సొంతింటి కల మానేసిన బిజెపి, టీడీపీతో మళ్ళీ జత కట్టే యోచన

(Dr NB Sudhakar Reddy)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని తలపోస్తున్న బిజెపి మళ్ళీ టిడిపితో జతకడుతుందా ? పొత్తు పెట్టుకుని అధికారం చేపడుతుందా ? అంటే ఔననే ఎక్కువ మంది సమాదానం చెపుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 లో ఎపిలో జరిగిన ఎన్నికల్లో బిజెపి, జనసేన మద్దతు ఇవ్వడం వల్ల టిడిపి అధికాంలోకి వచ్చింది.
2019 లో ఆ రెండు పార్టీలు టిడిపిని ఓడించాలన్న లక్ష్యంతో విడి విడిగా పోటీ చేశాయి. దీంతో ఓట్లు చీలి వైకాపా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.
తరువాత టిడిపి దెబ్బతింటే తాము వైకాపాకు ప్రత్యామ్నాయం కావచ్చని బిజెపి తలపోసింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేయవచ్చని కలలు కనింది. అవన్నీ పగటి కలలని మొన్న ఎన్నికల్లో అర్థమయింది. ఎన్నికల తర్వాత కూడా బిజెపి ఒక్క అంగుళం ముందుకు కదలడం లేదు. మోదీ ఆకర్షణ ఆంధ్రలోకి ప్రవేశించడమే లేదు. తర్వాత కొద్దిగా వ్యూహం మార్చుకుని  కొంత బలమున్నచిన్న పార్టీ  జనసేనతో జతకట్టి వ్యూహాత్మకంగా ఎదగాలని ప్రయత్నించింది. అయితే అనుకున్నంతగా ఎదగలేక పోతున్నది.
కాగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, టిడిపి నేత చంద్రబాబు నాయుడు వ్యూహం, పనితీరు వల్ల తిరిగి టిడిపి పుంజుకుంటున్నదే తప్ప తమని ప్రజలెవరూ గుర్తించడం లేదని బిజెపి గ్రహించక తప్పడం లేదు. అడగడుగునా వైకాపా ప్రభుత్వం పనితీరును ఎండగడుతున్నా ప్రజల్లో  టిడిపిని రీప్లేస్ చేసే స్థాయికి ఎదగడం లేదన్న స్పృహ బిజెపి నేతల్లో వచ్చినట్లు చెబుతున్నారు..
దీంతో 2022లో జమిలి ఎన్నికలు వచ్చినా, 2024లో జరిగే సాధారణ ఎన్నికలైనా టిడిపి యే ప్రధాన పోటీ ఇస్తుందని,  తిరిగి అధికారంలోకి వుండేది ఒక్క టిడిపికే అనే  అంచనా బిజెపినేతలు వచ్చినట్లు చెబుతున్నారు.
దీంతో సొంతఇంటి కల మానేసి జనసేనతో కలపుకుని టిడిపితో కలసి ముందుకు పోవడమే మంచిదని బిజెపి నేతలు భావిస్తున్నారు. దీనికి టిడిపి చరిత్రను విశ్లేషిస్తున్నారు.
స్వర్గీయ ఎన్ టి రామారావు ఉమ్మడి రాష్ట్రంలో 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఎర్పాటు చేశారు.అప్పటిలో ఎదురులేని కాంగ్రెస్ పార్టీని ఓడించి, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే టిడిపి అధికారంలోకి వచ్చింది.
1983 జనవరి 29న ఆంధ్రప్రదేశ్ 10వ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.1985 మధ్యంతర ఎన్నికల్లో గెలిచిన టడిపి 1989 లో ఓటమి పాలయ్యింది.1994 లో తిరిగి అధికారంలోకి వచ్చింది.
అయితే పార్టీ అంతర్గత సమస్యల వల్ల 1995 సెప్టెంబర్ 1వ తేది నుండి తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు చేతికి వచ్చాయి. తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వానికే ప్రజలు పట్టం గట్టారు. 2004, 2009 ఎన్నికల్లో డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికాంలోకి వచ్చింది.
2014లో రాష్ట్రం విడిపోయిన తరువాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అధికారం చేట్టారు.అప్పటి వరకు 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పార్టీని కాపాడుకుంటూ పోరాటం సాగించారు.
ఇప్పుడు కరోనా సమస్య వల్ల బయట తిరగలేక పోతున్నప్పటికి సామాజిక మాధ్యమం, వర్చువల్ సమావేశాల ద్వారా వైకాపా ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారు. ఇందులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
2019 ఎన్నికల్లో టిడిపికి 40 శాతం ఓట్లు, 23 సీట్లు వచ్చాయి.వైకాపా 50 శాతం ఓట్లు 151 సీట్లు వరించాయి. కాగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకు ఏడు శాతం ఓట్లు ఒక స్థానం దక్కింది. బిజెపి కేవలం ఒక శాతం ఓట్లతో సరిపెట్టుకోవిల్సి వచ్చింది. ఇప్పుడు వైకాపాకు 10 శాతం ఓట్లు తగ్గాయని ఇంటలిజెన్స్ వర్గాలు అంటున్నట్టు చెపుతున్నారు.
అందుకే స్థానిక ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం సంకోచిస్తోందని అంటున్నారు. వైకాపాకు దూరమైన వారిలో మెజారిటీ టిడిపి వైపే మొగ్గు చూపుతారని ఈ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. కాబట్టి ఒక వేళ ఏ కారణం చేతైనా మధ్యంతర ఎన్నికలు జరిగినా టిడిపికే కలసివస్తుందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
తొలినుంచీ టిడిపికి రాష్ట్రంలో కొన్నివర్గాలు అండగా ఉన్నాయి. దినికి తోడు చంద్రబాబు అలుపెరగని పోరాటం వల్ల పార్టీ పటిష్టంగా ఉంది. బిజెపి ఎంతచేసినా బలం పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో స్వంతంగా అధికారంలోకి రావాలని భావించడం కంటే టిడిపితో తిరిగి పొత్తు పెట్టుకోవడమే మేలని బిజెపిలో ఒక బలమైన వర్గం భావస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే ఇవన్నీ ఇప్పటికి ఇప్పడు జరిగేవి కాదు. కాలక్రమంలో పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
(డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి,సీనియర్ జర్నలిస్ట్,తిరుపతి,సెల్: 9440584400)