Home Features ఆగస్టు 7, బీసీల బర్త్ డే : ప్రొఫెసర్ సింహాద్రి

ఆగస్టు 7, బీసీల బర్త్ డే : ప్రొఫెసర్ సింహాద్రి

567
0
SHARE
Prof Simhadri
ఆగస్టు 7,1990న బీసీలకు దేశం జన్మనిచ్చింది. ఈ రోజు భారత స్వాతంత్ర్య దినంతో పోల్చదగింది. దీని ద్వారా జాతీయ స్థాయిలో ఓబిసిలకు మొదటిసారి గుర్తింపు దొరికింది. దేశ జనాభాలో సగానికి పైగా ఓబీసీలు ఉన్నప్పటికీ, దాదాపు నలభై సంవత్సరాలకుపైగా భారతదేశంలో వారికి ఎటువంటి గుర్తింపు లేదు. వాస్తవానికి రాష్ట్రపతి నియమించిన బీసీ కమిషన్ ద్వారా ఓబీసీలకు జన్మనిస్తారని భారత రాజ్యాంగం వాగ్ధానం చేసింది. స్వాంతంత్ర్య అనంతరం విద్యలో రిజర్వేషన్లు పొందడానికి ఓబీసీలు 61 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. అంటే నలభై మూడు సంత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం లేకుండా, 61 సంవత్సరాలు విద్యలో అవకాశాలు లేకుండా బీసీలను ప్రభుత్వాలు అనాథలుగా మిగిలిల్చాయి. అదే అగ్రకులాలకు చెందిన పేదలకు మాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేవలం మూడు రోజుల్లో రిజర్వేషన్లు కల్పించారు. మొదటిరోజు బీజేపీ నాయకత్వంలో లోక్ సభలో బిల్లును ఆమోదించింది. రెండో రోజు రాజ్యసభ, ఆ వెంటనే భారత రాష్ట్రపతి సంతకం చేయగానే అగ్రకులాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టం చేయడమైంది. 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదనే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ అగ్రకుల రిజర్వేషన్ల చట్టం ఏర్పరిచారు. దానికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అని నామకరణం చేశారు.
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందటానికి, ఓబీసీలను గుర్తించడానికి భారత ప్రభుత్వాలు, నలభై నుంచి అరవై సంవత్సరాలు ఎందుకు అడ్డుకున్నారన్నదే ప్రశ్న.
ఈ వ్యాసం భారతదేశంలో ఓబీసీ రిజర్వేషన్ల పరిణామ క్రమాన్ని పరిశీలిస్తుంది. రాజ్యాంగ ఆధారిత కమిషన్‌ ఏర్పాటు, కోర్టులు, రాజకీయ పార్టీల స్పందనకు సంబంధించిన విశ్లేషణ చేయబడింది. ఇంకా జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాల ఉద్యమం గురించి విశ్లేషించే ప్రయత్నం జరిగింది.
1946 లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగ రచనని మొదలుపెట్టింది. ప్రారంభంలోనే, సామాజిక, ఆర్థిక న్యాయమే రాజ్యాంగానికి పునాదిగా ఉండాలని రాజ్యాంగ అసెంబ్లీ తీర్మానం చేసింది.
Dr B R Ambedkar (credits Wikipedia)
రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లను కల్పించే తీర్మానం ప్రవేశపెట్టగానే రాజ్యాంగ సభ వ్యతిరేకించింది. వాస్తవానికి పూనా ప్యాక్ట్ గా పిలిచే గాంధీ – అంబేద్కర్ ఒప్పందంలో భాగంగా వారికి రిజర్వేషన్లు లభించాయి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో ఎస్సీలు, ఎస్టీల కోసం బి.ఆర్.అంబేద్కర్ ఎంతో కష్టపడి సాధించిన ప్రత్యేక నియోజకవర్గాలను త్యాగం చేయాల్సి వచ్చింది. ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు తీసుకురావడానికి డాక్టర్ అంబేద్కర్ చేసిన అతిపెద్ద త్యాగం ఇది. 1935 లో భారత ప్రభుత్వ చట్టంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఉనికిలోకి వచ్చాయి. చివరగా డాక్టర్ అంబేద్కర్ నుండి చాలా ప్రతిఘటన ఎదురుకావడంతో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ లను అంగీకరిస్తూ రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దాంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రాజ్యాంగంలో చేర్చడమైంది.
