Home Features బకాసురుడు ఇంకా బతికే వున్నాడా?

బకాసురుడు ఇంకా బతికే వున్నాడా?

483
0
-దివికుమార్
“రాజ్యం” గురించి తొలిపాఠాలు నేర్పే “బకాసుర” కథ
భారత ఉపఖండంలో మహాభారత యుద్ధనేపధ్యమూ, కౌరవ-పాండవ సంగ్రామమూ ఎరుగనివారుండరు. అలాగే వారందరికీ బాగా జ్ఞాపకముండే సంఘటన బకాసుర సంహారం. పాండవులను చంపివేయటానికి పన్నిన లక్కయింటి దహనం కుట్రనుండి తప్పించుకుని బతికి బయటపడిన కుంతి, పాండవులయిదుగురూ రహస్యంగా ఏకచక్రపురం అనే గ్రామంలో తలదాచుకుంటారు. అప్పటికే ఆ గ్రామస్తులు బకాసురుడనే నరమాంస భక్షకుడైన రాక్షసునితో రోజుకొక్కరు చొప్పున వంతుల వారీగా ఆహారంగా వస్తామని ఒప్పందం చేసుకుని వుంటారు. పాండవులు తలదాచుకుంటున్న బ్రాహ్మడి యింటి వంతు వచ్చేదాకా ఈ విషయం కుంతికీ. ఆమె పుత్రులకూ తెలియదు. తెలియగానే భీముడ్ని బకునిపైకి పంపటం, భీముడా రాక్షసుణ్ణి చంపివేయటం మనం బాగా ఎరిగిన కథే. మూల కథలో బకుని సంహారం సంగతి పాండవులను తలదాల్చుకోనిచ్చిన బ్రాహ్మడికి తప్ప మరెవరికీ తెలియదు.
మహాభారతంలో బకాసుర సంహారానికి వొక ప్రశస్తి వుందని చెబుతారు. భీముడు – దుర్యోధనుడు – జరాసంధుడు –
కీచకుడు – బకాసురుడు: ఈ ఐదుగురూ ఒకే సమయం (కాలం)లో జన్మించారనీ, వీరిలో ముందుగా ఎవరి చేతుల్లో మరొకరు చనిపోతే మిగిలిన ముగ్గురు కూడా తొలియుద్ధంలో గెలిచి బతికినవాని చేతుల్లోనే చనిపోతారనీ, ఆవిధంగా మహాభారత యుద్ధ ఫలితం బకాసుర సంహారంతోనే తేలిపోయిందనీ చెబుతుంటారు. భీమ, బకాసుర యుద్ధానికి పై కారణంగా ప్రాముఖ్యత హెచ్చి ఎంతో పెద్ద మహాభారతంలోఇంత చిన్న సంఘటన అయినప్పటికీ అందరూ బాగా జ్ఞాపకం పెట్టుకునే విశేష గాధగా యిదివుంది. క్రీ.శ 11వ శతాబ్దంలో అనగా వెయ్యిసంవత్సరాల క్రితం తెలుగులోకి అనువాదమైన “అంధ్రమహాభారతం”లో ఈ బకాసురగాధ 49 పద్యాలూ, 25 వచన సంధులతోముద్రణలో కేవలం 14 పేజీలు మాత్రమే వుంటుంది. కుంతి, పాండవులు కాక మూలగాధలో మరో రెండు పాత్రలే వుంటాయి. అందులోబకాసురునికి ఒక్కనికే మహాభారత రచయితలు పేరు పెట్టారు. మిగిలింది పాండవులకు చోటు చూపించిన బ్రాహ్మణుడు. ఈ కథను తిరగరాయటం ద్వారా కొడవటిగంటి కుటుంబరావు (ఇక నుంచి కొ.కు.) తన పాఠకులకి ఏం చెప్పదలుచుకున్నారన్నది ప్రస్తుత మనచర్చనీయాంశం.
