వెనుకబడిన ప్రాంతాల ఆకాంక్షలపై స్పందించండి! :ప్రజాస్వామిక వాదులకు విజ్ఞప్తి

రాష్ట్ర సమగ్రతను కాపాడండి: రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సి.హెచ్ చంద్రశేఖర్ రెడ్డి

(యనమల నాగిరెడ్డి)
రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రచార సాధనాలు ఏకపక్షంగా, తమ (రాజకీయ, ఆర్థిక) ప్రయోజనాలు  కాపాడుకోవడానికి అమరావతి పేరుతొ చేస్తున్న ఆందోళనలపైన, కోర్టులలో లెక్కకు మించి వేసిన పిటీషన్ల పైన, రాష్ట్రంలోని వెనుకపడిన ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు, ఆ ప్రాంతాల అభివృద్దిపైన రాష్ట్రంలోని ప్రాజాస్వామ్యవాదులు, ప్రత్యేకించి మధ్యకొస్తా ప్రాంతంలోని మేధావులు స్పందించాలని రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సి.హెచ్ చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేసారు.  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి, రాష్ట్ర ఐక్యతకు  మేధావులు కృషి చేయాలని, అలా కాక వారు మౌనం పాటిస్తే అది రాష్ట్ర విచ్ఛిన్నానికి, వేర్పాటు ఉద్యమాలకు దారితీస్తుందని అయన హెచ్చరించారు. . 
అమరావతి ఏర్పాటు 
2014లో రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ ప్రజల ఆశలను గత కొన్ని దశాబ్దాలుగా సజీవంగా ఉంచిన  శ్రీభాగ్ ఒప్పందాన్ని (కోస్తా, రాయలసీమ పెద్దల మధ్య 1937లో కుదిరిన ఒప్పందం), కేంద్రంనియమించిన కమిటీల సూచనలను విస్మరించి ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఆనాటి రాజకీయాల ఉచ్చులో చిక్కుకున్న రాజకీయ పార్టీలు, మేధావులు ఈ ప్రతిపాదనను ఆమోదించారు.   హైదరాబాదులో కేంద్రీకరించిన విధంగానే, అమరావతిలో కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను, ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రీకరించారు. రాష్ట్రంలో మిగిలిన వెనుకపడిన ప్రాంతాల ఊసే ఎత్తలేదు. 
రాజధాని ఎంపికలో శ్రీభాగ్ ఒప్పందం, కేంద్ర కమిటీల సూచనలు అసలు  పట్టించుకోలేదు
2014లో రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం, ప్రతిపక్షం, రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, బిజెపిలు, కమ్యూనిస్టులు, జనసేన, ఇతర రాజకీయ పార్టీలు, ప్రచార మాధ్యమాలు, మేధావులు రాయలసీమ విషయంలో శ్రీభాగ్ ఒప్పందాన్ని కానీ, రాష్ట్ర విభజన కోసం, రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల సూచనలను కానీ  అసలు పట్టించుకోలేదు.  రాయలసీమ ఉద్యమకారుల  ఆర్తనాదాలు రాజకీయ నాయకులకు,  ప్రచార సాధనాలకు వినిపించలేదు. రాజధాని ఎంపిక విషయంలో రెండు ప్రాంతాల  పెద్ద మనుషుల మధ్య కుదిరిన శ్రీ భాగ్  ఒప్పందాన్ని,  కేంద్రం నియమించిన చట్ట బద్ద కమిటీల సూచనలను పరిగణించలేక పోవడానికి సహేతుక కారణాలను వారే  సీమ ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  
“అభివృద్ధి కేంద్రీకరణ వల్లనే తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ జరిగిందని, అందువల్ల కొత్త రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం ద్వారా భవిష్యత్తులో  ప్రత్యేక రాయలసీమ ఉద్యమం తలెత్తే ప్రమాదం నివారించ వచ్చునని  జస్టిస్ శ్రీకృష్ట్ణ కమీషన్ తన నివేదికలో స్పష్టంగా చెప్పినా ” రాజకీయనాయకులు పట్టించుకోకపోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  
చంద్రశేఖర్ రెడ్డి (రాయలసీ కర్షక కార్మిక సమితి నేత, కడప)
“రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణ్ణన్ కమిటీ విజయవాడ-గుంటూరు మధ్య  ప్రాంతం రాజధానికి అనువు కాదని,  కొత్త రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన అభివృదికి అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నది. ఈ సూచనలను అప్పటి ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, మేధావులు  ఖాతరు చేయలేదు. సీమ నాయకులు నోరు మెదప లేదని” ఆయన ఆరోపించారు.   