ఆ తర్వాత, ఇతర వెనుకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్లను కల్పించేందుకు డాక్టర్ అంబేద్కర్ చర్చ ప్రారంభించారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సభ్యులు అడ్డుకున్నారు. ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము అంగీకరించాం. అలాంటప్పుడు ఈ ఇతర వెనుకబడిన తరగతులు ఎవరు? అంటూ రాజ్యాంగ అసెంబ్లీలోని సభ్యులు ప్రశ్నించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం భారత రాష్ట్రపతి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారని, ఇది ఓబిసిల పరిస్థితిని అధ్యయనం చేసి, ఓబిసిలను నిర్వచించే నివేదికను సమర్పించి, వారి పరిస్థితి ని మెరుగుపరచడానికి సిఫార్సులు చేస్తుందని డాక్టర్ అంబేద్కర్ బదులిచ్చారు. దీనిపై చర్చలో పాల్గొన్న పలువురు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఓబీసీల నిర్వచనం అనేది న్యాయస్థానాలలో కొందరు న్యాయవాదులకు స్వర్గంగా మారుతుందని అన్నారు.
ఆయా కులాల, మతాల జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ వ్యవస్థలలో ప్రాతినిధ్యం ఉండాలని మరాఠాలకు చెందిన పంజాబ్ రావు దేశ్‌ముఖ్ వాదించారు. రాజ్యాంగ అసెంబ్లీలో ఓబీసీల ప్రాతినిధ్యం లేదు. సభలో ఓబీసీ సభ్యులు లేకపోవడం, బయట నుంచి ఒత్తిడి తెచ్చే ఓబీసీ ఉద్యమం లేకపోవడంతో రాజ్యాంగ అసెంబ్లీలో ఓబీసీలకు న్యాయం జరగలేదు.
అసమానతలతో కూడిన పోటీ ఉన్నప్పుడు, కింది సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుందని డాక్టర్ అంబేద్కర్ వాదించారు. అందువల్ల వారికి రిజర్వేషన్లను కల్పించడమే సామాజిక న్యాయ సూత్రమని డాక్టర్ అంబేద్కర్ అన్నారు. అందులో భాగంగా డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)ను ఆమోదించే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ” రాష్ట్ర సర్వీసులలో వెనుకబడిన తరగతుల ప్రాతినిథ్యం లేదని భావిస్తే, నియామకాల్లో రిజర్వేషన్ సూత్రాన్ని ఏ అధికరణం అడ్డుకోదు.”
ఆర్టికల్ 340, “వెనుకబడిన తరగతుల పరిస్థితులను పరిశోధించడానికి ఒక కమిషన్ నియామకం ” గురించి తెలియజేస్తుంది.
(1) దేశ పరిధిలో సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితులపై అధ్యయనం చేసి, వారి ఇబ్బందులను తొలగించడమేగాకుండా పరిస్థితులను మెరుగుపరచడానికి కేంద్రం లేదా ఏదైనా రాష్ట్రం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన సిఫార్సులు చేయడానికి తగినట్లుగా భావించే వ్యక్తులతో కూడిన కమిషన్ ను రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా నియమించవచ్చు. అటువంటి ఇబ్బందులను తొలగించి, వారి పరిస్థితులు మెరుగపరచడానికి కేంద్రం లేదా ఏదైనా రాష్ట్రం ఇవ్వాల్సిన నిధులు గురించి… వారి ప్రయోజనాల కోసం ఇవ్వవలసిన గ్రాంట్లు, అటువంటి గ్రాంట్లకు ఇవ్వవలసిన షరతులు, ఉత్తర్వుల ద్వారా నియమించబడ్డ కమిషన్ అనుసరించాల్సిన విధానాలను కూడా నిర్వచిస్తుంది” .