బకాసుర మూలకథ చదివిన పాఠకులకు కొన్ని సందేహాలు వస్తాయి. అందులో మొదటిది: గ్రామంపైపడి రాక్షసుడు మనుషుల్ని పీక్కుతింటుంటే ప్రజల్ని కాపాడాల్సిన `రాజు’ ఏం చేస్తున్నాడూ అని. ఇది సహజంగా ఎవరికైనా వచ్చే అనుమానమే. కనుక ఏకచక్రపురం రాజు మిక్కిలి దుర్బలుడు అని పాండవులకు ఆవాసం చూపించిన బ్రాహ్మడి ద్వారా మూల రచయిత చెప్పిస్తారు. వెంటనే పాఠకునికొచ్చే మరొక అనుమానమేమంటే అంత దుర్భలరాజ్యాన్ని ఇరుగుపొరుగు రాజ్యాలు ఎందుకు సహించి బతకనిస్తారూ? అని! దీనికి జవాబు కొ.కు. యిచ్చారు. ఏకచక్రపుర రాజ్యాన్ని దుర్బలమైనదిగా కొ.కు. ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు. ఒక్క యువకుని చేతిలో చచ్చిన ఒక రాక్షసుణ్ణి సంహరించలేనంత దుర్బలంగా రాజ్యం వుండటం హేతువిరుద్ధమైనది. నిజంగా అలాంటి రాజ్యం వున్నదని మాటవరుసకు అంగీకరించినా అంత బలహీనమైన రాజ్యాన్ని ఇరుగుపొరుగు రాజులు ఆక్రమించుకోకుండా వదిలిపెట్టరు. ప్రజల్నుండి తిరుగుబాబైనా రాకుండా వుండిపోదు. కనుకనే కొ.కు. ప్రజలకంటే, రాజ్యంకంటే ఎంతటి రాక్షసుడైనా. ఒకే ఒక్కడైన బకుణ్ణి బలోపేతమైనవానిగా చూపలేదు.
కొ.కు. ‘బకాసుర’ కథలో రాజుగారి హృదయం ఇట్టే మంత్రికి తెలిసిపోయింది. బకాసురుడు ఏకచక్రపురానికి పెట్టనికోట.
వాడు మూడు అక్షౌహిణుల సైన్యానికి సమానం. వాడే చతురంగబలాలూను. అందుకే వాడు రాజుగారికి దివ్యమైన అంగరక్ష.వాడు చనిపోవడానికి పొలిమేర వీడి పోవటానికి వీల్లేదు. వాడి ఖర్చు ఏడాదికి మూడువందల అరవైమంది ప్రాణులు. కారుచౌక! యుద్ధాలలోదానికి అయిదింతలు చస్తారు. క్షామాలు అంతకంటే ఎక్కువ బలితీసుకుంటున్నాయి…. అదృష్టదేవత ఈ రాక్షసుడి రూపంలో వచ్చిందంటే అతిశయోక్తి కాదు… “మన రాజ్యంపై కన్నువేసిన పరిసర రాజులతో పోల్చితే రాక్షసేశ్వరులు దాదాపు మిత్రులనే చెప్పాలి. దాదాపు మిత్రులు”
రాజ్యవ్యవస్థ పుట్టింది కుటుంబమూ-వ్యక్తిగత ఆస్తులూ ఏర్పడిన సామాజిక పరిస్థితుల నుండి. అంటే సమాజంలో వర్గవిభజన(భారతదేశంలో అదే వర్ణ విభజన కూడా) ఏర్పడిన తర్వాత. అది అత్యధికుల పాలిట ముఖ్యంగా సమాజావసరాలైన ఆహారం, వ్యవసాయ,యుద్ధపరికరాలు ఉత్పత్తిచేసే శ్రామిక ప్రజానీకం పట్ల అణచివేత సాధనం. కనుకనే బకాసురుని కంటే రాజ్యం దుర్బలమైనదని మూలరచయితలు కలిగించిన భావనకు విరుద్ధంగా బకాసురుణ్ణే దుర్భలమైనవానిగా కొ.కు. చెప్పారు. ప్రజలపాలిట నిజమైన అసలు పీడకశక్తి రాజ్యమేనన్న భావం కొ.కు. కలిగించారు. ప్రజలపాలిట బకాసురునిది అదనపు పీడన. లేక సరికొత్త విపత్తు. అలాంటివిపత్తులు సంభవించినపుడు ‘రాజ్యం’ ఏం చేస్తుంది? దాన్నుండి తక్షణం ప్రజల్ని కాపాడి వారికి శాంతి-భద్రత కలిగిస్తుందా? అలాచేయటం ‘వర్గ’ రాజ్యం యొక్క లక్షణం కాదు. కొత్త విపత్తును తనకు అనుకూలంగా మలుచుకోవటమే రాజ్యం యొక్క లక్షణం తప్ప తనప్రయోజనాల్ని వీడి ప్రజల్ని కాపాడేయటం దాని స్వభావం కాదు, అని కొ.కు. చెప్పదలిచారు. అందుకే రాజు “వాడు (అనగా బకాసురుడు)తిండి దొరక్క మరో ఊరువెతుక్కుంటూ పోతాడేమోనన్న భయంతో నేను నిద్రపట్టక చస్తున్నాను” అంటాడు. అందుకు మంత్రి “మనం రాక్షసుణ్ణి మచ్చిక… చెయ్యాలి” అని, తన అనుభవంలో అలా మచ్చికై తన ఆహారానికి తాను పడాల్సిన కనీస కష్టంకూడా పడనంత సోమరిగా తయారైన పిల్లి, అందుబాటులోకొచ్చిన ఎలుకల్ని కూడా చంపకుండా ఎలావుండేదో ఉదహరిస్తాడు.