           
మూడు రాజధానుల ఏర్పాటు 
ఈ నేపథ్యంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఊపిరి పోసుకుంటున్న వేర్పాటు ఉద్యమాలకు చెక్ పట్టడానికి, రాష్ట్ర సమగ్రతను  కాపాడి రాష్ట్రంలోని  అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం , ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణలకు శ్రీకారం చుట్టింది. అందుకు ఓ  చట్టాన్ని ఆమోదించి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నది.  ఈ నేపథ్యంలో అమరావతి పేరుతొ రాజకీయ పార్టీలు, పత్రికలు, టివిలు ఏక  పక్షంగా ఒకే ప్రాంతానికి కొమ్ము కాస్తూ వెనుకపడిన ప్రాంతాల గోడు పట్టించుకోకపోవడం శోచనీయమని ఆయన వాపోయారు. అలాగే అమరావతి ప్రాంతానికి చెందిన వివిధ రంగాల మేధావులు, సంఘాల పేరుతొ ఆందోళనలు కొనసాగించడం, ఈ చట్టాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాలలో కేసులు వేసి, మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకోవడం దారుణం. ఆర్థికంగా, సామాజికంగా బలవంతులైన వీరు తమ పంతం నెగ్గించుకోడానికి దేశంలో అత్యంత ప్రతిభావంతులను, వ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారి బంధువులను  న్యాయవాదులుగా  నియమించుకుని మిగిలిన వెనుకపడిన ప్రాంతాల ఆశలను పూర్తిగా నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.   
రాష్ట్ర మంత్రి ప్రకటన ప్రజాస్వామ్య బద్దమే !
అమరావతి  ప్రాంతంలో శాసన రాజధాని అవసరం లేదని రాష్ట్ర మంత్రి నాని అమరావతిపై చేసిన వ్యక్తిగత ప్రకటనను ప్రజాస్వామిక దృక్పధం కలిగిన వారంతా స్వాగతించాలి. గత కొన్ని దశాబ్దాలుగా అన్ని రంగాలలో విశేష అభివృద్ధి సాధించిన మధ్య కోస్తా ప్రాంతానికి శాసన రాజధాని అవసరంలేదు.  వాస్తవాలు పరిగణించకుండా రాజకీయ నాయకులు, ప్రసార మాధ్యమాలు   ఈ ప్రకటన చేసినందుకు ఆయనపై అందరు మూకుమ్మడిగా దాడులు చేయడం గర్హనీయం.  
