Home Breaking అసెంబ్లీలో లవ్ స్టోరీ చెప్పిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే

అసెంబ్లీలో లవ్ స్టోరీ చెప్పిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే

290
0
SHARE

తెలంగాణ డిప్యూటి స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ అసెంబ్లీలో సభ్యులు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ కు అవకాశం రాగా పద్మారావు గారిది మంచి మనస్తత్వం అని, ఉద్యమ సమయంలో తనకు చాలా సహాయం చేశాడని అన్నారు. అదే విధంగా తనకు పెళ్లి చేసింది పద్మారావేనని ఈ సందర్భంగా బాల్క సుమన్ గుర్తు చేసుకున్నాడు. బాల్క సుమన్ తన లవ్ స్టోరిని అసెంబ్లీలో చెప్పాడు. సుమన్ ఏమన్నారంటే…

“నేను టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నసమయంలో మీరు నాకు చాలా సహకరించారు. ముఖ్యంగా 2012లో నేను ప్రేమ వివాహం చేసుకోవడానికి సిద్ధమైనప్పుడు నాకేమీ లేదని అత్తమాములు పిల్లనివ్వలేదు. ఆ సందర్భంలో మీ సామాజిక వర్గానికి చెందిన ఆ అమ్మాయి తల్లిదండ్రులను.. మీరు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, శ్రవణ్‌‌ పెద్ద మనసుతో ఒప్పించారు.

కచ్చితంగా బాల్కసుమన్ ఎమ్మెల్యే అవుతాడు.. మంచి పొజిషన్‌లో ఉంటాడు.. కేసీఆర్‌కు దగ్గరవుతాడు.. మంచి పిల్లగాడు అని వాళ్లను ఒప్పించారు. ముఖ్యంగా నా పెళ్లికి అందర్నీ ఒప్పించడంలో కీలకపాత్ర పోషించారు.. అనంతరం నా పెళ్లి కూడా దగ్గరుండి మీరే జరిపించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని బాల్కసుమన్ నవ్వుతూ తన లవ్ స్టోరీ ముగించారు.

అయితే స్పీకర్ సీటులో కూర్చోనున్న పద్మారావు ఆ విషయాలు గుర్తు తెచ్చుకుని నవ్వు ఆపుకోలేకపోయారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.