బ్రహ్మంగారి మఠం రిజర్వాయరుకు కృష్ణా జలాలేవి?

 (టి.లక్ష్మీనారాయణ)
శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్.ఆర్.బి.సి., తెలుగు గంగ, గాలేరు – నగరి ప్రాజెక్టులకు, కె.సి.కెనాల్, చెన్నయ్ నగరం మరియు రాయలసీమ ప్రాంత త్రాగు నీటి అవసరాలకు కృష్ణా నదీ జలాల తరలింపు వీలౌతుంది.
 మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో భారీ వర్షాల ఫలితంగా కృష్ణా నది పరవళ్ళు తొక్కుతూ సముద్రం వైపు పరుగులు పెడుతూనే ఉన్నది. ఆగస్టు 4 వ తేదీకి శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 854 అడుగులకు చేరుకొన్నది. రెండు నెలలుగా శ్రీశైలం జలాశయం నిండు కుండలా నీటితో తొణికిసలాడుతున్నది. నాలుగు సార్లు గేట్లు ఎత్తి నీటిని క్రిందికి వదిలారు. నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజి దాటుకొని దాదాపు 400 టియంసిల నీరు సముద్రగర్భంలో కలిసిపోయింది.
శ్రీశైలం జలాశయం నుండి 30 రోజుల్లో 114 టియంసిల నీటిని తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరును 44,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించబడింది. పోతిరెడ్డిపాడు నుండి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా కర్నూలు జిల్లాలో 16.95 టియంసిల సామర్థ్యంతో నిర్మించబడిన వెలుగోడు రిజర్వాయరుకు ముందు నీరు చేరుతుంది. వెలుగోడు రిజర్వాయరును ఈ ఏడాది కూడా నీటితో నింపారు.
వెలుగోడు నుండి కడప జిల్లాలో నిర్మించబడిన సబ్సిడరీ రిజర్వాయర్స్ బండ్ ‘ఎ’, బండ్ ‘బి’ వరకు, అటుపై బ్రహ్మంగారి మఠం రిజర్వాయరుకు నీటిని తరలించడానికి 5,000 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రధాన కాలువ నిర్మించబడింది.
 తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగంగా 17.74 టియంసిల సామర్థ్యంతో కడప జిల్లాలో నిర్మించబడిన బ్రహ్మంగారి మఠం రిజర్వాయరుకు కేవలం 0.8 టియంసిలను మాత్రమే ఈ ఏడాది తరలించారు. ఆంధ్రప్రదేశ్ నీటి వనరుల శాఖ ‘వెబ్ సైట్’ తాజా సమాచారం మేరకు బ్రహ్మంగారి మఠం రిజర్వాయరులో 2.62 టియంసిల నిల్వ ఉన్నది. అంటే అంతకు ముందు రిజర్వాయరులో నిల్వ ఉన్న నీటికి ప్రస్తుతం దాదాపు ఒక టియంసి మాత్రమే చేరింది. గతంలో బ్రహ్మంగారి మఠం రిజర్వాయరులో 12, 13 టియంసిలు నిల్వ చేసి పోరుమామిళ్ళ, బద్వేల్ చెరువులకు నీటిని సరఫరా చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. మరి, ఈ ఏడాది ఎందుకు మఠం రిజర్వాయరుకు నీటిని తరలించలేక పోయారు అన్నదే ప్రశ్న. లోపమెక్కడుంది ?