అధిక వర్షపాతం కలిగిన ఈ ప్రాంతంలో క్రిష్ట్నా నదిపై ప్రకాశం బ్యారేజి నిర్మించినప్పటి నుండి క్రిష్ట్న, గుంటూరు, పశ్చిమ  గోదావరి జిల్లాలలో వ్యవసాయరంగం ఇతోధికంగా అభివ్రిద్ది చెందింది. దీనికి తోడు నాగార్జునసాగర్ నిర్మించిన తర్వాత వచ్చిన ఇతోధిక వ్యవసాయ ఆదాయంతో ఈ ప్రాంతం అన్ని రంగాలలో విశేషంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంత పెట్టుబడి దారులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టి  సినిమా, ప్రచార మాధ్యమాలు, పరిశ్రమలు, కాంట్రాక్టు రంగాలలో బలీయమైన శక్తులుగా మారారు. విద్యారంగంలో అవకాశాలు అందిపుచ్చుకున్న యువత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అలాగే ఈ ప్రాంతవాసులు తమకున్న పలుకుబడితో  మిగిలిన రాష్ట్రాలలో చేపట్టనున్న ప్రాజెక్టుల గురించి ముందుగా తెలుసుకొని వందల ఎకరాలు  కొనుగోలు (ప్రతిపాదిత హంద్రీ-నీవా కాల్వ పరివాహక ప్రాంతంలోని కడప, చిత్తూర్ జిల్లాలలో కూడా భూములు కొన్నారు)   చేసి వివిధ ప్రాంతాలలో  “సెటిలర్ లు”  గా స్థిరపడ్డారు. ఇక పెద్ద నగరాలలో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వీరు బలంగా పునాది వేసుకున్నారు.  “బ్రతుకు. ఇతరులను బ్రతికించు” అన్న నానుడిని పక్కన పెట్టి “తాము మాత్రమే బ్రతకాలన్న వీరి దురాశ” సమాజానికి, రాష్ట్రానికి ఎంత మాత్రం మంచిది కాదని ఆయన హితవు చెప్పారు.  
    ఈ నేపథ్యంలో కోస్తాలోని మేధావులు రాజధాని  వికేంద్రీకరణ పై ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి  మిగిలిన ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించి  వెనుకపడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది. అలాగే  రాష్ట్ర సమగ్రతను కాపాడాలి.  
రాయలసీమకే తీరని అన్యాయం!
రాష్ట్రాలు విడిపోయినా, కొత్త రాష్ట్రం  ఏర్పడినా, తెలుగు రాష్ట్రాలలో ఏ పరిణామం సంభవించినా రాయలసీమకే తీరని ద్రోహం జరుగుతున్నది.   రాయలసీమ వాసుల సహకారం లేకపోతె మద్రాసు రాష్ట్రం నుండి ఆంద్ర రాష్ట్రం ఏర్పడదని తెలుసుకున్న కోస్తా నాయకులు శ్రీభాగ్ ఒప్పందం పేరుతొ సీమ నాయకులను ఒప్పించి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఒప్పందాన్ని పట్టించుకోలేదు. కర్నూల్ ను టెంట్ క్యాపిటల్ గా ఏర్పాటు చేసి అతి తక్కువ కాలంలోనే విశాలాంధ్ర పేరుతొ రాజధానిని హైదరాబాదుకు తరలించి అభివృద్ధి మొత్తం అక్కడే కేంద్రీకరించారు. సీమ నీటి అవసరాలు తీరిన తర్వాత మిగిలిన ప్రాంతాలకు నీటిని తరలిస్తామని చెప్పిన పెద్దలు ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించారు.1951లో క్రిష్ట్నా-పెన్నారు నిర్మిస్తే మద్రాసుకు నీళ్లు పోతాయని చెప్పి అడ్డుకున్న కాంగ్రెస్ పెద్దలు, వామపక్ష పార్టీలు, సీమకు ప్రాణాధారమైన సిద్దేశ్వరం ప్రాజెక్ట్ ను పట్టించుకోకుండా, నాగార్జున సాగర్ నిర్మాణానికి కృషి చేసి, సీమ నీటి అవసరాలకు శాశ్వతంగా సమాధి కట్టారని ఆయన ఆరోపించారు . (సీమకు ఇవ్వడానికి నీళ్లెక్కడున్నాయి. అన్నీపంచేసారుగా! అన్నది ఓ ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడి ముక్తాయింపు)
ఆ తర్వాత  విశాలాంధ్ర పేరుతొ ఆంద్ర రాష్టాన్ని తెలంగాణాలో కలపడానికి ఉర్రుతలూగి, రాజధానిని కర్నూల్ నుండి హైదరాబాదుకు తరలించడంలో ప్రముఖ పాత్ర పోషించిన  వామపక్ష పార్టీలు  సీమ పేరు చెప్పి  అడపా దడపా ఉద్యమాల పేరుతొ కాలయాపన చేయడం మినహా ఈ ప్రాంతానికి చేసింది సూన్యం. కర్నూలును హైదరాబాదుకు తరలించిన వామపక్ష పార్టీలు, నాయకులు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధానిని కర్నూల్ లో  ఏర్పాటు చేయాలని కనీసం  డిమాండ్ కూడా చేయలేదని ఆయన ఆరోపించారు.  
