Home Features లేచి నాలుగడులు అట్ట యేసానో లేదో నల్లటి ఎనుంగొడ్డు…

లేచి నాలుగడులు అట్ట యేసానో లేదో నల్లటి ఎనుంగొడ్డు…

199
0
(వివేకానందరెడ్డికి ఎదురైన ఎలుగ్గొడ్డు అనుభవం ‘ఎలుగుబంటి నేను’ చదవుతూంటే నాకు Kenneth Anderson రాసిన Mamandur Man-Eater కథ చదువుతున్నట్లే అనిపించింది. వివేకానందరెడ్డి కూడా మామండూరుకు దగ్గర్లోనే బద్వేల్ మండలం సగిలేరు నది ఒడ్డున ఉండే  నందిపల్లిలో ఉంటాడు. అక్కడేం అడివిలేదు, ఉండేవన్నీ కంపచెట్లే. ఇక్కడే ఆయనకు ఈ ఎలుగుబంటు కనిపించింది. ఆ అనుభవాన్ని గొప్పగా కడప మాండలికంలో రాశాడు. ఆయన శైలి మిమ్మల్ని కాలర్ పట్టుకుని వాళ్లవూరికి లాక్కెళ్లకపోతే అడగండి!)
(వివేకానందరెడ్డి లోమాటి)
రెండేళ్ల కిందటి మాట. అప్పుట్లో మన యవ్వారం మామూలుగా ఉండేది కాదు. నెత్తినిండా ఎంటికెలు. సిన్న గాలొచ్చినా అయ్యొచ్చి ముందుకు పడితుంటే చేత్తో పైకి లేపుతూ తిరిగేవాళ్లం. బో ఎచ్చల్నా కొడుకబ్బా కటింగ్ సేపిచ్చుకుంటేమీ అని గొనుగుతాన్నే వినకుండా అట్నే పెంచుకునే వాళ్లం. ఆ పెరిగిన జుట్టు విలువ తర్వాత ఒకరోజు తెలిసింది.
ఇక అసలు విషయానికొస్తే మాయమ్మ మనసులో ఏం కోరుకున్నెదో ఏమో తెలీదు గానీ మా ఊరి అంకాలమ్మ దేవరకి మా ఇంటి దున్నపోతును ఇస్తామని మొక్కున్నెది.
అది మాంచి హర్యానా జాతి పారం దున్నపోతు. బిల్ల కొమ్ములతో బలిష్టంగా ఉండేది. దారెమ్మటి నడుచ్చాంటే మాంచి ఒంగోలు జాతి బండెద్దు నడ్సినంత ఠీవీగా ఉండేది నడక. ఒళ్లు గూడా నీళ్లతో కడిగి రవ్వంత చమురు గాని పూస్తే అప్పుడే యేసిన తారు రోడ్డులాగా నల్లగా నిగనిగలాడతా ఉండేది.
అదంటే మా అమ్మకు బో పాణం దాని ఎవరైనా పొగుడుతుంటే భలే సంబరపడేది. దున్నపోతని కూడా చూడకుండా పాలిచ్చే బర్రెకు యేసేమాయిన చొప్ప, పచ్చి గెడ్డి, తవుడేసి మరీ మేపేది.
దాని జాతి లక్షణాలు చూసి దీని యిత్తనం పడ్తే సాలని మా ఊర్లో వాళ్లు ఎదకొచ్చిన ఎనుములని దాటించడానికి వాళ్ల కలాల్లోకి తోలకపోయి దాటిచ్చి మళ్లా మా ఇంటి కాన్నే వొదిలి పోతాంటిరి.
మాంచి పాకంలో ఉండేదాన ఎదకొచ్చిన ఎనుముల మీద గాలి మల్లి వాటె వాసెన సూచ్చా అట్నే పొయిందేమో మూడ్రోజుల నుండి ఇంటికి రాలేదంట. ఆసాయ ఎవురైనా పట్టకపోయి అమ్ముకున్నెరేమోనని మా అమ్మకు దిగులు పట్టుకున్నెది.
