Home Features అనంతపురంలో హోళిగ సెంటర్లు…

అనంతపురంలో హోళిగ సెంటర్లు…

218
0
representative image (facebook)

(బి వి మూర్తి)

మొన్నామధ్య, చాలా ఏళ్ల విరామం తర్వాత, అనంతపురానికి చుట్టపు చూపుగా వచ్చినప్పుడు, పాతూరు రామ్మందిరం వీధిలో కాలు మోపానో లేదో గుప్పుమని నెయ్యి వాసన.

మెయిన్ రోడ్డు నుంచి ఒక నూరడుగుల దూరంలో ఉండే రాముని గుడి వరకు రోడ్డు కిరువైపులా హోళిగ సెంటర్లు. దాదాపు అన్ని ఇండ్లలోను బయట రోడ్డుకు కనిపించే వరండాలో పొయ్యి పెట్టుకుని పెనం మీద వేడి వేడి హోళిగలు తిప్పేస్తున్న ముసలవ్వలు…

కానీ పాపం, మా బెంగుళూరులోని దోశ క్యాంపుల్లో లాగానో, ఫుడ్ స్ట్రీట్ లోని రకరకాల తిండి దుకాణాల్లో లాగానో ఈ పాతూరు హోళిగ సెంటర్లలో కిటకిటలాడే జనం, క్యూల్లో నిలబడిన జనం కనిపించలేదు. బహుశ ఈ సరికే బుక్ అయిపోయిన ఆర్డర్ ల కోసం ఆ ముసలమ్మలు హోళిగలు చేస్తున్నారేమోనని నాకు నేను సర్దిచెప్పుకొన్నాను. కానీ ఆ పాతకొంపల రూపురేఖావిలాసాలు గమనిస్తుంటే నా అనంతపురంలో అవ్యవహితమైన అనంతకోటి దరిద్రాలు అప్పటికీ ఇప్పటికీ క్షేమమేనని కూడా అనిపించింది.

బహుశ 1978లో అనుకుంటాను, కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ కె దివాన్, ఎల్ కె పి (అంటే లలితా కళా పరిషత్)లో ఓ సభలో మాట్లాడుతూ, “ఇన్ హైదరాబాద్, ఐ వాజ్ టోల్డ్ టు హావ్ బీన్ గివెన్ పోస్టింగ్ టు అనంత పూర్. బట్ ఆఫ్టర్ కమింగ్ హియర్, ఐ కేమ్ టు నో దట్ ఇటీజ్ నాట్ అనంత పూర్, ర్యాదర్ అంతా… పూర్!’’, అని అన్నాడు. తరతరాలుగా ఇలాంటి దరిద్రపు జోకులకు అలవాటు పడి ఇంకా ఇంకా దరిద్రంలోనే మగ్గుతున్న దిక్కుమాలిన జిల్లా నాది.

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఓ సామెత. ఈ దరిద్ర గొట్టు సామెతలో నా సొంతజిల్లా పేరెందుకు రావాలి? అని ఎప్పుడూ పిచ్చిగా ఆలోచించేవాడిని. ఇంకా నయం, అనంతకోటి దరిద్రాలకు శతకోటి ఉపాయాలని రివర్స్ చేసి చెప్పనందుకు సంతోషపడాలి కాబోలు. ట్రెండింగ్ తెలుగు న్యూస్ (టిటిఎన్) పరిచయం చేస్తున్న చాకుల్లాంటి స్టార్టప్ కుర్రాళ్లలో ఎవరో ఒకరు మా రామ్మందిరం వీధిలో హఠాత్తుగా వాలిపోయి, ఈ ముసలమ్మలందరితో జట్టు కట్టేసి, న్యూయార్క్, న్యూ జెర్సీ, లండన్, ప్యారిస్, స్టాక్ హోం, బ్యూనస్ ఏర్స్ వగైరా వగైరాల్లో మా అనంతపురం హోళిగల మాధుర్యాన్ని పంచిపెట్టే స్టార్టప్ ఒకటి పెట్టి ముసలమ్మల వొళ్లోకి దోసిళ్ల కొద్దీ డాలర్ల సంపదను కుమ్మరించకూడదా అని పట్టపగలే కమ్మని కలలు కంటూ రాముని గుడి దగ్గరికి వచ్చేసరికి ఆ సందుగొందుల తిండి జ్ఞాపకాలు నన్ను తట్టి లేపాయి.

రామ్మందిరం జంక్షన్ నుంచి పాతూరు మెయిన్ రోడ్డుకు లింకు కలిపే సందుల్లో ఓ కొట్టం హోటలుండేది. దాంట్లో ఉగ్గానీ-మెరపకాయ వడ కాంబినేషన్ బలే రుచిగా ఉండేది. మా బావ తమ్ముడు కంబదూరు వేణు మొదటి సారి ఆ హోటల్లో ఈ తిండి నాకు రుచి చూపించాడు.

