధించిన ఆదేశాలు జారీచేసింది. సహజంగానే కోర్టు రద్దు చేసింది. అదే జీఓ ఇవ్వకుండా ఆంగ్లభాషలో విద్యాబోధనకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండి ఉండేది.

మాతృభాషకు నష్టం కాదు మనిషి సర్వతోముకాభివృద్ధి ఆటంకం..

చాలా కాలం నుంచి మాతృభాషను నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాథమిక విద్య మాతృభాషలో జరగడం అవసరం ఎంతైనా ఉంది. ప్రతి మనిషి ప్రాథమిక విద్యలో ప్రావీణ్యం సాధించినపుడే మరిన్ని భాషలను సులభంగా నేర్చుకోగలడు. మాతృభాషలో పట్టు సాధించలేకపోతే ఇతర భాషా పరిజ్ఞానం సాధ్యం కాదు. మాతృభాషను కోల్పోవడం వల్ల నష్టం జరిగేది సమాజానికే. రాష్ట్రంలో స్కూలు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య 70 లక్షలు అన్ని రకాల ప్రభుత్వ సారధ్యంలోని సంస్థలలో చదువుతున్న విద్యార్థులు 40 లక్షలు. అదే ప్రవేటు సంస్థలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 30 లక్షలు. ఇక్కడ ఉన్న విద్యార్థులు దాదాపుగా ఆంగ్ల మాధ్యమంలోనే విద్యను అభ్యసిస్తున్నారు. కేవలం ప్రభుత్వ సంస్థలలోని వారు మాత్రమే తెలుగు భాషలో విద్యను అభ్యసిస్తున్నారు. కేవలం ఒక తరగతి ప్రజలు మాత్రమే మాతృభాషను చదువుకోవడం వల్లే తెలుగుభాషను కాపాడుకోలేము. ఇక్కడ కూడా ప్రభుత్వం జీఓ ఇవ్వకుండా ఆంగ్లభాషను ప్రోత్సాహించి ఉంటే ప్రవేటు విద్యాసంస్థలలో జరిగిందే జరిగేది.

రాజకీయ సంకల్పంతోనే మాతృభాషను కాపాడుకోగలం..

నేడు ప్రభుత్వ జీఓ ను రద్దు చేసినంత మాత్రాన మాతృభాషలో విద్యాబోధన జరుగుతుంది అని అనుకోలేము. జీఓ లు ఇవ్వకుండా ఇదివరకు ప్రభుత్వాల హయాంలో జరిగిన పద్దతిలో కొనసాగితే జీఓ లు లేకుండా100 శాతం ప్రవేటు సంస్థలలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన లాగా సమీప భవిష్యత్తులో ప్రభుత్వ బడులలో కూడా ఆంగ్ల విద్య వస్తుంది. మనిషి సర్వేతో ముకాభివృద్ది తల్లి భాషలో ప్రాథమిక విద్యే కీలకం అన్న వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ప్రభుత్వ , ప్రవేటు అన్న వ్యత్యాసం లేకుండా మాతృభాషలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. అంతే కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేడు తెలుగుభాషలో అందుబాటులో లేదు. అంతర్జాలం అందుబాటులో ఉన్న నేటి సమాజంలో కీలక సమాచారం ఆంగ్ల భాషలోనే లభిస్తుంది. ప్రభుత్వం కీలక సమాచారం తెలుగులో కూడా లభించేలా కృషి చేయాలి. అలాంటి ప్రయత్నం చేయకుండా తల్లి భాష గొప్పది అని కేవలం భావోద్వేగంతో మాత్రమే వ్యవహారం చేస్తే తెలుగు భాషను కాపాడు కోవడం అసాధ్యం.

కోర్టు తీర్పు నేపద్యంలో రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించి రాష్ట్రంలోని విద్యార్థుల బోధన భాషను యూనిపామ్ గా ఉండేలా చర్యలు తీసుకోవాలి. భాషను భాషగా మాత్రమే ప్రోత్సాహిస్తే సమీప భవిష్యత్తులో మాకు ఆంగ్ల భాష కావాలని విద్యార్థులే డిమాండు చేసే అవకాశం ఉంది. తాము తెలుగులో విద్యను అభ్యసిస్తున్న కారణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని , అవకాశాలను కోల్పోతున్నాము అన్న భావన ఏర్పడే అవకాశం లేని విధంగా మాతృభాషలో సమాచారం , ఆధునికీకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలి. అపుడు మాత్రమే మనిషి సమగ్రాభివృద్ధికి మాతృభాష మూలం అన్న పరిస్థితి నిజమవుతుంది. అలా కాకుండా సాంకేతి అంశాల ఆధారంగా మాతృభాషను కాపాడుకోవడం సాధ్యం కాదు.