గొర్లకు, మేకలకు పోయే వాళ్లను విచారిస్తే మొన్న ఆసాయ బోలారెపల్లె మల్లల్లో ఉనిందంట అని చెప్పారని వెదకి వచ్చిందంట గానీ ఎక్కడా దాని కనిపీలేదు.
ఏ రోజూ పిడికెడు గెడ్డి వెయ్యకపోయినా అదంటే నాగ్గూడా ఆశే. అంతలావు గొడ్డు ఇంట్లో ఉండి పలానోల్ల దున్నపోతుబ్బా అంటే లోలోపల చిన్న గర్వం లాంటి భావన.
శనారం, ఆదివారం ఆఫీసుకు సెలవు కావడంతో ఆపొద్దు నేను ఇంటికొచ్చినా. తొందరగా బువ్వ తిను ఆటో వీరాడ్డెన్న, రాంస్వామి సిన్నయ్య వాల్లయి గూడా రెండ్రోజుల్నుండి ఇంటికి రాలేదంట మేం బోయి వెతికొస్తాం అన్నెది.
“నువ్వెందుకులేమా పోడము వాళ్ళమ్మటి నేను పోతాలే” అని సద్దాగి బయల్దేరాను.
మా ఊరికి ఆ బోలారెపల్లెకి మద్దెలో ఉండే సగిలేటి గుంతల్లో ఆడాడ రొవ్వన్ని నీళ్లున్నాయి. ఆ నీళ్లు తాగి చుట్టుపక్కల కంప చెట్లల్లో ఏమన్నా పడుకుంటాండయేమోనని ఆ కంప కటవల వారన, తుమ్మ చెట్లల్లో దూరి దూరి అంతా వెతికితిమి గానీ యాడ వాటి జాడలేకపోయె.
కనపచ్చినోల్లందరినీ అడిగాంగానీ ఎవ్వురూ అందాసు పట్టలేకుండరు. యెతికి యెతికి యాసిరికొచ్చి మధ్యాన్నం అన్నానికి ఇంటికొచ్చినాం.
నిన్న మూలేటి సాయ కేశంపల్లె మల్లల్లో మేచ్చాన్నెయని వీరాడ్డెన్నకు ఎవురోచెప్పిండ్రని మూడు గంటలకల్లా మళ్లీ వచ్చినారు ఈసారి మూలేటికి పోదాంపా అని.
పొయిన పోడం ఆ చీక్కంప చెట్లమ్మటి తిరిగి తిరిగి అలసిపోయినాం గానీ యాడా వాటి జాడనేది లేకపోయె. అట్నుంచి ఒక్కరవ్వ పైకి మల్లి పత్తి చేలో తవ్వకం తవ్వుకుంటున్న ఒక పెద్దాయన్ను అడిగితే “నాకు కానరాలేదబ్బా” అన్నాడు.
రోంచేపుండి “పొద్దుగూకుతాంది ఇంగ ఇంటికి బోండి ఈ సాయ ఎనుంగుడ్డు తిరుగుతాంది. నిన్న పొద్దుమాడ్జాం మా ఊరి పిల్లోని మీదబడి బరికింది. వాడు వొగిసోడయి మచ్చుకత్తి చేతిలో ఉండి రెండేట్లేసేసరికి ఇడిపిచ్చిందని” జాగర్త చెప్పినాడు.
అది విన్నాంచి అప్పుడదాంక ఎట్టపడితే అట్ట తిరిగిన నాకు ఒక్క రవ్వ గుంపు చెట్లు కనబడితే చాలు ఎనుంగుడ్డేమోనని గిలి పట్టుకున్నెది. ఏ చిన్న అలికిడైనా ఉలిక్కిపడి తిరుగుతాంటిని. అంతకు రెండ్నెళ్ల ముందు అడివి నుంచి వొచ్చిన ఒక ఎనుంగుడ్డు సిద్దుగారి పల్లెలో ఒకామె మిందబడి పొట్ట సీల్చిన విషయం మాటి మాటికీ గుర్తుకొచ్చాంది.