అదే సమయంలో ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన తరగతులకు విద్యలో రిజర్వేషన్లు కల్పిస్తున్న జి.ఓ.ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్దించింది. ద్రవిడ ఉద్యమ నాయకుడు పెరియార్ ఇవి రామస్వామి రిజర్వేషన్లను తగ్గించటానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ ఉద్యమాన్ని కేరళ, కర్నాటక, మద్రాస్‌ మొదలైన దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించడం ద్వారా ద్రవిడ జాతిని ఏర్పాటు చేస్తామని పెరియార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో విద్యలో రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణను తీసుకురావడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. ఈ విధంగా డాక్టర్ అంబేద్కర్ 1951 సంవత్సరంలో మొదటి రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టారు.
ఆర్టికల్ 15 (4) ను రాజ్యాంగంలో చేర్చారు. “ఈ ఆర్టికల్ 29 లోని క్లాజ్ (2) లో ఏదీ కూడా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీల పౌరుల పురోగతి కోసం ప్రభుత్వం తీసుకొచ్చే ప్రత్యేక నిబంధనలను నిరోధించదు ” అని పేర్కొంటోంది.
1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ, గణతంత్ర దేశంగా ప్రకటించిన రోజున అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య ఏర్పడింది. దీనికి పంజాబ్ రావు దేశ్ముఖ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజ్యాంగబద్ధ బిసి కమిషన్ ఏర్పాటు కోసం ఈ సమాఖ్య ప్రచారం చేసింది. భారత మొదటి ప్రధాని నెహ్రూ కొంతకాలం కమిషన్‌ను ఏర్పాటు చేయలేదు. కేంద్ర మంత్రివర్గానికి డాక్టర్ అంబేద్కర్ రాజీనామా చేస్తున్న సమయంలో… రాజ్యాంగం వెనుకబడిన వర్గాలకు తగిన భద్రతలను అందించలేదని అన్నారు. 1951 వరకు ప్రభుత్వం బిసి కమిషన్‌ను ఏర్పాటు చేయలేదు. అంతేకాకుండా, హిందూ కోడ్ బిల్లును తీసుకురాకపోవడంతోపాటు చట్టం ద్వారా మహిళలకు సమాన హక్కులు, గౌరవాన్ని కల్పించకపోవడంపై భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా డాక్టర్ అంబేద్కర్ నిరసన వ్యక్తం చేశారు.
తరువాత ఢిల్లీ మొదటి ముఖ్యమంత్రిగా ఉన్న చౌదరి బ్రహ్మ ప్రకాష్ యాదవ్ ఎఐబిసిఎఫ్ అధ్యక్షుడయ్యాడు. బీహార్ కు చెందిన కుర్మి ఆర్.ఎల్.చందాపురి మరో సంస్థకు నాయకత్వం వహించారు. ఆ తర్వాత అతను సోషలిస్ట్ పార్టీలో చేరాడు. ఇద్దరు నాయకులు తమ సంస్థల ద్వారా రాజ్యాంగబద్ద వెనుకబడిన రతగతుల కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రచారం చేశారు. తరువాత వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదికను అమలు చేయాలని ఉద్యమించారు.
1953 సంవత్సరంలో మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పడింది. దానికి గాంధేయవాది అయిన కాకా కాలేల్కర్ ను చైర్మన్‌గా నియమించారు. అతను 2399 కులాలను ఓబీసీలుగా గుర్తించి, 1955 లో కమిషన్ నివేదికను సమర్పించాడు. ఈ నివేదికను 1956 లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.
నెహ్రూ మంత్రివర్గంలో హోంమంత్రిగా వున్న జి.బి. పంత్‌, కేంద్ర ప్రభుత్వం నుండి ఒక ప్రకటన చేస్తూ, వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదికను తిరస్కరించారు. బిసి కమిషన్ వెనుకబడిన వర్గాలను కాకుండా వెనుకబడిన కులాలను సిఫార్సు చేసిందని ప్రభుత్వం వాదించింది. వెనుకబడిన వర్గాలను గుర్తించడానికి తమ కమిటీలు లేక కమిషన్లను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది.