ఇరుగుపొరుగు రాజ్యాల్నుండి తన రాజ్యాన్ని కాపాడుకోవటమే తమ సమస్యగా రాజు భావించటం, అందుకు బకాసురుడినితమ రాజ్యం పాలిమేరల్లోనే నిలుపుకోవటానికై పకడ్బందీ సూచనలూ, ఏర్పాట్లూ మంత్రి చేయటం ఈ కథలో మనం చూస్తాం. అదే సమయంలో రాజ్యంలోని ప్రజల సంగతేమిటి? ఆ ప్రజలను తమకనుకూలంగా మలుపుకోవటం ఎలా? ఆనే కీలకమైన ప్రశ్నలకుకొ.కు. రెండురకాలుగా పరిష్కారం చూపారు.
1. బకాసురుని సమస్యతో ముడిపడిన చిక్కులను సమాజంలోని ధనిక (ఉన్నత వర్గ) శ్రేణికి సున్నితంగా వివరించి, రాజ్యం తీసుకోనున్న చర్యలు వారికి నష్టం కలిగించేవి కావని నమ్మించి, అంతోయింతో లాభాన్ని కూడా చూపించి, వారికీ ‘రాజ్యం’ ప్రయోజనానికీ నడుమ వైరుధ్యం లేదని ఒప్పించటం.
2. “మేధావి” అనే పాత్రను సృష్టించి రాజ్యానుకూల భావజాల ప్రచారం (మన కాలానికి మీడియా, సాంస్కృతిక రూపాలు) ఎలా సాగిస్తుందో తనదైన వ్యంగ్యాన్ని జోడించి కొ.కు. చెప్పారు. ఆ క్రమంలోనే బకుడు – బకాసురేశ్వరుడుగా – బకాసురోత్తమునిగా -రాక్షసేశ్వరులుంగారుగా ఎలా పరిణామం చెందాడో కూడా మనం ఈ కధలో చూడొచ్చు.
మనదేశంలో ఆకురౌడీలు – మాఫియాలుగా, ప్రజాప్రతినిధులుగా మారుతుంటారు. వారిని అంతరంగికంగా వాడు, వీడు అనుకుంటారు. కానీ బహిరంగంగా గౌరవనీయ పదజాలమైన వారు, వీరు, తమరుగా ఎలా మారిపోతుందో మనకు తెలుసు. బాల్‌ధాక్రేలాంటి వారికి భారత రాజ్యం ఎంత లొంగిపోయిందో జ్ఞాపకం పెట్టుకుంటే రాజ్యానుకూల ‘మేధాని” నిర్వహించే పాత్ర స్వభావం మనకు స్పష్టంగా అర్ధమవుతుంది. సమస్త మూఢవిశ్వాసాలనూ రాజ్యానుకూలంగా, ప్రజలను నిమిత్తమాత్రులుగా మలచి ప్రచారం గావించటం మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని పాలకవర్గ మేధావుల లక్షణంగా కొ.కు. చిత్రీకరించారు. ఉదాహరణకు గత 22 ఏళ్ళుగా మన దేశాన్ని పట్టిపీడిస్తున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణమనే (బకాసురుడు లాంటి) మహావిపత్తుని దృష్టిలో పెట్టుకుంటే భారతరాజ్యం దానిపట్ల ఎలా వ్యవహరిస్తోందో మనకు తెలును. ప్రపంచీకరణానికి లొంగిపోయిన రాజ్యం, రాజకీయ పార్టీలు, మీడియా మొత్తం కలసి- దాన్ని మనం ఎదుర్కోలేము. దానితో సర్దుబాటు చేసుకొని బతకాల్సిందే – దాన్నుండి మనకు ఎలాంటి ప్రయోజనాలు సమకూరుతాయో తెలుసుకొని మెలగటమే ‘విజ్ఞుల’ లక్షణం అన్నట్లు వ్యవహరిస్తున్న తీరుని గ్రహిస్తేగానీ కొ.కు. ‘బకాసుర’ కథలోని ‘రాజ్యం’ యొక్క అసలు స్వరూపం మనకు అర్ధం కాదు.
