బిసి కార్పొరేషన్లకు జగన్ రాజ్యాంగ రక్షణ కల్పిస్తారా?

బిసి కార్పొరేషన్లు ఆ కులాల సంక్షేమానికా లేక  విభజించి పాలించే ఎత్తుగడేనా!

(సిహెచ్ నరేంద్ర)
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఒకే రోజున రాష్ట్రంలో 57 బిసి కులాలకు కార్పొరేషన్ లను, వాటికి పాలక వర్గాలను ఏర్పాటు చేయడం ద్వారా చరిత్రాత్మకమని, ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో బిసిలకు పెద్ద పీట వేసిన్నట్లు అయినది అంటూ అధికారంలో ఉన్న నేతలు ఉప్పొంగి పోతున్నారు.
దేశంలో ఒకసారి ఈ విధంగా ఇన్ని బిసి కార్పొరేషన్ లను ఏర్పాటు చేయలేదని అంటూ ప్రచారం చేస్తున్నారు. పైగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా బిసిలు పండుగ జరుపుకోవాలని అంటూ వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది.
‘బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, వెన్నెముకలాంటి వర్గాలు’ అని ముఖ్యమంత్రి సాహసోపేతంగా చేసి చూపించారని అంటూ ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఆ విధంగా తొలి నుండి కాంగ్రెస్ కు, ఆ తర్వాత ఆ పార్టీ మరో రూపమైన వైసీపీకి దూరంగా ఉంటున్న బిసి వర్గాలను దగ్గర చేర్చుకునేందుకు బృహత్తర ప్రయత్నం చేస్తున్నారు.
వారి రాజకీయాలు ఎట్లాగూ ఉంచితే, గత ఎన్నికల సమయంలో ప్రతి బిసి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన 17 నెలలకు కేవలం 57 కులాలకు మాత్రమే వేయడం గమనార్హం. అంటే మూడోవంతుకన్నా కొంచెం ఎక్కువ కులాలకు వేశారు.
ఈ కార్పొరేషన్ లకు ఎటువంటి చట్టబద్దత, నిధుల కేటాయింపు లేకుండా కేవలం పదవులు ఇచ్చినందున ఉపయోగం ఏమీ ఉండదు. కనీసం వాటికి కార్యాలయాలను, ఇతర సదుపాయాలను కూడా ప్రభుత్వం సమకూర్చుకోవడం లేదు. చైర్మన్లే తమకు వచ్చే జీతంలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనుకబడిన తరగతుల  కులాల కార్పోరేషన్ల నియామకం బిసిల కులాల మధ్య అనైక్యతను పెంచి విభజించు పాలించు అనే బ్రిటిష్ వారి ధుర్మార్గమైన సూత్రంలాగా ఉందని బీజేపీ రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షుడు బిట్రా వెంకట శివన్నారాయణ విమర్శించారు.
పైగా, వాటిల్లో షేక్ కార్పొరేషన్, ముస్లిం సంచారజాతుల కార్పోరేషన్ లను బిసి జాబితాలో కలిపి బిసిలకు ఏం సందేశం పంపాలనుకుంటున్నారని సీఎం జగన్ ను ఆయన  ప్రశ్నించారు.ఇది బిసిల హక్కులకు భంగం కలిగించడమే  అని స్పష్టం చేశారు.
 ఒక విధంగా జగన్ వ్యవహరించిన తీరు బిసిల ఆత్మగౌరవం, ఐక్యతను దెబ్బతీసే ప్రక్రియగా ఉన్నట్లు పలువురు బిసి నాయకులు మండిపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిన ఓబిసి కార్పోరేషన్ ఉండగా ఈ కుల  కార్పొరేషన్ల నాటకం దేనికి అని ప్రశ్నిస్తున్నారు. కేవలం కార్పొరేషన్ ల పేరుతో ప్రభుత్వ నిధులను అధికార పార్టీ కార్యకర్తలు స్వాహా చేసేందుకే ఈ విధంగా నీయమకాలు జరిపినట్లు విమర్శలు చెలరేగుతున్నాయి.