సుమారు పది నుంచి పదిహేను కమిటీలు / కమీషన్లను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. వివిధ కోర్టులు ఈ కమిషన్‌లను నిలిపివేశాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వాంచూ 1968 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక తీర్పు ఇచ్చారు. తీర్పులో భాగంగా వివరిస్తూ.. కులాలు వెనుకబడిన తరగతుల ప్రమాణాలను సంతృప్తి పరిస్తే, ఆ కులాలను వెనుకబడిన రగతులు అని పిలవచ్చు.. అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన వర్గాలపై 1972 లో వేసిన అనంతరామన్ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టు సమర్థించింది. సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతులు విద్య, ఉద్యోగాల్లో కూడా BC రిజర్వేషన్లు పొందడం మొదలైంది.
1977 ఎన్నికల సమయంలో వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదికను అమలు చేస్తామని జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన (బ్రాహ్మణ) ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ఎన్నికల హామీని పక్కనపెట్టాడు. జనతా పార్టీలోని సోషలిస్టులు అతనిపై ఒత్తిడి తేవడంతో రెండో వెనుకబడిన తరగతుల కమిషన్ ను ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నాడు.
BP Mandal
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్టు అయిన బీపీ మండల్‌ను 1978 లో రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్‌గా భారత రాష్ట్రపతి నియమించారు. 1980 లో ఆయన ఈ నివేదికను భారత రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్‌కు సమర్పించారు. ఆ నివేదకను ఇందీరాగాంధీ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. కొన్ని మార్పులతో నివేదికను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి వి.సి.సుక్లా హామీ ఇచ్చారు. తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను బుట్టదాఖలు చేసింది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా మండల కమిషన్ నివేదికను అమలు చేయలేదు.
ఆగష్టు 7,1990 న, కేంద్రంలోని నేషనల్‌ ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ప్రధాని, వి.పి. సింగ్ పై మండల్ కమిషన్ నివేదిక అమలు పరచాలని సోషలిస్టులు ఒత్తిడి తెచ్చారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు విపి సింగ్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. ఇది మండల్ కమిషన్ చేసిన నలభై సిఫార్సులలో ఒకటి మాత్రమే. కాంగ్రెస్, బిజెపి ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించాయి. రామ జన్మభూమి పేరుతో అయోధ్య రథ యాత్రను నిర్వహించాయి.
నవంబర్ 16,1992 న తొమ్మిది మంది సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పుతో ఓబీసీ వర్గాల అస్థిత్వాన్ని గుర్తించడమైంది. ఉద్యోగాల్లో ఓబిసిలకు 27% రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం 1993 లో ఆదేశాలు జారీ చేసింది. యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే ఫోరమ్ రాజకీయ పార్టీల ప్రమేయంతో విద్యలో ఓబీసీ రిజర్వేషన్‌లపై మళ్ళీ వ్యతిరేక ముందుకు తెచ్చింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణన్.. విద్యలో ఓబీసీ రిజర్వేషన్ సరైనదేనని తీర్పునిచ్చారు. 2008 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఐఐటిలు, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాల వంటి విద్యా సంస్థలలో ఓబిసిలకు రిజర్వేషన్లను అమలు చేసింది.
వెనుకబడినతరగతులు తమ ఆకాంక్షలను ఉద్యమ రూపంలో వ్యక్తం చేశారు. స్థానికం నుంచి జాతీయ స్థాయి వరకు సామాజిక, రాజకీయ సంస్థలు బీసీల సాధికారిత కోసం ఉద్యమించి, ప్రజలను ఏకం చేశారు.
ఆల్ ఇండియా కుల సంఘాలైన అఖిల భారత యాదవ్ మహాసభ, కుర్మి, కొహిరి మహాసభలు 1950, 60 లలో వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదిక అమలు కోసం ఉత్తర భారతదేశంలో ప్రచారం చేశాయి. వారు “పిచారా జగావో దేశ్ బచావో” అని పిలుపునిచ్చారు.
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నాయకత్వంలో సోషలిస్టులు ‘జాతి తోడో ఆందళన్ ‘ లో భాగంగా వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం పోరాడారు. ‘పిచ్డా పావే సౌ మే సాట్’ అనే నినాదంతో సామాజిక వర్గాలను జాగృతపరిచారు. సోషలిస్టు / సమాజ్ వాదీల ఉద్యమంలో భాగంగా ముందుకు సాగిన వారిలో ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్‌తో పాటు సోషలిస్ట్ ప్రముఖులైన బి.పి. మండల్‌, కర్పూరి ఠాకూర్, రామ్ నరేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.