రాజ్యం అంటే కేవలం ప్రభుత్వమని భావించేవారు కొందరున్నారు. ధనిక ఆధిపత్య వర్గాలూ, పాలక వర్గం‌లోని ప్రతిపక్ష పార్టీలు, మాఫియాశ్రేణులూ, నిరంకుశాధికారవర్గం, రక్షకభటవర్గాలూ, న్యాయస్థానాలూ, ద్రవ్య వ్యవస్థా, పాలకముఠాలూ,విద్యావ్యవస్థా, వీరందరికీ ప్రచార యంత్రాంగంగా దోహదపడే మీడియా అంతా కలగలిస్తేనే ‘రాజ్యం’ అవుతుంది. మహాభారత కాలం నాడు నేడున్నంతసంక్లిష్టత లేదు. కనుక రాజు-మంత్రి- నగరప్రముఖులూ- మేధావి వరకు చూపిస్తే సరిపోయింది.
కొ.కు. సృష్టించిన మరొక ముఖ్యమైన పాత్రపేరు “అజ్ఞాని. అలా పేరు పెట్టటంలోనే ఆయన నేటి వ్యవస్థను వ్యంగ్యంగా విమర్శించదలుచుకున్నాడు. ఎవరీ అజ్ఞాని? కేవలం నిజాలు మాట్లాడేవాడు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తన అభిప్రాయాల్నిచెప్పేవాడు. ఖచ్చితంగా ప్రజాప్రయోజనాలకు కట్టుబడినవారిని ‘అజ్ఞాని’గా ఈ వ్యవస్థ పరిగణిస్తుంది.
ఉదాః సామ్రాజ్యవాదం మీద ఆధారపడకుండా మనకాళ్ళమీద మనం నిలబడివుండే పారిశ్రామిక-వ్యవసాయ-విద్యా విధానాన్ని మనం అనుసరించాలి అనటం, అజ్ఞానులు మాట్లాడేదిగానే నేటి మన భారత ప్రధాన స్రవంతిలోని మీడియా అంతా పరిగణిస్తోంది. దేశ జనాభాలో అత్యధికులుగా వుండే నిరక్షరాస్యులతో సహా గ్రామీణ, పట్టణ పేద, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల ఆధారంగా “మాతృభాషలోనే విద్య” ను గరపాలని ప్రతిపాదిస్తే…. అమెరికా వెళ్ళదలుచుకున్న కొద్దిమందికి ఇంగ్లీషు మీడియం అవసరమని (నిజంగా ఆ అవసరం లేదు. అది ఇంగ్లీషు భాషని వ్యాపారం చేస్తున్న వారికి మాత్రమే అవసరం) నేటి ప్రపంచీకరణ పరిస్థితుల వాస్తవాన్నుండి మాత్రు భాషా మాధ్యమం వారు విషయాలను చూడలేని ‘అజ్ఞానులన్నట్లుగా పరిగణించటం ఎంత సహజంగా వుంది!!.
కనుక అజ్ఞాని పాత్ర ద్వారా… ప్రజాభిప్రాయానికి ప్రజాఅవసరాలకి ప్రాతినిధ్యం వహించే భావజాలాలుంటాయి. అవి కేవలం
వ్యక్తుల అభిప్రాయాలు కావు. ప్రత్యామ్నాయ దృక్పథానికి అవి ప్రాతినిధ్యం వహిస్తుంటాయని చెప్పటమే కొ.కు. ఉద్దేశంగా మనకుస్పష్టమవుతుంది.
రాజ్యానికుండే అణచివేత స్వభావాన్ని మూడు పాత్రలు 1. బలభద్రుడనే సాహస యువకుడు, 2. బండివాడు, ౩. భీముడు
ద్వారా కొ.కు. మరింత స్పష్టపడేటట్లు చేశారు.