వీరాడ్డెన్న, రాంస్వామి సిన్నయ్య ఉత్తరం దిక్కుపోయి నేనెంత పిల్సినా పలక్కపోయె. ఆ పరిస్థితి చూసి నాకు లోపలొకపక్క గిలిగానే ఉన్నా ఇంగో పక్క ఎయ్ ఈ వయసులో భయపడ్డమేందనే పిల్ల సొయ్యంతో అట్నే దక్షిణంగా ఎతుక్కుంటా కిందికి యెల్లబారితిని.
ఇంతలో యానించొచ్చిందో గ్గూక్ గ్గూక్ అంటా ఒక పిల్లల పంది తన పది పదైదు పిల్లల్నేసుకుని కంప చెట్లల్లోంచి బయటికొచ్చింది. ఉచ్చబడ్నెయి నాకు.
పిల్లల పందంటే బో భయం అదీగాక ఎంటమ్మిటి పిల్లలుంటే సింహాన్ని సైతం మోరతో మోది చంపేసే తెగువు గల మొరటు జీవులు. చేతిలో చూసుకుంటే చిన్న కట్టెపుల్ల కూడా లేకపోయె. లోపల్లోపల భయపడుతూనే వాటి అలికిడి పూర్తిగా పొయ్యే వరకూ థూత్..థూత్.. అంటూ కదలకుండా ఆన్నే నిలబడితిని. అయ్యి పూర్తిగాకనుమరుగయ్యేదాంక ఒళ్లు సల్లబడలేదు.
ఇంగ శాంచేపు ఈడ్నే ఉంటే పనిగాదు అంతగా అయితే రేప్పొద్దన్నే వజ్జాంలే అని అట్టా మూలేటి సాయ మల్లినా. పోయే దోవలో కొత్తగా చిన్న చెక్ డ్యాం కట్టినారు. నీళ్లు లేకున్నా కూడా చూడ్డానికి బాగుంటే ఎనుంగొడ్డు గురించి గిలిపడుతూనే పొద్దుకూకే సూర్యుడి రుధిర వర్ణాన్ని ఆస్వాదిస్తూ కొద్దిసేపు ఆన్నే కూకుంటిని.
పొద్దుగూకేటప్పుడు చుట్టుపక్కల మనిషనేవాడు లేకుండా ఏకంతంగా సూర్యున్ని చూడ్డమంటే నాకు చాలా ఇష్టం అందుకే ఎనుంగొడ్డు ఆలోచనలు మదిలో మెదులుతున్నా పదైదు నిముషాలు ఆడనే ఉన్నాను.
గూళ్లకు చేలిన బెల్లగాయిలూ, గోజీతలూ, పిచికెలు అరుపులతో పిల్లలకు ఆ రోజు తమకెదురైన అనుభవాలను వివరిస్తూ జాగరూక పరుస్తున్నాయా అన్నట్టుంది.
అప్పడ్దాంకా వెలుగులు వియజిమ్మిన సూర్యుడు కొండల్లేకి దిగడంతో ఎర్రగా రక్తమోడ్చిన పడమటి దిక్కున ఆకాశం మెలిమెల్లిగా నలుపు రంగులోకి మారుతోంది. ఒకపక్క ప్రకృతి ఎంతగా ఊరిస్తున్నప్పటికీ మరోపక్క ఎలుగుబంటి తాలూకు ఆలోచనలు కుదురుగా ఉన్నియ్యడం లేదు. సరే ఎంతసేపున్నా ఇంతే కదా అని లేచి ఇంటి మొహం పడ్తిని.