కాన్సీరామ్ నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ మండల్ కమిషన్ నివేదిక అమలు కోసం నిరసనలు నిర్వహించింది. దక్షిణాన, పెరియార్ ఇవి రామసామి ద్రవిడ ఉద్యమంలో భాగంగా సామాజిక న్యాయం, సమానత్వం, కులనిర్మూలన కోసం ఉద్యమించారు.
మహాత్మా జ్యోతిరావుపూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ల సిద్ధాంతాల భూమికపై సామాజిక విప్లవ స్పృహతో, సామాజిక ప్రజాస్వామ్య దేశ నిర్మాణం కోసం పునాదులు పడ్డాయి.
జాతీయవాద ఉద్యమం, మత జాతీయవాదుల పార్టీలు, ప్రభుత్వాల ద్వారా 52 శాతం వున్న ఓబీసీలను అణచివేశారు. గుర్తింపును నిరాకరించారు. ప్రజాస్వామికపరంగా వారికి చెందాల్సిన ప్రాతినిధ్యం, అభివృద్ధి, అవకాశాల నుండి వెలివేయబడ్డారు. కులతత్త్వ, మతతత్త్వ నాయకత్వంతో కూడుకున్న కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థలను అగ్రకులీకరించడం జరిగింది.
జనాభాలో 52 శాతంగా వున్న ఓబీసీలు, ఓబీసీ గుర్తింపు దొరకక అనామకులుగా మిగిలపోయారు. నలభై నుంచి అరవై సంవత్సరాలు ఓబీసీలు ప్రభుత్వ వ్యవస్థలలో నామమాత్రంగా మిగిలిపోయారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాలలో ఓబీసీలకు స్థానం దొరకలేదు. బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, యూనివర్శిటీలు, సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, మీడియా, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్, కాంట్రాక్టులు మొదలైన రంగాల్లోనూ ఓబీసీలకు స్థానం లభించలేదనేది నిజం. చాలా రంగాలు ఉన్నత కులాల ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. దాని ఫలితంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కులీకరించబడ్డాయి. కాంగ్రెస్-బీజేపీ నేతృత్వంలోని కులతత్త్వ రాజకీయాలు ఓబీసీలను తమ దేశంలో అనామక ప్రజలుగా మిగిల్చబడ్డారు. దాని ద్వారా దేశాన్ని వెనకబాటు తనానికి గురి చేశాయి.ప్రజాస్వామ్యం, అభివృద్ధిని అగ్రకులీకరించడం జరిగింది. బహుళ ప్రజాస్వామ్యంగా మార్చడానికి, సామాజిక వర్గాలతో కూడిన దేశాన్ని నిర్మించడానికి మళ్లీ దళిత, ఆదివాసి, ఒబిసి,మైనారిటీ మహిళలను సమీకరించాల్సిన అవసరం ఉంది.
20 వ శతాబ్దంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాలు దశాబ్దాలుగా పోరాడాయి. భారతదేశ జనాభాలోని సగం మంది ఓబీసీలుగా గుర్తింపు పొందడంలో విజయవంతమయ్యారు. ఆగష్టు 7, 1990న భారతదేశం ఓబీసీలకు జన్మనివ్వడంతో అదొక చారిత్రక ఘట్టంగా నిలిచిపోయింది. మందిర్ భూమిపూజతో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 5, 2020 స్వాతంత్ర్య దిన ప్రాముఖ్యతను కలిగిందన్నారు.
అయితే వెనుకబడినవారు ఉన్నత / ఆధిపత్య కులాలు ఏర్పాటు చేసిన సంస్థలతో అత్యంత వ్యతిరేకతను ఎదుర్కోవలసి వుంటుంది. మండలైట్లు (మండల ఉద్యమ మద్దతుదారులు), వెనుకబడిన తరగతుల ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.
(ప్రొ.ఎస్‌.సింహాద్రి,రాష్ట్ర అధ్యక్షుడు,సమాజ్ వాదీ పార్టీ, తెలంగాణ రాష్ట్రం,పిహెచ్: 9490568899.వాట్సాప్: 8688943120)