‘బలభద్రుడు సాహసవంతుడైన సూత యువకుడు. పదిమంది కలసి, తమ స్వీయ శక్తియుక్తులతో ఒక పనిని సాధించగలుగుతామనే ఆత్మవిశ్వాసం గలవాడు. తనలాంటి మరికొందర్ని వెంట పెట్టుకొని బకాసురుణ్ణి చంపాలని బయలుదేరతాడు. అతనికి రాజ్యానికి వుండే వర్గ స్వభావంగానీ, క్రౌర్యంగానీ తెలియవు. బకుడి సమస్య చిన్నదిగానే అతను భావిస్తాడు. తీరా పదిమంది యువకులతో కలసి వెళ్ళి బకునికోసం వెదికినా వాడు దొరకలేదు. కానీ, అలా వెళ్ళినవారు రాజ్యానికి దొరికిపోయారు. అప్పుడు బలభద్రుడిని
“నువ్వేనా జనాన్నిరాక్షసుడిపై యుద్ధానికి తీసుకుపోయే ప్రయత్నంలో వున్నది”. అని రాజు అడిగాడు.
“చిత్తం మహారాజా” అన్నాడు బలభద్రుడు.
“నువ్వీనగరానికి రాజువా”
“కాను మహారాజా తమరుండగా….?”
“నిన్ను నగర రక్షకుడిగా నియమించానా?”
“లేదు మహారాజా!”
“మరి నీకు జనాన్ని పోగుచేసే అధికారం ఎవరిచ్చారు? రాక్షసుడంటూ నిజంగా ఉన్నప్పటికీ వాడి సంగతి చూడవలసింది
మేము. అవునా?”
“ఈ భాగ్యానికి తమకు శ్రమదేనికి మహారాజా? మేము పదిమంది కర్రలు తీసుకొనిపోతే వాడు మా కళ్ళపడకుండా దాక్కున్నాడు”
“మీకు వాడు కనిపించనుకూడా లేదా?”
“లేదు మహారాజా”
“లేనివాడు ఎలా కనబడతాడు?”
“ఉన్నాడు మహారాజా! వాడిప్పటికి ముప్పైమందిని పొట్టనబెట్టుకున్నాడు. ఈ ముఫ్పైమంది ఒక్కసారిగా వాణ్ణి ఎదిరించి కొట్టినట్లయితే పీడ వదిలిపోయుండేది.”
రాజుగారు అకస్మాత్తుగా కళ్ళనిప్పులు రాలుస్తూ “పాపీ! నీ దొంగవేషాలు చాలించు. నీవు జనరక్షకుడననిపించుకుని జనాన్నికూడగట్టుకొని రాజువు కావాలని చూస్తున్నావు. ఒక వంక జనాన్ని హడలగొట్టడానికి రాక్షసుడున్నాడన్నావు. నీ ఎత్తు సగం పారింది. ఈఅమాయకులను వెంటేసుకొని తిరిగి వచ్చావు. ఇలా నాలుగుసార్లు తిరిగి ఏ అభాగ్యుణ్లో చంపి, రాక్షసుణ్ణి చంపి ఏకచక్రపురాన్ని రాక్షసుడిబారినుండి కాపాడానని మూఢులైన ప్రజలను సులువుగా నమ్మిస్తావు. మంత్రీ! ఈ రాజద్రోహి తలతీయండి. ఈ మిగిలిన వాళ్ళందరినీ కారాగృహంలోకి తోయించండి” అన్నాడు.
ప్రజలకు మేలు చెయ్యాలనే బలభద్రుని ఆలోచనను రాజ్యాన్ని కూల్చివేసి అధికారాన్ని పొందాలనే పన్నాగంగా ‘రాజ్యం’
భావించింది. శాంతిభద్రతలు, దేశరక్షణ తను మాత్రమే నిర్వహించాల్సిన కర్తవ్యంగా భావించటమే కాక, అందుగురించి ప్రజల ప్రయోజనంపేరిట ప్రజలు చేసుకొనే జోక్యాన్ని కూడా ఈ రాజ్యం సహించలేదు.
రెండవపాత్ర – బండివాడు. అతడే బకాసురుణ్ణి ప్రత్యక్షంగా ఎరిగినవాడు. బకుడు అందరూ అనుకునేంత బలవంతుడేంకాదని గ్రహించినవాడు. అది రాజ్యానికి ప్రమాదం. కనుక వాడికీ ప్రమాదమే. నిజం తెలిసిన బండివాడిని చంపినా మర్నాడు మరొకడైనా ఆ నిజాన్ని తెలుసుకుంటాడు. అందుకే బండివాని నాలుక కోయించి మూగవానిగా మార్పిస్తాడు రాజు. నిజాలు తెలిసినా, తెలియనట్టు మూగవాళ్ళుగా ప్రజలు బతకాలని రాజ్యం కోరుకుంటుంది అనేదానికిది చక్కని ఉదాహరణ.
