Home Features మేధావులంటే ఎవరు? మేధోసంపత్తి సాధన ఎలా సాధ్యం?

మేధావులంటే ఎవరు? మేధోసంపత్తి సాధన ఎలా సాధ్యం?

167
0
SHARE
(Dandi Venkat)
ఈ దేశంలో మేధస్సుకు కులం ఉంటుంది. ఎంత గొప్ప మేధావి అయినా, ఆయన పుట్టిన కులాన్ని బట్టే మేధస్సు గౌరవ మర్యాదలు దక్కుతాయనేది భారతీయ చరిత్ర నిండా కనిపిస్తుంది.  వేల సంవత్సరాల మానవ జీవన పరిణామక్రమాన్ని శ్రమాధారిత భౌతికశాస్త్రాల దృక్పథంతో చారిత్రక నేపథ్యంతో  సమాజాన్ని అధ్యయనం చేయడమే విజ్ఞానమవుతుంది.
ఆధునిక మానవ సమాజంలో వేల సంవత్సరాల మానవ జీవన పరిణామక్రమాన్ని అధ్యయనం చేసిన వారిలో  “కారల్ మార్క్స్” , “డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్” లు మాత్రమేఅని అర్థమవుతుంది.  అందుకే “కారల్ మార్క్స్” “డాక్టర్ బాబాసాహేబ్ అంబెడ్కర్” ల సాహిత్యాన్ని మానవ సమాజం ఎప్పటికప్పుడు పరిశీలనాత్మకంగా పరిశోధిస్తుంది.
“కారల్ మార్క్స్”, “డాక్టర్ అంబేడ్కర్”లు సంపాధించిన మేధోసంపత్తి వారి జీవితకాలమంతా పరిశోధించి సాధించినది. వారి అనుభవాత్మక   చారిత్రక జ్ఞాన,విజ్ఞానాల సారాంశాన్ని, మేధోసంపత్తిని భవిష్యత్తు తరాలకు అందించిన అద్భుతమైన కృషియే అంబెడ్కరిజంగా దినదినాభివృద్ది చెందుతూ ఉంది.
ఆర్థిక అసమానతల నిర్మూలన శాస్త్రంగా మార్క్సిజం రూపొందితే, సామాజిక,రాజకీయ అసమానతల నిర్మూలన శాస్త్రంగా అంబేడ్కరిజమైయ్యింది.
“డాక్టర్ అంబెడ్కర్”ఎంత జ్ఞాన సంపన్నులంటే ఆయన కాలానికి మార్క్సిజం ప్రపంచాన్నే శాసిస్తున్నది. అయినా, భారతదేశం  బహుజన సమాజంమని,  రష్యా, చైనా తరహా మార్క్సిజం తీసుకువచ్చే విప్లవాలు భారత్ లో  సాధ్యం కాదని గుర్తించారు. అందుకే  భారతీయ నమూనా సామాజిక
సోషలిస్టు విప్లవ నిర్మాణం కోసం తన చివరి శ్వాస విడిచేవరకు
ప్రయత్నించారు.
 ఆయన బౌద్ద స్వీకరణకు కారణమిదే.  భారతీయ బహుజన సమాజానికి ఒక మార్గం చూపడానికే ఆయన బౌద్ధాన్ని స్వీకరించారు. నిజమైన భారతీయ సింధునారికథ వారసత్వ పునాదులపై నిర్మించబడిన భౌతిక భావజాలమే బౌద్ధమని గుర్తించారు డాక్టర్ అంబెడ్కర్.
గౌతమ బుద్ధుడి మార్గాన్ని డాక్టర్ బాబాసాహేబ్ అంబెడ్కర్
రాత్రికి రాత్రి అనుసరించలేదు. ఆయన జీవితకాలంలో దాదాపు ముప్పై సంవత్సరాలుగా గౌతముడి సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. బుద్ధుడి కాలంలో పాలిభాషానే అధికారిక భాషా కాబట్టి,  బుద్ధుడు ఏంచెప్పాడో స్వయంగా పాలిభాషలోనే అధ్యయనం చేసితెలుసుకున్నారు డాక్టర్ అంబెడ్కర్.
అంటే వేల సంవత్సరాల భారతీయ చరిత్ర మూలాల్లోకి
వెల్లి పరిశోధించి, ఈ దేశ బహుజన ప్రజల సమస్యలకు మూలకారణమైన, బ్రాహ్మణాధిపత్యం, పెట్టుబడిదారి కుట్ర సిద్ధాంతం యొక్క గుట్టును అర్థం చేసుకున్నారు. బట్టబయలు చేశారు. గౌతమ బుద్ధుడు ఏనాడు ఈ తారతమ్యాల మతాన్ని ప్రేమించలేదు. ఏ మత గ్రంథాన్ని అనుసరించలేదు.
 బాబాసాహేబ్ అంబెడ్కర్ బౌద్ధ మత స్వీకరణ వెనక చాలా పరిశోధన, మేధోమధనం ఉంది.
ఈ విషయాన్ని ప్రతిభను వంద సంవత్సరాల వర్గ పోరాట చరిత్రను బుజాలపై మోస్తున్న వామపక్ష మేధావులు ఎందుకు గుర్తించలేకపోతున్నారో నాలాంటి వారికి ఇప్పటి అర్థం కావడం లేదు.
కమ్యూనిస్టు ఉద్యమాన్ని విమర్శించడంవేరు.లోపాలను ఎత్తిచూపడం వేరు. కమ్యూనిస్టు ఉద్యమ సైద్ధాంతిక పునాదులపై దాడి చేసేవారు. బ్రాహ్మణాధిపత్య పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్ధించడమే అవుతుంది.
అప్పుడప్పుడు కొన్ని గాయపడిన గుండెలు కమ్యూనిస్టు పార్టీల్లోని కొంతమంది నాయకులపై ఉన్న కోపంతో త్యాగాల పునాదులపై రాళ్ళు రువ్విన సందర్భాలు ఉండొచ్చు, కానీ మార్క్సిజం మానవాళి విముక్తి ప్రదాయిని అనేది మాత్రం చరిత్ర రుజువు చేసిన సత్యం.
 మార్క్సిజమనేది ప్రాపంచిక దృక్పథంతో కూడిన
ఆర్థిక,రాజకీయ,సామాజిక భౌతిక శాస్త్రం. నేటి అసమాన ఆర్థిక,రాజకీయ, సామాజిక పరిస్థితులనురూపుమాపేందుకు అంబేద్కర్ తత్వశాస్త్రం ఒక సాధనంగా మారబోతుంది.
భారతీయ సమాజంలో భారతీయ నమూనా భౌతిక తత్వవేత్తలైన చార్వకుల నుండి గౌతమ బుద్ధుడు,ఫూలే, సావిత్రి బాయి,పెరియార్ డాక్టర్ అంబెడ్కర్,కాన్షీరాం, మారోజు వీరన్న, ఉ.సాల వరకు సాగిన ప్రస్థానమంతా బ్రాహ్మణాధిపత్య పెట్టుబడిదారీ వ్యవస్థ రద్దు కోసం సాగిందే. ఇంకా సాగుతున్న విరామమెరుగని పోరాటమది.ఇక ముందు సాగుతుంది.ఈ అనుభవాలను మరింత జాగ్రత్తగా భవిష్యత్తు తరాలకు అంధించాలసిన భాధ్యత నిజమైన ఫూలే-అంబెడ్కర్,మార్క్స్ ల వారసులపై ఉంది.
Dandi Venkat
(Dandi Venkat, Convenor, Bahujana Left Front (BLF), Telangana, Nizamabad)