ఉగ్గానీని బొరుగుల తిరగబాతు అంటారు. ఉగ్గానీ అనే పదం బహుశ బళ్లారి నుంచి మా అనంతపురానికి దిగుమతి అయ్యుంటుంది. కన్నడంలో దాన్ని మండక్కి వగ్గరణె అంటారు. మన బొరుగులు కోస్తావాళ్లకు మరమరాలు.

బొరుగులను నీళ్లలో నానబెట్టి వెంటనే పైకి తీసి, నీళ్లన్నీ దిగిపోయేలా పిండేసి, నూనెలో ఆవాల తిరగబాతు వేసి, అటుతర్వాత చిటికెడు పసుపు వేసి, తరిగిన ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరేపాకు కూడా వేసేసి మగ్గనిచ్చి, ఆ పైన ఈ తడిపిన బొరుగులు వేసి జాలిగరిటెతో కలుపుతుండాలి. అడుగునున్న తిరగబాతు తాలూకూ ఉల్లిపాయల మిశ్రమం బొరుగు గింజలన్నింటినీ పలకరించి పరామర్శించిందని నిర్ధరించుకున్నాక తెల్లగడ్డలు, ఉప్పు కలిపి దంచిన పప్పుల పొడిని కొంచెం కొంచెంగా ఎడం చేత్తో చల్లుతూ కుడి చేత్తో కలియబెడుతూ ఉండాలి.

బాండ్లీ గోడలపైన పప్పుల పొడి లేయర్ ఏర్పడం ఆరంభమయ్యాకనో లేక ఉగ్గానీ కమ్మని వాసనలు హాలు దాకా విస్తరించాకనో బాండ్లీ దింపేసి చివరగా మరోసారి పైనుంచి కింది దాకా కలియబెట్టి తృప్తిగా నిట్టూర్చాలి. షరా: కొందరు మరీ ఛాందసులైన బాపనోళ్లకు తెల్లగడ్డల వాసన సరిపడదు గనుక అలాంటి వారు తెల్లగడ్డలు లేకుండానే ఉగ్గానీ చేసుకోవచ్చునని పాకశాస్త్ర ప్రవీణులు సెలవిస్తున్నారు.

ఈ వేడి వేడి ఉగ్గానీకి వేడి వేడి మెరపకాయ వడలు తోడైతే తిన్నవాడికి నాలుక తుప్పు వదిలిపోతుందంతే. ఆ కొట్టం హోటల్లో ఒక్కోసారి మెరపకాయ వడల్లోని మెరపకాయలు కారం తలకెక్కేవి. అయినా అదీ ఓ కిక్కే. పైగా ఉగ్గానీకి మెరపకాయ వడ నంజుకోడం అనుభవంతో సిద్ధించే ఓ పెద్ద కళ కదా. ఇంక జాగా లేదేమో అనిపించే లాగా ఉగ్గానీని నోటినిండా నింపేశాక మెరపకాయ వడని మునిపంటితో కసిక్కున కొరికి తక్షణమే దౌడలోని ఉగ్గానీ మధ్యకు తోసెయ్యాలి. కారానికి ఊపిరాడకుండా అటూ ఇటూ తిప్పేస్తుంటే నాలుక విజయగర్వంతో మరింతగా ఆకలి పెంచుకుంటుంది.

ఇక్కడొక విషయం చెప్పదలుచుకున్నా, హైదరాబాద్, విజయవాడ వంటి మహానగరాలలో పరిసర జిల్లాలో కూడా బొరుగుల ఉగ్గాన్ని చేస్తున్నట్లు మాకు విశ్వసనీయంగా తెలిసింది. ఏమయినా సరే, ఎవరెలా చేసినా సరే,  ఆథెంటిక్ ఉగ్గానికి కావాలంటే,రాయలసీమకే రావాలి, అందునా అనంతపురం వస్తే మరీ మంచిది.

మా అనంతపురం పాతూరు ఉగ్గానీనే కాదు, చదువుకునే రోజుల్లో మా అనంతలో తిన్న తిండ్లను దేన్ని తల్చుకున్నా ఇప్పటికీ నాకు నోరూరుతుంది. పోస్టాఫీసు ఎదురుగా షణ్ముగ విలాస్ లో ఇడ్లీ సాంబారైనా ఓవర్ బ్రిడ్జీ కింద మెరపకాయ వడలైనా ఆ రుచులే రుచులు. వాటి కవే సాటి. అలనాటి రుచులు మళ్లీ దొరకవు గాక దొరకవు. మన ఈ తిండియావ రామాయణం తెగేదా, తెల్లవారేదా? ఈ సారి సందు దొరికినప్పుడు మరిన్ని సంగతులు చెబుతా, ఇప్పటికింతే సంగతులు, నమస్తే!

(బివి మూర్తి, సీనియర్ జర్నలిస్టు, బెంగళూరు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here