గతంలో  విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సీమలోని  తమ బలాన్ని, బలగాలను పూర్తిగా ఉపయోగించిన వామపక్షాలు, రాష్ట్ర విభజన సమయంలో  పోలవరం ప్రాజెక్టును ఆమోదింపచేసుకున్న కోస్తా నాయకులు, అప్పటికే నిర్మాణంలో ఉన్న “దుమ్ముగూడెం- నాగార్జున సాగర్ టైల్ పాండ్” గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని  ఆవేదన వ్యక్తం చేశారు.  
 ప్రస్తుత ప్రభుత్వం  మూడు రాజధానులను ఏర్పాటు చేసి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుచేయాలని నిర్ణయిస్తే టీడీపీ, వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన అడ్డుకోవడం శోచనీయం. రాష్ట్రంలో అన్ని రంగాలలో విశేష అభివృద్ధి చెందిన కోస్తాతో పాటు మిగిలిన ప్రాంతాలు కూడా అభివృది చెందడానికి, రాష్ట్ర సమగ్రత కాపాడటానికి  కృషి చేయాలని ఆయన అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసారు.   
1953 నుండే రాజధాని డిమాండ్ !
ఇటీవల ఒక సీనియర్ సోషలిస్టు నాయకుడు ఇచ్చిన ఇంటర్వూలో 1953 నుండే విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉందని శ్రీభాగ్ ఒప్పందం మేరకు కర్నూల్ కు రాజధాని ఇచ్చామని చెప్పారు. సీమ వాసుల సహకారంతో  ఆంద్ర రాష్టం సాధించడానికే  కోస్తా పెద్దలు  కుట్ర పూరితంగా శ్రీభాగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని అనుకోవలసి వస్తుంది. ఆంద్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీ భాగ్ ఒప్పందాన్ని అమలు చేయడంలో  కోస్తా నాయకులు చూపిన అలసత్వం, ప్రస్తుతం రాజధానుల విభజన విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరు   ఈ కుట్రను నిర్దారిస్తున్నదని  చెప్పక తప్పదన్నారు.   
వామపక్షవాదులు, మేధావులు ఇప్పటికైనా సీమపై దృష్టిసారించండి.
1951 నుండి  2014 వరకు ఈ రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ, సామాజిక పరిణామాలలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, 1983 నుండి ఈ రాష్ట్ర పాలనా వ్యవస్థలో విడదీయరాని బంధాన్ని, బలాన్ని కలిగిన టీడీపీ, 2014 రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన  బిజెపి నాయకులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఇప్పటికైనా  తమ దృష్టిని వెనుకపడిన ప్రాంతాలపై పెట్టి, శ్రీభాగ్ తో పాటు కేంద్ర కమిటీల సూచనలను పరిగణన లోకి తీసుకోవాలని, అన్నిప్రాంతాల సమాన, సమగ్రఅభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.   సోషలిస్టు,  కమ్యూనిస్టు నాయకులు రాష్ట్రంలోని వెనుక(దగా) పడిన ప్రాంతాల అభివృద్ధికి, ప్రత్యేకించి సీమ దుస్థితి తొలగించడానికి కృషి చేయాలని ఆయన కోరారు. అలాగే సీమ వెనుకబాటు తనానికి ప్రధాన భాద్యులైన  కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మేల్కొని సీమతో పాటు రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, దక్షిణ  కోస్తాలోని ఒంగోలు ప్రాంతాల ప్రజల అభివృద్ధి  కోసం పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.          
 (యనమల నాగిరెడ్డి, సీనియర్ జర్నలిస్టు, కడప)