బిసి కార్పొరేషన్ల వెనక వెనక పెద్ద రాజకీయం ఉందంటున్నారు?
చట్టబద్ధత ఉన్న కార్పొరేషన్ పేరిట నిధులు విడుదల చేస్తే ఖచ్చితంగా ఆ నిధులు బిసిలకే వాడాల్సి వస్తుందనే భయంతో ఈ కార్పోరేషన్ల నాటకాలు ఆడుతున్నారని బిసి నేతలే వాపవుతున్నారు.
బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో 95 శాతం, బీసీ సబ్‌ప్లాన్‌ కేటాయింపుల్లో రూ.4000 కోట్లు, బీసీ కార్పొరేషన్ల నుంచి రూ.3400 కోట్లు మళ్లించడం బిసిల సంక్షేమం పట్ల జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నార్ధకరంగా మారుస్తుంది. నిధులన్నీ మింగేసి ఉత్తుత్తి పదవులను బీసీ నేతలకు ఇచ్చి ఏదో గొప్ప మేలు చేసినట్లు కోట్లు పత్రికల్లో ప్రకటనలు గుప్పించుకోవడం బిసి వర్గాలను సహితం నిరాశకు గురిచేస్తున్నది.   అదే కులాల పేరిట కార్పోరేషన్లకైతే ఎంత నిధులు విడుదల చేశారు అలాగే ఎంత వినియోగించారనే జవాబుధారి వ్యవస్థ ఉండదు. అందుకే ఈ కుల కార్పొరేషన్ అనే విషబీజం నాటారని ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ చర్యలు రాబోయే రోజుల్లో బిసి జాతిని నిర్వీర్యం చేసి బిసిలను ఆర్థికంగా, సామాజికంగా అణగద్రొక్కి రాజ్యాధికారం అనే ఆలోచనలు బిసిలకు రాకుండా చేయాలనే భారీకుట్రను జగన్ ప్రభుత్వం నాంది పలుకుతున్నదనే అని జగన్ విమర్శకులు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చట్టబద్ధత కల్పించిన బిసి కార్పోరేషన్ కు, అలాగే యన్.టి.,డి.యన్.టి, అత్యంత వెనుకబడిన తరగతుల  కార్పరేషన్లను ఏర్పాటు చేసింది. వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదే విధంగా 2021 లో జరగబోయే జనగణన ప్రతి కులంలో విధ్య ,ఆర్థిక స్థితిగతులు, రాజకీయ ప్రాతినిధ్యం ఎంత శాతం ఉంది అనేది కూడా జరపడం ద్వారా బిసిలకు చట్టబద్దమైన సాధికారికతకు మార్గం ఏర్పడుతుంది. ఆ దిశలో ఏపీ ప్రభుత్వం ఎటువంటి సన్నాహాలు చేస్తున్నట్లు కనబడటం లేదు. ఈ కార్పొరేషన్లకు రాజ్యాంగ బద్ధత లేెకపోతే వీటికి విలువ ఉండదు. వీటిని అధికారులు లెక్క చేయగలరు. వీటన్నంటికి చట్టబద్ధత కల్పించేందుకు జగన్ ప్రభుత్వం చర్య లు తీసుకోగలదు. అసెంబ్లీ లో చట్టం చేసిన ఈ కార్పొరేషన్ ల హోదా పెంచగలరా? అలచేయకపోతే, ఇది కేవలం ప్రచారంకోసమే అనుుకోవాలి.
1881 నుంచి 1931 వరకు జనగణన కులప్రాతిపదికన 1931 వరకూ జరిగింది. అయితే స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆ విధానానికి స్వస్తి పలకడం ద్వారా కాంగ్రెసు పాలకులు బిసిలకు  చేసిన ద్రోహంను బిసిలు ఎప్పటికీ క్షమించలేరు.