సమాచారహక్కు చట్టం ద్వారా నిజాలు తెలుసుకున్న కొందరు సామాజిక కార్యకర్తల, జర్నలిస్టుల జీవితాలు, మాఫియా పోలీసుల జోక్యంతో ముగియటం పత్రికల ద్వారా మనం చూస్తూ వున్నాం. రాజ్యానికి ముప్పుకలిగించే నిజాలు జనాంతికంగానేవుండాలి తప్ప స్పష్టమైన రుజువులతో దొరకకూడదన్నది, ముఖ్యంగా రాజ్యానికి పరీక్ష కాకూడదన్నది ఇక్కడి సారాంశంగా మనం గ్రహించటం ముఖ్యం.
‘చివరిదీ, మూడవదీ- బకాసుర సంహారం తర్వాత రాజ్యం యొక్క అసలు స్వరూపాన్ని గగుర్పాటు కలిగించేంత భయంకరమైన నగ్నసత్యంగా కొ.కు. చెబుతారు.
బకుడిని చంపేసినట్లు తెలియగానే అజ్ఞాని సహజంగానే అంటాడు.“ఒక్క కుర్రాడి చేత చచ్చే రాక్షసుడి కోసం ఎంతమంది
ప్రాణాలు బలిచేశామండీ” అని. ఆరాత్రి రాజుకూ మంత్రికీ నిద్రపట్టలేదు.
“ఇక ఈ నగరంలో మనం తలెత్తుకు తిరగలేం.” అన్నాడు మంత్రి
“ఇప్పటికైనా నిజాన్ని అబద్ధం చేసేటందుకు ఏదైనా ఉపాయం ఉందేమో”నని రాజు
“అ చంపినవాడు మనిషికాదని ప్రచారంచేస్తే” -మంత్రి
“ఆ ప్రచారం ప్రజలే చేస్తున్నారు-వాడి మీద గౌరవం కొద్దీ వాణ్ణి రాజుని చేసేస్తారు. నిశ్చయం” -రాజు
“అజ్ఞాని చెప్పినట్లు ఆ కుర్రాణ్జి మనం విందుకు పిలిచి విషంపెట్టి చంపేస్తే”
“బాగానే వుందికానీ అదికూడా మననే కట్టికుడిపితే”
“ఒక ఆలోచన”
“ఏమిటది?”
“వాడు బకాసురుణ్జిమించిన రాక్షసుడని ప్రచారం చేస్తే”
“సాధ్యమా?”
“ఈ నగరంలో రోజుకొకణ్ణి చంపేసి, అదీ వీడిపనే అంటే సరి!”
“దివ్యంగా ఉంది అలోచన”
రాజ్యం ప్రజాసంక్షేమం కోసమే ఏర్పడ్డదిగా, అది ప్రజలందరిదిగా భావించే అమాయకులను, అలాగని నమ్మించాలని చూసే
‘మాయకులనుండి ‘బకాసుర’ కథ కనువిప్పు కలిగిస్తుంది. సాధారణ ప్రజలందరూ బాగా ఎరిగిన ఒక పౌరాణికగాధ ద్వారా సులువుగాఅర్ధం గాని ఎంతో సంక్లిష్టమైన రాజ్యం యొక్క వర్గ స్వభావాన్ని తేలికగా అర్ధం చేసుకునే రీతిగా మార్చిన విధం, గొప్ప సృజనాత్మక విశేషం. అంతేకాదు కొ.కు. మేధాశక్తికీ, సామాజిక పరిజ్ఞానానికీ కూడా ఈ కథ నిదర్శనంగా నిలుస్తుంది. దీని ద్వారా….
1. రాజ్యం- సాధారణ ప్రజలందరి ప్రయోజనాల కొరకుకాక ఉన్నతవర్గాలకు సేవచేసేదిగా ఉంటుంది. సత్యాన్నిమూగబుచ్చుతుంది, అదిప్రజల చొరవను విరిచేస్తుంది. రాజ్యానికి వర్ణస్వభావం ఉండి తీరుతుంది.