లేచి నాలుగడులు అట్ట యేసానో లేదో నల్లటి ఎనుంగొడ్డు ఇంచుమించు ఓ ఇరవై బారల దూరంలో వంకవారమ్మటి తలకాయ వొంచుకుని నా వైపే వస్తాన్నెది. చేతిలో చిన్న కట్టె కూడా లేదు దానికి తోడు లుంగీ కిదికి ఇడ్సి ఉన్నా. చుట్టూ ఒక రకమైన రాయీ లేదు అది మిందికి రాకుండా కలబడ్డానికి. ఇంగ నాకు గుండెల్లో పదురు పట్టుకున్నెది. ఏం చేయ్యాలో దిక్కుదెలీడంల్యా. అదేమో తలచాయొంచుకోని ఇట్నే వచ్చాంది.
సుట్టూ సూచ్చే ఆ పక్కన పాతకాలం నాటి ఒక అయిదడుగుల గోడ కనపన్నెది. అది సరక్కిన మిందపడకుండా దానిమిందికి ఎక్కితో రోంత మేలనిపిచ్చింది. ఇంక ఆలస్సెం చెయ్యకుండా ఊత్తరంగా దానిమిందికి ఎక్కితిని.
అప్పటిదాంకా ఆ ఎలుగుబంటి నన్ను గమనించలేదేమో ఆగిత్తెంగా వచ్చిన అలికిడి చూసి అది బెదిరిపోయి గ్గుక్ గ్గుక్ అని అర్సుకుంటా చెట్లల్లోకి  పరిగెత్తింది.
నా నెత్తిన యింత పొడుగుండే జుట్టు, డార్క్ కలర్ ఫుల్ హ్యాండ్ లూజు లూజు టీ షర్టు, పైకి కట్టకుండా కిందికి వదిలిన లుంగీ అవతారం చూసి ఇదేదో నాకంటే వింత జంతువున్నట్టుందని భయపడిందేమో పాపం.
అది పోయిన అయిదు నిముషాల్దాంక నా గుండె పదురు తగ్గలేదు. మళ్లీ వెనక్కి వస్తుందేమోనని అది పోయిన దావమ్మటి కొద్ది సేపు చూసి ఇంటికి బయల్దేరితిని.
పదురు తగ్గినాంక ఆలోచిస్తే ఒకవేళ అది నా అవతారం చూసి భయపడకుండా మిందకొచ్చింటే పెద్ద యుద్ధమే జరిగేదోమో అనే ఆలోచన తల్సుకుంటే ఇప్పుటికీ ఒళ్లు జలదరిస్తుంది.
వెనక్కి చూసుకుంటూ పెద్ద పెద్ద అంగలతో గబ గబా కొంచెం దూరం పోయినాంక ఎనుముల్ని వెదకడం ఆపి నన్నెతుక్కుంటా వచ్చిన వీరెడ్డెన్న, రాంస్వామి సిన్నయ్య ఎదురయ్యారు.
ఎలుగుబంటి విషయం సెప్తే “బతికిచ్చినవురా సోమి లేకుంటే అదిగానీ నీ మిందికొచ్చినింటే ఇంగ మాకు బతుకులేదు మీ అమ్మ మా యిద్దరిని ఊర్లోకి కూడా అడుగుపెట్టనిచ్చేది కాదు” అనె.
అప్పుడనిపించింది మనం పెంచుకున్న జుట్టు కూడా అప్పుడప్పుడూ ఉపయోగపడ్తుందని.
ఆ తర్వాత రోజు మా అమ్మ ఒక్కటేబొయి మేము వెదికిన కానుంచే మా దున్నపోతు, వాళ్ల ఎనుములను ఇంటికి తోలకొచ్చింది మరి ఆమెకేం ధైర్యమో ఏమో.
Vivekananda Reddy Lomati
(వివేకానందరెడ్డి లోమాటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కడప మాండలిక రచయిత)