 కారణాలేంటో తెలుసుకొందామని తెలుగు గంగ ప్రాజెక్టు పరిథిలో పని చేస్తున్న ఇంజనీర్లతో మాట్లాడా. వెలుగోడు రిజర్వాయరు నుండి 3,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే, కర్నూలు – కడప జిల్లాల సరిహద్దు చేరేటప్పటికి 1,800 క్యూసెక్కులు, బండ్ (ఎ), (బి) చేరేటప్పటికి 1300 క్యూసెక్కులు, బి.మఠం రిజర్వాయరుకు 1,019 క్యూసెక్కులు మాత్రమే అంత్యమంగా చేరుతున్నాయని తెలియజేశారు. కారణం, తెలుగు గంగ ప్రధాన కాలువ 98.6 కి.మీ. నుండి అంటే కర్నూలు – కడప జిల్లాల సరిహద్దు నుండి ప్రధాన కాలువకు “లైనింగ్” చేయక పోవడం పర్యవసానంగా నీరు వృధాగా పొలాల్లోకి వెళుతున్నదని చెప్పారు. అంటే, అంత నాసిరకంగా ప్రధాన కాలువను నిర్మించారా! అన్న అనుమానం రాకమానదు.
 “లైనింగ్” పనుల కాంట్రాక్టును రు.280 కోట్లకు తీసుకొన్న సి.యం.రమేష్, యాదవ్ లు నిర్మాణ పనులు చేపట్టక పోవడం వల్ల నీరు అందుబాటులో ఉన్నా తరలించుకోలేని దుస్థితి నెలకొన్నదని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రధాన కాలువ ‘లైనింగ్’ పనులకు “రీ టెండరింగ్” పిలవాలని ఆలోచిస్తున్నదని చెప్పారు.
 కుందూ నదీ పరివాహక ప్రాంతంలో ఇటీవల వర్షంపడి వరద వచ్చినప్పుడు 3500 క్యూసెక్కుల వరకు అదే కాలువ గుండా నీరు ప్రవహించింది కదా! అంటే దానికి సరియైన సమాధానం లభించలేదు.
 శ్రీశైలం జలాశయం నుండి 29 టియంసిల కృష్ణా వరద నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలించి కర్నూలు జిల్లాలో 1,08,000 ఎకరాలకు, కడప జిల్లాలలో 1,67,000 ఎకరాలకు, మొత్తం 2,75,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలి. అలాగే 30 టియంసిల పెన్నా నది జలాలను నెల్లూరు జిల్లాలో 2,54,000, చిత్తూరు జిల్లాలో 46,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు ఇవ్వాలి. మొత్తం ఆయకట్టు 5,75,000 ఎకరాలు.
చెన్నయ్ నగరానికి 15 టియంసిల నికర జలాలను త్రాగు నీటి అవసరాలకు సరఫరా చేయాల్సి ఉంది. అలాగే రాయలసీమ ప్రాంతం త్రాగు నీటికి కోసం నీటిని తరలించాల్సి ఉన్నది.
 తెలుగు గంగ ప్రాజెక్టు పరిథిలోని వెలుగోడు రిజర్వాయరులో 16.47 టియంసిలు (గరిష్ట నిల్వ సామర్థ్యం 17.95 టియంసిలు) నిల్వ ఉన్నది. నెల్లూరు జిల్లాలోని సోమశిల రిజర్వాయరుకు 70 టియంసిలు(గరిష్ట నిల్వ సామర్థ్యం 78 టియంసిలు), కండలేరు రిజర్వాయరుకు 17 టియంసిల(గరిష్ట నిల్వ సామర్థ్యం 68 టియంసిలు) నీరు తరలించబడింది. ఒక్క బ్రహ్మంగారి మఠం రిజర్వాయరుకు మాత్రం నీటిని తరలించ లేదు.
 ప్రభుత్వ అలసత్వానికి, బాధ్యతారాహిత్యానికి, నాసిరకం నిర్మాణాలకు తెలుగు గంగ ప్రాజెక్టు ప్రబల నిదర్శనంగా నిలిచింది. ప్రాజెక్టు పరిథిలో పంట కాలువల వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మించ లేదు.
కృష్ణా నది వరద నీరు దాదాపు 400 టియంసిలు సముద్రం పాలైన పూర్వరంగంలో కూడా కరవు పీడిత ప్రాంతానికి నీటిని తరలించడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించ లేదని చెప్పక తప్పదు.
– టి.లక్ష్మీనారాయణ,నీటి పారుదల రంగ విశ్లేషకులు

(photo Wikimapia)