ఉదా! ప్రభుత్వం భూసంస్కరణల చట్టం చేస్తుంది. దానిప్రాతిపదికన ప్రజలు భూములు పంచుకునే ప్రయత్నం ఎంత నిజాయితీగాచేసినా అది చట్టవిరుద్ధమంటుంది. కేసులు పెడుతుంది. జైలుపాలు చేస్తుంది. సంపన్నుల దోపిడీకి మాత్రం అండగా ఉంటుంది.
2. ప్రజలకేదైనా విపత్తు సంభవించినపుడు, ఆ విపత్తునుండి ప్రజలను కాపాడటమనే ధర్మాన్ని కాక, ఆ విపత్తును తమ సంపన్న వర్గ ప్రయోజనాలకు వాడుకోవటమెట్లాగనే రాజ్యం ఆలోచిస్తుంది.
ఉదా!1 అమెరికా రాజ్యం టెర్రరిజమనే ప్రపంచవ్యాపిత ప్రమాదాన్నెదుర్కొంటున్నామని చెబుతుంది. నిజంగా అది టెర్రరిజాన్ని లేకుండా చేసి ప్రపంచ ప్రజలను కాపాడుతోందా, అంటే అదేమీ లేకపోగా దానిపేరుతోనే దేశదేశాల్ని పునరాక్రమించుకోవటానికి టెర్రరిజాన్ని సాధనంగా చేసుకుంది. ఇంకా లోతుకెళ్ళి మాట్లాడుకుంటే అమెరికన్‌ సమ్రాజ్యవాదమే టెర్రరిజాన్ని సృష్టించి – దానితోయుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తూ తనతో కలసిరాక తప్పని స్థితిని పరాధీన రాజ్యాలకు సృష్టించి ప్రజల్ని మరింత లోబరుచుకుంటుంది.
ఒక సమస్యగా తీసుకొని ఆలోచిస్తే నేటి “ప్రత్యేక తెలంగాణ’ను భారతరాజ్యం ఎలా సుదీర్హకాలం నలుగుతూ ఉండే సమస్యగాచేసి నడిపిస్తోందో గమనించవచ్చు. ప్రజల్ని మౌలిక సమస్యలైన అధికధరలు, నిరుద్యోగం, గ్రామాలకు గ్రామలను, వారి భూములను సెజ్‌లు పేరిట స్వాధీనపరుచుకోవటం; అవినీతి, కుల, మత పీడనలు, స్త్రీలపై పెచ్చరిల్లుతున్న హత్యాచారాలు, నీచ సాంస్కృతిక విధానాలు…లాంటివాటిపై ఐక్యంగా, సంఘటితంగా ఉద్యమించనీయకుండా…. ఎంత బాగా పక్కదారి పట్టించగలుగుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
3. పూర్వజన్మ, పునర్జన్మలు లాంటి సమస్త మూఢ విశ్వాసాల్నీ, ప్రజల శక్తియుక్తులను నిర్వీర్యపరచే భావజాలాల్నీ… అంతిమంగా ప్రజల్ని నిమిత్తమాత్రులుగా, దేవునిపైనో, రాజ్యంపైనో అధారపడి సహాయానికి దేబిరించేవారిగా ‘రాజ్యం’ మారుస్తుందని మేధావి పాత్రద్వారా ఈ కథ చెబుతుంది.
4.ప్రజలలో `సత్యం’ దాగి వుంటుందనీ పాలకులు దాన్ని `అజ్ఞానం’ అన్నా అది వ్యక్తమవుతూనే వుంటుందనీ, అది ప్రజల
అనుభవాలనూ, అకాంక్షలనూ ప్రతిబింబిస్తుందని చెబుతుంది.
5. నేటి ఆధునికయుగంలో భీముడి పాత్రని ఎలా అర్ధం చేసుకోవాలి? అంతటి బలసంపన్నత ఎక్కడి నుండి వస్తుంది? ప్రజల సంఘటిత ఐక్య ఉద్యమ శక్తి మాత్రమే, ఒక్కమాటలో `ప్రజాశక్తి’ మాత్రమే నేటి విపత్తులను ఓడించి ప్రజలను కాపాడగలుగుతుంది. భగత్‌సింగ్‌ చెప్పినట్లు అలాంటి విప్లవశక్తులు గ్రామాలలో రైతుకూలీలు, పట్టణాల్లో కార్మికులుగా ఉన్నారు. వారు మాత్రమే అధునికదోపిడీరాజ్యాలను వాటి కుట్రలూ, కూహకాలనూ ఓడించి ప్రజాస్వామికరాజ్యాన్ని నిర్మించగలవారు. అందుకు పూనికవహించటమే నేటివిద్యార్ధి యువజనులు నిర్వహించాల్సిన మొదటి కర్తవ్యం.
ముగింపు
1961లో సరిగా 52 సంవత్సరాలక్రితం కొ.కు. ఈ `బకాసుర’ కథను రాశారు. అప్పటికి భారతస్వాతంత్రం వచ్చి 14సంవత్సరాలు. జవహర్‌లాల్‌నెహ్రూ ప్రారంభించిన పంచవర్ష ప్రణాళికలు రెండు పూర్తయి మూడవదానికి సిద్ధమవుతున్న కాలంలో ఈకథ రాశారు. ప్రపంచరాజ్యాలలో మనది అతిపెద్ద ప్రజాస్వామిక దేశమనీ, ప్రజలచేత, ప్రజల కొరకు, ప్రజలే నిర్మించుకుంటున్న దేశమనీ`మేధావు’ల చేత ప్రశంసలండుకుంటున్న రోజులలో యిది బడా పెట్టుబడిదారుల, భూస్వాముల ప్రయోజనాలకొరకు, సామ్రాజ్యవాదులతోషరీకయిన రాజ్యమని వాదించే ‘అజ్ఞాను’లు కూడా వుండేవారు. అయితే సాధారణ జీవితానుభవం ఎలా వుండేది?
“అకాశం అంటుకునే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
అవినీతి బంధుప్రీతి చీకటి బజారు.
అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు” – శ్రీశ్రీ – (రచన 1961)
వ్యక్తిగత ఆస్తులను కాపాడే రాజ్యం సంపన్నవర్గాల ప్రయోజనాల పరిరక్షణకే పూనుకుంటుంది. శ్రామిక పేదవర్గాలను ఇంకాదోచుకోవడానికే దోహదం చేస్తుంది. రాజ్యానికి ధనికులు – పేదలలో ఏదో వొక వర్గ అనుకూల స్వభావం మాత్రమే ఉంటుందనీ వర్గాలకు అతీతంగా, అందరికి ప్రాతినిధ్యం వహించదనీ చెప్పటమే కొ.కు. ఉద్దేశం.
అందుకు అయన ‘బకాసుర’ కథను ఎంపిక చేసుకుని మనకు అతిసులువుగా దోపిడీ వర్గాల ‘రాజ్యం’ యొక్క స్వభావాన్ని
చేసుకొనేట్టు చేశారు. లెనిన్‌ రాసిన ‘రాజ్యంగయంత్రం-విప్లవం’ అనే గొప్ప మార్కిస్టు సిద్ధాంత గ్రంధం అర్థం చేసుకోవటానికి ఈ `బకాసుర’ సులువైన దారిని వేస్తుందని నేను నమ్ముతున్నాను.
(దివికుమార్‌ , 2013)
(కొడవటిగంటి కుటుంబరావు గారి ‘బకాసుర’ కథ 26 పేజీలుంటుంది. దీనిని కేతు విశ్వనాధరెడ్డిగారు నవలిక అన్నారు. దీని ఆధారంగా నెమలికంటి తారక రామారావు గారు ఒక నాటకాన్ని రూపొందించి హైదరాబాదు, తెనాలి ,బొంబాయి లాంటి చోట్ల ప్రదర్శించారు. నేను మొదటి సారి 2006లో ‘ కొ.కు . బకాసురుడింకా సజీవుడే ‘ నంటూ ఆంధ్రజ్యోతి దిన పత్రికలో రాశాను. ఆ తర్వాత నెమలికంటివారి నాటకం పై విమత్శనాత్మక సమీక్ష ప్రజాసాహితి (319) కొ.కు. శతజయంతి ప్రత్యేక సంచిక (2009 అక్టొబర్)లో రాశాను. రాజ్యం యొక్క వర్గ తత్త్వాన్ని వారు అర్థమే చేసుకోలేదని నా విమర్శ. నూతన తరాలకు ఈ కథ అర్థమవాలనే ఉద్దేశ్యంతో సోదాహరణంగా వివరించి ఇలా తిరిగి రాశాను. ఇది 2015 వ సంవత్సర0లో సి.పి.ఐ.(ఎం) వారి సైద్ధాంతిక మాస పత్రిక ‘ మార్క్సిస్టు ’ లో ప్రచురితమయింది.)

(Photo source: wiki media)